బ్రిటన్ అడుగులెటు?!
సంపాదకీయం
దేశమంతటా ఒకరకమైన అనిశ్చిత వాతావరణం అలుముకున్న దశలో బ్రిటన్ పార్లమెంటుకు గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌కు జరిగే ఈ ఎన్నికల్లో ఎప్పటిలానే కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ నువ్వా నేనా అని తలపడుతున్నా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలూ జోస్యం చెబుతున్నాయి. అయిదేళ్ల తమ పాలనలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నదని, 2008 తర్వాత నిరుద్యోగిత తొలిసారి 5.6 శాతానికి పడిపోయిందని, ఏడాది క్రితంతో పోల్చినా నిజవేతనాలు 1.8 శాతం పెరిగాయని, ద్రవ్యోల్బణం ఆచూకీ లేకుండాపోయిందని కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. మరొక్కసారి తమకు అవకాశమిస్తే ఈ ప్రగతి రథాన్ని మరింత వేగంతో నడిపించి, ప్రపంచంలోనే మెరుగైన వృద్ధి రేటును సుసాధ్యం చేస్తానని ప్రధాని డేవిడ్ కామెరాన్ ఊరిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా ఈ గణాంకాలకు అనుగుణంగా ఉంటే కన్సర్వేటివ్ పార్టీ ఈ ఎన్నికల్లో ధగధగలాడేది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 326 స్థానాలు ఆ పార్టీకి సునాయాసంగా చేజిక్కేవి. ఇప్పటిలా లిబరల్ డెమొక్రాటిక్ పార్టీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం కూడా తప్పేది. దాని ప్రధాన ప్రత్యర్థి పక్షం లేబర్ పార్టీ ఈ అభివృద్ధి కథను కొట్టిపారేస్తోంది. అయిదేళ్లలో ప్రభుత్వం 15 లక్షల ఉద్యోగాలను సృష్టించినా దేశంలో జీవన ప్రమాణాలు ఎందుకు పెరగలేదని ప్రశ్నిస్తోంది. చాలా సంస్థలూ, పరిశ్రమలూ ఇప్పటికీ తక్కువ సిబ్బందితో, అరకొర జీతాలతో కార్యకలాపాలు సాగిస్తున్నాయని లెక్కలు చెబుతోంది. జీడీపీ చూడబోతే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నదని...అటు పారిశ్రామిక రంగం, ఇటు నిర్మాణరంగం నైరాశ్యంలో ఉన్నాయంటూ గణాంకాల సాక్ష్యాన్ని చూపుతోంది.
దశాబ్దాలుగా బ్రిటన్ రాజకీయ రంగంలో రెండు పార్టీల వ్యవస్థే ప్రధానంగా కొనసాగుతున్నది. అధికారం కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీల మధ్యే చేతులు మారుతోంది. చాన్నాళ్ల తర్వాత 2010 ఎన్నికల్లో తొలిసారి త్రిశంకు సభ ఏర్పడి కన్సర్వేటివ్‌లు లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చింది. అయితే, ఈసారి ఎన్నికల్లో పరిస్థితి అంతకన్నా క్లిష్టంగా మారబోతున్నదని సర్వేలు సూచిస్తున్నాయి. రెండు కాదు...కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు సాధ్యపడే అవకాశం లేదంటున్నాయి. అలా ఏర్పడే ప్రభుత్వం నిరాటంకంగా అయిదేళ్లు మనగలగడం కూడా అనుమానమే. ఇదంతా రాజకీయ వ్యవస్థపై ప్రజల అసంతృప్తిని, విశ్వాసరాహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నది. ప్రధాన పార్టీలతోసహా అన్నీ తమ తమ మౌలిక సిద్ధాంతాలనుంచి పక్కకు జరగడమే ఇందుకు కారణం. సోషలిస్టు ముద్రతో మైనారిటీలు, కార్మికుల పక్షాన మాట్లాడే లేబర్ పార్టీ వలసలను నియంత్రించడానికి కఠినమైన చట్టాలుండాలని వాదించి ఆశ్చర్యపరచడమే కాదు...సంపన్నులైనవారిపై అధిక పన్నులకు తాను వ్యతిరేకమని ప్రకటించింది. ఆర్థికమాంద్యం దేశ రాజకీయాలపై వేసిన బలమైన ముద్రే ఇందుకు కారణం. పొదుపు చర్యల పేరిట ఉద్యోగాల కోత, వేతనాల కోత, సంక్షేమ పథకాల కుదింపువంటివన్నీ తీసుకొచ్చిన అనిశ్చితిని...పర్యవసానంగా వలసొచ్చినవారిపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహావేశాలను సొమ్ము చేసుకోవడానికి కన్సర్వేటివ్‌లను మించిన మితవాద ధోరణులతో యూకే ఇండిపెండెన్స్ పార్టీ(యూకేఐపీ) ఏర్పడింది. ఇలాంటి కారణాలకు జాతి ఆకాంక్షలు కూడా తోడై ప్రాంతీయంగా స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్‌ఎన్‌పీ), డెమొక్రాటిక్ యూనియనిస్టు పార్టీ((డీయూపీ), గ్రీన్ పార్టీవంటివి బలం పుంజుకున్నాయి. ఆ మేరకు కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీల వోటు బ్యాంకుకు ఎక్కడికక్కడ గండిపడింది. ఇది ఏ స్థాయిలో ఉందంటే...ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో మూడో స్థానంలో ఉన్న లిబరల్ డెమొక్రాటిక్ పార్టీని వెనక్కి నెట్టి యూకేఐపీ ఆ స్థానాన్ని చేజిక్కించుకోగలదని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితులు అంత భరోసానివ్వడంలేదని గ్రహించబట్టే కన్సర్వేటివ్ పార్టీ తన స్వభావానికి భిన్నంగా ఈసారి సంక్షేమం గురించి మాట్లాడింది. మరోసారి అధికారంలోకొస్తే కోతలను తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చింది. వలసలపై జనంలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం యూరప్ యూనియన్ (ఈయూ) నుంచి విడిపోవడానికి సైతం అనుకూలమని ప్రధాని కామెరాన్ ప్రకటించారు. అంతేకాదు...అందుకోసం 2017లో రిఫరెండం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్థిక మాంద్యంనుంచి ఇంకా తెరిపిన పడని ఫ్రాన్స్, స్పెయిన్ వగైరా దేశాలనుంచి ఉపాధి నిమిత్తం వచ్చేవారిని నిలువరించడం కోసం ఇది అవసరమని ఆయన చెబుతున్నారు.
ఇందుకు విరుద్ధంగా లేబర్ పార్టీ ఈయూతో గట్టిగా చర్చించి వలసలను ఆపించగమని హామీ ఇస్తోంది. రిఫరెండం అవసరం లేదంటున్నది. నిజంగా కామెరాన్ అధికారంలోకొచ్చి రిఫరెండం నిర్వహించే పరిస్థితే వస్తే అందువల్ల ఎక్కువగా నష్టపోయేది బ్రిటనే. అంతర్జాతీయంగా దాని పలుకుబడి, ప్రాభవం తగ్గి యూరప్‌ను ప్రభావితం చేయలేని చిన్న దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన బ్రిటన్‌కు ఇది శరాఘాతమవుతుంది. పైగా ఇప్పుడు బ్రిటన్‌లో కొనసాగుతున్న స్కాట్లాండ్‌లో మరోసారి విడిపోవడంపైనా, ఈయూలో కొనసాగడంపైనా రిఫరెండం డిమాండ్ బయల్దేరుతుంది. అది సహజంగానే ఇతర ప్రాంతాల్లో కొత్త డిమాండ్లకు తెరలేపుతుంది. ఇప్పుడిప్పుడే మెరుగైందనుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ పరిణామాలతో దెబ్బతింటుందని, మరో నాలుగేళ్లు వెనక్కి పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించే ప్రజా తీర్పు కోసం అన్ని వర్గాలూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.