కర్ణాటకానికి క్లైమాక్స్‌ ఏంటి? | What is the climax to Karnataka political crisis | Sakshi

కర్ణాటకానికి క్లైమాక్స్‌ ఏంటి?

Jul 11 2019 3:10 AM | Updated on Jul 11 2019 3:10 AM

What is the climax to Karnataka political crisis - Sakshi

బుధవారం బెంగళూరులో కాంగ్రెస్‌ ర్యాలీ దృశ్యం

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందని స్పీకర్‌ మంగళవారం చెప్పారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్‌ కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షోభ నివారణకు చర్య తీసుకోవాలని బీజేపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను నయానో, భయానో వెనక్కి రప్పించడానికి కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారాలేమిటన్నది చర్చనీయాంశమయింది.

రాజీనామాల ఆమోదం
16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించడం. అదే జరిగితే కాంగ్రెస్‌ కూటమి బలం 100 కి పడిపోతుంది. దాంతో శాసన సభలో బలం నిరూపించుకోవాలని స్పీకర్‌ కుమార స్వామిని ఆదేశించవచ్చు. 16 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 209 అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 105 మంది ఉంటే సరిపోతుంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిస్తున్నందున వారి బలం 108కి పెరుగుతుంది..కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఆ పార్టీ డిమాండు చేసే అవకాశం ఉంది.

రాజీనామాల తిరస్కరణ
ఒకవేళ స్పీకర్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తే దానిపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఫలితంగా సంక్షోభం మరింత కాలం కొనసాగవచ్చు.పది మంది తిరుగుబాటుఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చు. లేదా శాసన సభలో బల నిరూపణకు ఆదేశించవచ్చు.

ఎమ్మెల్యేలు వెనక్కి రావడం
రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి వస్తారని కాంగ్రెస్,జేడీఎస్‌ నేతలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులివ్వడం కోసం ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా కూడా చేసింది. ఆ ఆశతోనైనా కొందరు తిరిగొస్తారని భావిస్తున్నారు. ముందు నలుగురైదుగురు వెనక్కి వస్తే..తర్వాత మిగతావాళ్లు ఆ దారినే వస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడొకరు అన్నారు. అది జరగని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత మంది రాజీనామా చేసేలా కూటమి నేతలు వ్యూహం పన్నవచ్చు.

ఫిరాయింపు నిరోధక చట్టం
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తోంది. అయితే, చట్ట ప్రకారం అది చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ఆ సభ్యుడు పార్టీ విప్‌ను ధిక్కరించాలి. లేదా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేయాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. కాబట్టి వీరికి ఫిరాయింపు చట్టం వర్తించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement