MLAs Resignations
-
గుజరాత్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. గుజరాత్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆక్షయ్ పటేల్, జితు చౌధరి బుధవారం తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. వీరిద్దరితో పాటు మార్చి నుంచి గుజరాత్లో మొత్తం ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగానే.. మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం 66 మంది సభ్యులున్నారు. జూన్ 19న ఎన్నికలు జరగనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు బీజేపీ సిటింగ్ స్థానాలే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఎంపీల పీఏలకు ప్రవేశం లేదు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పార్లమెంట్‌లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బందిని అనుమతించకూడదని లోక్‌సభ సచివాలయం గురువారం నిర్ణయించింది.సమావేశాలు జరుగుతున్న సమయంలో సుమారు 800 మంది ఎంపీల పీఏలను ప్రాంగణంలోకి అనుమతిస్తే కరోనా సమస్య మరింత జటిలమవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
విశ్వాస పరీక్షకు సిద్ధం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందా యంలో పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన గవర్నర్ లాల్జీ టాండన్‌ని కలిసి ఓ లేఖ అందజేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నిర్బంధంలో ఉంచి బేరసారా లాడుతోందని ఆరోపించారు. ఈనెల 3, 4 తేదీల నుంచి 10వ తేదీ వరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడిందన్నారు. బెంగుళూరులో నిర్బంధంలో ఉంచిన 22 మంది ఎమ్మెల్యేలను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ని కోరినట్టు వెల్లడించారు. ఏ క్షణంలోనైనా విశ్వాస పరీక్ష జరగొచ్చని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కోరిన మేరకు జ్యోతిరా దిత్య సింధియాకు అనుకూ లంగా రాజీనామా సమర్పించిన 22 మందిలో ఆరుగురు మంత్రులను తొలగించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించిం ది. ఇదిలా ఉండగా, మంత్రులతో సహా శాసన సభ్యులు బెంగళూరులోని రిసార్ట్స్‌లో తాము బందీలుగా ఉంచామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భోపాల్ బయలుదేరిన ఆరుగురు మంత్రులు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేసేందుకు బెంగళూరు రిసార్టులో ఉన్న ఆరుగురు మంత్రులు భోపాల్ బయలుదేరారు. వీరి రాక సందర్భంగా భోపాల్, బెంగళూరు విమానాశ్రయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారంలోగా తన ముందు వ్యక్తిగతం గా హాజరవ్వాల్సిందిగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభకు సింధియా నామినేషన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఉన్నారు. -
ఆ 22 మందికి నోటీసులు
భోపాల్/న్యూఢిల్లీ/బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కల్లా తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. స్వచ్ఛందంగానా లేక.. ఎవరి ఒత్తిడితోనైనా రాజీనామా చేశారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వారిని కోరారు. ఆ తర్వాతే సభలో బల పరీక్ష చేపడతామని స్పీకర్ తెలిపారు. బల నిరూపణకు సిద్ధమని సీఎం కమల్‌నాథ్ ఇంతకుముందే తెలిపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, పార్టీని వీడిన ఆరుగురు మంత్రులు సహా 22 మంది సభ్యుల రాజీనామాల విషయం తేలాకే బలపరీక్ష ఉంటుందన్నారు. రాజీనామాలు చేసిన వారంతా స్పీకర్‌ను ఎందుకు కలుసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి బీజేపీయే కారణమన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకున్న జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ కార్యకర్తలు, సింధియా అనుచరులు ఘనస్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి ఆయన్ను మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలోకి చేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బెంగళూరులో హైడ్రామా బెంగళూరు పోలీసులు తమ మంత్రులను ఇద్దరిని అరెస్టు చేశారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ, న్యాయవాది అయిన వివేక్ తంఖా మాట్లాడుతూ.. ‘బెంగళూరు రిసార్టులో ఉన్న ఎమ్మెల్యే మనోజ్ చౌదరితో మాట్లాడేందుకు ఆయన తండ్రితో కలిసి మంత్రులు జితు పట్వారీ, లఖన్ సింగ్ వెళ్లారు. బెంగళూరు పోలీసులు వారిని రిసార్టులోపలికి వెళ్లనివ్వలేదు. వారిపై దాడి చేసి, అరెస్టు చేశారు. మనోజ్ తన తండ్రితో కలిసి భోపాల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, రానివ్వడం లేదు. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, పట్వారీ అక్కడి పోలీసులతో వాదులాడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. రాజీనామా చేసిన 22 మందిలో 19 మంది బెంగళూరులోనూ మిగతా వారు మధ్యప్రదేశ్‌లోనూ ఉన్నట్లు సమాచారం. బల పరీక్షకు బీజేపీ డిమాండ్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అసెంబ్లీలో సర్కారు బలం నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 16వ తేదీన సభలో బల నిరూపణ జరపాలని స్పీకర్‌ను, గవర్నర్‌ను కోరతాం’ అని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తు గురించి భయపడ్డారు: రాహుల్ తన రాజకీయ భవిష్యత్తు గురించి భయపడుతున్నందునే సింధియా నమ్ముకున్న సిద్ధాంతాలను మర్చిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఆయన బయటకు చెప్పే దానికి వాస్తవ కారణాలకు చాలా తేడా ఉంది. ఆయన నా చిరకాల మిత్రుడు. కాలేజీ రోజుల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. తన రాజకీయ భవిష్యత్తు గురించిన భయం వల్లే సిద్ధాంతాలను పక్కనబెట్టి ఆర్ఎస్ఎస్(బీజేపీ)లోకి వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ గౌరవం లభించదు. ఆ పార్టీలో ఆయన సంతృప్తికరంగా ఉండలేరు’ అని అన్నారు. -
ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే. తన నిర్ణయంపై రెబెల్స్ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్ కోరారు. యెడ్డీ జోరుకు షా బ్రేక్.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప, నేతలు జగదీశ్ షెట్టర్, అరవింద్ లింబావలి, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
కర్నాటకంలో కాంగ్రెస్ సీఎం!
బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్ ముంబైలోని రినైసెన్స్ హోటల్లో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేలు శివకుమార్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు. కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే.. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ‘తాజ్వివంత హోటల్’లో, బీజేపీ నేతలు ‘హోటల్ రమద’లో సమావేశమై చర్చించారు. ‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్.. బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం. సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు. దయచేసి వెనక్కి రండి: సీఎం ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్‌వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్‌తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్‌లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం శుక్రవారం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురవుతున్నట్లు గవర్నర్‌కు ఇప్పుడే జ్ఞానోదయమైందని కుమారస్వామి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వజూభాయ్‌వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఆయనేమీ శాసనవ్యవస్థకు అంబుడ్స్‌మన్ కాదని చురకలు అంటించారు. బల నిరూపణపై గవర్నర్ రాసిన రెండు లేఖలను ‘లవ్ లెటర్స్’గా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. జూలై 22న విశ్వాసపరీక్షపై తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామనీ, ఇక ఆలస్యం చేయబోమని చెబుతూ స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం.. విధానసౌధ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ కోల్పోయిందని తెలిపారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..‘కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటే రూ.40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అస్థిరపరిచే ప్రక్రియ సాగుతోంది. 14 నెలల తర్వాత ఇప్పుడది చివరిదశకు చేరుకుంది. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని నాకు ముందే తెలుసు.కాబట్టి విశ్వాసపరీక్ష విషయంలో మనం నిదానంగా చర్చిద్దాం. సోమవారం లేదా మంగళవారం కూడా విశ్వాసపరీక్షను చేపట్టవచ్చు. మీరు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఇబ్బందేమీ లేదు. మీకిప్పుడు మద్దతు తెలిపిన రెబెల్స్ అండతో మీ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంతకాలం అధికారంలో ఉంటుందో నేనూ చూస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కావడంతో గవర్నర్ ఆదేశాల మేరకు విశ్వాసపరీక్ష డివిజన్ నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అయితే నిబంధనల మేరకు విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాకే ఓటింగ్ జరగాలని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగగా, పోటీగా కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ రమేశ్ అసెంబ్లీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదావేశారు. నిమ్మకాయ ఉంటే చేతబడేనా? ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి రావడంతో రగడ మొదలైంది. ప్రభుత్వ మనుగడ కోసమే ఆయన చేతబడి చేయించిన నిమ్మకాయతో వచ్చారని కొందరు బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కుమారస్వామి వెంటనే స్పందిస్తూ..‘నిమ్మకాయను తెచ్చుకున్నందుకు మీరంతా రేవణ్ణను నిందిస్తున్నారు. మీరు హిందూ సంస్కృతిని గౌరవిస్తామంటూనే, ఆయన్ను అవమానిస్తున్నారు. రేవణ్ణ ఆలయాలకు వెళతారు. వెంట నిమ్మకాయను ఉంచుకుంటారు. కానీ మీరుమాత్రం ఆయన చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు. చేతబడులతో అసలు ఎక్కడైనా ప్రభుత్వాలు నిలుస్తాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని జిల్లాలకు నిధులు కేటాయించినా, బీజేపీ మాత్రం తనను 2–3 జిల్లాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ ఇచ్చిన రెండో గడువు దాటిపోతున్న సమయంలో బీజేపీ నేత సురేష్ కుమార్ విశ్వాసపరీక్ష ఓటింగ్ చేపట్టాలని కోరారు. తాను చెప్పాల్సింది చెప్పేశాననీ, ఇంకేమైనా ఉంటే సోమవారం చూసుకుందామని కుమారస్వామి అన్నారు. దీంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. రెబెల్స్‌ను హోటల్లో బంధించారు: శివకుమార్ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బంధించారని మంత్రి డి.కె.శివకుమార్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘మమ్మల్ని బంధించారు.. కాపాడండి అని రెబెల్ ఎమ్మెల్యేల నుంచి సీఎం కుమారస్వామికి ఫోన్ వచ్చింది. అందుకే మేం ముంబై వెళ్లాం. తొలుత కుమారస్వామి స్వయంగా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం అలా వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వారించారు. ఈ నేపథ్యంలో మేం సదరు హోటల్లో గదిని బుక్ చేశాం’ అని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు, వారి కుటుం సభ్యులెవరూ సాయం కోసం తనను సంప్రదించలేదని స్పీకర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఛాతినొప్పితో ముంబైలోని సెయింట్ జార్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్‌కు మహారాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రెండో ‘లవ్ లెటర్’ వచ్చింది.. అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వజూభాయ్‌వాలా రెండో లేఖను రాశారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి’ అని లేఖరాశారు. దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..‘‘గవర్నర్ వజూభాయ్‌వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింది. వజూభాయ్‌వాలాకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గవర్నర్ లేఖలో చెప్పారు. అంటే ఇన్నిరోజులు రాష్ట్రంలో జరుగుతున్న తతంగమంతా ఆయనకు కన్పించలేదా? మా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ప్రలోభాలపర్వం ఆయనకు కనిపించలేదా? ఆరోజే గవర్నర్ చర్య తీసుకునిఉంటే ఈ ప్రత్యేక విమానాలు అసలు గాల్లోకి లేచేవా? రెబెల్ ఎమ్మెల్యేలకు పోలీస్‌భద్రత కల్పించిన గవర్నర్ వారు ముంబైకి వెళ్లేలా చేశారు. ఇక విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాన్ని నేను మీకే(స్పీకర్‌కే) వదిలిపెడుతున్నాను. ఇలాంటి ఆదేశాలు ఢిల్లీ(కేంద్రం) సూచనలతో రాకూడదు. గవర్నర్ రాసిన లేఖ నుంచి నన్ను రక్షించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని కోరారు. స్పీకర్ విధుల్లో గవర్నర్ జోక్యం తగదు అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్ వజూభాయ్ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని గతంలో అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుణాచల్ అసెంబ్లీ కేసు.. 2016లో అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ లేదన్న కారణంగా అప్పటి గవర్నర్ రాజ్కోవా నబం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇస్తూ స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది. రద్దయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ‘గవర్నర్ స్పీకర్‌కు గురువుగానీ మార్గదర్శిగానీ కాదు. కాబట్టి స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదు. స్పీకర్‌ను తొలగించే హక్కు గవర్నర్‌కు లేదు. స్పీకర్, గవర్నర్లు ఇద్దరూ వేర్వేరు రాజ్యాంగ సంస్థలకు అధిపతులు’అని ఆనాటి తీర్పులో సుప్రీం కోర్టు వివరించింది. రాజకీయ పార్టీలో చెలరేగే సంక్షోభం లేదా కల్లోలానికి గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలకు ఆయన దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ లేఖపై భిన్నాభిప్రాయాలు స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి గవర్నర్ ఇలా లేఖలు పంపడం సమర్థనీయమేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అన్నారు. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్‌కు ఉందని, దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉందని ఆయన అన్నారు. గవర్నర్ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టంగా చెపుతోందన్నారు. అయితే, కర్ణాటక గవర్నర్ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని లోక్‌సభ మరో మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు.శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సభకు సూచించవచ్చని రాజ్యాంగంలోని 175వ అధికరణ చెబుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు. అంతేకాని సభ ఎలా జరగాలో చెప్పే అధికారం ఆయనకు లేదు. ఏమైనా కర్ణాటక గవర్నర్ అసాధారణ చర్య తీసుకున్నారు’అని ఆచార్య తెలిపారు. గవర్నర్ చర్య సరైనదా కాదా అన్నది న్యాయస్థానం తేల్చుతుందన్నారు. శాసన సభకు సంబంధించినంత వరకు స్పీకరే సర్వాధికారి అని, సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్‌ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాత్రి విధానసౌధలో నిద్రిస్తున్న బీఎస్ యడ్యూరప్ప -
కర్నాటకం క్లైమాక్స్ నేడే
సాక్షి బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభ ప్రారంభం కాగానే ‘ఈ సభ నా నేతృత్వంలోని మంత్రివర్గంపై విశ్వాసం ఉంచుతోంది’ అని ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈరోజే విశ్వాసపరీక్షను పూర్తిచేయాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్పీకర్ రమేశ్‌ను డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్దరామయ్య రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసేందుకు వీలుగా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఈ విషయమై తాను అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేయడంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి స్పీకర్ న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నారు. దేశానికి నిజాలు చెప్పాలి: కుమారస్వామి విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్‌తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్‌డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష నేత, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పందిస్తూ..‘విశ్వాసపరీక్ష ప్రక్రియ మొత్తం ఒక్కరోజులోనే పూర్తికావాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో ‘చూస్తుంటే ప్రతిపక్ష నేతకు తొందర ఎక్కువైనట్లు ఉంది’ అని కుమారస్వామి వ్యంగ్యంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంపై తుది నిర్ణయం తీసుకునేవరకూ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించే అవకాశముందనీ, కాబట్టి ఈ విషయంలో రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా విశ్వాసపరీక్షను చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తాను అడ్వొకేట్ జనరల్ సలహా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో స్పీకర్ కావాలనే విశ్వాసపరీక్షను ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదృశ్యం.. అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించారు. ‘పాటిల్‌ను కిడ్నాప్ చేసి ముంబైలోని ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్వచ్చింది. పాటిల్ వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సవది ఉన్నారు. నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని(స్పీకర్‌ను) ఒక్కటే కోరుతున్నా. మా ఎమ్మెల్యేను వెనక్కి తీసుకురండి సార్. మాకు పోలీస్ భద్రత కావాలి. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాటిల్ ఫొటోలతో వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు ‘బీజేపీ డౌన్‌డౌన్’ ‘ఆపరేషన్ కమల డౌన్‌డౌన్’ అని నినాదాలు చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. దీంతో స్పీకర్ రమేశ్ స్పందిస్తూ..‘అంటే నేను కళ్లు మూసుకుని నాకు ఏమీ సంబంధం లేనట్లు కూర్చోవాలా? అసలు మనం ఎటువైపు పోతున్నాం. ఛాతినొప్పి ఉండటంతో తాను ఆసుపత్రిలో చేరినట్లు పాటిల్ నుంచి లేఖ అందింది. ఇది సహజంగా అనిపించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కుటుంబీకులతో మాట్లాడి నాకు నివేదిక అందించండి’ అని హోంమంత్రి ఎంబీ పాటిల్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమంత్ పాటిల్ అదృశ్యంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తననెవరూ కిడ్నాప్ చేయలేదనీ, సొంతపనిపై బుధవారం ముంబైకి రాగా ఛాతిలోనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని శ్రీమంత్ పాటిల్ ఓ వీడియోను విడుదల చేశారు. అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా.. విశ్వాసపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ సభను వాయిదావేయడంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసతీర్మానంపై కనీసం 15 నిమిషాలు కూడా సభలో చర్చించలేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము విధానసౌధలోనే నిద్రపోతామని తెలిపారు. సభలో విశ్వాసపరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఖరారయ్యేవరకూ ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని బీజేపీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇది మూడో విశ్వాసపరీక్ష తీర్మానం కావడం గమనార్హం. మొదటగా సీఎం యడ్యూరప్ప తగిన సంఖ్యాబలం లేక విశ్వాసపరీక్షకు 3 రోజులముందే రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. గవర్నర్‌తో బీజేపీ బృందం భేటీ విశ్వాసపరీక్ష ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా వెంటనే విశ్వాసపరీక్ష జరిపేలా స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించాలని వినతిపత్రాన్ని సమర్పించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి కుయుక్తులు పన్నుతుందన్న భయం తమకు ఉందని ఈ సందర్భంగా జగదీశ్ షెట్టర్ అన్నారు. దీంతో ‘సీఎం సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోండి’ అని వజూభాయ్‌వాలా స్పీకర్‌ను ఆదేశించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ఈ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ బలపరీక్షకు దూరంగా ఉన్నారు. కుమారస్వామికి గవర్నర్ లేఖ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్ ధ్రువీకరించారు. విప్ అంటే? చట్టసభల్లో ఏదైనా కీలకాంశం చర్చకు వచ్చిన సందర్భాల్లో, లేదంటే ఫలానా తరహాలోనే ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు భావించిన సందర్భాల్లో తమ సభ్యులకు విప్‌లను పార్టీ జారీచేస్తాయి. ఇది ఏకవాక్య విప్, రెండులైన్ల విప్, మూడులైన్ల విప్ అని మూడురకాలుగా ఉంటుంది. సభలో కోరం(కనీస సభ్యులు) ఉండాలని భావించినప్పుడు పార్టీలు ఏకవాక్య విప్‌ను జారీచేస్తాయి. సభలో ఓటింగ్ సందర్భంగా హాజరుకావాలని తమ సభ్యులకు రాజకీయ పార్టీలు రెండు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. సభలో ముఖ్యమైన బిల్లుపై రెండోసారి చర్చ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భాల్లో సభ్యులు తప్పనిసరిగా తమ ఆదేశాలమేర నడుచుకోవాలని పార్టీలు మూడు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. వీటిలో మూడులైన్ల విప్‌ను ఉల్లంఘించే చట్టసభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొంటారు. విధానసౌధలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న యడ్యూరప్ప -
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్‌ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్‌చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్‌కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్‌లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్‌ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్‌ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్‌పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
సంకీర్ణానికి నాగరాజ్ ఝలక్
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయం ఆదివారం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు చేసిన విజ్ఞప్తికి తొలుత సానుకూలంగా స్పందించిన రెబెల్ ఎమ్మెల్యేల ఎంటీబీ నాగరాజ్ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేత ఆర్.అశోక్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం బెంగళూరు నుంచి ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ముంబైలో దిగగానే మాటమార్చారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. అయితే రెబెల్ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరిని ఒప్పించి వెనక్కు తీసుకొచ్చేందుకే నాగరాజ్ ముంబైకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో విశ్వాసపరీక్ష నాటికి అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజీనామా వెనక్కి తీసుకోను: నాగరాజ్ ముంబైకి వెళ్లేముందు నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘సుధాకర్ గత రెండ్రోజులుగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించి వెనక్కి తీసుకొస్తాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే చెప్పాను’ అని తెలిపారు. కానీ ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్న వెంటనే నాగరాజ్ మాటమార్చారు. ‘మేమంతా(రెబెల్ ఎమ్మెల్యేలు) ఒకేసారి రాజీనామా చేశాం. ఇప్పుడు రాజీనామా విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. నా రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా వెనుక బీజేపీ లేదు. బీజేపీ నేత అశోక్‌తో కలిసి నేను ముంబైకి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని వెల్లడించారు. మరో రెబెల్ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ స్పందిస్తూ.. నాగరాజ్ తమతో కలవడానికే ముంబై వచ్చారనీ, ఎమ్మెల్యే సుధాకర్‌ను వెనక్కి తీసుకెళ్లడానికి కాదన్నారు. నాగరాజ్ చేరికతో ముంబైలో మకాం వేసిన రెబెల్స్ సంఖ్య 15కు చేరుకుంది. రామలింగారెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ.. ఎమ్మెల్యే నాగరాజ్ చాకచక్యంగా ముంబైలోని రెబెల్స్ క్యాంప్‌కు చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రెబెల్ నేత రామలింగారెడ్డితో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖంద్రే, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి సమర్పించిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖంద్రే మీడియాతో మాట్లాడుతూ..‘రామలింగారెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం చాలాఉంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాబట్టి రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరాం‘’ అని తెలిపారు. మరోవైపు రామలింగారెడ్డి స్పందిస్తూ.. స్పీకర్ రమేశ్‌కుమార్‌తో సోమవారం సమావేశమయ్యేవరకూ తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎల్పీ సోమవారం సమావేశం కానుంది. 2–3 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మరోసారి డిమాండ్ చేశారు.‘కుమారస్వామి నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవముంటే వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి నేను ఇదే సూచిస్తాను. రెబెల్ ఎమ్మెల్యేలు వెనక్కు రాబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2–3 రోజుల్లో కర్ణాటక ప్రజలకు సేవలందించే సదవకాశం బీజేపీకి లభిస్తుంది’ అని చెప్పారు. కాంగ్రెస్‌పై కుమారస్వామి చిందులు.. సాక్షి, బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. బెంగళూరులోని కుమారకృప గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు. ‘మా పార్టీ నుంచి కేవలం ముగ్గురే వెళ్లారు. కానీ కాంగ్రెస్ నుంచి ఏకంగా 13 మంది రాజీనామాలు చేశారు. మీ ఎమ్మెల్యేలను కూడా మీరు బుజ్జగించలేరా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన కమల్‌నాథ్ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అప్రమత్తమయ్యారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా బుధవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 230 స్థానాలున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్రులు(4), బీఎస్పీ(2) ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బలాబలాలు 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది రాజీనామా చేయగా, మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ 16 రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం 100కు పడిపోతుంది. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగినందున ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
రేపే ‘విశ్వాసం’ పెట్టండి
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి శనివారం వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్, రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఆయన్ను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో శనివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘సీఎం స్వయంగా సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. సోమవారం జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ మేరకు మేం సీఎంకు సూచిస్తాం. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాధ్యతలు అప్పగించడం ఆయనకే మంచిది’ అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆపేందుకే కుమారస్వామి ‘విశ్వాసపరీక్ష’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. దమ్ముంటే సీఎం విశ్వాసపరీక్ష కోరాలనీ, ప్రస్తుతం పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చెప్పారు. స్పీకర్‌కు స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ.. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ శనివారం స్పీకర్ రమేశ్ కుమార్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షం(బీజేపీ)వైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జూలై 26 వరకూ కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్లో నగేశ్ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్ల మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. మా పిటిషన్లను కలిపి విచారించండి సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు చెందిన మరో ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించడంలేదని ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె.సుధాకర్, ఎన్.నాగరాజ్, మునిరత్న, రోషన్‌బేగ్‌లు ఆరోపించారు. గతంలో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషనత్తో తమ పిటిషన్‌ను కలిపి విచారించాలని కోర్టును కోరారు. 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్‌ను కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అనర్హతపై నిర్ణయం రిజర్వు: స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోరిందని స్పీకర్ తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపామనీ, చివరికి నిర్ణయాన్ని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ ‘నాగరాజ్’ సఫలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్‌ను తమవైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని నాగరాజ్ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజ్ ఇంటికొచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెత్తబడ్డ నాగరాజ్ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు చూచాయగా అంగీకరించారు. తర్వాత నాగరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నా రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సిద్దరామయ్య, దినేశ్గూండూరావులు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం అడిగా. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్‌తో మాట్లాడి ఆయన్ను కూడా రాజీనామా ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని చెప్పా’ అని తెలిపారు. మరోవైపు రమడా రిసార్టులో బసచేసిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి యడ్యూరప్ప భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ వెనక్కి వెళ్లబోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్ పద్మనాభ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపై స్పందించేందుకు రామలింగారెడ్డి నిరాకరించారు. ఫిరాయింపులపై చర్యలేవి? నిర్వీర్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో ఇప్పటివరకూ ఒక్క నేతకూ శిక్షపడని వైనం కర్ణాటక, గోవాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను నివారించేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయుధంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టాన్ని 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడకపోవడం గమనార్హం. స్పీకర్ పాత్రే కీలకం.. 1985లో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రచారం ఏ ప్రజాప్రతినిధి అయినా తమ పార్టీ విప్‌ను పాటించకపోయినా, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసినా అతను/ఆమె అనర్హులవుతారు. అయితే ఈ చట్టం ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ పాత్రే కీలకం. స్పీకర్ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ చట్టం ఉద్దేశమే నీరుగారిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనుగోలు చేసింది. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఫిరాయింపుదారులపై వేటేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిష్ప్రయోజనమవుతుందని చెబుతున్నారు. బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి వెళ్తున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ -
విశ్వాసపరీక్షకు సిద్ధం!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్‌లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి. సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్ సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు. రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్‌లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్‌లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు. ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్ అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్‌పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు. రాహుల్‌కు బెయిలు మంజూరు నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్‌కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి. యథాతథ స్థితి: సుప్రీంకోర్టు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు. స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా? ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్‌కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్‌కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ -
స్పీకర్ కోర్టులో బంతి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటక రాజకీయం గురువారం మరింత రసవత్తరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్ రమేశ్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించట్లేరని 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ఎమ్మెల్యేలను కలవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరంతా ప్రత్యేక విమానాల్లో ముంబై నుంచి కర్ణాటకలోని హాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి పోలీస్ భద్రత మధ్య లగ్జరీ బస్సులో విధానసౌధ(అసెంబ్లీ)లోని స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సాయంత్రం 6 నుంచి గంటపాటు సమావేశమైన స్పీకర్ రమేశ్‡.. వారు మరోసారి సమర్పించిన రాజీనామా లేఖల్ని స్వీకరించారు. సమావేశం అనంతరం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఈసారి సరైన ఫార్మాట్లో సమర్పించారు. ఈ రాజీనామాలను శాసనసభ్యులు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా? లేదా? అనేది సమీక్షిస్తా. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు, రాబోయే ఫలితానికి నేను ఎంతమాత్రం బాధ్యుడ్ని కాదు’ అని రమేశ్ స్పష్టం చేశారు. రాజీనామాలు సమర్పించిన అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైకి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం అసెంబ్లీ స్పీకర్ రమేశ్‌ను ఆదేశించింది. వీరి రాజీనామాలపై తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం సూచించింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు విమానాశ్రయం నుంచి విధానసౌధ వరకూ వెళ్లేందుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. వీరంతా గురువారం సాయంత్రం 6 గంటలకు స్పీకర్‌తో భేటీ కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడ్డ కొన్నిగంటల్లోనే స్పీకర్ రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు తొలుత అందిన, పెండింగ్‌లో ఉన్న విజ్ఞప్తులపై తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పీకర్ కోర్టుకు విన్నవించారు. కాబట్టి రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరారు. అయితే ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున స్పీకర్ పిటిషన్‌ను రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులు కేవలం ఈ 10 మంది ఎమ్మెల్యేలకే వర్తిస్తాయని తేల్చిచెప్పింది. విధానసౌధ వద్ద 144 సెక్షన్ కర్ణాటక అసెంబ్లీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విధానసౌధకు 2 కి.మీ పరిధిలో సీఆర్పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలో ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన నగర కమిషనర్ అలోక్ కుమార్.. ఈ నిషేధాజ్ఞలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. సౌమ్యా రెడ్డి(జయనగర–బెంగళూరు), సుబ్బారెడ్డి(బాగేపల్లి), మహంతేశ్ కౌజలగి(రాయభాగ), అంజలి నింబాళ్కర్(ఖానాపుర)లు త్వరలోనే రాజీనామా చేస్తారని సమాచారం. మనస్సాక్షి ఆధారంగా నిర్ణయం: స్పీకర్ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా స్పందించిందని స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ‘10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలుసుకోవాలనీ, వారి రాజీనామాలను స్వీకరించాలని అత్యున్నత న్యాయస్థానం నన్ను కోరింది. ఒకవేళ ఈ రాజీనామాలను ఆమోదిస్తే, అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ చేసిన విజ్ఞప్తులు చెల్లకుండాపోతాయి. ఒకవేళ నేను ఈ ప్రక్రియను ఆదరాబాదరాగా చేపడితే మొత్తంగా అన్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విషయంలో నేను మనస్సాక్షి ఆధారంగా ముందుకెళతా. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు నన్ను కోరింది. 10 మంది శాసనసభ్యులతో గురువారం జరిగిన భేటీని వీడియో తీయించాను. శుక్రవారం ఈ వీడియోను సుప్రీంకోర్టుకు సమర్పిస్తాను. అలాగే ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగానే రాజీనామాలు సమర్పించారా.. అనే విషయమై రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది. నేనేమీ మెరుపువేగంతో పనిచేయలేను. ప్రజలకు, రాష్ట్రానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తప్ప నేను ఎవ్వరికీ జవాబుదారీ కాదు’ అని వెల్లడించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై తాను కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో కలత చెందానని స్పీకర్ రమేశ్ పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్ వజూభాయ్‌వాలాను జూలై 6న కలిశారనీ, ఆ రోజున తాను కార్యాలయంలోనే ఉన్నానన్నారు. అయితే తాను సొంతపనిపై బయటకు వెళ్లగా, ఎమ్మెల్యేలు కనీస సమాచారం ఇవ్వకుండా తన కార్యాలయానికి వచ్చారని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పరిస్థితులు గందరగోళంగా, రోతపుట్టించేలా తయారయ్యాయని రమేశ్ వ్యాఖ్యానించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో భేటీకి ముందు రమేశ్ మీడియాతో మాట్లాడుతూ..‘వాళ్లు(శాసనసభ్యులు) నా కార్యాలయానికి రావాలనుకుంటే నేను అడ్డుకునేవాడిని కాదు. ఇందుకోసం వాళ్లు సుప్రీంకోర్టు వరకూ ఎందుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. శాసనసభ్యుల్ని కలుసుకోవడానికి నేను ఏనాడూ నిరాకరించలేదు‘ అని స్పష్టం చేశారు. స్పీకర్‌పై అభిశంసన? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించజాలదని రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య ఉన్న అధికారాల విభజనే ఇందుకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో ఓస్థాయి దాటి అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోలేదనీ, తమ అభిప్రాయాలను మాత్రమే చెప్పగలదని స్పష్టం చేశారు. మరోవైపు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యుల మద్దతున్న నేపథ్యంలో స్పీకర్ రమేశ్ కుమార్‌పై ‘అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ద్రవ్య బిల్లు(ఓటాన్ అకౌంట్)ను ప్రవేశపెట్టనుంది. రాజీనామా ప్రసక్తే లేదు: సీఎం ‘అసలు నేనెందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు నేను రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? 2009–10 సమయంలో కొంత మంది మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం యడ్యూరప్పను వ్యతిరేకించారు. అప్పుడాయన రాజీనామా చేయలేదే’ అని సీఎం కుమారస్వామి అన్నారు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అసెంబ్లీకొస్తున్న సీఎం కుమారస్వామి బీజేపీ నేతలతో మంత్రి మహేశ్ రహస్య భేటీ సాక్షి, బెంగళూరు: సీఎం కుమారస్వామి సన్నిహితుడు, మంత్రి సా.రా.మహేశ్ గురువారం రాత్రి బెంగళూరులో కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పతో రహస్యంగా భేటీ అయ్యారు. బీజేపీతో జేడీఎస్ మైత్రి కోసమే మహేశ్ రంగంలోకి దిగారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి మహేశ్ స్పందిస్తూ.. తాను బీజేపీ నేతలను అనుకోకుండా కలిశానని తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకు తాను వెళ్లగా బీజేపీ నేతలు కనిపించారనీ, దీంతో మర్యాదపూర్వకంగా మాట్లాడానని స్పష్టం చేశారు. -
కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందని స్పీకర్ మంగళవారం చెప్పారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షోభ నివారణకు చర్య తీసుకోవాలని బీజేపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను నయానో, భయానో వెనక్కి రప్పించడానికి కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారాలేమిటన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాల ఆమోదం 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడం. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలం 100 కి పడిపోతుంది. దాంతో శాసన సభలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ కుమార స్వామిని ఆదేశించవచ్చు. 16 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 209 అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 105 మంది ఉంటే సరిపోతుంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిస్తున్నందున వారి బలం 108కి పెరుగుతుంది..కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఆ పార్టీ డిమాండు చేసే అవకాశం ఉంది. రాజీనామాల తిరస్కరణ ఒకవేళ స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తే దానిపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఫలితంగా సంక్షోభం మరింత కాలం కొనసాగవచ్చు.పది మంది తిరుగుబాటుఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చు. లేదా శాసన సభలో బల నిరూపణకు ఆదేశించవచ్చు. ఎమ్మెల్యేలు వెనక్కి రావడం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి వస్తారని కాంగ్రెస్,జేడీఎస్ నేతలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులివ్వడం కోసం ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా కూడా చేసింది. ఆ ఆశతోనైనా కొందరు తిరిగొస్తారని భావిస్తున్నారు. ముందు నలుగురైదుగురు వెనక్కి వస్తే..తర్వాత మిగతావాళ్లు ఆ దారినే వస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు. అది జరగని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత మంది రాజీనామా చేసేలా కూటమి నేతలు వ్యూహం పన్నవచ్చు. ఫిరాయింపు నిరోధక చట్టం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే, చట్ట ప్రకారం అది చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ఆ సభ్యుడు పార్టీ విప్‌ను ధిక్కరించాలి. లేదా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేయాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. కాబట్టి వీరికి ఫిరాయింపు చట్టం వర్తించదు. -
సంక్షోభం ముదిరింది
బెంగళూరులో మొదలైన కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వ సంక్షోభం ముదిరి ముంబై, ఢిల్లీలకూ విస్తరించింది. బెంగళూరులో కాంగ్రెస్ నేత, మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం రాజీనామా సమర్పించడంతో హైడ్రామా మొదలైంది. రాజీనామావేళ ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్–జేడీఎస్ నేతలు నిర్బంధించగా, గవర్నర్ జోక్యంతో బయటపడ్డారు. ముంబైలోని 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రి శివకుమార్‌ను పోలీసులు హోటల్ గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కించారు. మరోవైపు స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించట్లేరంటూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో, కన్నడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబై: కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు ఉంటున్న ముంబైలోని రినైసన్స్ హోటల్ వద్ద బుధవారం హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వచ్చిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్‌లో కీలక నేత డీకే శివకుమార్‌ను హోటల్ లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని కొన్ని గంటల అనంతరం బలవంతంగా బెంగళూరుకు పంపారు. అంతకుముందు హోటల్ బయట శివకుమార్ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేసి, వ్యానులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు. తాను ఆ హోటల్లో రిజర్వేషన్ చేసుకున్నాననీ, తనను లోపలకు వెళ్లనివ్వాలని శివకుమార్ కోరినా ముంబై పోలీసులు పట్టించుకోలేదు. శివకుమార్‌ను కలిసేందుకు హోటల్ వద్దకు వచ్చిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మిలింద్ దేవరా, నసీం ఖాన్‌లను కూడా పోలీసులు శివకుమార్తోపాటే అదుపులోకి తీసుకుని, వారు ముగ్గురినీ కలీనా ప్రాంతంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. కొద్దిసేపటి అనంతరం దేవరా, ఖాన్‌లను విడిచిపెట్టి, శివకుమార్‌ను నేరుగా ముంబై విమానాశ్రయానికి బలవంతంగా తీసుకెళ్లి బెంగళూరు విమానం ఎక్కించారు. కాగా, రినైసన్స్ హోటల్లో మొత్తం 12 మంది కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఉదయం 8.20 గంటలకే శివకుమార్ హోటల్ వద్దకు చేరుకోగా, ఆయనను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, శివకుమార్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, వారిని హోటల్ లోపలకు రానివ్వద్దంటూ రెబెల్ ఎమ్మెల్యేలు తమను కోరారని పోలీసులు చెప్పారు. హోటల్ బయట ఉన్నవాళ్లు ‘శివకుమార్ వెనక్కు వెళ్లిపోవాలి’ అంటూ నినాదాలు కూడా చేశారు. హోటల్ బయట, ఆ మార్గంలో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మహారాష్ట్ర ప్రభుత్వం మోహరించింది. హోటల్ సెక్యూరిటీ గార్డులు, కెమెరాల సిబ్బంది, విలేకరులు, పార్టీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. వెనక్కి తీసుకెళ్లగలననే నమ్మకంతో వచ్చా.. పోలీసులు తనను అదుపులోకి తీసుకోడానికి ముందు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను రెబెల్ ఎమ్మెల్యేలతో శాంతంగా చర్చలు జరపడం కోసమే వచ్చానన్నారు. తన వద్ద ఏ ఆయుధమూ లేదనీ, భద్రతా సిబ్బందిని కూడా వెంట తెచ్చుకోలేదనీ, కేవలం మాట్లాడేందుకే ఇక్కడకు వచ్చానని ఆయన వెల్లడించారు. లోపల ఉన్న ఎమ్మెల్యేలంతా గత 40 ఏళ్లుగా తనకు మిత్రులనీ, వారితో కలిసి కాఫీ తాగుతూ మాట్లాడటానికి ఇక్కడకు వచ్చాననీ, అయినా తనను లోపలకు వెళ్లనివ్వడం లేదని శివకుమార్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుండకపోతే తనను ఎందుకు లోపలకు వెళ్లనివ్వడం లేదనీ, ఏ ఆయుధమూ లేకుండానే తన మిత్రులకు తానెలా హాని తలపెట్టగలనని ఆయన ప్రశ్నించారు. వారితో మాట్లాడితే తాను వారిని కర్ణాటకకు వెనక్కి తీసుకెళ్లగలనన్న నమ్మకం తనకు ఉందని శివకుమార్ చెప్పారు. ఎమ్మెల్యేలను కలవనీయకుండానే శివకుమార్‌ను పోలీసులు వెనక్కు పంపేశారు. బీజేపీ ప్రజాస్వామ్యం గొంతునులుముతోంది: చవాన్ కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా ప్రజాస్వామ్యం గొంతును ఆ పార్టీ నులుముతోందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ఆరోపించారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి చేటని ఆయన అన్నారు. చవాన్ మాట్లాడుతూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడాన్ని మహారాష్ట్ర సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రోత్సహిస్తున్నారనీ, రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని హోటల్లో బంధించారని చవాన్ మండిపడ్డారు. గతంలో గోవా, మణిపూర్‌ల్లోనూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని చవాన్ అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలేననీ, కానీ వారిని కలిసేందుకు కాంగ్రెస్ నాయకులనే లోపలకు అనుమతించని విషయాన్ని అందరూ గుర్తించాలని చవాన్ కోరారు. శివకుమార్ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేయడం గర్హనీయమన్నారు. -
కర్నాటకంలో కొత్త ట్విస్ట్
సాక్షి, బెంగళూరు/ ముంబై: కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుందని, తప్పుడు నిర్ణయంతో చరిత్రలో ద్రోహిగా మారడం ఇష్టం లేదని స్పీకర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తనకు అందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్లో 5 మాత్రమే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయని ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కూడా రెబెల్స్ జాబితాలో చేరిపోగా, సర్కారు మనుగడ ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బేగ్ రాజీనామా లేఖ అందింది ‘నేను జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. భవిష్యత్ తరాలు నన్నో అపరాధిగా చూస్తాయి’అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ అన్నారు. మంగళవారం విధాన సౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీలోగా ఆధారాలను చూపాలని కోరానని, సమాధానాన్ని బట్టి చర్యలుంటాయని వివరించారు. రాజీనామా చేసిన 14 మందిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలున్నారని వెల్లడించారు. రాజీనామాలను ఆమోదించాలా లేక మరే ఇతర చర్యలు చేపట్టాలా అనే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, రూల్‌బుక్ ప్రకారం నడుచుకుంటానన్నారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ‘ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా లేఖ ఈ రోజే అందింది. దానిని ఇంకా పరిశీలించలేదు. ఇప్పటికే అందిన అధికార కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 ఎమ్మెల్యేల రాజీనామా పత్రాల్లో ఐదుగురివే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయి. మిగతా వారికి ఈ మేరకు సమాచారం అందించాం. వారు మరోసారి రాజీనామా పత్రాలు అందజేస్తే పరిశీలిస్తా’అని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీకి రాని 20 మంది మంగళవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. పదవులకు రాజీనామా చేసిన వారితోపాటు మొత్తం 20 మంది ఈ భేటీకి గైర్హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను కలిశారు. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిని వారు స్పీకర్‌కు అందజేశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజీనామాలు చేసి, బీజేపీతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’అని వెల్లడించారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్దరామయ్య హెచ్చరించారు. ‘రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు తెలియకనే వారంతా రాజీనామా చేశారు. బీజేపీ వలలో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో చేతులు కలిపారు. మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారు’ అని అన్నారు. అంతకుముందు విధానసౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరుకు చేరుకుని ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు ప్రారంభించారు. రెబెల్స్ మళ్లీ ముంబైకి.. కర్ణాటక తిరుగుబాటు శాసనసభ్యులు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరి మార్గమధ్యంలో సతారా సమీపంలో ఆగిపోయారు. తమ రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వారు అక్కడే మంగళవారం ఎదురు చూశారు. కొందరి ఎమ్మెల్యేల రాజీనామాలు నిర్దేశిత నమూనా ప్రకారం లేవని స్పీకర్ ప్రకటించడంతో తిరిగి ముంబై వెళ్లారు. రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. నగర శివార్లలోని ఒక రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని, మరో నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. హెచ్చరికలకు లొంగని రెబెల్స్ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరికలు పంపినప్పటికీ వారు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ‘రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చాం. ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం రాజీనామా సమర్పించినట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే.. ఐఎంఏ గ్రూప్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే బేగ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఐఎంఏ గ్రూప్ ముఖ్య నిర్వాహకుడు, ఐఎంఏ జ్యుయెల్లర్స్ అధినేత మొహమ్మద్ మన్సూర్ ఖాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రోషన్‌బేగ్ తన వద్ద నుంచి రూ.400 కోట్లు తీసుకుని, ఎగనామం పెట్టాడని ఆయన విడుదల చేసిన ఆడియోలో ఆరోపించడం కలకలం రేపింది. -
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సిద్దు!
కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. 13మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాతో కన్నడ డ్రామా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నిలబడుతుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ.. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణంలో మాత్రం లుకలుకలు బహిర్గతమయ్యాయి. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కావాలనే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంగా ఒప్పుకోమంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదనే సంకేతాలనిచ్చాయి. అయితే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేనప్పటికీ.. పిల్లి పోరు – పిల్లి పోరు కోతి తీర్చినట్లు.. కాంగ్రెస్–జేడీఎస్ విభేదాలను సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ కాచుకుని కూర్చొంది. తాజా పరిణామాలను ఆ పార్టీ నిశితంగా గమనిస్తోంది. అవసరమైతే రాష్ట్రపతిపాలన పెట్టయినా పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం లేకపోలేదు. సిద్దరామయ్యే అంతా చేస్తున్నారా? అయితే ఉన్నపళంగా ప్రభుత్వం పడిపోయే అవకాశాల్లేవని.. ఒక్కొక్క ఇటుక రాలిపోతున్నట్లుగా కుమారస్వామి ప్రభుత్వం మెల్లిగా కూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటైనప్పటినుంచీ సున్నితమైన బంధాలపైనే నడుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల వెనక మాజీ సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని జేడీఎస్ ఆరోపిస్తోంది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు సిద్దు మద్దతుందని కుమారస్వామి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. సిద్దు ప్రోద్బలంతోనే వీరంతా రాజీనామాలకు పాల్పడ్డారంటున్నారు. ఆయన్ను సీఎం చేస్తేనే రాజీనామాలు వెనక్కు తీసుకుంటామంటూ రెబల్ ఎమ్మెల్యేలు చెప్పడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అయితే దీనికి జేడీఎస్ కచ్చితంగా ఒప్పుకునే అవకాశం లేదు. అయితే.. ఇదంతా మంగళవారం సభకు రానున్న స్పీకర్.. ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తారా? లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిద్దు అభ్యర్థిత్వానికే కాంగ్రెస్ జై కొడితే.. జేడీఎస్ ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఆపరేషన్ ‘లోటస్’ పార్లమెంటు ఎన్నికల వరకు నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ తాజా పరిణామాల నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించింది. మరింత మంది సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే పరిస్థితులను ప్రోత్సహిస్తే.. కమలం పార్టీ గద్దెనెక్కేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. ఇలా జరిగితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. విప్ ధిక్కరించారనే వివాదమూ ఉండదు. తద్వారా ఎలాంటి వివాదం లేకుండా బీజేపీ సర్కారు ఏర్పాటు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మిగిలిన ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై బరిలో దింపి గెలిపించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే చర్చ జరుగుతోంది. ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలుంటారు. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది బలం ఉండాల్సిందే. ప్రస్తుత జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ బలం 118. ఒకవేళ ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 105 (కాంగ్రెస్ 69, జేడీఎస్ 34, బీఎస్పీ 1, స్వతంత్రులు 1)కు చేరుతుంది. బీజేపీ సొంత బలం కూడా 105. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 (స్పీకర్‌ను మినహాయిస్తే). ఇది బీజేపీ, సంకీర్ణ సర్కారు మధ్య నువ్వా–నేనా అనే పరిస్థితి నెలకొంటుంది. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యేను లాక్కుంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చు. -
రసవత్తరం కర్ణాటకం..
సాక్షి, బెంగళూరు/యశవంతపుర/న్యూఢిల్లీ/ముంబై: కర్నాటకం రసకందాయంలో పడింది. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆదివారం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమై ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై చర్చలు జరిపారు. మరోవైపు కేపీసీసీ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డికే శివకుమార్ తదితరులు అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒక్కో జిల్లా మంత్రికి ఆ జిల్లాలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగించారు. ఈ విషయమై మంత్రి శివకుమార్ మాట్లాడుతూ..‘ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా నేను సిద్ధం’ అని ప్రకటించారు. దేవెగౌడతో సమావేశమైన శివకుమార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? లేక కూలిపోతుందా? అన్న విషయం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జూలై 12న ప్రారంభం కానున్నాయి. సోనియాజీ.. చూస్తున్నారా?: దేవెగౌడ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జేడీఎస్ అధినేత దేవెగౌడ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పార్టీని అస్తవ్యస్తం చేశారనీ, దానివల్లే ఈ దుస్థితి దాపురించిందని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు.‘శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను సస్పెండ్ చేయడం, మరో ఎమ్మెల్యే భీమానాయక్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఇస్తామని 2–3 సార్లు హామీలిచ్చి విస్మరించడం, మంత్రి డీకే శివకుమార్–మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మధ్య గొడవలు.. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు సృష్టించిన సమస్యలే’ అని విమర్శించారు. మరోవైపు సిద్దరామయ్యకు సీఎం పదవి అప్పగిస్తే రాజీనామా ఉపసంహరించుకుంటామని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడం గమనార్హం. దీంతో సిద్దరామయ్య సీఎం అభ్యర్థి అయితే తాము మద్దతు ఇవ్వబోమని, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని దేవెగౌడ కుండబద్ధలు కొట్టారు. మేం సన్యాసులం కాదు: యడ్యూరప్ప కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి తాము సన్యాసులం కాదని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆదివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలన్న విషయమై మా పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాది జాతీయపార్టీ. కాబట్టి ప్రభుత్వ విషయంలో హైకమాండ్‌తో చర్చించాకే తుదినిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి మేమేమైనా సన్యాసులమా? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు మేము ఒప్పుకోం. ఏదేమైనా తుది నిర్ణయం కోసం వేచిచూడండి’ అని చెప్పారు. ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించడంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైతే, 105 మంది ఎమ్మెల్యేలతో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు సిద్దరామయ్య గేమ్‌ప్లాన్‌లో భాగమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయారు: మురళీధరరావు సాక్షి, న్యూఢిల్లీ: అవగాహనారాహిత్యంతోనే కాంగ్రెస్–జేడీఎస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఇన్చార్జి మురళీధరరావు అన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అసలు అధ్యక్షుడే లేని కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, ప్రజల విశ్వాసం కోల్పోవడం తోనే పార్టీని వీడుతున్నారు’ అని ఆయన సాక్షితో అన్నారు. రెబెల్స్ కోసం బీజేపీ నేత విమానం.. ప్రస్తుతం 10 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఆదివారం హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే వీరంతా బీజేపీ నేతకు చెందిన చార్టెడ్ విమానంలో బెంగళూరు నుంచి ముంబై వెళ్లినట్లు వెలుగులోకివచ్చింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ విమానంలోనే బెంగళూరు నుంచి ముంబై వెళ్లారని జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చార్టెడ్ విమానాన్ని ఎవరు, ఎవరికోసం అద్దెకు తీసుకున్నారు.. అనే వివరాలను చెప్పేందుకు నిరాకరించాయి. తాము చార్డెట్ విమాన సర్వీసులను నడుపుతున్నామనీ, వాటిని ఎవరైనా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో ఉన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మహారాష్ట్ర బీజేపీ విభాగం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి సీఎం కుర్చీ! 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఐదేళ్ల పాటు కుమారస్వామే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కుమారస్వామి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలనీ, మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎం కుర్చీని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇరుపార్టీల నుంచి ఐదుగురు చొప్పున మంత్రులు రాజీనామాలు చేసి ఆ పదవులను రెబల్ ఎమ్మెల్యేలకు అప్పగించడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించవచ్చని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. సీఎం కుమారస్వామి ఆదివారం రాత్రి అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేతలతో ఆయన సమావేశమైన తర్వాతే కాంగ్రెస్ డిమాండ్‌పై స్పష్టత రానుంది. మరోవైపు సిద్దరామయ్యకు సన్నిహితులైన బైరటి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, మునిరత్నలు రాజీనామా చేయడంపై ఈ మాజీ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిలదీసినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. సొంతవర్గం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారని సిద్దరామయ్యపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ముంబైలోని హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు -
కన్నడ సంక్షోభం
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో రాజకీయం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర అసెంబ్లీలోని 224 మంది సభ్యులకుగాను మెజారిటీకి అవసరమైన 118 మంది సభ్యుల బలం సంకీర్ణానికి ఉంది. తాజా రాజీనామా లను స్పీకర్ అంగీకరిస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ ఆఫీస్‌లో రాజీనామా లేఖలు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాలు సమర్పించారు. అనంతరం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిశారు. ‘ఇటీవలి రాజీనామా సమర్పించిన ఆనంద్ సింగ్‌తోపాటు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖలు అందజేశారు’ అని జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ గవర్నర్‌తోను కలిశాక మీడియాకు చెప్పారు. ‘ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదు’ అని విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ మచ్చిక చేసుకుంటోందన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కమలం వంటివన్నీ ఊహాగానాలు. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం’ అని అన్నారు. అయితే, ఆనంద్ సింగ్ సహా 13 మంది ఎమ్మెల్యేలే రాజీనామా లేఖలను అందజేసినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు చెప్పాయి. ఈ పరిణామంపై స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో కార్యాలయంలో లేను. మొత్తం 11 మంది శాసనసభ్యులు రాజీనామా లేఖలు ఆఫీస్‌లో ఇచ్చారు. ప్రభుత్వం కొనసాగేదీ లేనిదీ అసెంబ్లీలోనే తేలుతుంది. మంగళవారం ఆఫీసుకు వెళ్లి రాజీనామా లేఖలను పరిశీలించి, చర్య తీసుకుంటా’ అని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో ‘ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ముఖ్యులైన రామలింగారెడ్డి తదితరులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బెంగళూరుకు చేరుకోనున్నారు. ముంబై రిసార్టుకు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చార్టెర్డ్ విమానంలో శనివారం సాయంత్రం ముంబైకి బయలుదేరారు. వీరంతా హోటల్లో బస చేసే అవకాశముందని సమాచారం. ‘ప్రత్యర్థి పార్టీల్లో జరుగుతున్న పరిణామాలతో నాకు గానీ, మా పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. అంతర్గత కుమ్ములాటలే కారణం: బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కమలదళం స్పందించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీఎస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ ఆరోపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మా ప్రభుత్వానికి ఢోకాలేదు: కాంగ్రెస్ ధీమా ఎమ్మెల్యేల రాజీనామా వార్తలపై సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్దరామయ్య స్పందించారు. ‘మా ప్రభుత్వానికి ఢోకా లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘బంతి స్పీకర్ కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’ అని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ -
కేసీఆర్‌పై ‘క్విడ్‌ప్రోకో’ సీఎల్పీ నేత భట్టి డిమాండ్
ఖమ్మంరూరల్: పార్టీ ఫిరా యింపులకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌పై క్విడ్‌ప్రోకో కింద చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా రూరల్ మండలం పోలేపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కేసీఆర్ చేస్తున్న కుట్రలు, తప్పిదాలతో ప్రజాస్వామ్యం అభాసు పాలవుతోందన్నారు. తన స్వార్థం కోసం, అహంకార ధోరణితో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. లేకుంటే స్పీకర్ వారి సభ్యత్వాలను రద్దు చేయాలన్నారు. దురదృష్టవశాత్తు స్పీకర్ కూడా సీఎం కనుసన్నల్లోనే ఉంటూ.. రాజ్యాంగాన్ని విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణకే పరిమితమైన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దేశం అంతా వైరస్‌లా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే పాలేరు ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుంది: బాలినేని
ఒంగోలు : ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగిపోతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్ఆర్ సీపీకి ముఖ్యం అని ఆయన చెప్పారు. తమ రాజీనామాలను శాసనసభాపతి చేత ఆమోదింప చేసుకుంటామన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలన్నారు. పదవుల కోసం మంత్రులు ఆరాటపడుతుంటే, వారి భార్యలు దీక్షచేయడం సిగ్గుచేటన్నారు. విభజనకు బీజం వేసింది వైఎస్ఆర్ అంటూ నిందవేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్రాన్ని సోనియా గాంధీ ముక్కలు చేస్తున్నారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.