అందరూ ఎంతో ఉత్కంఠగా, ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూసిన ఫలితం రానేవచ్చింది. గ్రేట్ బ్రిటన్‌గా, యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)గా కొనసాగుతున్న ‘ఆంగ్లేయుల రాజ్యం’ ఇకముందూ అలాగే ఉండబో తున్నది. ప్రపంచపటంలో చోటు సంపాదించడం ఖాయమనుకున్న కొత్త దేశం పుట్టుక ఆగిపోయింది. స్కాట్‌లాండ్ ప్రాంతం దేశంలో కలిసుండాలా, లేదా అనే అంశంపై ఆ ప్రాంతంలో జరిగిన రిఫరెండంలో 55 శాతంమంది ‘యస్’వైపే... అంటే, ఐక్యతకే ఓటేశారు. విడిపోవాలన్న ఆకాంక్ష ‘నో’కు 45 శాతం మద్దతు మాత్రమే లభించింది. 307 ఏళ్లక్రితం రెండు రాచకుటుంబాలమధ్య ఏర్పడిన బంధంతో బ్రిటన్‌లో విలీనమైన స్కాట్‌లాండ్‌కు స్వాతంత్య్రం లభించితీరాలని గట్టిగా డిమాండు చేస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగింది. అది చూస్తుండగానే మెజారిటీ ప్రజల ఆకాంక్షగా వ్యక్తం కావడం ప్రారంభమైంది. పలు సర్వేలు స్కాట్‌లాండ్ విడిపోవడం ఖాయమని జోస్యం చెప్పాయి.
తీరా ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చింది. ఫలితాన్ని చూశాక బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఒక్కరు మాత్రమే కాదు ఆ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా ఊపిరిపీల్చుకున్నారు. స్కాటిష్ జాతినుంచి వెల్లువెత్తిన ప్రశ్నలకూ, వాటిపై జరిగిన చర్చకూ రిఫరెండం ఫలితం ముగింపు పలికినట్టేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. అయితే, అదంత సులభంగా ముగిసిపోయేది కాదు. వాస్తవానికి ఈ రిఫరెండంతో బ్రిటన్‌కు సమస్యల పరంపర ప్రారంభమైంది. అది ఇన్నాళ్లలా ఒక దేశంగా, యూనియన్‌గా మనగలగడం ఇక అసాధ్యం. దేశంలోని వేల్స్, ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్‌లకు చాలా అంశాల్లో అది స్వయం నిర్ణయాధికారాలివ్వాల్సి ఉంటుంది. అందుకోసం బృహత్తర ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.
కలిసివుండటం స్కాట్‌లాండ్ శ్రేయస్సుకే మంచిద న్న వాదనలు రిఫరెండానికి ముందు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఓటింగ్ రోజు సమీపించేకొద్దీ ఆ వాదనల హోరు ఇంతకింతా పెరిగింది. విడిపోతే స్కాట్‌లాండ్‌కు రాగల నష్టాలేమిటో ఆ వాదనలు ఊదరగొట్టాయి. బ్రిటన్ పౌండుకు ఆ ప్రాంతవాసులు శాశ్వతంగా దూరంకావడమేకాక, యూరోపియన్ యూనియన్‌లో ప్రవేశానికి ఈయూతో సంప్రదింపులు ప్రారంభించాల్సి వుంటుందని... ఆ సంస్థ పెట్టే షరతులను నెరవేర్చవలసి ఉంటుందనీ తెలిపాయి. అదే జరిగితే స్కాట్‌లాండ్ మరింత కుంగిపోతుందని బెదిరించాయి. నార్త్ సీలో ఉన్న చమురు నిక్షేపాలవల్ల స్కాట్‌లాండ్‌కు దివ్యమైన భవిష్యత్తు ఉండబోతున్నదన్న వేర్పాటువాదుల వాదనలో పసలేదన్నాయి. అంతంత మాత్రంగా ఉండే ఆ నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్థకు దన్నుగా నిలవటం కష్టమన్నాయి. విభజనానంతర సమస్యలవల్ల అంతర్గత కలహాలు పెచ్చరిల్లుతాయని, దాన్నుంచి బయటపడటం అసాధ్యమని హెచ్చరిం చాయి. అయితే స్కాట్‌లాండ్‌కు రాగల ముప్పుగురించి సాగుతున్న ప్రచారం ‘ప్రాజెక్టు ఫియర్’ (భయాందోళనలు రేకెత్తించడం)లో భాగమని, దీనివెనుక కార్పొరేట్ ప్రపంచ ప్రయోజనాలు ఇమిడి వున్నాయని వేర్పాటువాదులు చెప్పకపోలేదు. అయినా ఫలితం మాత్రం వారికి ప్రతికూలంగా వచ్చింది. అయితే, ఇంతచేసినా 45 శాతం మంది వేర్పాటువాదాన్నే బలపరిచారని మర్చిపోకూడదు.
రిఫరెండంలో వ్యక్తమైన ప్రజాభిప్రాయం వెనక భయాలున్నాయా, ఆశలున్నాయా అన్న వాదన పక్కనబెడితే బ్రిటిష్ పాలకులు ఇన్నాళ్లూ ఉన్నట్టు ఇకపై ఉండటం మాత్రం సాధ్యంకాదు. స్కాట్‌లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర ఆకాంక్ష అంతకంతకు పెరగడానికి కేవలం భావోద్వేగా లొక్కటే కారణం కాదని గుర్తించాల్సివుంది. తమ గడ్డపై ఉన్న చమురు, ఖనిజ నిక్షేపాలను తరలించుకుపోవడమే తప్ప న్యాయమైన వాటా దక్కడంలేదన్న భావన స్కాట్‌లాండ్‌వాసుల్లో ఉంది.
‘రవి అస్తమించని సామ్రాజ్యాన్ని’ బ్రిటన్ ఏలినప్పటినుంచీ ఈ ఫిర్యాదు ఉంది. అప్పటికీ, ఇప్పటికీ స్కాటిష్ ప్రజల బతుకుల్లో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదు. ఉంటే గింటే ఆర్ధికమాంద్యం కారణంగా వచ్చిన కోతలున్నాయి. అవి వారి ఉద్యోగాలకూ, ఆదాయానికి ఎసరుపెడుతున్నాయి. పూట గడవటాన్ని దుర్భరంగా మారుస్తున్నాయి. అందువల్లే స్కాటిష్ జాతీయ పార్టీకి మూడేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో ఆదరణ లభించి ఆ పార్టీ గద్దెనెక్కింది. ఉన్నంతలో అది కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసింది. ఇప్పుడు బ్రిటన్ నేతలు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజా సంక్షేమానికి చేస్తున్న తలసరి వ్యయం ఇప్పటికంటే మరో 20 శాతం పెరగాలి. ఆరోగ్య సర్వీసులకు ఎంత వ్యయం చేయాలో నిర్ణయించే అధికారాన్ని స్కాట్‌లాండ్ పార్లమెంటుకు అప్పగించాల్సి ఉంది. ఆదాయంపన్ను, స్టాంపు డ్యూటీ, భూమిశిస్తు వగైరా అంశాల్లో మరిన్ని అధికారాలివ్వాలి. పెన్షన్ల విషయంలోనూ అక్కడి పార్లమెంటుదే ఆఖరిమాట కావాలి. ఒక్కమాటలో...రక్షణ, విదేశాంగవిధానం, కరెన్సీ విషయాల్లో మినహా మిగిలిన అంశాల్లో విధాన రూపకల్పన అధికారం స్కాట్‌లాండ్‌దే. రిఫరెండానికి ముందు ఆత్రంగా ఇచ్చిన ఈ హామీల అమలుకు నిజంగా బ్రిటన్ నాయకత్వం కట్టుబడి ఉంటుందా? ఆ విషయంలో మాటలు చెప్పినంత స్థాయిలో చురుకుదనంలేదన్న సంగతి కనబడుతూనే ఉన్నది. దేశంలోని వేల్స్, ఉత్తర ఐర్లాండ్, ఇంగ్లాండ్ ప్రాంతాలకివ్వాల్సిన అధికారాలగురించి కూడా సమగ్రంగా చర్చించి వాటితోపాటే స్కాట్ లాండ్‌కు కూడా ప్రత్యేకాధికారాలిచ్చేలా సమగ్ర రాజ్యాంగ సవరణలు తేవాలని యోచిస్తున్నట్టు కామెరాన్ చెబుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే మరికాస్త సమయం అవసరమన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే, స్కాట్‌లాండ్ జాతీయతా భావాలు, ఆ ప్రాంత ప్రజల్లో అవి తీసుకొచ్చిన భావోద్వేగాలు సామాన్యమైనవి కాదు. వాటిని ఉపేక్షించడం అంత తేలిక కాదు. ఈ విషయంలో బ్రిటన్ పాలకులు జాగ్రత్తగా అడుగులేయాల్సి ఉన్నది.
స్కాట్‌లాండ్ ఆకాంక్ష!
Published Mon, Sep 22 2014 11:41 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement