లండన్: రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. ఆయన తల్లి రాణి ఎలిజబెత్–2 వృద్ధాప్యంతో గురువారం స్కాట్లాండ్‌లో మరణించడం తెలిసిందే. దాంతో నిబంధనల ప్రకారం ఆ మరుక్షణం నుంచే చార్లెస్ బ్రిటన్ రాజయ్యారు. శుక్రవారం స్కాట్లండ్ నుంచి లండన్ చేరుకున్న ఆయనకు ప్రజలు ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ జాతీయ గీతం పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రాజు హోదాలో చార్లెస్ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని లిజ్ ట్రస్‌తో భేటీ అయ్యారు.
అంత్యక్రియలపై అస్పష్టత
ఎలిజబెత్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా తేలలేదు. రెండు వారాల్లోపు చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబేలో అంత్యక్రియలు జరుగుతాయని బీబీసీ వెల్లడించింది. పార్లమెంటు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై రాణికి నివాళులర్పించింది. 96 ఏళ్లపాటు జీవించిన రాణి గౌరవార్థం సెంట్రల్ లండన్లో 96 రౌండ్ల గన్ సెల్యూట్ జరిగింది. శనివారం హౌజ్ ఆఫ్ కామన్స్ ప్రత్యేక భేటీలో ఎంపీలంతా కింగ్ చార్లెస్–3కి విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై చార్లెస్‌ను రాజుగా లాంఛనంగా ప్రకటించనుంది
సంతాపాల వెల్లువ
ఎలిజబెత్ అస్తమయం పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భా్రంతి వెలిబుచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతులు వాషింగ్టన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ నివాళులర్పించారు. ‘‘రాణిది అరుదైన, గొప్ప వ్యక్తిత్వం. అమెరికన్లందరి తరఫున మా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సంతాపాల పుస్తకంలో రాశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితరులు కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో 11న ఆదివారం ఒక్కరోజు సంతాప దినంగా పాటించనున్నారు.
రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్‌కు చార్లెస్
Published Sat, Sep 10 2022 6:05 AM | Last Updated on Sat, Sep 10 2022 6:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment