సంపాదకీయం
‘కలడు కలండనెడివాడు కలడో లేడో’నని సర్వాంతర్యామిపై గజేం ద్రుడికి సంశయం వస్తే వచ్చివుండొచ్చుగానీ... దొంగచాటుగా మన కదలికలనూ, మాటలనూ గమనించేవారున్నారని చెబితే నమ్మనివా రుండరు. సాంకేతిక విజ్ఞానం పెరిగేకొద్దీ ఈపని చాలా సులభమైపో యింది. దాంతోపాటే విచక్షణా జ్ఞానమూ నశించింది. ఒకప్పటి రోజు లు వేరు. గూఢచర్యంలో తలమునకలయ్యేవారికి స్వపర భేదాలుం డేవి. మనవాడు కాదనుకున్నప్పుడే నిఘా ఉండేది. కానీ, అమెరికా అలాంటి రూల్సన్నీ మార్చేసింది. మిత్రదేశాలుగా ఉంటూ తానేం చేసినా వెనకా ముందూ చూడకుండా సమర్ధించే బ్రిటన్, జర్మనీ వంటి దేశాధినేతలను సైతం నిఘా కళ్లతోనే చూసింది. కరచాలనం చేస్తూనే అవతలివారి కూపీలాగే పనిలో అది ఆరితేరింది. మన దేశంలో ఇంది రాగాంధీ పాలనాకాలంలో విపక్షాలతోపాటు కాంగ్రెస్‌లోనే ఉండే ‘యంగ్‌టర్క్’గ్రూపు యువ నేతల కదలికలను గూఢచార సంస్థలు ఎప్పటికప్పుడు గమనించేవని చెబుతారు. కనుక ఇప్పుడు కేంద్ర ఉపరి తల రవాణామంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో రహస్య మైక్రోఫోన్లు లభిం చాయన్న కథనాలను కొట్టిపారేయనవసరంలేదని విశ్వసించే వారే ఎక్కువమంది ఉంటారు. మీడియాలో ఈ సంగతి వెల్లడికాగానే బీజేపీ అగ్రనేతలూ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా ఖండించారు. సాధారణంగా అయితే అది అక్కడితో సమసిపోయేది. మహా అయితే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి ప్రస్తావనకొచ్చి ప్రభుత్వం వివ రణ ఇచ్చుకోవాల్సివచ్చేది. కానీ, ఇది మరుసటిరోజునా కొనసాగింది. తన ఇంట్లో ‘బగ్గింగ్’ పరికరాలు దొరికాయన్న కథనాలు ఊహాజనిత మైనవని నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనలో కాంగ్రెస్ రంధ్రాన్వేషణ చేయ డమే ఇందుకు కారణం. ఆ కథనాలు పూర్తిగా అబద్ధమని ఖండించ కుండా గడ్కరీ ఇలా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందని ఆ పార్టీ నిల దీసింది. అందువల్లే మరోసారి...అదంతా అబద్ధమని గడ్కరీ చెప్పాల్సి వచ్చింది.
ఇంతకూ ఒకరిపై మరొకరి నిఘా అవ సరం ఎందుకుంటుంది? రాజ్యం మనుగడ కైతే అది తప్పనిసరి. జనం ఏమనుకుంటున్నారో, వారిలో ఎలాంటి అసంతృప్తి గూడుకట్టుకుని ఉన్నదో, దాన్ని ప్రేరేపిస్తున్న అంశాలేమిటో తెలుసుకోవడం ప్రభు త్వాల దినచర్య. అయితే, ఈ పేరిట పౌరుల వ్యక్తిగత జీవితంలోకి చొర బడటాన్ని ఏ చట్టాలూ అంగీకరించవు. టెక్నాలజీ ఇంతగా విస్తరించని కాలంలో ఒకరి ఫోన్ సంభాషణలు వినాలన్నా అందుకు తగిన అను మతులు తీసుకోవాలన్న నిబంధనలుండేవి. పౌరుల వ్యక్తిగత జీవితా ల్లోకి చొరబడటం రాజ్యాంగంలో జీవించే స్వేచ్ఛకు అవకాశం కల్పి స్తున్న 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో స్పష్టంచేసింది. ఇప్పుడు మన సెల్‌ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి ప్రవహించే సంభాషణలను, సందేశాలనూ జల్లెడపట్టే సామర్ధ్యం అధి కార యంత్రాంగానికుంది. ఇందుకు సర్వీసు ప్రొవైడర్ల సాయం కూడా అవసరంలేదు. కనుక నిఘా నీడలో ఉన్నామన్న స్పృహ కూడా ఎవరికీ కలగకుండానే అంతా సాగిపోతున్నది.
ప్రమాదకరమనుకున్న వ్యక్తులకే పరిమితం కావలసిన నిఘా వీఐ పీలను సైతం వెంటాడటం ఇది మొదటిసారేమీ కాదు. 1991లో తన ఇంటిముందు ఇద్దరు కానిస్టేబుళ్లను నిఘా ఉంచారని రాజీవ్‌గాంధీ ఆరోపించి, అందుకు నిరసనగా ఆనాటి చంద్రశేఖర్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతును ఉపసంహరించుకున్నారు. యూపీఏ సర్కారు హయాంలో కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉన్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ము ఖర్జీ కార్యాలయంలో 16చోట్ల జిగురువంటి పదార్ధం అతికించి ఉండ టాన్ని గమనించారు. ఆయన కూర్చునేచోట టేబుల్‌కిందా, ఆయన సలహాదారు, వ్యక్తిగత కార్యదర్శుల గదుల్లో ఇవి కనబడ్డాయి. ఆనాటి హోంమంత్రి చిదంబరానికీ, ఆయనకూ ఉన్న స్పర్థలే ఈ నిఘాకు కారణమన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అటు తర్వాత కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కార్యాలయంలో సైతం రహస్యంగా వినే పరిక రాలు కనుగొన్నారని గుప్పుమంది. రెండు సందర్భాల్లోనూ ప్రభుత్వం వెనువెంటనే ఆ కథనాలను ఖండించింది. ఇప్పుడు గడ్కరీ ఇంట లభించాయంటున్న బగ్గింగ్ పరికరాల గురించి కాంగ్రెస్ చెబుతున్న కథనం, బీజేపీ అనధికారికంగా ప్రచారంలోకి తె చ్చిన కథనం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. గుజరాత్‌లో మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో 90,000మందిపై నిఘా ఉండేదని డీజీపీగా పనిచేసినవారు చెప్పారని, ఒక మహిళపై నిఘా ఉంచిన ఉదంతం కూడా వెల్లడైం దని...ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆ రోజులు వచ్చినట్టు కనబడుతున్నదని కాంగ్రెస్ అంటున్నది. బీజేపీ నేతలమధ్య ఉన్న పరస్పర అవిశ్వాసం పర్యవసానమే ఈ నిఘా అని ఆరోపిస్తున్నది. ఇక బీజేపీ అనధికార కథనం మరోలా ఉంది. యూపీఏ సర్కారు హయాంలోనే సార్వత్రిక ఎన్నికల సమయంలో గడ్కరీ ఇంట ఈ పరికరాలు ఉంచారని, అనంత రకాలంలో యదృచ్ఛికంగా ఒక పరికరం బయటపడ్డాక ఆయన ప్రైవేటు ఏజెన్సీతో ‘డీ బగ్గింగ్’పరికరాలతో తనిఖీ చేయించగా మరో రెండు దొరికాయని ఆ కథనం సారాంశం. ఈ పరికరాలుంచడం ఆ నాటి యూపీఏ సర్కారు అమెరికాతో కుమ్మక్కయి చేసిన పని అని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చెబుతున్నారు. అదే నిజమైతే కాంగ్రెస్ ను, దాని కుమ్మక్కు విధానాలనూ తూర్పారబట్టడానికి ఉపయోగపడే ఉదంతాన్ని ఎన్డీయే సర్కారు ఎందుకు కప్పెడుతున్నట్టు? తనపై కాం గ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నా అసలేమీ జరగలేదని ఎందుకు అంటున్న ట్టు? గడ్కరీ ఇప్పుడు కేంద్రమంత్రి. స్వామి చెబుతున్నట్టు ఆయనపై సాగిన నిఘాలో నిజంగా అమెరికా పాత్ర ఉంటే అది మన సార్వభౌ మత్వానికే పెను సవాల్. అందుకే, నిజానిజాలేమిటో ఎన్డీయే సర్కారు బయటపెట్టాలి. అన్నీ తేటతెల్లంచేయాలి.
ఈ నిఘా నిజమేనా?!
Published Wed, Jul 30 2014 12:08 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement