నితీశ్‌వైపే విశ్వాసం..
అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన ఎన్డీయే
► 131–108 ఓట్ల తేడాతో విజయం
► ప్రజాసేవ చేస్తా.. కుటుంబసేవ కాదు
► బిహార్ అసెంబ్లీలో మహాకూటమిపై నితీశ్ విమర్శలు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సులభంగా విజయం సాధించారు. కీలకమైన పరీక్షలో 131–108 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బిహార్‌లో మూడేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం కొనసాగేందుకు మార్గం సుగమమైంది. కాగా, ఓటింగ్‌కు ముందు బిహార్ అసెంబ్లీలో వాతావరణం వేడెక్కింది.
అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రజలకు సేవచేయటమే తన బాధ్యతని.. ఒక కుటుంబానికి సేవ చేసేందుకు కాదని అసెంబ్లీలో నితీశ్ కుమార్ విమర్శించారు. తనను స్వార్థపరుడన్న రాహుల్ గాంధీకీ చురకలంటించారు. అటు తేజస్వీ యాదవ్ కూడా నితీశ్, ఎన్డీయేలపై తీవ్రంగా మండిపడ్డారు. విశ్వాస పరీక్ష సందర్భంగా తేజస్వీ యాదవ్, సుశీల్ మోదీ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
సునాయాసంగా..
ఆరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ విశ్వాస పరీక్షకు ముందు పట్నా, ఢిల్లీల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురు జేడీయూ ముఖ్యనేతలు నితీశ్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అటు కొందరు ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్డీయేతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే నితీశ్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 243 మంది సభ్యుల అసెంబ్లీలో నలుగురికి ఓటుహక్కు లేకపోవటంతో మిగిలిన 239 మందితోనే ఓటింగ్ కొనసాగించారు. దీంతో విశ్వాసం పొందేందుకు ఎన్డీయేకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. ఇందుకు తగ్గట్లుగానే సభలో 131 మంది (జేడీయూ 70, బీజేపీ 52, హెచ్‌ఏఎమ్ 1, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 2, ఎల్‌జేపీ 2, స్వతంత్రులు 4, స్పీకర్ ఓటు వేయలేరు) నితీశ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విపక్షాల సభ్యులు (ఆర్జేడీ 79, కాంగ్రెస్ 26, సీపీఐ–ఎమ్‌ఎల్ 3) 108మంది వ్యతిరేకంగా ఓటేశారు.
తెలిసీ పొత్తెందుకు పెట్టుకున్నట్లు: తేజస్వీ
అంతకుముందు సభ ప్రారంభం కాగానే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని నితీశ్ ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా విపక్ష నేతైన తేజస్వీ యాదవ్ ముందుగా మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. దీంతో ఆయన నితీశ్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి నితీశ్ బిహార్ ప్రజలను మోసగించారన్నారు. ‘నన్ను అడ్డం పెట్టుకుని నితీశ్ తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. బీజేపీతో చేరాలని ముందుగానే నిర్ణయించుకుని ఈ పన్నాగం పన్నారు. నితీశ్‌ను తన గురువుగా, చిన్నాన్నగా, వికాస్ పురుష్‌గా గుర్తించానని యాదవ్ పేర్కొన్నారు.
జేడీయూ ఎప్పుడూ సొంతంగా బిహార్‌లో గెలవలేదని.. ఇతర పార్టీల సాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని విమర్శించారు. ఆర్జేడీ, లాలూపై అవినీతి కేసులున్న విషయం తెలిసి మరీ అప్పుడు పొత్తేందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. కాగా, లాలూ ప్రసాద్ అవినీతి కుటుంబంపై నితీశ్ పోరాటం చేశారని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ పేర్కొన్నారు. ‘2015లో ప్రజాతీర్పు అవినీతికి వ్యతిరేకంగా, సుపరిపాలన కోసం ఇచ్చారు. కానీ అక్రమ పద్ధతుల్లో, బినామీలపేరుతో ఆస్తులను కూడబెట్టుకునేందుకు కాదు. మహాకూటమితో సుపరిపాలన సాధ్యంకాదనే నితీశ్ ఎన్డీయేలో కలిశారు. మహ్మద్ షాబుద్దీన్, రాజ్ వల్లభ్ వంటి ఆర్జేడీ నేతలతో పాలన చేయటమే కష్టం’ అని సుశీల్ మోదీ తెలిపారు.
నాకు పాఠాలు చెప్పొద్దు: నితీశ్
విశ్వాస పరీక్షకు ముందు నితీశ్ సభలో ఆర్జేడీపై మండిపడ్డారు. ‘విపక్షాలు నాకు లౌకికవాదంపై పాఠాలు చెప్పనక్కర్లేదు. లౌకికవాదాన్ని చేతల్లో చూపాలి. అవినీతి చేసి కోట్లు సంపాదించుకుని లౌకికవాదం మాటున దాక్కునే వారితో కలిసి పనిచేయలేను’ అని అన్నారు. పదినిమిషాల సేపు మాట్లాడినా పదునైన వ్యాఖ్యలతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘తేజస్వీని తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వమని అడిగాను. దీనికి ఆయన స్పందించలేదు. సంకీర్ణ రాజకీయాలను నేను గౌరవించాను.
ప్రజాతీర్పు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేందుకే. కానీ కొందరు దీన్ని మోసగించారు. ప్రజాకోర్టే అత్యంత కీలకం. ప్రజలకు సేవచేయటమే నా బాధ్యత. ఒక కుటుంబానికి సేవ చేసేందుకు కాదు’ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటం చాలా కష్టమైందని నితీశ్ పేర్కొన్నారు. బిహార్ అభివృద్ధి కోసమే బీజేపీతో జతకలిసినట్లు తెలిపారు. తను స్వార్థపరుడినంటూ వ్యాఖ్యానించిన రాహుల్ పేరును ప్రస్తావించకుండానే విమర్శించారు.‘2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 15–20 సీట్లు ఇవ్వాలని లాలూ నిర్ణయించారు. 40 సీట్లు ఇచ్చేలా నేను చొరవతీసుకున్నా. అందులో 27 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అదే నా స్వార్థం’ అని పేర్కొన్నారు.