House of Commons
-
గట్టెక్కిన కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందున్న సవాళ్లు.. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్‌పై రెండో ఓటింగ్‌ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్‌లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్‌లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. -
Canada: ట్రూడో ప్రభుత్వానికి ముప్పు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఊహించని గట్టి దెబ్బ తగిలింది. ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ బుధవారం ప్రకటించారు. 2022లో తమ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు జగ్మీత్ తెలిపారు. తన నిర్ణయాన్ని ఇప్పటికే ప్రధానికి తెలియజేశానని చెప్పారు. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో బల పరీక్షలో నెగ్గాలంటే ఇతర ప్రతిపక్షాల మద్దతు ట్రూడోకు తప్పనిసరి. అయితే కన్జర్వేటివ్‌లను ట్రూడో ఎదుర్కోలేకపోతున్నారని జగ్మీత్ విమర్శించారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా స్వార్థపరులతో నిండిపోయిందని, కార్పొరేట్ ప్రపంచానికి కొమ్ముకాస్తోందని జగ్మీత్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి పోటీ చేస్తానని జగ్మీత్ తన మనసులో మాట బయటపెట్టారు. 52 ఏళ్ల ట్రూడో తొలిసారిగా 2015 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం,గృహనిర్మాణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత రెండు ఎన్నికలలోనూ లిబరల్స్ మెజారిటీ సాధించలేదు. ఎన్డీపీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ట్రూడో పాలిస్తున్నారు. 2015 నవంబర్‌లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో పట్ల ప్రస్తుతం ఓటర్లలో వ్యతిరేకతతో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తాను ఘోరంగా ఓడిపోతానని సర్వేలు చెబుతున్న తరుణంలో పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ట్రూడో ప్రతిపక్ష సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సి వస్తుంది. కెనడా చట్టం ప్రకారం 2025 అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్ 16న హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ట్రూడో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోతే సార్వత్రిక ఎన్నికలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల వార్తలను ట్రూడో తోసిపుచ్చారు. న్యూ ఫౌండ్ ల్యాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రూడో మీడియాతో మాట్లాడారు. కెనడియన్లకు సేవలందించడంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇతర రాజకీయాలపై దృష్టి పెట్టబోమని ఆయన స్పష్టంచేశారు. వచ్చే సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దానివల్ల తమ ప్రభుత్వం సొంత ఎజెండాతో ముందుకు సాగడానికి సమయం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
UK general elections: ముందస్తు ఓటమే?!
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్‌లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు. లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్ తదితరులున్నారు.ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్.. లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం కెనడా పార్లమెంటు నివాళులరి్పంచింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో సభ్యులు మౌనం పాటించారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత నిజ్జర్ గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా గురుద్వారా ఎదుట జరిగిన కాల్పుల్లో హతమాయ్యాడు. భారత ప్రభుత్వం ప్రకటించిన టెర్రిరిస్టుల జాబితాలో నిజ్జర్ పేరు ఉంది. నలుగురు భారతీయులు నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1997లో నకిలీ పాస్‌పోర్ట్‌పై నిజ్జర్ కెనడాకు వెళ్లాడు. శరణార్థిగా కెనడా పౌరసత్వాన్ని కోరాడు. ఇది తిరస్కరణకు గురైంది. అనంతరం తాను కెనడాకు రావడానికి సహాయపడ్డ మహిళను నిజ్జర్ వివాహమాడి మరోమారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మళ్లీ తిరస్కరణకు గురైంది. అయితే నిజ్జర్ హత్యకు గురైన వెంటనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయూ అతను కెనడా పౌరుడని పార్లమెంటులో చెప్పారు. నిజ్జర్ కేటీఎఫ్ కోసం నియామకాలు చేసుకొని.. వారికి శిక్షణ ఇస్తున్నాడని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి అరి్పంచడంపై వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ తీవ్రవాదులు బాంబులు అమర్చడంతో 329 ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్థం ఈనెల 23న (విమాన ఘటన 39 ఏళ్లు) సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్‌లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్
లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగసంపర్కులైన సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. సైన్యంలోకి వారిని తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యమని అన్నారు. దయచేసి క్షమించండి.. రిషి సునాక్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000 సంవత్సరానికి ముందు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా స్వలింగ సంపర్కులైన సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం. స్వలింగ సంపర్కులను సైన్యం నుండి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల పైనా వారి కుటుంబాలపైనా ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేము అర్ధం చేసుకున్నాము. ఆరోజున వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. మీరు కూడా మిగతా సైన్యంలాగే దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహాసాలను తలచుకుని గర్వపడాలన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు. యూకే డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ.. 1967-2000 మధ్యలో అనుభవజ్ఞులైన ఎందరో స్వలింగసంపర్కులైన సైనికులు చాలా వివక్షకు గురయ్యారు. సైన్యంలోకి వారిని నిషేధించడంతో వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. బ్రిటీష్ సాయుధ దళాల చరిత్రలోనే అదొక అవమానకరమైన సహించరాని పొరపాటని అన్నారు. On a historic day, the Prime Minister @10DowningStreet has apologised on behalf of the British state for the treatment of veterans who were affected by the ban on LGBT personnel before 2000.https://t.co/FHIu0baTEU pic.twitter.com/3a8trpaJgI — Office for Veterans' Affairs (@VeteransGovUK) July 19, 2023 ఇది కూడా చదవండి: ప్రపంచ కప్ టోర్నమెంటుకు ముందు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి -
ఉక్రెయిన్‌కు స్పీడుగా సహాయం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో పాటు తూర్పు యూరప్‌లోని మిత్రదేశాలకు మరింత సాయం వేగంగా అందించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ కామన్స్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీనికింద రష్యా ఆక్రమణను నిరోధించేందుకు ఈ దేశాలకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తారు. తమ మద్దతుతో రష్యాపై ఉక్రెయిన్ గెలుస్తుందని యూఎస్ ప్రతినిధి గ్రెగరీ మీక్స్ చెప్పారు. ఆ దేశానికి మరో 3,000 కోట్ల డాలర్ల సాయమందించేందుకు అమెరికా కాంగ్రెస్ మద్దతు కోరతానని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. డోన్బాస్‌పైనే ఫోకస్ తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. వాటిని ఉక్రెయిన్ సమర్థంగా అడ్డుకుంటోందని బ్రిటన్ తెలిపింది. ఐరాస చీఫ్ గుటెరస్ కీవ్‌లో పర్యటిస్తుండగానే ఆ నగరంపై రష్యా తీవ్ర దాడులకు దిగింది. అక్కడి మిలటరీ ఫ్యాక్టరీపై దాడి చేశామని ప్రకటించింది. వరదలతో నిరోధం కీవ్‌ను సమీపించకుండా రష్యా సేనలను నిరోధించేందుకు పరిసర గ్రామాలను ప్రజలు నీటితో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మౌలిక వసతులు దెబ్బతింటున్నా పర్లేదంటున్నారు. శత్రువుల ఆక్రమణ ముప్పు కన్నా ఆస్తి నష్టం ఎక్కువేమీ కాదని చెప్పారు. ఇటీవలే దెమిదివ్ గ్రామ ప్రజలు ఇలాగే రష్యా సేనలను నిలువరించారు. ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి ఉక్రెయిన్ సైన్యం కీలకమైన జవానును కోల్పోయింది. ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’గా పేరు పొందిన మేజర్ స్టెపాన్ టారాబాల్కా(29) గత నెలలో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. అతను 40 రష్యా యుద్ధ విమానాలను నేలకూల్చాడని ఉక్రెయిన్ చెబుతోంది. ‘ఉక్రెయిన్’ వైద్య విద్యార్థులకు సుప్రీం ఊరట న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఉక్రెయిన్‌తో పాటు ఇతర దేశాల నుంచి మధ్యలో వచ్చిన వాళ్లు స్థానిక కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు రెండు నెలల్లో పథకం రూపొందించాలని జాతీయ వైద్య కమిషన్‌ను శుక్రవారం ఆదేశించింది. స్వదేశీ కాలేజీల్లో చేరికకు అవసరమైన క్లినికల్ ట్రైనింగ్‌ను ఈ పథకంలో భాగంగా అందిస్తారు. చైనా వర్సిటీకి చెందిన ఓ వైద్య విద్యార్థిని సూత్రప్రాయంగా రిజిస్టర్ చేసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఎంసీ సుప్రీంలో సవాలు చేసింది. మానవాళికి కరోనా కొత్త సవాళ్లు విసిరిందని విచారణ సందర్భంగా ఎన్ఎంసీకి జస్టిస్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చైనా వర్సిటీలో క్లినికల్ శిక్షణ పూర్తి చేసుకోనంత మాత్రాన విద్యార్థి ప్రతిభ వృథా కాకూడదని అభిప్రాయపడింది. వారికి ఒక్క అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇలాంటి విద్యార్థులను ఎన్ఎంసీ ఒక నెలలో పరీక్షించవచ్చని, సరైన శిక్షణ పొందారని కమిషన్ భావిస్తే దేశీయంగా 12 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేందుకు వారికి వీలు కల్పించవచ్చని తెలిపింది. -
బ్రెగ్జిట్ డీల్‌కు యూకే ఆమోదం
లండన్: యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన డీల్ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్‌రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమీషనర్ బుధవారం డీల్‌పై సంతకాలు చేశారు. -
‘బ్రెగ్జిట్’కు బ్రిటన్ పార్లమెంట్ ఓకే
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తూ ఓటేసింది. తాజా ఓటింగ్‌తో బ్రెగ్జిట్‌పై సంవత్సరాలుగా కొనసాగిన ఉత్కంఠ, రాజకీయ డ్రామా, అనుకూల, ప్రతికూలతలపై చర్చోపచర్చలు.. అన్నింటికీ కొంతవరకు తెరపడింది. ‘జనవరి 31న ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో పార్లమెంట్లో బ్రెగ్జిట్ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు. పార్లమెంట్లో ప్రధాని జాన్సన్ (మధ్యలో) -
భారతీయుల హవా
బ్రిటన్ పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో భారతీయం వెల్లి విరిసింది. భారత సంతతికి చెందిన 15 మంది సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై కొత్త రికార్డు నెలకొల్పారు. అటు అధికార కన్జర్వేటివ్ పార్టీ, ఇటు ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి ఏడుగురు చొప్పున విజయం సాధించారు. లిబరల్ డెమొక్రాట్ పార్టీ తరఫున మరొకరు ఎన్నికయ్యారు. 12 మంది తమ సీట్లను నిలబెట్టుకుంటే ముగ్గురు కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీపడిన సిట్టింగ్ ఎంపీలందరూ తమ స్థానాలను నిలబెట్టుకోగా గగన్ మహీంద్రా, క్లెయిర్ కౌతినో కొత్తగా ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ నుంచి మొదటిసారిగా నవేంద్రూ మిశ్రా కొత్తగా పార్లమెంటులో అడుగు పెట్టబోతుండగా లిబరల్ డెమొక్రాట్ తరఫు మునీరా విల్సన్ ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ 10 మందిలో ఒకరు మైనార్టీ వర్గానికి చెందినవారు. బ్రిటన్‌లో 15 లక్షల మంది వరకు ప్రవాస భారతీయులున్నారు. వీరంతా కన్జర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. -
వేధింపుల చట్టానికి ఎంపీ అడ్డుపుల్ల
మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఉద్యమాలు జరిగాయి.(జరుగుతున్నాయి కూడా). ఈ క్రమంలో యూకేలో ఓ యువతి నిర్వహించిన ఉద్యమం పార్లమెంట్(హౌజ్ ఆఫ్ కామన్స్)ను కదిలించింది. అయితే కఠిన చట్టం దిశగా అడుగులు వేసిన క్రమంలో ఓ ఎంపీ వేసిన అడ్డుపుల్ల ప్రజల్లో ఆగ్రహజ్వాలలను రగిల్చింది. సున్నితమైన అంశం, పైగా అధికారపక్ష ఎంపీ కావటం ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. లండన్: గినా మార్టిన్(26) గతేడాది జూలైలో లండన్ హైడ్ పార్క్‌లో జరిగిన ఓ ఫెస్టివల్‌కు తన సోదరితో కలిసి హాజరయ్యింది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన కొందరు యువకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్ట్ కింద నుంచి ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అది గమనించి ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. ఫోన్ లాక్కుని పరిగెత్తటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటం, వారిని పోలీసులు ప్రశ్నించటం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ వ్యవహారంలో ఆమెకు సరైన న్యాయం జరగలేదు. దీంతో స్టాప్స్కర్టింగ్ పేరిట ఆమె సోషల్ మీడియాలో ఉద్యమాన్ని మొదలుపెట్టింది. కఠిన చట్టం... మహిళల అనుమతి లేకుండా వారిని అభ్యంతకరంగా ఫోటోలు తీయటం నేరమనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దీనికి సామాన్యులు, సెలబ్రిటీలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మద్ధతు ప్రకటించారు. దీంతో చివరకు ఈ వ్యవహారం హౌజ్ ఆఫ్ కామన్స్‌కు చేరింది. అందరి మద్ధతుతో కఠిన చట్టం రూపకల్పన చేయాలని నిర్ణయించారు. లిబరల్ డెమొక్రట్ ఎంపీ వెరా హోప్హౌజ్ ప్రతిపాదిత బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అనుమతులు లేకుండా మహిళల ఫోటోలను తీయటం నిషేధం. అలా కాదని తీస్తే వేధింపుల కిందకే వస్తుంది. నేరం కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తారు. అధికార ఎంపీ అడ్డుపుల్ల... అయితే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కన్సర్వేటివ్ ఎంపీ సర్ క్రిస్టోఫర్ చోప్(71) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభలో కలకలం రేపారు. ఆ వెంటనే సభలో ‘సిగ్గు చేటు’ అంటూ ఎంపీలంతా నినాదాలు చేశారు. బిల్లును తాను ఎందుకు వ్యతిరేకిస్తున్న అన్న అంశంపై మాత్రం చోప్ స్పష్టత ఇవ్వలేదు. తోటి ఎంపీలు ఆయన నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేయగా, సొంత పార్టీ ఎంపీ తీరుపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చోప్ మౌనంగా ఉండటంతో విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉద్యమకారిణి గినా మార్టిన్ కూడా చోప్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఈ లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం కార్యరూపం దాల్చటం మాత్రం ఖాయమని అధికార పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఆయనంతే... క్రిస్టోఫర్ చోప్(71)కు వివాదాలు కొత్తేం కాదు. మానవ హక్కులకు సంబంధించిన చట్టం, సమాన వేతన చట్టం, స్వలింగ వివాహ చట్టం.. తదితరాలను వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలను నిషేధించాలని, కనీస వేతన చట్టాలను రద్దు చేయాలని, మరణ శిక్షను పునరుద్ధరించాలని, నిర్భంద సైనిక శిక్షణ అమలు చేయాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసి దుమారం రేపారు. ఇవన్నీ ఒక్క ఎత్తయితే 2013లో హౌజ్ ఆఫ్ కామన్స్ సిబ్బందిని ‘పనివాళ్లుగా’ అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. చోప్ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటికీ ఆ పెద్దాయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. -
బ్రిటన్ అడుగులెటు?!
సంపాదకీయం దేశమంతటా ఒకరకమైన అనిశ్చిత వాతావరణం అలుముకున్న దశలో బ్రిటన్ పార్లమెంటుకు గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌కు జరిగే ఈ ఎన్నికల్లో ఎప్పటిలానే కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ నువ్వా నేనా అని తలపడుతున్నా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలూ జోస్యం చెబుతున్నాయి. అయిదేళ్ల తమ పాలనలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నదని, 2008 తర్వాత నిరుద్యోగిత తొలిసారి 5.6 శాతానికి పడిపోయిందని, ఏడాది క్రితంతో పోల్చినా నిజవేతనాలు 1.8 శాతం పెరిగాయని, ద్రవ్యోల్బణం ఆచూకీ లేకుండాపోయిందని కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. మరొక్కసారి తమకు అవకాశమిస్తే ఈ ప్రగతి రథాన్ని మరింత వేగంతో నడిపించి, ప్రపంచంలోనే మెరుగైన వృద్ధి రేటును సుసాధ్యం చేస్తానని ప్రధాని డేవిడ్ కామెరాన్ ఊరిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా ఈ గణాంకాలకు అనుగుణంగా ఉంటే కన్సర్వేటివ్ పార్టీ ఈ ఎన్నికల్లో ధగధగలాడేది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 326 స్థానాలు ఆ పార్టీకి సునాయాసంగా చేజిక్కేవి. ఇప్పటిలా లిబరల్ డెమొక్రాటిక్ పార్టీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం కూడా తప్పేది. దాని ప్రధాన ప్రత్యర్థి పక్షం లేబర్ పార్టీ ఈ అభివృద్ధి కథను కొట్టిపారేస్తోంది. అయిదేళ్లలో ప్రభుత్వం 15 లక్షల ఉద్యోగాలను సృష్టించినా దేశంలో జీవన ప్రమాణాలు ఎందుకు పెరగలేదని ప్రశ్నిస్తోంది. చాలా సంస్థలూ, పరిశ్రమలూ ఇప్పటికీ తక్కువ సిబ్బందితో, అరకొర జీతాలతో కార్యకలాపాలు సాగిస్తున్నాయని లెక్కలు చెబుతోంది. జీడీపీ చూడబోతే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నదని...అటు పారిశ్రామిక రంగం, ఇటు నిర్మాణరంగం నైరాశ్యంలో ఉన్నాయంటూ గణాంకాల సాక్ష్యాన్ని చూపుతోంది. దశాబ్దాలుగా బ్రిటన్ రాజకీయ రంగంలో రెండు పార్టీల వ్యవస్థే ప్రధానంగా కొనసాగుతున్నది. అధికారం కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీల మధ్యే చేతులు మారుతోంది. చాన్నాళ్ల తర్వాత 2010 ఎన్నికల్లో తొలిసారి త్రిశంకు సభ ఏర్పడి కన్సర్వేటివ్‌లు లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చింది. అయితే, ఈసారి ఎన్నికల్లో పరిస్థితి అంతకన్నా క్లిష్టంగా మారబోతున్నదని సర్వేలు సూచిస్తున్నాయి. రెండు కాదు...కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు సాధ్యపడే అవకాశం లేదంటున్నాయి. అలా ఏర్పడే ప్రభుత్వం నిరాటంకంగా అయిదేళ్లు మనగలగడం కూడా అనుమానమే. ఇదంతా రాజకీయ వ్యవస్థపై ప్రజల అసంతృప్తిని, విశ్వాసరాహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నది. ప్రధాన పార్టీలతోసహా అన్నీ తమ తమ మౌలిక సిద్ధాంతాలనుంచి పక్కకు జరగడమే ఇందుకు కారణం. సోషలిస్టు ముద్రతో మైనారిటీలు, కార్మికుల పక్షాన మాట్లాడే లేబర్ పార్టీ వలసలను నియంత్రించడానికి కఠినమైన చట్టాలుండాలని వాదించి ఆశ్చర్యపరచడమే కాదు...సంపన్నులైనవారిపై అధిక పన్నులకు తాను వ్యతిరేకమని ప్రకటించింది. ఆర్థికమాంద్యం దేశ రాజకీయాలపై వేసిన బలమైన ముద్రే ఇందుకు కారణం. పొదుపు చర్యల పేరిట ఉద్యోగాల కోత, వేతనాల కోత, సంక్షేమ పథకాల కుదింపువంటివన్నీ తీసుకొచ్చిన అనిశ్చితిని...పర్యవసానంగా వలసొచ్చినవారిపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహావేశాలను సొమ్ము చేసుకోవడానికి కన్సర్వేటివ్‌లను మించిన మితవాద ధోరణులతో యూకే ఇండిపెండెన్స్ పార్టీ(యూకేఐపీ) ఏర్పడింది. ఇలాంటి కారణాలకు జాతి ఆకాంక్షలు కూడా తోడై ప్రాంతీయంగా స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పీ), డెమొక్రాటిక్ యూనియనిస్టు పార్టీ((డీయూపీ), గ్రీన్ పార్టీవంటివి బలం పుంజుకున్నాయి. ఆ మేరకు కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీల వోటు బ్యాంకుకు ఎక్కడికక్కడ గండిపడింది. ఇది ఏ స్థాయిలో ఉందంటే...ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో మూడో స్థానంలో ఉన్న లిబరల్ డెమొక్రాటిక్ పార్టీని వెనక్కి నెట్టి యూకేఐపీ ఆ స్థానాన్ని చేజిక్కించుకోగలదని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితులు అంత భరోసానివ్వడంలేదని గ్రహించబట్టే కన్సర్వేటివ్ పార్టీ తన స్వభావానికి భిన్నంగా ఈసారి సంక్షేమం గురించి మాట్లాడింది. మరోసారి అధికారంలోకొస్తే కోతలను తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చింది. వలసలపై జనంలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం యూరప్ యూనియన్ (ఈయూ) నుంచి విడిపోవడానికి సైతం అనుకూలమని ప్రధాని కామెరాన్ ప్రకటించారు. అంతేకాదు...అందుకోసం 2017లో రిఫరెండం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్థిక మాంద్యంనుంచి ఇంకా తెరిపిన పడని ఫ్రాన్స్, స్పెయిన్ వగైరా దేశాలనుంచి ఉపాధి నిమిత్తం వచ్చేవారిని నిలువరించడం కోసం ఇది అవసరమని ఆయన చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా లేబర్ పార్టీ ఈయూతో గట్టిగా చర్చించి వలసలను ఆపించగమని హామీ ఇస్తోంది. రిఫరెండం అవసరం లేదంటున్నది. నిజంగా కామెరాన్ అధికారంలోకొచ్చి రిఫరెండం నిర్వహించే పరిస్థితే వస్తే అందువల్ల ఎక్కువగా నష్టపోయేది బ్రిటనే. అంతర్జాతీయంగా దాని పలుకుబడి, ప్రాభవం తగ్గి యూరప్‌ను ప్రభావితం చేయలేని చిన్న దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన బ్రిటన్‌కు ఇది శరాఘాతమవుతుంది. పైగా ఇప్పుడు బ్రిటన్‌లో కొనసాగుతున్న స్కాట్లాండ్లో మరోసారి విడిపోవడంపైనా, ఈయూలో కొనసాగడంపైనా రిఫరెండం డిమాండ్ బయల్దేరుతుంది. అది సహజంగానే ఇతర ప్రాంతాల్లో కొత్త డిమాండ్లకు తెరలేపుతుంది. ఇప్పుడిప్పుడే మెరుగైందనుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ పరిణామాలతో దెబ్బతింటుందని, మరో నాలుగేళ్లు వెనక్కి పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించే ప్రజా తీర్పు కోసం అన్ని వర్గాలూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. -
హౌజ్ ఆఫ్ కామన్స్ లో కరీనాకు సత్కారం!
ప్రపంచ వినోద పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా బాలీవుడ్ తార కరీనా కపూర్ ను ఏషియన్ ఎథ్నిక్ వీక్లీ హౌజ్ ఆఫ్ కామన్స్ ఘనంగా సత్కరించింది. బ్రిటన్ హోమ్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎన్నారై ఎంపీ కీత్ వాజ్ ఈ కార్యక్రమానికి హాజరై.. కరీనా కపూర్ కు జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ..యూకేతో చాలా కాలంగా తనకు అనుబంధం ఉంది అని అన్నారు. తన తాతమ్మ కూడా బ్రిటిష్ జాతీయురాలేనని..అంతేకాకుండా తన మామ, సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి ఆక్స్ ఫర్డ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు అని కరీనా తెలిపింది. 'కభీ కుషీ కభీ ఘమ్', జబ్ వీ మెట్, ఓంకారా, 3 ఇడియెట్స్, గోల్ మాల్ 3, బాడీ గార్డ్ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు.