అమెరికా నుంచి వచ్చిన సీఎం కుమారస్వామిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలిసిన మంత్రులు
సాక్షి, బెంగళూరు/యశవంతపుర/న్యూఢిల్లీ/ముంబై: కర్నాటకం రసకందాయంలో పడింది. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఆదివారం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అలాగే బెంగళూరులోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమై ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై చర్చలు జరిపారు. మరోవైపు కేపీసీసీ ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డికే శివకుమార్ తదితరులు అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒక్కో జిల్లా మంత్రికి ఆ జిల్లాలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగించారు.
ఈ విషయమై మంత్రి శివకుమార్ మాట్లాడుతూ..‘ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా నేను సిద్ధం’ అని ప్రకటించారు. దేవెగౌడతో సమావేశమైన శివకుమార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? లేక కూలిపోతుందా? అన్న విషయం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జూలై 12న ప్రారంభం కానున్నాయి.
సోనియాజీ.. చూస్తున్నారా?: దేవెగౌడ
కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జేడీఎస్ అధినేత దేవెగౌడ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పార్టీని అస్తవ్యస్తం చేశారనీ, దానివల్లే ఈ దుస్థితి దాపురించిందని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు.‘శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను సస్పెండ్ చేయడం, మరో ఎమ్మెల్యే భీమానాయక్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఇస్తామని 2–3 సార్లు హామీలిచ్చి విస్మరించడం, మంత్రి డీకే శివకుమార్–మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మధ్య గొడవలు.. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు సృష్టించిన సమస్యలే’ అని విమర్శించారు. మరోవైపు సిద్దరామయ్యకు సీఎం పదవి అప్పగిస్తే రాజీనామా ఉపసంహరించుకుంటామని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడం గమనార్హం. దీంతో సిద్దరామయ్య సీఎం అభ్యర్థి అయితే తాము మద్దతు ఇవ్వబోమని, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని దేవెగౌడ కుండబద్ధలు కొట్టారు.
మేం సన్యాసులం కాదు: యడ్యూరప్ప
కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి తాము సన్యాసులం కాదని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆదివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలన్న విషయమై మా పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాది జాతీయపార్టీ.
కాబట్టి ప్రభుత్వ విషయంలో హైకమాండ్‌తో చర్చించాకే తుదినిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి మేమేమైనా సన్యాసులమా? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు మేము ఒప్పుకోం. ఏదేమైనా తుది నిర్ణయం కోసం వేచిచూడండి’ అని చెప్పారు. ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించడంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైతే, 105 మంది ఎమ్మెల్యేలతో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు సిద్దరామయ్య గేమ్‌ప్లాన్‌లో భాగమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు.
ప్రజల విశ్వాసం కోల్పోయారు: మురళీధరరావు
సాక్షి, న్యూఢిల్లీ: అవగాహనారాహిత్యంతోనే కాంగ్రెస్–జేడీఎస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జి మురళీధరరావు అన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అసలు అధ్యక్షుడే లేని కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, ప్రజల విశ్వాసం కోల్పోవడం తోనే పార్టీని వీడుతున్నారు’ అని ఆయన సాక్షితో అన్నారు.
రెబెల్స్ కోసం బీజేపీ నేత విమానం..
ప్రస్తుతం 10 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఆదివారం హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే వీరంతా బీజేపీ నేతకు చెందిన చార్టెడ్ విమానంలో బెంగళూరు నుంచి ముంబై వెళ్లినట్లు వెలుగులోకివచ్చింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు.
రెబెల్ ఎమ్మెల్యేలు తమ విమానంలోనే బెంగళూరు నుంచి ముంబై వెళ్లారని జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చార్టెడ్ విమానాన్ని ఎవరు, ఎవరికోసం అద్దెకు తీసుకున్నారు.. అనే వివరాలను చెప్పేందుకు నిరాకరించాయి. తాము చార్డెట్ విమాన సర్వీసులను నడుపుతున్నామనీ, వాటిని ఎవరైనా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో ఉన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మహారాష్ట్ర బీజేపీ విభాగం ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీకి సీఎం కుర్చీ!
2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఐదేళ్ల పాటు కుమారస్వామే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కుమారస్వామి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలనీ, మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎం కుర్చీని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇరుపార్టీల నుంచి ఐదుగురు చొప్పున మంత్రులు రాజీనామాలు చేసి ఆ పదవులను రెబల్ ఎమ్మెల్యేలకు అప్పగించడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించవచ్చని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం.
సీఎం కుమారస్వామి ఆదివారం రాత్రి అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేతలతో ఆయన సమావేశమైన తర్వాతే కాంగ్రెస్ డిమాండ్‌పై స్పష్టత రానుంది. మరోవైపు సిద్దరామయ్యకు సన్నిహితులైన బైరటి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, మునిరత్నలు రాజీనామా చేయడంపై ఈ మాజీ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిలదీసినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. సొంతవర్గం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారని సిద్దరామయ్యపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు.
ముంబైలోని హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment