‘మూడో’ కసరత్తు ముమ్మరం
న్యూఢిల్లీ: మూడో కూటమి ఏర్పాటు యత్నాలు ముమ్మరమయ్యాయి! సోమవారమిక్కడ మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ నివాసంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమై థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీకి సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలతో కూడిన 11 పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఇందులో నిర్ణయించారు.
మూడో కూటమి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్న పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు ఒకట్రెండు భారీ ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ‘బీహార్ సీఎం ఇక్కడ ఉండడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశాం. మూడో కూటమి ఏర్పాటుపై చర్చించాం. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు 11 పార్టీలకు చెందిన నేతలతో త్వరలోనే ఢిల్లీలో సమావేశం కాబోతున్నాం’ అని జేడీ(ఎస్) సెక్రటరీ జనరల్ డానిష్ ఆలీ చెప్పారు. మూడో కూటమికి రూపు ఇచ్చే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు. ఎన్నికల తర్వాతే కూటమి ఏర్పడుతుందని చెప్పారు. నాలుగు లెఫ్ట్ పార్టీలు, ఎస్పీ, జేడీ యూ, అన్నా డీఎంకే, ఏజీపీ, జార్ఖండ్ వికాస్ మోర్చా, జేడీ(ఎస్), బీజేడీలు థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.