
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ దగ్గర్నుంచి.. శనివారం బలపరీక్ష జరిగేంతవరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. శివకుమార్ ఒక్కళిగ సామాజికవర్గానికి చెందినవారు. కననపుర ఎమ్మెల్యే అయిన శివకుమార్ గతంలో ఇంధనశాఖ మంత్రిగా చేశారు.
విలాస్‌రావ్ ప్రభుత్వానికి అండ
మహారాష్ట్రలో 2002లో అప్పటి కాంగ్రెస్ సీఎం విలాశ్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కర్ణాటకలో ఎస్‌ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరి ఉంది. దీంతో ఎస్‌ఎం కృష్ణ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న శివ మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌కు తరలించి కాపాడారు. శివ తొలిసారిగా 1989లో సాతనూరు నియోజకవర్గంలో దేవెగౌడను ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో 1990లో అప్పటి సీఎం బంగారప్ప ఆయన్ను జైళ్లు, హోంగార్డుల శాఖమంత్రిగా నియమించారు. 2002 లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ మీద పోటీచేసి ఓడిపోయిన శివకుమార్.. రెండేళ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేవెగౌడపై తేజస్వినీ అనే జర్నలిస్టును గెలిపించి ప్రతీకారం తీర్చుకున్నారు.
గుజరాత్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు నేతృత్వం
2017 చివర్లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను ఓడించాలని బీజేపీ ప్రయత్నించిన నేపథ్యంలో శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈగల్‌టన్ రిసార్ట్‌లో దాచిఉంచారు. ఈ సమయంలో శివతో పాటు ఆయన సన్నిహితులపై ఐటీ శాఖ భారీఎత్తున దాడులు నిర్వహించింది. తాజాగా కర్ణాటక సంక్షోభం నేపథ్యంలోనూ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం శివకే అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment