బుధవారం బెంగళూరులో డీకే శివకుమార్‌తో దిగ్విజయ్
భోపాల్/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేదికగా మధ్యప్రదేశ్ రాజకీయం బుధవారం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి. కమల్‌నాథ్ ప్రభుత్వం మనుగడ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని కోర్టు అంగీకరిస్తూనే.. బలపరీక్షను నిర్ణయించే అసెంబ్లీ కార్యకలాపాల్లోకి తాము రాదల్చుకోలేదని స్పష్టంచేసింది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు వారి ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తారని ప్రశ్నించింది.
‘రెబెల్ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లాలా లేదా అనేది వారి ఇష్టం. వారిని నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వారు స్వేచ్ఛగా ఉన్నారా లేదా అనేది మేము చూడాలి. వారిని నిర్బంధంలో ఉంచకూడదు’అని స్పష్టంచేసింది. రెబెల్ ఎమ్మెల్యేలను గురువారం జడ్జి చాంబర్‌లో హాజరుపరుస్తామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. వారు నిర్బంధంలో లేరని ఎలా నమ్మాలో చెప్పాలంటూ చౌహాన్ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీని అడిగింది. అయితే వారు స్వచ్ఛందంగానే బెంగళూరులో ఉన్నారని, నిర్బంధంలో లేరని ఆయన సమాధానం ఇచ్చారు.
రెబెల్ ఎమ్మెల్యేల లాయర్ మణిందర్ సింగ్ కల్పించుకొని, స్పీకర్ ముందుకు తమ ఎమ్మెల్యేలు రాబోవడం లేదని, కొందరి రాజీనామాలను స్వీకరించి మరికొందరివి ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచిందని, వారిని కలిసేందుకు అనుమతించేలా కేంద్రానికి, కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేయగా.. రాజ్యాంగపరంగా ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేగానీ.. కాంగ్రెస్ నేతలతో కలవబోమని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాదించారు.
బీజేపీ హిట్లర్ పోకడ: కమల్‌నాథ్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న∙రిసార్ట్ వద్ద ఆ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ ఆందోళనకు దిగగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిగ్విజయ్‌ను అరెస్ట్ చేయడం బీజేపీ హిట్లర్ తరహా నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్.. అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతిని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment