బ్రిటన్ ఎన్నికల్లో ఘనవిజయం
కన్జర్వేటివ్‌లకు ఘోర పరాజయం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం.
లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది.
రిచ్‌మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి.
నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం.
నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్
ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్‌ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు.
సునాక్‌పై ప్రశంసల జల్లు
ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్‌ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు.
కేబినెట్‌లోకి లీసా నంది
స్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్‌తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment