లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్‌ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది.
గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది.
సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్
ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు.
సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్
ఘోర పరాభవం నుంచి..
2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు.
వ్యతిరేకత ఇలా..
బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి.
Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.
Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024
To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:
Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024
లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది.
ఎగ్జిట్‌పోల్స్ నిజమయ్యాయి!
యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment