విలువ తెలియక తలుపు అడ్డుగా వాడుకున్న జనం
అరుదైన శిల్పానికి చివరకు అసలైన ఆదరణ
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాన్నాళ్లు తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు. అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్‌డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెల్సి ఇప్పుడు ఔత్సాహిక కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ.27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్ తల్లి వద్ద సెర్చింగ్‌లు మొదలుపెట్టారు.
ఫ్రాన్స్‌కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్‌డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్‌లోని హైల్యాండ్స్ కౌన్సిల్ ప్రాంతంలో ఆనాటి భూస్వామి, రాజకీయనాయకుడు జాన్ గార్డన్.. ఎడ్మీతో తన స్వీయ ప్రతిమను చెక్కించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతంలో ఇన్వర్‌గార్డన్ పట్టణానికి రూపకల్పనచేశారు. తర్వాత 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. ఆ సంఘటన తర్వాత 1930వ సంవత్సరంలో అదే ఇన్వర్‌గార్డన్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు.
దశాబ్దాల తర్వాత అంటే 1998లో హైల్యాండ్స్ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్‌సభ్యురాలు మాక్సిన్ స్మిత్ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ‘ది లారీస్’, లాస్‌ఏంజిల్స్‌లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనదికావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.
సహాయక నిధుల కోసం వేలానికి..
విలువైన వస్తువును దగ్గర పెట్టుకోవడం కంటే దానిని విక్రయిస్తే వచ్చే సొమ్ముతో స్థానికుల సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని స్థానిక ప్రభుత్వం భావించింది. అమ్మడానికి సిద్ధమైంది. వచ్చే నిధులను ఇన్వర్‌గార్డన్ కామన్‌గుడ్ ఫండ్ కింద ఖర్చుచేస్తామని చాటింపు వేయించింది. చారిత్రక వస్తువును సొంత ఆస్తిగా భావించి వేలం ఎలా వేస్తారని కొందరు కోర్టుకెక్కారు. దీనిపై హైల్యాండ్స్ టెయిన్ షరీఫ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అది వారసత్వ ఆస్తి కాదని తేల్చిచెప్పింది.
చదవండి: వెదురుగొట్టం తూనీగ.. పశ్చిమ కనుమల్లో సరికొత్త జాతి
ఈలోపే గత ఏడాది అక్టోబర్‌లోనే దానిని రూ.27 కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ ఏడోతేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు. రోజు రోజుకూ దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది. విషయం తెల్సుకున్న ఆనాటి కౌన్సిల్‌సభ్యురాలు మాక్సిన్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలీకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేది. కోటీశ్వరురాలివి అయ్యేదానివి అని నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ఆటపట్టిస్తారు’’అని ఆమె అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment