సునాక్ పార్టీ ఎదురీత
బ్రిటన్‌లో నేడే ఎన్నికలు
650 స్థానాలకు పోలింగ్
రేపటికల్లా ఫలితాల వెల్లడి
లేబర్ పార్టీదే గెలుపు: సర్వేలు
బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి.
కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి.
సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్‌లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు...
బరిలో భారతీయం
బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్‌లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు.
37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు
బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు.
కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు.
లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్
తదితరులున్నారు.
ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్..
లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే.
సునాక్ ఎదురీత వెనక...
44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.
స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు...
ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment