HD dev gowda
-
రసవత్తరం కర్ణాటకం..
సాక్షి, బెంగళూరు/యశవంతపుర/న్యూఢిల్లీ/ముంబై: కర్నాటకం రసకందాయంలో పడింది. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆదివారం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమై ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై చర్చలు జరిపారు. మరోవైపు కేపీసీసీ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డికే శివకుమార్ తదితరులు అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒక్కో జిల్లా మంత్రికి ఆ జిల్లాలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగించారు. ఈ విషయమై మంత్రి శివకుమార్ మాట్లాడుతూ..‘ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా నేను సిద్ధం’ అని ప్రకటించారు. దేవెగౌడతో సమావేశమైన శివకుమార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? లేక కూలిపోతుందా? అన్న విషయం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జూలై 12న ప్రారంభం కానున్నాయి. సోనియాజీ.. చూస్తున్నారా?: దేవెగౌడ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జేడీఎస్ అధినేత దేవెగౌడ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పార్టీని అస్తవ్యస్తం చేశారనీ, దానివల్లే ఈ దుస్థితి దాపురించిందని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు.‘శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను సస్పెండ్ చేయడం, మరో ఎమ్మెల్యే భీమానాయక్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఇస్తామని 2–3 సార్లు హామీలిచ్చి విస్మరించడం, మంత్రి డీకే శివకుమార్–మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మధ్య గొడవలు.. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు సృష్టించిన సమస్యలే’ అని విమర్శించారు. మరోవైపు సిద్దరామయ్యకు సీఎం పదవి అప్పగిస్తే రాజీనామా ఉపసంహరించుకుంటామని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడం గమనార్హం. దీంతో సిద్దరామయ్య సీఎం అభ్యర్థి అయితే తాము మద్దతు ఇవ్వబోమని, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని దేవెగౌడ కుండబద్ధలు కొట్టారు. మేం సన్యాసులం కాదు: యడ్యూరప్ప కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి తాము సన్యాసులం కాదని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆదివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలన్న విషయమై మా పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాది జాతీయపార్టీ. కాబట్టి ప్రభుత్వ విషయంలో హైకమాండ్‌తో చర్చించాకే తుదినిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి మేమేమైనా సన్యాసులమా? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు మేము ఒప్పుకోం. ఏదేమైనా తుది నిర్ణయం కోసం వేచిచూడండి’ అని చెప్పారు. ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించడంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైతే, 105 మంది ఎమ్మెల్యేలతో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు సిద్దరామయ్య గేమ్‌ప్లాన్‌లో భాగమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయారు: మురళీధరరావు సాక్షి, న్యూఢిల్లీ: అవగాహనారాహిత్యంతోనే కాంగ్రెస్–జేడీఎస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఇన్చార్జి మురళీధరరావు అన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అసలు అధ్యక్షుడే లేని కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, ప్రజల విశ్వాసం కోల్పోవడం తోనే పార్టీని వీడుతున్నారు’ అని ఆయన సాక్షితో అన్నారు. రెబెల్స్ కోసం బీజేపీ నేత విమానం.. ప్రస్తుతం 10 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఆదివారం హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే వీరంతా బీజేపీ నేతకు చెందిన చార్టెడ్ విమానంలో బెంగళూరు నుంచి ముంబై వెళ్లినట్లు వెలుగులోకివచ్చింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ విమానంలోనే బెంగళూరు నుంచి ముంబై వెళ్లారని జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చార్టెడ్ విమానాన్ని ఎవరు, ఎవరికోసం అద్దెకు తీసుకున్నారు.. అనే వివరాలను చెప్పేందుకు నిరాకరించాయి. తాము చార్డెట్ విమాన సర్వీసులను నడుపుతున్నామనీ, వాటిని ఎవరైనా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో ఉన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మహారాష్ట్ర బీజేపీ విభాగం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి సీఎం కుర్చీ! 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఐదేళ్ల పాటు కుమారస్వామే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కుమారస్వామి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలనీ, మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎం కుర్చీని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇరుపార్టీల నుంచి ఐదుగురు చొప్పున మంత్రులు రాజీనామాలు చేసి ఆ పదవులను రెబల్ ఎమ్మెల్యేలకు అప్పగించడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించవచ్చని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. సీఎం కుమారస్వామి ఆదివారం రాత్రి అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేతలతో ఆయన సమావేశమైన తర్వాతే కాంగ్రెస్ డిమాండ్‌పై స్పష్టత రానుంది. మరోవైపు సిద్దరామయ్యకు సన్నిహితులైన బైరటి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, మునిరత్నలు రాజీనామా చేయడంపై ఈ మాజీ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిలదీసినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. సొంతవర్గం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారని సిద్దరామయ్యపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ముంబైలోని హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు -
ఈ సారి కూడా కుటుంబ రాజకీయాలే....
‘స్థానిక’ ఎన్నికల్లో కూడా కుల రాజకీయాలు ధనవంతులకే ప్రాధాన్యం టికెట్ దక్కకపోతే ఇతర పార్టీల్లోకి జంప్ ! ప్రధాన పార్టీలకు దడ సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇక జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కని నేతలంతా ఇతర పార్టీల్లో చేరి బీఫాం తీసుకోవడమో లేదంటే రెబల్స్‌గానో బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రెబల్స్ అన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 13న 15 జిల్లా పంచాయతీ, 95 తాలూకా పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి విడతలో పోలింగ్ జరగనున్న జిల్లా, తాలూకా పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించే దిశగా అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు. ఇదే సందర్భంలో ఆయా పార్టీల్లో టికెట్లు దక్కని అభ్యర్థులు రెబల్స్‌గా బరిలోకి దిగి తమకు టికెట్ కేటాయించని పార్టీల అభ్యర్థులు ఎలాగైనా సరే ఓటమి పాలయ్యేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ, రామనగర, చిత్రదుర్గ, దావణగెరె, కోలారు, చిక్కబళ్లాపుర, తూమకూరు ఇలా మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న అన్ని ప్రాంతా ల్లోనూ రెబల్ అభ్యర్థులు ప్రధాన పార్టీల నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. ఇక తమ సొంత పార్టీ నుంచి టికెట్ దక్కని వారంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి బి-ఫారం తీసుకొని పోటీలో నిలబడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పట్టున్న స్థానికులు ఇతర పార్టీల్లో చేరిపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలా అన్ని డైలమాలో పడిపోతున్నాయి. ఈ సారి కూడా ఇక ఈ సారి కూడా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ, కె.ఎస్.ఈశ్వరప్ప కుమారుడు కాంతరాజు, కోలారు ఎంపీ కె.హెచ్.మునియప్ప కుమార్తె రూపా శశిధర్, మాజీ మంత్రి ఎం.బి.పాటిల్ కుమారుడు వినయ్ పాటిల్, ఎమ్మెల్సీ వివేక్రావ్ పాటిల్ కుమారుడు ప్రణయ్ పాటిల్, మాజీ మంత్రి ఉమేష్ కత్తి కుమారుడు నిఖిల్ కత్తి, ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్ భార్య భారతి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప కుమారుడు వెంకటేష్ ఇలా చాలా మంది ప్రముఖుల కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం గమనార్హం. ధన ప్రవాహం..... ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయా జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల్లో ధన ప్రవాహం కనిపిస్తోంది. గ్రామాల్లోని స్త్రీ శక్తి సంఘాలు, యువ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఇలా అన్ని సంఘాల ద్వారా ఓటర్లకు డబ్బును చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సందర్భంలో మద్యం, చీరలు, ముక్కుపుడకలు, గృహోపకరణాలు ఇలా వివిధ రకాల బహుమతులను ఓటర్లకు అందజేసి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టేదిశగా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. -
‘మూడో’ కసరత్తు ముమ్మరం
న్యూఢిల్లీ: మూడో కూటమి ఏర్పాటు యత్నాలు ముమ్మరమయ్యాయి! సోమవారమిక్కడ మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ నివాసంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమై థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీకి సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలతో కూడిన 11 పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఇందులో నిర్ణయించారు. మూడో కూటమి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్న పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు ఒకట్రెండు భారీ ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ‘బీహార్ సీఎం ఇక్కడ ఉండడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశాం. మూడో కూటమి ఏర్పాటుపై చర్చించాం. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు 11 పార్టీలకు చెందిన నేతలతో త్వరలోనే ఢిల్లీలో సమావేశం కాబోతున్నాం’ అని జేడీ(ఎస్) సెక్రటరీ జనరల్ డానిష్ ఆలీ చెప్పారు. మూడో కూటమికి రూపు ఇచ్చే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు. ఎన్నికల తర్వాతే కూటమి ఏర్పడుతుందని చెప్పారు. నాలుగు లెఫ్ట్ పార్టీలు, ఎస్పీ, జేడీ యూ, అన్నా డీఎంకే, ఏజీపీ, జార్ఖండ్ వికాస్ మోర్చా, జేడీ(ఎస్), బీజేడీలు థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.