strength test
-
Canada: ట్రూడో ప్రభుత్వానికి ముప్పు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఊహించని గట్టి దెబ్బ తగిలింది. ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ బుధవారం ప్రకటించారు. 2022లో తమ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు జగ్మీత్ తెలిపారు. తన నిర్ణయాన్ని ఇప్పటికే ప్రధానికి తెలియజేశానని చెప్పారు. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో బల పరీక్షలో నెగ్గాలంటే ఇతర ప్రతిపక్షాల మద్దతు ట్రూడోకు తప్పనిసరి. అయితే కన్జర్వేటివ్‌లను ట్రూడో ఎదుర్కోలేకపోతున్నారని జగ్మీత్ విమర్శించారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా స్వార్థపరులతో నిండిపోయిందని, కార్పొరేట్ ప్రపంచానికి కొమ్ముకాస్తోందని జగ్మీత్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి పోటీ చేస్తానని జగ్మీత్ తన మనసులో మాట బయటపెట్టారు. 52 ఏళ్ల ట్రూడో తొలిసారిగా 2015 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం,గృహనిర్మాణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత రెండు ఎన్నికలలోనూ లిబరల్స్ మెజారిటీ సాధించలేదు. ఎన్డీపీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ట్రూడో పాలిస్తున్నారు. 2015 నవంబర్‌లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో పట్ల ప్రస్తుతం ఓటర్లలో వ్యతిరేకతతో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తాను ఘోరంగా ఓడిపోతానని సర్వేలు చెబుతున్న తరుణంలో పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ట్రూడో ప్రతిపక్ష సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సి వస్తుంది. కెనడా చట్టం ప్రకారం 2025 అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్ 16న హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ట్రూడో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోతే సార్వత్రిక ఎన్నికలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల వార్తలను ట్రూడో తోసిపుచ్చారు. న్యూ ఫౌండ్ ల్యాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రూడో మీడియాతో మాట్లాడారు. కెనడియన్లకు సేవలందించడంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇతర రాజకీయాలపై దృష్టి పెట్టబోమని ఆయన స్పష్టంచేశారు. వచ్చే సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దానివల్ల తమ ప్రభుత్వం సొంత ఎజెండాతో ముందుకు సాగడానికి సమయం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఐసీయూలో ‘నారాయణ’ సర్కార్
సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో పుదుచ్చేరి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీఎం నారాయణస్వామి సర్కారు పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్లా మారింది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో సోమవారం బల పరీక్ష సాగేనా అనే చర్చ బయలు దేరింది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ‘నారాయణ’ సర్కారు భవిత తేలనుంది. పుదుచ్చేరిలో సాగుతున్న రసవత్తర రాజకీయం గురించి తెలిసిందే. మైనారిటీలో పడ్డ సీఎం నారాయణస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఇన్చార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలతో సోమవారం బలపరీక్షకు నారాయణ స్వామి సిద్ధమవుతున్న సమయంలో ఆదివారం ఊహించని మలుపులు తప్పలేదు. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్‌డౌన్..మొదలైనట్టుగానే పరిస్థితులు నెలకొన్నాయి. మరో ఇద్దరు రాజీనామా.. 2016 ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నాలుగున్నరేళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడితో అధికార వార్కే అధిక సమయం కేటాయించిన సీఎం నారాయణస్వామి, తాజాగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోకతప్పలేదు. గత ఏడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిరుగుబావుటా ఎగురవేసిన నాటి నుంచి దినదిన గండం అన్నట్టుగా ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి నారాయణస్వామికి తప్పలేదు. 28 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 15 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మె ల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. వరుస రాజీనామాలతో ప్రస్తుతం సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 9కిచేరగా, మిత్రపక్షం డీఎంకే సంఖ్య 2 తగ్గింది. స్వతంత్ర అభ్యర్థి అండగా ఉన్నా, అధికార బలాన్ని నిరూపించుకునేంత సంఖ్య నారాయణ చేతిలో ప్రస్తుతం లేదని చెప్పవచ్చు. నారాయణ మాట్లాడుతూ తాజా పరిమాణాలపై చర్చించామని రేపు నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. బలపరీక్ష సాగేనా?.... ప్రస్తుతం డీఎంకే–కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిని కలుపుకుంటే అధికార పక్షం సభ్యుల సంఖ్య 12గా ఉంది. ప్రతి పక్షాల విషయానికి వస్తే ఎన్ఆర్ కాంగ్రెస్–7, అన్నాడీఎంకే–4, బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటే, అధికార పక్షం కన్నా, ప్రతి పక్ష బలమే ఎక్కువ. ఈ దృష్ట్యా, బల పరీక్ష సాగేనా లేదా తన పదవికి నారాయణ రాజీనామా చేసేనా ప్రశ్న బయలురింది. తాజా పరిణామాల గురించి స్పీకర్ శివకొళుందు మీడియాతో మాట్లాడుతూ మరో ఇద్దరు రాజీనామా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. చట్టనిపుణులతో చర్చించి బలపరీక్షకు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది సోమవారం ఉదయం తేలుతుందన్నారు. వెంకటేషన్ తన పదవికి రాజీనామా చేసినా, తాను డీఎంకేలోనే ఉన్నట్టు ప్రకటించడం గమనార్హం. చదవండి: సొంత పార్టీ నేతలపై కార్తీ చిదంబరం విమర్శలు కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం -
22న బలం నిరూపించుకోండి
సాక్షి ప్రతినిధి, చెన్నై/యానాం: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. ‘విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలి. ఈ కార్యక్రమం మొత్తం వీడియో రికార్డింగ్ జరగాలి. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగియాలి’అని గవర్నర్ కార్యాలయం ఒక తెలిపింది. అంతకుముందు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి గవర్నర్ బంగ్లా రాజ్‌నివాస్‌లో ఆమె చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీప్ బెనర్జీ పదవీ ప్రమాణం చేయించారు. సీఎం నారాయణస్వామి ఆమెకు పుష్పగుచ్ఛమిచ్చి సత్కరించారు. తెలంగాణ, పుదుచ్చేరి అనే కవలపిల్లలను ఎలా చూసుకోవాలో తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వలసలు, రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. అయితే ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. -
ఎమ్మెల్యేలను నిర్బంధించవద్దు
భోపాల్/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేదికగా మధ్యప్రదేశ్ రాజకీయం బుధవారం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి. కమల్‌నాథ్ ప్రభుత్వం మనుగడ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని కోర్టు అంగీకరిస్తూనే.. బలపరీక్షను నిర్ణయించే అసెంబ్లీ కార్యకలాపాల్లోకి తాము రాదల్చుకోలేదని స్పష్టంచేసింది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు వారి ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తారని ప్రశ్నించింది. ‘రెబెల్ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లాలా లేదా అనేది వారి ఇష్టం. వారిని నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వారు స్వేచ్ఛగా ఉన్నారా లేదా అనేది మేము చూడాలి. వారిని నిర్బంధంలో ఉంచకూడదు’అని స్పష్టంచేసింది. రెబెల్ ఎమ్మెల్యేలను గురువారం జడ్జి చాంబర్లో హాజరుపరుస్తామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. వారు నిర్బంధంలో లేరని ఎలా నమ్మాలో చెప్పాలంటూ చౌహాన్ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీని అడిగింది. అయితే వారు స్వచ్ఛందంగానే బెంగళూరులో ఉన్నారని, నిర్బంధంలో లేరని ఆయన సమాధానం ఇచ్చారు. రెబెల్ ఎమ్మెల్యేల లాయర్ మణిందర్ సింగ్ కల్పించుకొని, స్పీకర్ ముందుకు తమ ఎమ్మెల్యేలు రాబోవడం లేదని, కొందరి రాజీనామాలను స్వీకరించి మరికొందరివి ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచిందని, వారిని కలిసేందుకు అనుమతించేలా కేంద్రానికి, కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేయగా.. రాజ్యాంగపరంగా ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేగానీ.. కాంగ్రెస్ నేతలతో కలవబోమని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాదించారు. బీజేపీ హిట్లర్ పోకడ: కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న∙రిసార్ట్ వద్ద ఆ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ ఆందోళనకు దిగగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిగ్విజయ్‌ను అరెస్ట్ చేయడం బీజేపీ హిట్లర్ తరహా నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్.. అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతిని కొనియాడారు. -
ఆ 22 మందికి నోటీసులు
భోపాల్/న్యూఢిల్లీ/బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కల్లా తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. స్వచ్ఛందంగానా లేక.. ఎవరి ఒత్తిడితోనైనా రాజీనామా చేశారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వారిని కోరారు. ఆ తర్వాతే సభలో బల పరీక్ష చేపడతామని స్పీకర్ తెలిపారు. బల నిరూపణకు సిద్ధమని సీఎం కమల్‌నాథ్ ఇంతకుముందే తెలిపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, పార్టీని వీడిన ఆరుగురు మంత్రులు సహా 22 మంది సభ్యుల రాజీనామాల విషయం తేలాకే బలపరీక్ష ఉంటుందన్నారు. రాజీనామాలు చేసిన వారంతా స్పీకర్‌ను ఎందుకు కలుసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి బీజేపీయే కారణమన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ కార్యకర్తలు, సింధియా అనుచరులు ఘనస్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి ఆయన్ను మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలోకి చేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బెంగళూరులో హైడ్రామా బెంగళూరు పోలీసులు తమ మంత్రులను ఇద్దరిని అరెస్టు చేశారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ, న్యాయవాది అయిన వివేక్ తంఖా మాట్లాడుతూ.. ‘బెంగళూరు రిసార్టులో ఉన్న ఎమ్మెల్యే మనోజ్ చౌదరితో మాట్లాడేందుకు ఆయన తండ్రితో కలిసి మంత్రులు జితు పట్వారీ, లఖన్ సింగ్ వెళ్లారు. బెంగళూరు పోలీసులు వారిని రిసార్టులోపలికి వెళ్లనివ్వలేదు. వారిపై దాడి చేసి, అరెస్టు చేశారు. మనోజ్ తన తండ్రితో కలిసి భోపాల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, రానివ్వడం లేదు. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, పట్వారీ అక్కడి పోలీసులతో వాదులాడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. రాజీనామా చేసిన 22 మందిలో 19 మంది బెంగళూరులోనూ మిగతా వారు మధ్యప్రదేశ్‌లోనూ ఉన్నట్లు సమాచారం. బల పరీక్షకు బీజేపీ డిమాండ్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అసెంబ్లీలో సర్కారు బలం నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 16వ తేదీన సభలో బల నిరూపణ జరపాలని స్పీకర్‌ను, గవర్నర్‌ను కోరతాం’ అని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తు గురించి భయపడ్డారు: రాహుల్ తన రాజకీయ భవిష్యత్తు గురించి భయపడుతున్నందునే సింధియా నమ్ముకున్న సిద్ధాంతాలను మర్చిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఆయన బయటకు చెప్పే దానికి వాస్తవ కారణాలకు చాలా తేడా ఉంది. ఆయన నా చిరకాల మిత్రుడు. కాలేజీ రోజుల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. తన రాజకీయ భవిష్యత్తు గురించిన భయం వల్లే సిద్ధాంతాలను పక్కనబెట్టి ఆర్ఎస్ఎస్(బీజేపీ)లోకి వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ గౌరవం లభించదు. ఆ పార్టీలో ఆయన సంతృప్తికరంగా ఉండలేరు’ అని అన్నారు. -
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్‌ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్‌చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్‌కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్‌లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్‌ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్‌ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్‌పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
సంకీర్ణానికి నాగరాజ్ ఝలక్
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయం ఆదివారం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు చేసిన విజ్ఞప్తికి తొలుత సానుకూలంగా స్పందించిన రెబెల్ ఎమ్మెల్యేల ఎంటీబీ నాగరాజ్ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేత ఆర్.అశోక్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం బెంగళూరు నుంచి ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ముంబైలో దిగగానే మాటమార్చారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. అయితే రెబెల్ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరిని ఒప్పించి వెనక్కు తీసుకొచ్చేందుకే నాగరాజ్ ముంబైకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో విశ్వాసపరీక్ష నాటికి అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజీనామా వెనక్కి తీసుకోను: నాగరాజ్ ముంబైకి వెళ్లేముందు నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘సుధాకర్ గత రెండ్రోజులుగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించి వెనక్కి తీసుకొస్తాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే చెప్పాను’ అని తెలిపారు. కానీ ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్న వెంటనే నాగరాజ్ మాటమార్చారు. ‘మేమంతా(రెబెల్ ఎమ్మెల్యేలు) ఒకేసారి రాజీనామా చేశాం. ఇప్పుడు రాజీనామా విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. నా రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా వెనుక బీజేపీ లేదు. బీజేపీ నేత అశోక్‌తో కలిసి నేను ముంబైకి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని వెల్లడించారు. మరో రెబెల్ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ స్పందిస్తూ.. నాగరాజ్ తమతో కలవడానికే ముంబై వచ్చారనీ, ఎమ్మెల్యే సుధాకర్‌ను వెనక్కి తీసుకెళ్లడానికి కాదన్నారు. నాగరాజ్ చేరికతో ముంబైలో మకాం వేసిన రెబెల్స్ సంఖ్య 15కు చేరుకుంది. రామలింగారెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ.. ఎమ్మెల్యే నాగరాజ్ చాకచక్యంగా ముంబైలోని రెబెల్స్ క్యాంప్‌కు చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రెబెల్ నేత రామలింగారెడ్డితో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖంద్రే, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి సమర్పించిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖంద్రే మీడియాతో మాట్లాడుతూ..‘రామలింగారెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం చాలాఉంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాబట్టి రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరాం‘’ అని తెలిపారు. మరోవైపు రామలింగారెడ్డి స్పందిస్తూ.. స్పీకర్ రమేశ్‌కుమార్‌తో సోమవారం సమావేశమయ్యేవరకూ తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎల్పీ సోమవారం సమావేశం కానుంది. 2–3 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మరోసారి డిమాండ్ చేశారు.‘కుమారస్వామి నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవముంటే వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి నేను ఇదే సూచిస్తాను. రెబెల్ ఎమ్మెల్యేలు వెనక్కు రాబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2–3 రోజుల్లో కర్ణాటక ప్రజలకు సేవలందించే సదవకాశం బీజేపీకి లభిస్తుంది’ అని చెప్పారు. కాంగ్రెస్‌పై కుమారస్వామి చిందులు.. సాక్షి, బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. బెంగళూరులోని కుమారకృప గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు. ‘మా పార్టీ నుంచి కేవలం ముగ్గురే వెళ్లారు. కానీ కాంగ్రెస్ నుంచి ఏకంగా 13 మంది రాజీనామాలు చేశారు. మీ ఎమ్మెల్యేలను కూడా మీరు బుజ్జగించలేరా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన కమల్‌నాథ్ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అప్రమత్తమయ్యారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా బుధవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 230 స్థానాలున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్రులు(4), బీఎస్పీ(2) ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బలాబలాలు 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది రాజీనామా చేయగా, మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ 16 రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం 100కు పడిపోతుంది. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగినందున ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
రేపే ‘విశ్వాసం’ పెట్టండి
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి శనివారం వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్, రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఆయన్ను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో శనివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘సీఎం స్వయంగా సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. సోమవారం జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ మేరకు మేం సీఎంకు సూచిస్తాం. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాధ్యతలు అప్పగించడం ఆయనకే మంచిది’ అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆపేందుకే కుమారస్వామి ‘విశ్వాసపరీక్ష’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. దమ్ముంటే సీఎం విశ్వాసపరీక్ష కోరాలనీ, ప్రస్తుతం పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చెప్పారు. స్పీకర్‌కు స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ.. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ శనివారం స్పీకర్ రమేశ్ కుమార్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షం(బీజేపీ)వైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జూలై 26 వరకూ కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్లో నగేశ్ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్ల మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. మా పిటిషన్లను కలిపి విచారించండి సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు చెందిన మరో ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించడంలేదని ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె.సుధాకర్, ఎన్.నాగరాజ్, మునిరత్న, రోషన్‌బేగ్‌లు ఆరోపించారు. గతంలో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషనత్తో తమ పిటిషన్‌ను కలిపి విచారించాలని కోర్టును కోరారు. 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్‌ను కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అనర్హతపై నిర్ణయం రిజర్వు: స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోరిందని స్పీకర్ తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపామనీ, చివరికి నిర్ణయాన్ని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ ‘నాగరాజ్’ సఫలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్‌ను తమవైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని నాగరాజ్ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజ్ ఇంటికొచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెత్తబడ్డ నాగరాజ్ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు చూచాయగా అంగీకరించారు. తర్వాత నాగరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నా రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సిద్దరామయ్య, దినేశ్గూండూరావులు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం అడిగా. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్‌తో మాట్లాడి ఆయన్ను కూడా రాజీనామా ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని చెప్పా’ అని తెలిపారు. మరోవైపు రమడా రిసార్టులో బసచేసిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి యడ్యూరప్ప భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ వెనక్కి వెళ్లబోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్ పద్మనాభ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపై స్పందించేందుకు రామలింగారెడ్డి నిరాకరించారు. ఫిరాయింపులపై చర్యలేవి? నిర్వీర్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో ఇప్పటివరకూ ఒక్క నేతకూ శిక్షపడని వైనం కర్ణాటక, గోవాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను నివారించేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయుధంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టాన్ని 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడకపోవడం గమనార్హం. స్పీకర్ పాత్రే కీలకం.. 1985లో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రచారం ఏ ప్రజాప్రతినిధి అయినా తమ పార్టీ విప్‌ను పాటించకపోయినా, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసినా అతను/ఆమె అనర్హులవుతారు. అయితే ఈ చట్టం ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ పాత్రే కీలకం. స్పీకర్ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ చట్టం ఉద్దేశమే నీరుగారిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనుగోలు చేసింది. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఫిరాయింపుదారులపై వేటేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిష్ప్రయోజనమవుతుందని చెబుతున్నారు. బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి వెళ్తున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ -
విశ్వాసపరీక్షకు సిద్ధం!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్‌లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి. సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్ సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు. రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్‌లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్‌లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు. ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్ అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్‌పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు. రాహుల్‌కు బెయిలు మంజూరు నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్‌కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి. యథాతథ స్థితి: సుప్రీంకోర్టు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు. స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా? ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్‌కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్‌కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ -
కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందని స్పీకర్ మంగళవారం చెప్పారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షోభ నివారణకు చర్య తీసుకోవాలని బీజేపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను నయానో, భయానో వెనక్కి రప్పించడానికి కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారాలేమిటన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాల ఆమోదం 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడం. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలం 100 కి పడిపోతుంది. దాంతో శాసన సభలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ కుమార స్వామిని ఆదేశించవచ్చు. 16 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 209 అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 105 మంది ఉంటే సరిపోతుంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిస్తున్నందున వారి బలం 108కి పెరుగుతుంది..కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఆ పార్టీ డిమాండు చేసే అవకాశం ఉంది. రాజీనామాల తిరస్కరణ ఒకవేళ స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తే దానిపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఫలితంగా సంక్షోభం మరింత కాలం కొనసాగవచ్చు.పది మంది తిరుగుబాటుఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చు. లేదా శాసన సభలో బల నిరూపణకు ఆదేశించవచ్చు. ఎమ్మెల్యేలు వెనక్కి రావడం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి వస్తారని కాంగ్రెస్,జేడీఎస్ నేతలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులివ్వడం కోసం ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా కూడా చేసింది. ఆ ఆశతోనైనా కొందరు తిరిగొస్తారని భావిస్తున్నారు. ముందు నలుగురైదుగురు వెనక్కి వస్తే..తర్వాత మిగతావాళ్లు ఆ దారినే వస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు. అది జరగని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత మంది రాజీనామా చేసేలా కూటమి నేతలు వ్యూహం పన్నవచ్చు. ఫిరాయింపు నిరోధక చట్టం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే, చట్ట ప్రకారం అది చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ఆ సభ్యుడు పార్టీ విప్‌ను ధిక్కరించాలి. లేదా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేయాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. కాబట్టి వీరికి ఫిరాయింపు చట్టం వర్తించదు. -
మంత్రులంతా రాజీనామా
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకం రోజుకో మలుపు తిరుగుతూ మరింత ఉత్కంఠ రేపుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–జేడీఎస్ ముఖ్యనేతలు సోమవారం చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. అసంతృప్త నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ నుంచి 21 మంది మంత్రులు, జేడీఎస్‌కు చెందిన 9 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. మరోవైపు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకం మరింత రంజుగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు, జేడీఎస్ ప్రతినిధులు ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరతో సమావేశమైన సీఎం కుమారస్వామి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మంత్రుల రాజీనామా నేపథ్యంలో వీలైనంత త్వరగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతామని అధికారిక వర్గాలు తెలిపాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొత్తం 34 మంత్రి పదవులకు గానూ కాంగ్రెస్ 22, జేడీఎస్ 12 మంత్రి పదవులను తీసుకునేలా ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరింది. అయితే తమకు న్యాయం జరగలేదంటూ 13 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. కాగా, ఈ రాజీనామాలను ఆమోదించవద్దని కాంగ్రెస్ న్యాయవిభాగం స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కోరింది. ఈ ఎమ్మెల్యేలు నియమ నిబంధనల మేరకు, స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించలేదని స్పష్టం చేసింది. ఇద్దరు మంత్రుల రాజీనామా కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార కూటమికి మరో షాక్ తగిలింది. ఇటీవల కుమారస్వామి కేబినెట్లో మంత్రులుగా నియమితులైన స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు తమ మంత్రి పదవులకు రాజీనామా సమర్పించారు. సోమవారం ఉదయం బెంగళూరులోని రాజ్‌భవన్‌కు చేరుకున్న నగేశ్, గవర్నర్ వజూభాయ్‌వాలాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నగేశ్ లేఖలో తెలిపారు. ఒకవేళ గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే మంత్రి ఆర్.శంకర్ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికారు. మరోవైపు తన సమస్యలను పరిష్కరించకుంటే అధికార కూటమిని వీడుతానని మంత్రి రహీమ్ మహమూద్ ఖాన్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందనీ, అందుకే త్వరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని బహిష్కృత ఎమ్మెల్యే రోషన్ బేగ్ ప్రకటించారు. మంగళవారం జరిగే సీఎల్పీ భేటీని తాను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తుది నిర్ణయం అధిష్టానానికే పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘సోమవారం మేం మంత్రులతో భేటీ అయ్యాం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలిపెట్టారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీని నిలువరించేందుకు మంత్రులు చేసిన త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బీజేపీ ఇప్పటికే ఐదుసార్లు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి విఫలమైంది’ అని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన నేతలు తిరిగివస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయమై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ‘పార్టీపై మాకు పూర్తి విశ్వాసముంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. కాంగ్రెస్ మంత్రులు శివనదా పాటిల్, ఆర్వీ దేశ్‌పాండేలు వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాకపోయినా రాజీనామాకు తమ సమ్మతిని తెలియజేశారు. సామాజిక న్యాయం, ప్రాంతం, అర్హతల ఆధారంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది’ అని తెలిపారు. నేను దేనికీ భయపడను: కుమారస్వామి కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై సీఎం కుమారస్వామి తొలిసారి నోరువిప్పారు. తాను దేనికీ భయపడబోననీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తాను ఏమాత్రం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పరి పాలించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడంపైనే నేను దృష్టి సారించా. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నేను దృష్టి సారించలేదు. అంత అవసరం కూడా నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్‌వాలా ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఆరోపించారు. గోవాకు రెబెల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్–జేడీఎస్‌కు చెందిన 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరారు. 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు గోవాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బీజేపీ ముంబై యువమోర్చా అధ్యక్షుడు మోహిత్ వీరితో ఉన్నట్లు వెల్లడించాయి. వీరంతా గోవా శివార్లలోని ఓ రిసార్టులో బస చేస్తారని పేర్కొన్నాయి. నేటి నుంచి బీజేపీ ఆందోళన కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనీ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కుమారస్వామి రాజీనామా చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఆందోళనలు చేపడతామని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప హెచ్చరించారు. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు: రాజ్‌నాథ్ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి తొలుత మాట్లాడుతూ..‘కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేలను ముంబైలోని స్టార్ హోటల్‌కు తరలించారు. ఎమ్మెల్యేలు గవర్నర్ వజూభాయ్‌వాలాను కలిసిన వెంటనే అప్పటికప్పుడు కార్లు, విమానాలు, హోటల్ సదుపాయాలు ఏర్పాటైపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. 303 మంది లోక్‌సభ ఎంపీలున్నప్పటికీ మీ కడుపు నిండలేదు. ఇప్పుడు మీ(బీజేపీ) కడుపు, ఢిల్లీ గేటు ఒకేలా కనిపిస్తున్నాయి’ అని దుయ్యబట్టారు. దీంతో రాజ్‌నాథ్ స్పందిస్తూ..‘కర్ణాటకలో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ పార్టీలో పెద్దపెద్ద నేతలే(రాహుల్ గాంధీ, సింధియా తదితరులు) రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని రాహుల్ గాంధీయే ప్రారంభించారు’ అని తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదాలున్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత నగదు వెచ్చించారో చెప్పాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లను కాంగ్రెస్ ట్విట్టర్లో డిమాండ్ చేసింది. 12 మందికి యెడ్డీ కేబినెట్లో చోటు! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యడ్యూరప్ప నేతృత్వంలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమని బీజేపీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 13 మంది ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వెల్లడించాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ..‘13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసినందున వారికి విప్ జారీ వర్తించదు. వీరి రాజీనామాలపై నిర్ణయాన్ని స్పీకర్ ఆలస్యం చేయగలరే తప్ప తిరస్కరించలేరు’ అని స్పష్టం చేశారు. ప్రభు త్వం పడిపోకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలను వాయిదావేయడం లేదా రద్దుచేసే చాన్సుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. స్పీకర్ నిర్ణయమే కీలకం.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజీనామాలన్నీ పద్దతి ప్రకారం, నిర్ధిష్ట నమూనాలో ఉంటే వాటిని ఆమోదించడం తప్ప స్పీకర్ మరో ప్రత్యామ్నాయం ఉండదు. అయితే, ఆమోదానికి కొంత వ్యవధి తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పించవచ్చు. లేదా బలపరీక్షకు సిద్ధంకావాలని సీఎం కుమారస్వామిని ఆదేశించవచ్చు. స్పీకర్ గనుక రాజీనామాలను ఆమోదిస్తే ఆ క్షణమే కుమారస్వామి సర్కారు మైనారిటీలో పడిపోతుంది. కుమార స్వామి బలపరీక్షకు ఒప్పుకోకపోతే బీజేపీ అవిశ్వాస తీర్మానాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా స్పీకర్‌ను తొలగించాలని కూడా ఆ పార్టీ డిమాండు చేయవచ్చు. అదే జరిగితే సభలో బలపరీక్ష తప్పదు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం సరిగా లేదని భావిస్తే ఇరు పక్షాల్లో ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. బలాబలాలు ఇలా... 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రాజీనామాల ముందు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి 118 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ స్పీకర్ రమేశ్ కుమార్ 13 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 211కు తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. అదే సమయంలో అధికార జేడీఎస్–కాంగ్రెస్ కూటమి బలం 103కు పడిపోతుంది. ఇదే జరిగితే 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇద్దరు స్వతంత్రుల మద్దతు (107) తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. మీడియాతో మాట్లాడుతున్న సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, దినేశ్ గుండూరావు -
భం భం బోలే మెజార్టీ మోగాలే!
ఇప్పుడు అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసి మీదే. ప్రధాని గెలుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయనకు ఎంత మెజార్టీ వస్తుందన్నదే చర్చనీయాంశం. 2014 ఎన్నికల్లో మోదీ పోటీ చేసిన ఈ స్థానంలో ప్రత్యర్థిగా అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మోదీని ఓడిస్తానని శపథం చేసి మరీ వారణాసి నుంచి బరిలోకి దిగారు. మోదీ హవా ముందు కేజ్రీవాల్ క్రేజ్ వెలవెలబోయింది. 3 లక్షల 71 వేల 785 ఓట్ల మెజార్టీతో మోదీ విజయదుందుభి మోగించారు. ఈసారి కేజ్రీవాల్ వంటి బలమైన అభ్యర్థులు బరిలో లేరు. ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థి శాలిని యాదవ్ రెండేళ్ల క్రితమే వారణాసి మేయర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి ఆమె మూడో స్థానానికే పరిమితమవుతారని అంచనాలున్నాయి. ఇక కాంగ్రెస్ తరఫు నుంచి అజయ్‌రాయ్ గత ఎన్నికల్లో పోటీకి దిగి కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయారు. అందుకే బీజేపీ ఈ సారి గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పక్కాగా అడుగులు వేస్తోంది. నామినేషన్ నుంచే బలప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నాదే అన్నట్టుగా నామినేషన్ నుంచే బలప్రదర్శనకు దిగారు. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే వారణాసిలో హర హర మోదీ నినాదాలు హోరెత్తేలా ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షో నిర్వహించి తన సత్తా చాటారు. ఆ తర్వాత జరిగిన గంగా హారతి, పడవ విహారం నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగాయి . మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్లో పట్టు బిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే వారణాసిపైన కూడా అంతే దృష్టి పెట్టారు. మోదీ కూడా ప్రతీ రోజూ ఏదో ఒక సమయంలో వారణాసికి వస్తూ పొలిటికల్ మూడ్ గమనిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, సిద్ధార్థనాథ్ సింగ్, శ్రీకాంత్ శర్మ, సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, వీకే సింగ్ వారణాసిలో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ సాధించాలన్న పట్టుదలతో పని చేశారు. గత అయిదేళ్లలో వారణాసిలో జరిగిన అభివృద్ధినే ప్రస్తావించారు. వారణాసిని జపాన్‌లో ఆధ్యాత్మిక నగరం క్యోటోగా మారుస్తానని గత ఎన్నికల్లో మోదీ తాను ఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయినా ఆ దిశగా పునాదులైతే పడ్డాయి. విద్యుత్ సౌకర్యం, రోడ్ల విస్తరణ, విశ్వనాథుడి ఆలయం నుంచి గంగా ఘాట్ వరకు కారిడార్, ఇంటింటికీ పైపు లైన్ల ద్వారా గ్యాస్ సౌకర్యం వంటి ప్రాజెక్టుల్లో పురోగతి కళ్లకు కనిపిస్తూనే ఉంది. ‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్ని వర్గాలకు ఇళ్లు కట్టి ఇచ్చాం. ఆయుష్, టాయిలెట్ స్కీమ్‌లు ముస్లింలకు కూడా ప్రయోజనకరంగానే ఉన్నాయి’’ అని కొందరు ముస్లింలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ప్రియాంకని కాకుండా ఎప్పుడైతే వేరే అభ్యర్థిని రంగంలోకి దింపిందో అప్పుడే చేతులెత్తేసిందని, మోదీకి తిరుగులేని మెజార్టీ ఖాయమన్న అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది. ‘‘మేము ఎన్నుకుంటున్నది ఒక ఎంపీని కాదు. ప్రధానమంత్రిని’’ –శిశిర్ వాజ్‌పేయి, బీజేపీ కార్యకర్త (ఇది కేవలం ఒక కార్యకర్త అభిప్రాయం మాత్రమే కాదు వారణాసి గుండె చప్పుడు కూడా ఇదే) -
రేపు స్పీకర్ ఎన్నిక తర్వాత బలపరీక్ష
-
రేపు బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక
బెంగళూరు: జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ కుమార్ పేరును స్పీకర్ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. -
కాంగ్రెస్ ఆపద్బాంధవుడు శివకుమార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ దగ్గర్నుంచి.. శనివారం బలపరీక్ష జరిగేంతవరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. శివకుమార్ ఒక్కళిగ సామాజికవర్గానికి చెందినవారు. కననపుర ఎమ్మెల్యే అయిన శివకుమార్ గతంలో ఇంధనశాఖ మంత్రిగా చేశారు. విలాస్‌రావ్ ప్రభుత్వానికి అండ మహారాష్ట్రలో 2002లో అప్పటి కాంగ్రెస్ సీఎం విలాశ్రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరి ఉంది. దీంతో ఎస్ఎం కృష్ణ కేబినెట్లో మంత్రిగా ఉన్న శివ మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌కు తరలించి కాపాడారు. శివ తొలిసారిగా 1989లో సాతనూరు నియోజకవర్గంలో దేవెగౌడను ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో 1990లో అప్పటి సీఎం బంగారప్ప ఆయన్ను జైళ్లు, హోంగార్డుల శాఖమంత్రిగా నియమించారు. 2002 లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ మీద పోటీచేసి ఓడిపోయిన శివకుమార్.. రెండేళ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేవెగౌడపై తేజస్వినీ అనే జర్నలిస్టును గెలిపించి ప్రతీకారం తీర్చుకున్నారు. గుజరాత్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు నేతృత్వం 2017 చివర్లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను ఓడించాలని బీజేపీ ప్రయత్నించిన నేపథ్యంలో శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌లో దాచిఉంచారు. ఈ సమయంలో శివతో పాటు ఆయన సన్నిహితులపై ఐటీ శాఖ భారీఎత్తున దాడులు నిర్వహించింది. తాజాగా కర్ణాటక సంక్షోభం నేపథ్యంలోనూ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం శివకే అప్పగించింది. -
‘తక్కువ సమయం’ సహేతుకమే
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పును న్యాయ నిపుణులు స్వాగతించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు సహేతుకం, సమర్థనీయమైనవి, దీంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై అనుమానాలు నివృత్తి అవుతాయని సీనియర్ లాయర్లు రాకేశ్ ద్వివేది, అజిత్ సిన్హా, వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. బలపరీక్షకు కోర్టు కాల పరిమితి విధించడంలో తప్పు లేదని అజిత్ అన్నారు. ప్రమాణ స్వీకారాన్ని కోర్టు వాయిదా వేసి ఉండాల్సిందన్న వికాస్..బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సబబేనన్నారు. ‘బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సమంజసమే. గోవా, ఉత్తరాఖండ్‌లో ఇలాగే జరిగింది. ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేలు ఫిరాయించే ముప్పుంది. ఇప్పటికే రెండ్రోజులు లేటైంది’ అని ద్వివేది అన్నారు. ద్వివేదితో అజిత్ ఏకీభవించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల పందేరానికి తెరతీసినట్లవుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై స్పందిస్తూ..ఆ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దే అని ద్వివేది అన్నారు. -
వంద శాతం గెలుస్తాం
బెంగళూరు: బల పరీక్షలో వంద శాతం గెలుస్తానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అన్నారు. ‘ఈ రాజకీయ క్రీడలో మేం మా ఆధిక్యాన్ని నిరూపించుకుంటాం. బలపరీక్షలో నెగ్గుతాం’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సాధారణ ఆధిక్యం లేకుండానే సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప.. పీఠమెక్కిన దాదాపు 55 గంటల్లోనే విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. మా ఎమ్మెల్యేను ఢిల్లీలో ఉంచారు: ఆజాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం బేరసారాల కోసం ఢిల్లీకి పిలిపించుకుందనీ, అక్కడ నుంచి ఆయన తిరిగిరాకుండా కట్టడి చేస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానం లో ఉన్న గవర్నర్.. ఆయన చేతులతోనే రాజ్యాంగం పీక నొక్కుతున్నారని ఆజాద్ మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారనడానికి సుప్రీం ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నితీశ్‌వైపే విశ్వాసం..
అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన ఎన్డీయే ► 131–108 ఓట్ల తేడాతో విజయం ► ప్రజాసేవ చేస్తా.. కుటుంబసేవ కాదు ► బిహార్ అసెంబ్లీలో మహాకూటమిపై నితీశ్ విమర్శలు పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సులభంగా విజయం సాధించారు. కీలకమైన పరీక్షలో 131–108 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బిహార్‌లో మూడేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం కొనసాగేందుకు మార్గం సుగమమైంది. కాగా, ఓటింగ్‌కు ముందు బిహార్ అసెంబ్లీలో వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రజలకు సేవచేయటమే తన బాధ్యతని.. ఒక కుటుంబానికి సేవ చేసేందుకు కాదని అసెంబ్లీలో నితీశ్ కుమార్ విమర్శించారు. తనను స్వార్థపరుడన్న రాహుల్ గాంధీకీ చురకలంటించారు. అటు తేజస్వీ యాదవ్ కూడా నితీశ్, ఎన్డీయేలపై తీవ్రంగా మండిపడ్డారు. విశ్వాస పరీక్ష సందర్భంగా తేజస్వీ యాదవ్, సుశీల్ మోదీ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సునాయాసంగా.. ఆరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ విశ్వాస పరీక్షకు ముందు పట్నా, ఢిల్లీల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురు జేడీయూ ముఖ్యనేతలు నితీశ్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అటు కొందరు ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్డీయేతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే నితీశ్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 243 మంది సభ్యుల అసెంబ్లీలో నలుగురికి ఓటుహక్కు లేకపోవటంతో మిగిలిన 239 మందితోనే ఓటింగ్ కొనసాగించారు. దీంతో విశ్వాసం పొందేందుకు ఎన్డీయేకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. ఇందుకు తగ్గట్లుగానే సభలో 131 మంది (జేడీయూ 70, బీజేపీ 52, హెచ్ఏఎమ్ 1, ఆర్ఎల్ఎస్పీ 2, ఎల్జేపీ 2, స్వతంత్రులు 4, స్పీకర్ ఓటు వేయలేరు) నితీశ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విపక్షాల సభ్యులు (ఆర్జేడీ 79, కాంగ్రెస్ 26, సీపీఐ–ఎమ్ఎల్ 3) 108మంది వ్యతిరేకంగా ఓటేశారు. తెలిసీ పొత్తెందుకు పెట్టుకున్నట్లు: తేజస్వీ అంతకుముందు సభ ప్రారంభం కాగానే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని నితీశ్ ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా విపక్ష నేతైన తేజస్వీ యాదవ్ ముందుగా మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. దీంతో ఆయన నితీశ్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి నితీశ్ బిహార్ ప్రజలను మోసగించారన్నారు. ‘నన్ను అడ్డం పెట్టుకుని నితీశ్ తన ఇమేజ్ను పెంచుకున్నారు. బీజేపీతో చేరాలని ముందుగానే నిర్ణయించుకుని ఈ పన్నాగం పన్నారు. నితీశ్‌ను తన గురువుగా, చిన్నాన్నగా, వికాస్ పురుష్‌గా గుర్తించానని యాదవ్ పేర్కొన్నారు. జేడీయూ ఎప్పుడూ సొంతంగా బిహార్‌లో గెలవలేదని.. ఇతర పార్టీల సాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని విమర్శించారు. ఆర్జేడీ, లాలూపై అవినీతి కేసులున్న విషయం తెలిసి మరీ అప్పుడు పొత్తేందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. కాగా, లాలూ ప్రసాద్ అవినీతి కుటుంబంపై నితీశ్ పోరాటం చేశారని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ పేర్కొన్నారు. ‘2015లో ప్రజాతీర్పు అవినీతికి వ్యతిరేకంగా, సుపరిపాలన కోసం ఇచ్చారు. కానీ అక్రమ పద్ధతుల్లో, బినామీలపేరుతో ఆస్తులను కూడబెట్టుకునేందుకు కాదు. మహాకూటమితో సుపరిపాలన సాధ్యంకాదనే నితీశ్ ఎన్డీయేలో కలిశారు. మహ్మద్ షాబుద్దీన్, రాజ్ వల్లభ్ వంటి ఆర్జేడీ నేతలతో పాలన చేయటమే కష్టం’ అని సుశీల్ మోదీ తెలిపారు. నాకు పాఠాలు చెప్పొద్దు: నితీశ్ విశ్వాస పరీక్షకు ముందు నితీశ్ సభలో ఆర్జేడీపై మండిపడ్డారు. ‘విపక్షాలు నాకు లౌకికవాదంపై పాఠాలు చెప్పనక్కర్లేదు. లౌకికవాదాన్ని చేతల్లో చూపాలి. అవినీతి చేసి కోట్లు సంపాదించుకుని లౌకికవాదం మాటున దాక్కునే వారితో కలిసి పనిచేయలేను’ అని అన్నారు. పదినిమిషాల సేపు మాట్లాడినా పదునైన వ్యాఖ్యలతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘తేజస్వీని తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వమని అడిగాను. దీనికి ఆయన స్పందించలేదు. సంకీర్ణ రాజకీయాలను నేను గౌరవించాను. ప్రజాతీర్పు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేందుకే. కానీ కొందరు దీన్ని మోసగించారు. ప్రజాకోర్టే అత్యంత కీలకం. ప్రజలకు సేవచేయటమే నా బాధ్యత. ఒక కుటుంబానికి సేవ చేసేందుకు కాదు’ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటం చాలా కష్టమైందని నితీశ్ పేర్కొన్నారు. బిహార్ అభివృద్ధి కోసమే బీజేపీతో జతకలిసినట్లు తెలిపారు. తను స్వార్థపరుడినంటూ వ్యాఖ్యానించిన రాహుల్ పేరును ప్రస్తావించకుండానే విమర్శించారు.‘2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 15–20 సీట్లు ఇవ్వాలని లాలూ నిర్ణయించారు. 40 సీట్లు ఇచ్చేలా నేను చొరవతీసుకున్నా. అందులో 27 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అదే నా స్వార్థం’ అని పేర్కొన్నారు. -
పటుత్వ పరీక్ష చేయించుకోవాల్సిందే..
- ఓ భర్తకు తేల్చి చెప్పిన హైకోర్టు - సెషన్స్ కోర్టు ఉత్తర్వులకు సమర్థన సాక్షి, హైదరాబాద్: వైవాహిక జీవితంలో తలెత్తిన స్పర్థల నేపథ్యంలో తన భర్తకు లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించాలంటూ ఓ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తన భర్తకు లైంగిక పటుత్వం లేదని, ఈ విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నారని, అనంతరం అధిక కట్నం కోసం వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పటుత్వ పరీక్ష చేయించుకునేందుకు భర్త నిరాకరించడంతో పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మేజిస్ట్రేట్ పోలీసుల అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేశారు. దీనిపై పోలీసులు అప్పీల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సెషన్స్ కోర్టు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి పటుత్వ పరీక్ష చేయించుకోవాల్సిందేనని భర్తకు తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వులను సమర్థించారు. పటుత్వ పరీక్ష చేయించుకోవడం పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు కాదంటూ రివిజన్ పిటిషన్‌ను కొట్టేశారు. -
బలపరీక్షలో రావత్ గెలుపు
* ఉత్తరాఖండ్‌లో గట్టెక్కిన కాంగ్రెస్ సర్కారు * అనుకూలంగా 33 మంది, వ్యతిరేకంగా 28 మంది ఓటు గెలుపు వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు * నేడు అధికారికంగా ప్రకటించనున్న సుప్రీంకోర్టు * ఇప్పటికైనా ఉత్తరాఖండ్ అభివృద్ధికి కలసిరండి: రావత్ డెహ్రాడూన్/న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ మధ్య మంగళవారం జరిగిన ఉత్తరాఖండ్ బలపరీక్షలో రావత్ సర్కారు గట్టెక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమాచారం మేరకు రావత్‌కు అనుకూలంగా 33 మంది ఓటేయగా, 28 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 90 నిమిషాల ఓటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసిన అధికారులు సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించారు. గెలుపు వివరాలను సుప్రీంకోర్టు నేడు అధికారికంగా ప్రకటించనుంది. రావత్ సర్కారు విజయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందంటూ మార్చి 28న మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సరితాఆర్య తెలిపిన వివరాల ప్రకారం.. రావత్‌కు అనుకూలంగా 33 మంది ఓటేశారు. దాంతో బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. బీజేపీకి చెందిన భీమ్లాల్ ఆర్య, కాంగ్రెస్‌కు చెందిన రేఖా ఆర్యలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు సమాచారం. రావత్‌కు అనుకూలంగా ఓటేసిన వారిలో 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీకి చెందిన ఇద్దరు, యూకేడీ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్రులున్నారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు అనర్హులని సోమవారం హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 61 మందే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్ కోసం మంగళవారం ఉదయం రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను తొలగించారు. ఉదయం నుంచే ఉత్కంఠ.. బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉదయం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. 11 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ గంట పాటు సాగింది. అసెంబ్లీ గేటు బయట విలేకర్లు, పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఇంతలో నైనిటాల్ ఎమ్మెల్యే సరిత ఆర్య బయటకొచ్చి ఆనందంతో రావత్ గెలిచారంటూ ప్రకటించారు. సుప్రీం ఆదేశాల మేరకు బలపరీక్ష క్రమశిక్షణ మధ్య సాగిందన్నారు. ఘర్షణ వాతావరణం వద్దు: రావత్ బలపరీక్ష ముగిసిన వెంటనే హరీశ్ రావత్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఒక్కో ఎమ్మెల్యేకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. బలపరీక్ష వివరాల్ని బుధవారం సుప్రీంకోర్టు వెల్లడిస్తుందన్నారు. తాను చిన్న రాష్ట్రానికి చిన్న ముఖ్యమంత్రినని, ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికి ఉత్తరాఖండ్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని బలమైన నేతలు స్నేహ హస్తం అందించాలని కోరారు. రాజ్యసభలో రగడ: ఉత్తరాఖండ్ ఆర్థిక బిల్లును సోమవారం నాటి అదనపు జాబితాలో పెట్టడంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించగా మళ్లీ పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ బలపరీక్ష నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ బోసి పోయి కన్పించింది. పాలక, ప్రతిపక్ష సభ్యులు చాలా మంది హాజరుకాలేదు. సమాధానాలు కోరిన పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో కనిపించలేదు. కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రజాసంక్షేమంపై కీలకమైన ప్రశ్నలు సంధించినా.. ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడంతో సహాయమంత్రి సమాధానమిచ్చారు. మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ: సోనియా బలపరీక్ష ముగియగానే ఇది ప్రజాస్వామ్య విజయమంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పేర్కొన్నారంటూ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. ఈ విజయం మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టని సోనియా చెప్పారన్నారు. రావత్ విజయం బీజేపీకి ఎదురుదెబ్బ కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ అంతర్గత సమస్య వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. హరీశ్ రావత్ గెలుపును కొనుగోలు చేశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెపుతారంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుని సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేల్ని కొన్నారంటూ ఆయన విమర్శించారు. పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే ప్రజాప్రతినిధులు సొంత పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరాలనుకుంటే తక్షణం రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒకవేళ ప్రజాప్రతినిధి వేరే పార్టీ మారాలనుకుంటే అతన్ని తక్షణం అనర్హుడ్ని చేయాలన్నారు. ఉత్తరాఖండ్ బలపరీక్ష నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘ఒక ప్రజాప్రతినిధి పార్టీ మారాలనుకుంటే రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి పదవికి రాజీనామా చేయాలి. బలపరీక్షకు సంబంధించి స్పీకర్ పాత్రతో పాటు ఫిరాయింపుల చట్టం అమలు నిబంధనల్నీ పునఃపరిశీలించాలి’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బస్సుల్లో... బలపరీక్ష
నరకం.. నగర ప్రయాణం ⇒ నాయకులూ ఆలోచించండి..! ⇒ మొత్తం బస్సులు 3580 ⇒ మెట్రో (ఏసీ) 80 ⇒ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 1000 ⇒ ఆర్డినరీ బస్సులు 2500 ⇒ ప్రస్తుత అవసరం 1000 ⇒ భవిష్యత్ అవసరం 3000 సిటీ ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే సాహసమే. గంటల తరబడి స్టాపులో నిలుచుంటే ఎప్పటికో వస్తాయి. ఎక్కుదామనుకుంటే స్టాపులో ఆగకుండానే వెళ్లిపోతాయి. ఓపికున్నవారు పరుగెత్తి పట్టుకుంటారు. లేనివారు తిట్టుకుంటూ ఆటోను నమ్ముకుంటారు. ఇది ప్రయాణికుల అనుభవం. డ్రైవర్ కొలువు కూడా సాహసమే. స్టాపులో బస్సు నిలపలేదన్న సాకుతో చార్జీ మెమో అందుకోవాలి. అక్కడ ఆగి ఉన్న ఆటోలను మాత్రం ఎవరూ తొలగించరు. పని వేళలు ఎనిమిది గంటలే అయినా.. కనీసం 10 గంటలు తక్కువ కాకుండా విధుల్లో ఉండాల్సిందే. ఇందుకు ట్రాఫిక్‌జాం కారణమని వేరే చెప్పనక్కర్లేదు. రూట్లను బట్టి ఒక్కో డ్రైవర్ రోజుకు 100-150 కిలోమీటర్లు తిరగాలి. గతుకుల రోడ్లలో నడుములు విరిగిపోయి తక్కువ వయసులోనే బస్సులను షెడ్డుకు, దేహాన్ని ఆస్పత్రికి పంపక తప్పడం లేదు. ఇక రాత్రి వేళల్లో మందుబాబులు, ఆకతాయిల నుంచి డ్రైవర్లకు రక్షణ లేని పరిస్థితి. బస్సు నలువైపులా చూస్తూ టిక్కెట్.. టిక్కెట్.. అంటూ పరిగెత్తే కండక్టర్‌కూ ఎన్నో కష్టాలు. ఎస్సార్ సరిగా లేదని అధికారులతో అక్షింతలు. తమ స్టాప్ వద్ద ఆపలేదని ప్రయాణికుల చీవాట్లు. బస్సులు పెంచక, సిబ్బందిని నియమించకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ కష్టాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించే వారినే ‘గ్రేటర్’ పీఠం ఎక్కిస్తామంటున్నారు సిటీజనులు. బస్సుల సమస్యలపై వారేమన్నారో వారి మాటల్లోనే.. సమయమంతా ఎదురు చూపులకే.. నువ్వు ఎక్కాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. ఇది సరిగ్గా నగర ప్రయాణికులకు సరిపోతుంది. సమయానికి బస్సు రాదు. వచ్చినా కాలు తీసి వేయలేని దుస్థితి మధ్య ప్రయా ణం. నా కోర్సు కోచింగ్ సమయం రెండు గంటలైతే.. సిటీ బస్సు కోసం ఎదురు చూసేది మాత్రం మూడు గంటలు. - రాంభూపాల్, సివిల్స్ అభ్యర్థి పడుతూ లేస్తూ ప్రయాణం సిటీ బస్సుతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. రోజూ పంజగుట్ట నుంచి ఓల్డ్ సిటీకి వెళ్తాను. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో రద్దీ తీవ్రంగా ఉంటోంది. కిలోమీటర్ల పడుతూ లే స్తూ ప్రయాణం సాగించాల్సిందే. - సయ్యద్, ప్రయాణికుడు నిత్యం నిలబడాల్సిందే.. పదేళ్ల నుంచి సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. కోచింగ్ నిమిత్తం జీడిమెట్ల నుంచి అబిడ్స్‌కు వెళ్తుంటా. సమయానికి గమ్యం చేరతానన్న నమ్మకం ఎప్పుడూ లేదు. ఒకవైపు ట్రాఫిక్‌జాం, మరోవైపు సరిగా లేని స్టాపులు.. నిత్యం నిలబడి మూడు గంటల బస్సు ప్రయాణం. రాత్రి తొమ్మిది అయితే బస్సుల సంఖ్య మరీ తగ్గిపోతోంది. - నవ్యత, ప్రయాణికురాలు సాయంత్రం షిఫ్ట్ నరకం.. మార్నింగ్ షిఫ్ట్‌లో డ్యూటీ కాస్త రిలాక్స్‌గా చేసుకోవచ్చు. రెండు గంటల పాటు రద్దీ ఉన్నా ఆ తరువాత పర్వాలేదు. సాయంత్రం షిఫ్ట్ అయితే మాత్రం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కిక్కిరిసిన ప్రయాణికులను నెట్టుకొని వెళ్లి టికెట్లు ఇచ్చుకోవాల్సిందే. - విజయేందర్‌రెడ్డి, సిటీ బస్ కండక్టర్ సమయానికి రావు.. వచ్చినా ఆగవు.. బస్సు కోసం రోడ్డు వెంట పరుగు పందేలు.. కిక్కిరిసిన జనం.. ఆగినా ఎక్కలేని దుస్థితి.. నెట్టుకుంటూ వెళ్లాల్సిందే. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ.. గమ్యం చేరే వరకు బిక్కుబిక్కుమనాల్సిందే. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తప్పని బలపరీక్ష. ఎంఎంటీఎస్ తర్వాత నగరంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల కష్టాలు ఇవి. కాలం చెల్లిన బస్సులతో కాలం వెళ్లదీస్తోంది సిటీ ఆర్టీసీ. లక్షల మందిని గమ్యం చేర్చే బస్సుల సామర్థ్యం తగ్గిపోయి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికీ 40 శాతం పాత బస్సులే సేవలంది స్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వీటితో వేగలేక సిబ్బంది లోనూ అసహనమే కనిపిస్తోంది. కూకట్పల్లి-ఎల్బీనగర్ మార్గంలో తిరిగే ఆర్టీసీ సిటీ బస్సులో ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. నిత్యం అనుభవించే మనోవేదనను ఆయా వర్గాలు ప్రత్యక్షంగా ‘సాక్షి’తో పంచుకున్నాయి. ఇలాంటి తరుణంలో సిటీలో బస్సుల సమస్యను పరిష్కరించే వారితోనే ‘గ్రేటర్’ జెండా ఎగరేయిస్తామంటున్నాయి. - కోట కృష్ణారావు