Canada: ట్రూడో ప్రభుత్వానికి ముప్పు | Canada: Trouble for Trudeau as NDP chief Jagmeet Singh withdraws support | Sakshi
Sakshi News home page

Canada: ట్రూడో ప్రభుత్వానికి ముప్పు

Published Fri, Sep 6 2024 5:18 AM | Last Updated on Fri, Sep 6 2024 5:18 AM

Canada: Trouble for Trudeau as NDP chief Jagmeet Singh withdraws support

మద్దతు ఉపసంహరించుకున్న న్యూ డెమొక్రటిక్‌ పార్టీ 

కొత్త పొత్తులకు ఆహ్వానం 

విశ్వాస పరీక్ష కోసం ప్రతిపక్షాలపై ఆధారపడిన కెనడా ప్రధాని

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వానికి ఊహించని గట్టి దెబ్బ తగిలింది. ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు న్యూ డెమొక్రటిక్‌ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్‌ సింగ్‌ బుధవారం ప్రకటించారు. 2022లో తమ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు జగ్మీత్‌ తెలిపారు. తన నిర్ణయాన్ని ఇప్పటికే ప్రధానికి తెలియజేశానని చెప్పారు. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది.

 హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బల పరీక్షలో నెగ్గాలంటే ఇతర ప్రతిపక్షాల మద్దతు ట్రూడోకు తప్పనిసరి. అయితే కన్జర్వేటివ్‌లను ట్రూడో ఎదుర్కోలేకపోతున్నారని జగ్మీత్‌ విమర్శించారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా స్వార్థపరులతో నిండిపోయిందని, కార్పొరేట్‌ ప్రపంచానికి కొమ్ముకాస్తోందని జగ్మీత్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి పోటీ చేస్తానని జగ్మీత్‌ తన మనసులో మాట బయటపెట్టారు. 52 ఏళ్ల ట్రూడో తొలిసారిగా 2015 నవంబరులో బాధ్యతలు చేపట్టారు.

 గత రెండేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం,గృహనిర్మాణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత రెండు ఎన్నికలలోనూ లిబరల్స్‌ మెజారిటీ సాధించలేదు. ఎన్డీపీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ట్రూడో పాలిస్తున్నారు.  2015 నవంబర్‌లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో పట్ల ప్రస్తుతం ఓటర్లలో వ్యతిరేకతతో ఉందని సర్వేలు చెబుతున్నాయి. 

ఇప్పుడు ఎన్నికలు జరిగితే తాను ఘోరంగా ఓడిపోతానని సర్వేలు చెబుతున్న తరుణంలో పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ట్రూడో ప్రతిపక్ష సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సి వస్తుంది. కెనడా చట్టం ప్రకారం 2025 అక్టోబర్‌ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్‌ 16న హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. ట్రూడో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోతే సార్వత్రిక ఎన్నికలకు దారితీస్తుంది. 

ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల వార్తలను ట్రూడో తోసిపుచ్చారు. న్యూ ఫౌండ్‌ ల్యాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రూడో మీడియాతో మాట్లాడారు. కెనడియన్లకు సేవలందించడంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇతర రాజకీయాలపై దృష్టి పెట్టబోమని ఆయన స్పష్టంచేశారు. వచ్చే సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దానివల్ల తమ ప్రభుత్వం సొంత ఎజెండాతో ముందుకు సాగడానికి సమయం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement