Prakash karat
-
హిందువులంటే అదానీ, అంబానీలేనా?
సాక్షి, హైదరాబాద్: హిందువులంటే అదానీ, అంబానీలేనా? అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కారత్ ప్రశ్నించారు. వారి సంక్షేమం కోసమే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. హిందువుల్లో భాగమైన పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీకి కనిపించరా? అని నిలదీశారు. మతతత్వం, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనీ, అదానీ, అంబానీల ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17న వరంగల్‌లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర ముగింపు సభ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశ్‌కారత్ మాట్లాడుతూ, గతంలో టాటా, బిర్లా ప్రభుత్వం అనే వాళ్లమని, కేంద్రంలో ఇప్పుడున్న సర్కారు అదానీ, అంబానీ ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. అదానీఅక్రమ సంపాదనపై పార్లమెంటులో చర్చించకుండా సమాధానం చెప్పలేక సభను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. 2014లో అదానీ ఆస్తులు రూ.50 వేల కోట్లుండేవనీ, మోదీ ప్రధాని అయ్యాక ఇప్పుడు రూ.10.3 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ అక్రమ సంపాదనపై దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదనీ, పార్లమెంటులో చర్చకు కేంద్రం అంగీకరించడం లేదని చెప్పారు. అందుకే రాహుల్‌పై వేటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై, ముఖ్యంగా ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ప్రకాశ్‌కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ముక్త భారత్‌ను మోదీ కోరుకుంటున్నారని విమర్శించారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. ఆ క్రమంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. బీఆర్ఎస్ నేత కవితలను విచారిస్తున్నారనీ, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేశారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీల మద్దతుతోనే మునుగోడు ఫలితం: తమ్మినేని మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ అడగడంతో సీపీఎం, సీపీఐ మద్దతు ఇచ్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. దీనిపై అప్పట్లో అక్కడక్కడ విమర్శలు వచ్చాయనీ కానీ మునుగోడు ఫలితాలు వచ్చిన తర్వాత సీపీఎం, సీపీఐలు తీసుకున్న వైఖరిపై సానుకూలత వ చ్చిందన్నారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 10 వేల మెజారిటీతో గెలిచారని, ఈ రెండు పార్టీలు మద్దతు ఇవ్వకపోతే బీఆర్ఎస్కు ఆ ఫలితం వచ్చేది కాదని తమ్మినేని విశ్లేషించారు. రాబోయే ఎన్నికల్లో కూడా సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసుంటామా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో, ప్రజాసమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్తో కలిసే ఉంటామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలప్పుడు సీట్ల విషయంలో ఎలా ఒప్పందాలు జరుగుతాయో ఇప్పుడే తెలియదన్నారు. సీట్ల విషయంలో సరిగా ఒప్పందం జరిగితే కలిసి పోటీ చేస్తామని, లేదంటే విడిగా పోటీచేసే అవకాశముందని తమ్మినేని ప్రకటించారు. ఎర్రజెండాలు కలిసి పోటీచేయాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్ 9న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ–సీపీఎం ఆధ్వర్యంలో సంయుక్తంగా పార్టీ శ్రేణులతో సభ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. సభలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నాయకులు ఎస్.వీరయ్య, పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ, టి.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి మాట్లాడారు. -
ఏఐఎస్‌లపై కేంద్రం పెత్తనం సరికాదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/తుర్కయాంజాల్: ‘అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులపై కేంద్రం పెత్తనం సరికాదు. రాష్ట్రాలను సంప్రదించకుండా ఆ అధికారులను బదిలీ చేయడం, రాష్ట్రాల హక్కు లను హరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. అలాగే, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధులను కూడా విడుదల చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. సీపీఎం ఏ పార్టీకి గుడ్డిగా మద్దతు తెలపదని.. బీజేపీ, దాని విధానాలకు వ్యతిరేకంగా పని చేసే శక్తులకు మద్దతుగా ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలకు ప్రత్యేక పరిశీలకులుగా హాజరైన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట్లో బీజేపీతో దోస్తీ చేసినా...ప్రస్తుతం ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో ప్రజల్లో కొంత నమ్మకం కలిగించి వారి మద్దతు పొందే విషయంలో టీఆర్ఎస్ కొంత వెనుకబడిపోయిందన్నారు. బీజేపీ వేగంగా తన ఉనికి కోల్పోతుందని జోస్యం చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు. ముగిసిన మహాసభలు తుర్కయాంజాల్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన సీపీఎం రాష్ట్ర మహాసభలు మంగళవారం ముగిశాయి. ఈ సభల్లో 45 అంశాలపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోకడలపైనా పోరాటం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. విద్య, సాంస్కృతిక, సామాజిక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. మహాసభలకు పలువురు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులతోపాటు తెలంగాణ నుంచి 630 మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
సీపీఎం రాష్ట్ర మహాసభలు..హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) మూడో రాష్ట్రమహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభంకానున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు అతిథులుగా హాజరుకానున్నారు. సభలు జరిగే ప్రదేశంసహా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ప్రధాన వీధులన్నింటినీ ఎర్రతోరణాలతో అలంకరించారు. బొంగుళూరు గేటు, విజయవాడ హైవే, మహేశ్వరం ప్రధాన రహదారుల వెంట భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సభలకు జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అతిథులకు భోజనాలు, వసతిని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్‌తోపాటు సమీపంలోని పలు అతిథిగృహాల్లో కల్పించనున్నారు. చర్చకు వచ్చే ప్రధాన అంశాలివే... ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ, జిల్లాలో పరిశ్రమల స్థాపన పేరుతో బలవంతపు భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న తీరు, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, కేంద్రం తీసుకొస్తున్న సాగు వ్యతిరేక చట్టాలు, భవిష్యత్తులో వాటి పర్యవసానాలు వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
బలహీనతలు అధిగమించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా ఎదుర్కొంటున్న బలహీనతలు, లోటుపాట్లను అధిగమించేందుకు వెంటనే అవసరమైన కార్యాచరణను చేపట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని సీపీఎం జాతీయ నాయకత్వం ఆదేశించింది. కిందిస్థాయి నుంచి పార్టీ బలపడేందుకు, సొంత బలం పెంచుకునేందుకు రాబోయే మూడునెలల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి, వాటిపై ఆందోళనలు, ఉద్యమాలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు, వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలకు మారిన పరిస్థితుల్లో సైద్ధాంతిక అంశాలు, పార్టీ భావజలాన్ని అర్థమయ్యేలా వివరించాలని సూచించింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర పార్టీ ప్లీనం సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ హాజరై రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. యువతకు దగ్గర కావ డంతోపాటు పార్టీ భావజాల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో వైఫల్యాలను అధిగమించాలని సూచించింది. ఎలాంటి కార్యాచరణను చేపట్టాలనే దానిపై పూర్తిస్థాయిలో అధ్య యనం నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం, సంప్రదాయ ఓటర్లుగా, మద్దతునిస్తూ పార్టీకి సహకరిస్తున్న వివిధ వర్గాలు దూరం కావడం, బడుగు వర్గాలుసైతం పార్టీపై అనాసక్తి కనబర్చడంపై లోతైన ఆత్మపరిశీలన చేసుకుని ఆ మేరకు రాజకీయ వ్యూహాలు మార్చుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితా ల సమీక్షకు సంబంధించిన నివేదికలను రాష్ట్రనాయకులకు అందజేసినట్టు సమాచారం. ఏళ్లుగా పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంక్, మద్దతుదారులుగా ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం ఇతర వర్గాలు ఎందుకు దూరమవుతున్నారనే అంశంపై లోతైన విశ్లేషణ చేయాలని సూచించింది. -
వామపక్ష ఉద్యమ ప్రకాశం
వెబ్ ప్రత్యేకం : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ (సీపీఎం) ఉద్యమ నిర్మాణంలో ప్రకాశ్ కారత్‌ది కీలక పాత్ర. విద్యావంతుడిగా పేరొందిన కారత్.. కరడుగట్టిన మార్క్సిస్ట్ వాదిగా, విమర్శకుడిగా గుర్తింపుపొందారు. డెభై ఏళ్ల వయసులో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బూర్జువా, ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికరంగాన్ని ఏకం చేయడం కోసం ఎర్రజెండా పట్టి వామపక్ష ఉద్యమానికి ప్రకాశ్ కారత్ ఊపిరిలూదారు. విద్యార్థి నాయకుడిగా మార్క్సిజంలోకి అడుగుపెట్టిన కరత్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి పార్టీలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో అసువులుబాసిన ఎందరో అమరవీరులు చూపిన బాటను అనుసరిస్తూ.. ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ పోరాడేతత్వం కారత్‌ది. ప్రముఖ మార్క్సిస్ట్ మహిళా నేత బృందా కారత్ను (1975)ను వివాహం చేసుకుని దంపతులిద్దరూ ప్రజాసమస్యలకై పోరాడుతున్నారు. కేవలం ప్రజా ఉద్యమాలతోనే కాక .. పదునైన రచనలతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని చరిత్రలోకి ఎక్కించారు కారత్. తానే స్వయంగా రచయితగా అవతారమెత్తి ఎన్నో పుస్తకాలను రచించి కమ్యూనిస్ట్‌ల ఔనత్యాన్ని ప్రపంచాన్నికి పరిచయం చేశారు. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉచ్చస్థితిలో ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో కమ్యూనిస్ట్‌ల ప్రాతినిథ్యం కోల్పోయే రెండు రకాల విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కరత్కుంది. బూర్జువా పార్టీల ఆధిపత్యం ఓవైపు, దశాబ్దాల చరిత్రగల కమ్యూనిస్ట్ కంచుకోటలు బీటలు బారుతూ.. ఎర్రజెండా ఉద్యమాలు బలహీనపడుతున్న పరిస్థితి మరోవైపు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రజెండాను ఎగరేసేందుకు సీనియర్ నేతగా ప్రకాశ్ ఏవిధంగా వ్యూహాలు రచిస్తారో వేచిచూడాలి. రాజకీయ నేపథ్యం ఐదు దశాబ్దాల ప్రజాజీవితంలో కమ్యూనిస్ట్‌గా అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మార్స్ సిద్ధాంతానికే కట్టుబడి నిలిచారు. దేశంలో పేరొందిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడిగా 1971లో మార్క్సిజంలోకి అడుగుపెట్టిన ప్రకాష్ కారత్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి వరకు ఎదిగారు. సీపీఎంకు చెందిన విద్యార్థి సంఘం సంస్థ ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వ్యవస్థాపకుల్లో ఇతను కూడా ఒక్కరు. మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ విధించిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడి.. ఏడాది పాటు అజ్ఞాతంలో గడిపాడు. జేఎన్‌యూలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సీపీఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి, కమ్యూనిస్ట్ అగ్రనేత ఏకే గోపాలన్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి ఆడుగుపెట్టారు. 1974-79 మధ్య విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అ తరువాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కారత్ 1985లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైన్నారు. 1992లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీలో అనేక సంస్కరణలను అమలుచేసిన ప్రకాష్.. 2005లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2015 వరకు ఆ పదవిలో కొనసాగారు. ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మార్స్సిస్ట్ పార్టీ అధికారంలో ఉండి.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బలంగా ఉంది. యూపీఏ-1 ప్రభుత్వంలో సీపీఎం ప్రధానమైన భాగస్వామి కావడంలో కేంద్ర ప్రభుత్వంలోను ఆయన చక్రం తిప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు సోమనాథ్ చటర్జీని లోక్‌సభ స్పీకర్‌గా సోనియా గాంధీ నియమించారు. అమెరికాతో న్యూక్లీయర్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి సంచలనం సృష్టించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 9 తొమ్మిది స్థానాల్లోనే విజయం సాధించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు సీపీఎంకు కంచుకోటాలా ఉన్న బెంగాల్లో ఈ నాయకత్వంలోనే దారుణ ఓటమి చవిచూసి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆయన స్థానంలో సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత వారిద్దరి మధ్య విభేదాలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఏచూరి, కరత్ మధ్య విభేదాలు పార్టీని రెండు వర్గాలుగా చీల్చే పరిస్థితి వరకు వెళ్లింది. కుటుంబ నేపథ్యం ప్రకాశ్ కరత్ 1948 ఫిబ్రవరి 8న బర్మాలో జన్మించారు. అనంతరం కేరళలో స్థిరపడ్డారు. తండ్రి బర్మా రైల్వేస్‌లో ఉద్యోగి. తన పాఠశాల విద్య అంతా మద్రాస్‌లో కొనసాగించారు. ఉన్నత విద్యవంతుడైన ప్రకాశ్ తనకు కాబోయే సహచరి కూడా తన ఆలోచనలకు దగ్గరగా ఉండాలని మొదటి నుంచి అనుకునే వారు. ఆ నేపథ్యంలో లండన్‌లో విద్యనభ్యసించిన సామాజిక కార్యకర్త బృందా కరత్‌ను 1975లో వివాహం చేసుకున్నారు. భర్త అడుగుజాడల్లోనే నేను కూడా అంటూ మార్స్సిస్ట్ ఉద్యమంలోకి ప్రవేశించారు బృందా. 2005లో బెంగాల్ నుంచి ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సీపీఎం పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. - సురేష్ అల్లిక -
అన్ని రంగాల్లో కేంద్రం విఫలం
సాక్షి, అమరావతి/గన్నవరం: అన్ని రంగాలలో విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మతాన్ని అడ్డం పెట్టుకుని దేశ ప్రజల్ని చీల్చేందుకు కుట్ర పన్నుతోందని సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ధ్వజమెత్తారు. ఉత్తరాదిన అయోధ్య, దక్షిణాదిన శబరిమలను అస్త్రాలుగా చేసుకుని భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం అనే అంశంపై విజయవాడలో, ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు– కర్తవ్యాలు’ అనే అంశంపై గన్నవరంలో ఆదివారం జరిగిన సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. ప్రజల్లో పెద్దఎత్తున ఆశలు కల్పించి 2014లో అధికారాన్ని చేజిక్కించుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. మతోన్మాద హిందూత్వ అజెండాతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏమి చెబితే అది చేస్తోందని విమర్శించారు. ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలను మట్టుబెట్టేందుకు నడుంకట్టిందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనమంతా తెల్లధనమైందని, తిరిగి వచ్చిన పెద్దనోట్లు అసలు కన్నా ఎక్కువగా ఉన్నాయంటే సాధించిందేమిటన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే మరోపక్క దేశంలో అవినీతి విచ్చలవిడి అయిందనే దానికి నిదర్శనమే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అన్నారు. యుద్ధ విమానాల తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీకి అప్పగించిన రూ.21 వేల కోట్ల ఈ కాంట్రాక్ట్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణమన్నారు. రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం.. మోదీ హయాంలో ఆర్థిక, న్యాయ, విద్య సహా పలు రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని కారత్ ఆరోపించారు. చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా తమకు అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే సహించబోమనే స్థితికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వచ్చాయన్నారు. శని సింగనాపూర్ దేవాలయంలోకి మహిళల్ని అనుమతించాలని కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ అవకాశవాదాన్ని సహించబోమని హెచ్చరించారు. అమలు చేయలేని తీర్పులు, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే తీర్పులు కోర్టులు ఇవ్వొద్దని అమిత్ షా చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. మతోన్మాద హిందూ దేశాన్ని స్థాపించాలన్న బీజేపీ కలల్ని వమ్ము చేస్తామన్నారు. లౌకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ సైతం శబరిమల వ్యవహారంలో అవకాశవాదాన్ని ప్రదర్శించడం ఆత్మహత్యాసదృశ్యమన్నారు. సీబీఐకి నో ఎంట్రీపై చర్చించలేదు.. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ దానిపై తమ పార్టీ ఇంకా చర్చించలేదని, 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం మాట్లాడతామన్నారు. అయితే సీబీఐలో లుకలుకలు పెరిగిపోయాయని, బీజేపీ నియమించిన డైరెక్టరే ప్రస్తుతం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వచ్చే వారం ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. బీజేపీని ఓడించడం, కేంద్రంలో లౌకిక ప్రజాస్వామిక శక్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పార్లమెంటులో వామపక్ష పార్టీల బలాన్ని పెంచుకోవడం తమ ఎన్నికల విధానమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
సీపీఎం మహాసభల్లో కీలక తీర్మానాలు
సాక్షి, హైదారాబాద్: జాతీయ మహాసభల్లో భాగంగా పలు కీలక తీర్మానాలపై చర్చించినట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్ తెలిపారు. రాజకీయ తీర్మానంపై గురువారం చర్చ ముగిసిందని, తీర్మానంపై 47 మంది ప్రతినిదులు ప్రసంగించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారని కారత్ తెలిపారు. 286 ప్రతిపాదనల్లో చర్చలో వచ్చిన సూచనలతో కొన్ని మార్పులు చేసి రాజకీయ తీర్మానం సిద్ధంచేశామని, ఇవాళ పూర్తి స్థాయి రాజకీయ తీర్మానం ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ రాజకీయ నిర్మాణం పై తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తామన్నారు. చర్చలో భాగంగా 15వ ఆర్థిక సంఘం సూచనలు, దక్షణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై చర్చించామని తెలిపారు. 1971 జనాభా ప్రాతిపదికన కాకుండా 2011 లెక్కల ప్రకారం నిదుల కేటాయింపు సరికాదని, అలా అయితే జనాభా నియంత్రణ సక్రమంగా జరిపిన రాష్ట్రాలు నష్టపోతాయని తీర్మానంలో చర్చించినట్లు కారత్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా సంక్షేమ పథకాలు కుదించటం సరికాదని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రతపై మరో తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రైవేట్ సెక్టార్లో కార్మికులు, ఉద్యోగుల చట్టాల అమలుపై కార్మిక సంఘాల సూచనలను పరిశీలించారు. సభలో ప్రవేశపెట్టిన రెండు ముసాయిదాలపై వచ్చిన సవరణలకు సమాధానం ఉంటుందని, ముసాయిదాలపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఓటింగ్ నిర్వహిస్తామని కారత్ తెలిపారు. ఓటింగ్‌కు ఏ సభ్యుడైనా డిమాండ్ చేయవచ్చునని, పార్టీలో రహాస్య ఓటింగ్ విధానం లేనందున ప్రతినిదులు రహస్య ఓటింగ్ కోరితే ఆలోచిస్తామని తెలిపారు. ఓటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులందరూ పాటించాలని, అప్పుడు మెజారిటీ, మెనారిటీ అన్న ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. పార్టీ సెంట్రల్ కమిటీ కంటే పార్టీ కాంగ్రెస్ ఉన్నతమైనదని, కీలక అంశాలపై ఇక్కడ స్పష్టమైన ముగింపు ఉంటుందని ప్రకాష్ కారత్ స్పష్టంచేశారు. -
కారత్ X ఏచూరి!
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ విధానాల విషయంగా సీపీఎంలో జరుగుతున్న పరిణామాలు, కీలక నేతల మధ్య విభేదాలు సంచలనానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఆమోదించాల్సిన రాజకీయ తీర్మానం విషయంలో పార్టీ అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్‌ల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయని సమాచారం. కాంగ్రెస్‌తో సీపీఎం రాజకీయ సంబంధాల అంశంలో రాజకీయ తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఏమిటీ విభేదాలు? రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలను ఖరారు చేసుకునేందుకు సీపీఎం మూడేళ్లకోసారి జరిగే జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం చేసుకుంటుంది. ఆ తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చలు జరిపి, అవసరమైన సవరణలు చేసుకుని ఆమోదించుకుంటుంది. అయితే తాజాగా 22వ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టిన రాజకీయ ముసాయిదా తీర్మానం పార్టీ అగ్రనేతల మధ్య విభేదాలకు దారితీసింది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని, అదే సందర్భంలో కాంగ్రెస్‌తోనూ ఎలాంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోవద్దని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ బుధవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఈ తీర్మానంపై కేంద్ర కమిటీలో కూడా చర్చించారు. కానీ కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దన్న అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విభేదిస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండాలని తాను కోరుకోవడం లేదని.. కానీ బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల కలయిక అవసరమని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు అవసరమైతే కొనసాగించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు తీర్మానంలోని కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దనే వాక్యానికి సవరణలు చేయాలని పట్టుపడుతున్నారు. ఈ అంశంపై కేంద్ర కమిటీలో చర్చ జరిగినప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కారత్ ఆలోచన ప్రకారం కేంద్ర కమిటీ ఆమోదించిన ముసాయిదా తీర్మానాన్ని మహాసభలో పెట్టాలని.. దాంతోపాటు మైనార్టీ అభిప్రాయం కింద ఏచూరి ప్రతిపాదనను కూడా ప్రవేశపెట్టి ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని, తుది తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించారు. ఇలా తొలిసారిగా మహాసభల్లో రాజకీయ తీర్మానాన్ని విభేదిస్తూ.. మైనార్టీ అభిప్రాయాన్ని కూడా చర్చించాలంటూ తీర్మానం పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. మెజార్టీ మద్దతు కారత్‌కే.. మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానంతో పాటు ఏచూరి ప్రవేశపెట్టిన మైనార్టీ అభిప్రాయంపైనా గురువారం వాడివేడి చర్చ జరిగింది. 12 రాష్ట్రాలకు చెందిన 13 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. మెజార్టీ సభ్యులు కారత్ ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సూచించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడిన ప్రతినిధి కూడా కారత్ ప్రతిపాదననే బలపర్చినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు మరికొందరు ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ రాష్ట్రాల అభిప్రాయాలను తెలియజేసి సవరణలు సూచించనున్నారు. మొత్తంగా కారత్ ప్రవేశపెట్టిన తీర్మానానికే మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. వీగిపోతే.. తప్పుకొంటారా? రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఏచూరి ఉన్నట్టు సీపీఎం వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రాజకీయ ముసాయిదా తీర్మానం రూపొందించినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఓటింగ్ జరగ్గా.. ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది. అప్పుడే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధపడ్డారని.. కానీ మహాసభల వరకు కొనసాగాలని, మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకునే సమయంలో ఆలోచిద్దామని చెప్పడంతో ఆ యోచన విరమించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రతిపాదనకు ప్రతినిధుల మద్దతు కూడా లభించకపోతే.. ప్రధాన కార్యదర్శి పదవిలో తాను కొనసాగడం నైతికం కాదనే అభిప్రాయంతో ఏచూరి ఉన్నారని, ప్రతిపాదన వీగిపోతే తప్పుకొంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఏచూరి ప్రతిపాదన వీగిపోయినా.. తిరిగి ఆయననే ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలని ప్రతిపాదించే యోచనలోనే పార్టీ పొలిట్‌బ్యూరో ఉన్నట్టు సమాచారం. అయినా పదవిలో కొనసాగడానికి ఏచూరి విముఖత చూపితే మార్పు అనివార్యం కానుంది. అదే జరిగితే త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌కు పార్టీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. మరో సీనియర్ నేత బృందా కారత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓటింగ్ జరుగుతుందా? తాను ప్రతిపాదించిన సవరణను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే ఓటింగ్ నిర్వహించాలని కోరే అవకాశం మహాసభకు హాజరైన ప్రతి సభ్యుడికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ప్రవేశపెట్టిన మైనార్టీ అభిప్రాయంపై సీతారాం ఏచూరి కూడా ఓటింగ్‌కు పట్టుపట్టే అవకాశాలున్నాయి. అయితే పార్టీ మహాసభల్లో ఇప్పటివరకూ రహస్య ఓటింగ్ జరగలేదు. ఈసారి కూడా చేతులు ఎత్తే విధానం ద్వారానే ఓటింగ్ జరగనుంది. ఇదే జరిగితే కారత్ ప్రతిపాదించిన తీర్మానానికే ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. -
సీపీఎం మహాసభల్లో అభిప్రాయ బేధాలు
-
సీపీఎం మహాసభల్లో రసాభాస
సాక్షి, హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్(సీపీఎం) జాతీయ మహాసభల(22వ) రెండో రోజు రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం ముఖ్యనేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేర్చింది. ఒకానోక దశలో సభల్లో రెండు రకాల రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడంతో.. వర్గ పోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. (చారిత్రక తప్పిదమా?) ఒంటరిగా పోరాటం చేస్తూనే ప్రగతిశీల శక్తులను ఐక్యం చేసి బీజేపీని దెబ్బ కొట్టాలని సీనియర్ నేత ప్రకాశ్ కారత్ తన వాదన తెరపైకి తెస్తే.. బలోపేతమైన బీజేపీని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లాల్సిందేనని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాదిస్తున్నారు. గతంలో కేంద్ర కమిటీలో ఏచూరి తీర్మానం వీగిపోగా.. అన్యమనస్కంగానే ఆయన ఇప్పుడు మహాసభల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో నేడు జరగబోయే కీలక భేటీలో తన నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ప్రతిపాదనకే మెజారిటీ సభ్యులు మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మహాసభల్లో రెండు రకాల రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడం పార్టీ చరిత్రలో లేదని.. ఇది పార్టీ ప్రతిష్టకు మంచిది కాదని కొందరు సీనియర్ నేతలు వారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓటింగ్ అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క జాతీయ కార్యదర్శిగా మళ్లీ సీతారామే ఎన్నికవుతారన్న చర్చ మొదలవుతుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కొనసాగింపు కష్టమేనన్న మరో వాదన తెరపైకి వచ్చింది. కేరళ, మణిపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని.. లేకపోతే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుందని సీతారాం ఏచూరి వాదిస్తున్నారు. ఏదిఏమైనా నేటి కీలక భేటీలో తీసుకోబోయే నిర్ణయం ఏంటన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి! -
కేసీఆర్ ఫ్రంట్ సక్సెస్ కాదు: కారత్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని, బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీలో ఆయన సంపాదకీయం రాస్తూ.. ‘ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విఫలమవుతాయి. డీఎంకే, ఆర్జేడీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కొనసాగుతున్నాయి. విధానాలు, స్థానిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల మధ్య అనేక వైరుధ్యాలు ఉండడం ఫ్రంట్ ఏర్పాటుకు అడ్డంకిగా మారనున్నాయి. అందువల్ల యూపీలో అనుసరించినట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేస్తేనే ఆ పార్టీని ఓడించగలం’ అని పేర్కొన్నారు. -
సీపీఎం చేసింది మరో చారిత్రక తప్పిదమా?
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆదివారం పార్టీ కేంద్ర కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ఆ స్థానంలో మాజీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వర్గం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించడం సీపీఎం చేస్తున్న మరో చారిత్రక తప్పిదమా? పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి తన తీర్మానాన్ని నెగ్గించుకోకపోవడం సీతారాం ఏచూరి వైఫల్యమా? అందుకు ఆయన రాజీనామా చేస్తారా? పదవిలో కొనసాగుతూ మరో అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని తన పంథాన్ని భవిష్యత్తులోనైనా నెగ్గించుకుంటారా? వాస్తవానికి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, లేదా? అంశంలో తప్ప సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ ప్రవేశపెట్టిన తీర్మానాలకు పెద్ద తేడా లేదు. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలను ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ లాంటి లౌకికవాద పార్టీలను కలుపుకుపోవాలని సీతారాం ఏచూరి ప్రతిపాదించగా, బీజేపీ నాజీ లాంటి కరడుగట్టిన పార్టీ కాదని, ఏకీకత అధికారాన్ని చెలాయించే పార్టీ అని, దాన్ని ఎదుర్కొనేందుకు విద్యార్థి నాయకుడు కన్నయ్హ కుమార్ లాంటి వాళ్లను కలుపుకోవాలని, కాంగ్రెస్‌లాంటి బూర్జువా పార్టీల సహాయం అవసరం లేదని కారత్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ రెండు తీర్మానాల గురించి గత శనివారం చర్చించిన సీపీఎం పార్టీ సీతారాం ఏచూరి తీర్మానాన్ని వ్యతిరేకించి కారత్ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం తుది నిర్ణయం కోసం పార్టీ సెంట్రల్ కమిటీకి పంపించింది. ఆదివారం నాడు సమావేశమైన పార్టీ సెంట్రల్ కమిటీ కూడా సీతారాం ఏచారి తీర్మానాన్ని తిరస్కరించింది. ఏప్రిల్ హైదరాబాద్‌లో జరుగనున్న పార్టీ కాంగ్రెస్‌కు రెండు తీర్మానాలను పంపించేందుకు సీతారాం వర్గం చేసిన చివరి ప్రయత్నాన్ని బీవీ రాఘవులు అడ్డుకున్నారు. సీతారాం తీర్మానం వీగిపోవడానికి కారణం పార్టీ కేరళ శాఖ కారత్కు అండగా నిలబడటం. ప్రధానంగా కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే సీతారాం ఏచూరి తీర్మానాన్ని పార్టీ తిరస్కరించింది. కేరళలో సీపీఎంకు బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో అంటకాగడం స్థానిక పార్టీ నాయకులకు అస్సలు ఇష్టం లేదు. ఏదీ ఏమైనా 54 ఏళ్ల క్రితం, అంటే, 1964లో ఏకారణంగానైతే సీపీఐ రెండు పార్టీలుగా విడిపోయిందో, ఇప్పుడు అలాంటి కారణంతోనే పార్టీలో రెండు చీలికలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. 1962లో సీపీఐ ప్రధాన కార్యదర్శి అజయ్ గోష్ మరణంతో పార్టీలో వర్గాలు ఏర్పడినప్పటికీ 1964లో రెండు పార్టీలుగా చీలిపోయాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు సమాజంలో చైనా, సోవియట్ యూనియన్లు రెండు చీలిపోవడం, కార్మికుల ఉద్యమం మంచి ఊపులో ఉన్నప్పుడు పార్లమెంటరీ ఎన్నికల ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ లాంటి బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమి లేదన్న వారు సీపీఐలో ఉండిపోయారు. అదంతా పక్కా రివిజనిజం అని, అంతకన్నా సోవియట్, చైనా తరహాలో చీలిపోవడం మంచిదంటూ విడిపోయిన వర్గం సీపీఎంగా మారింది. అలాగే, 1975లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు సంఘ్ పార్టీలను కూడా కలుపుకుపోవాలని సీపీఎంలో మెజారిటీ వర్గం వాదించింది. ఎట్టి పరిస్థితుల్లో జనసంఘ్, ఆరెస్సెస్ లాంటి సంస్థలతో చేతులు కలపరాదని నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య వాదించారు. ఈ రోజున సీతారాం ఏచూరి ఓడిపోయినట్లుగానే నాడు సుందరయ్య తన పంతం నెగ్గించుకోలేక ఓడిపోయారు. అందుకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సీతారాం ఏచూరి ఆయన తరహాలో రాజీనామా చేస్తారని అనుకోలేం. కేంద్రంలో ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలను జారవిడుచుకోం పెద్ద పొరపాటని, అది చారిత్రక తప్పిదమని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నాయకుడు జ్యోతిబసు 1977, జనవరి నెలలో ‘ఏసియన్ ఏజ్’ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. నాడు జ్యోతిబసు ప్రధాని అభ్యర్థిత్వాన్ని సీతారాం ఏచూరి, కారత్‌లు గట్టిగా వ్యతిరేకించగా, ఆయన్ని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ ఒక్కరే బలపరిచారు. అప్పటి నుంచి సీపీఎం ఏ పొరపాటు చేసినా దాన్ని చారిత్రక తప్పిదనంగా పార్టీ వర్గాలు, రాజకీయ విమర్శకులు పేర్కొంటూ వస్తున్నారు. -
ఏచూరికి ఎదురు దెబ్బ.. రాజీనామాకు సిద్ధం?
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై పార్టీ అధిష్టానాన్ని ఒప్పించటంలో ఆయన రెండోసారి విఫలమయ్యారు. ఏచూరి చేసిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన కేంద్ర కమిటీ ఓటింగ్‌లో 55-31తో ఏచూరి చేసిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో మనస్థాపం చెందిన ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఏచూరిని కొనసాగాల్సిందిగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేయటంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తగ్గారు. అయినప్పటికీ ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో పార్టీ నిర్వహించబోయే అంతరంగిక సమావేశంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఏచూరి సిద్ధమవుతున్నారు. అసలు విషయం... 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రధాన లక్ష్యంగా సీపీఎం పార్టీ ఆరు నెలల క్రితం తీర్మానం చేసింది. పార్టీ ఓటు బ్యాంకింగ్ పెంచుకోవాలంటే బీజేపీ వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ఓ ప్రతిపాదన లేవనెత్తారు. కానీ, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని.. పార్టీ నైతిక విలువలు దెబ్బ తింటాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది మోసపూరిత రాజకీయాలని పేర్కొంటూ సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఏచూరి ప్రతిపాదనకు అచ్యుతానందన్ మద్ధతు ప్రకటించగా... ప్రకాశ్ ప్రతిపాదనకు కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నేతలు, పార్టీ లేబర్ విభాగం సీఐటీయూ కారత్ ప్రతిపాదనకు మద్ధతు ప్రకటించాయి. ఈ పరిణామాలు ఎంతకు తెగకపోవటంతో కోల్‌కతాలో భేటీ నిర్వహించిన కేంద్ర కమిటీ మూడు రోజులపాటు ఏచూరి-కారత్ ముసాయిదాల మీద చర్చించింది. శనివారం రాత్రి వరకు ఈ వ్యవహారంపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆదివారం ఓటింగ్ నిర్వహించింది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 91 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 55 మంది ప్రకాశ్ కారత్ ముసాయిదాకు ఓటేయగా.. 31 మంది ఏచూరి ముసాయిదావైపు మొగ్గు చూపారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. దీంతో ఏచూరి ముసాయిదా వీగిపోయినట్లయ్యింది. ఏచూరి ఓడిపోలేదు... సీతారాం ఏచూరికి బెంగాల్ పార్టీ యూనిట్ మొదటి నుంచి గట్టి మద్ధతు ఇస్తూ వస్తోంది. ముసాయిదా వీగిపోయిన నేపథ్యంలో ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రతిపాదన మాత్రమే వీగిపోయింది. కానీ, ఆయన ఓడిపోలేదు. అంతరంగిక సమావేశంలో అసలు విషయం తేల్చుకుంటాం’ అంటూ పేర్కొంది. ఇక అలీముద్దీన్ స్ట్రీట్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పందించిన ఏచూరి... ‘‘పార్టీ, పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ ఆదేశాల మేరకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నా. అంతిమ నిర్ణయం పార్టీదే’’ అంటూ ప్రకటించటంతో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డ వార్తలకు బలం చేకూరింది. కానీ, కమిటీ భేటీ, ఓటింగ్ విషయాలను మాత్రం ఆయన మీడియాతో పంచుకోలేదు. చివరిసారిగా 1975లో ప్రధాన కార్యదర్శి ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఆ సమయంలో పీ సుందరయ్య ప్రవేశపెట్టిన ప్రతిపాదనను తిరస్కరణకు గురికాగా.. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. -
ఏచూరికి విజయన్ షాక్!
ఆయనను మరోసారి రాజ్యసభకు పంపే ప్రసక్తే లేదు తేల్చిచెప్పిన కేరళ సీఎం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని మూడోదఫా రాజ్యసభకు పంపించే విషయమై ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కేంద్ర కమిటీ చర్చిస్తున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏచూరిని రాజ్యసభకు ఎన్నుకునే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. 'కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పార్టీ ప్రధాన కార్యదర్శిని రాజ్యసభకు పంపడం మా రాజకీయ వైఖరిరి విరుద్ధం' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి పార్లమెంటేరియన్ బాధ్యతలకు న్యాయం చేకూర్చలేరని, పార్టీ బాధ్యతల్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని చెప్పారు. సీపీఎంలో రాజ్యసభ సభ్యత్వం అంశం రెండు గ్రూపుల మధ్య దూరాన్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడోసారీ పెద్దలసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు వేశారు. పార్టీలో మరో సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వర్గం దీనిపై విముఖత వ్యక్తం చేస్తోంది. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు (జూలై 28) సమీపిస్తుండటంతో ఈ సమావేశాల్లోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కేంద్ర కమిటీ స్పష్టతనివ్వాల్సి ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌ల మధ్య రాజ్యసభ విషయంలో తీవ్రమైన విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. గత నెలలో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలోనే సీతారాం ఏచూరికి మూడోసారి రాజ్యసభ ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నేతలెవరైనా గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేంద్ర కమిటీలో చర్చ జరిగింది. అయితే, పశ్చిమబెంగాల్, త్రిపుర సీపీఎం యూనిట్లు ఏచూరీని మరోసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెటులో వామపక్ష వాణిని బలంగా వినిపిస్తున్నారని ఏచూరికి మద్దతుగా నిలిచాయి. మిగిలిన రాష్ట్రాల యూనిట్లలో ఏచూరిపై భిన్నాభిప్రాయాలున్నాయి. -
ఏచూరి వర్సెస్ కారత్
♦ రాజ్యసభ అభ్యర్థిత్వంపై సీపీఎంలో ముదురుతున్న వివాదం ♦ మూడోసారి ఏచూరికే అవకాశం ఇవ్వాలంటున్న ఓ వర్గం ♦ నిబంధనలు చూపుతూ తిరస్కరిస్తున్న ప్రకాశ్ కారత్ బృందం జీకేఎం రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి సీపీఎంలో రాజ్యసభ సభ్యత్వం రెండు గ్రూపుల మధ్య దూరాన్ని పెంచుతోంది. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడోసారీ పెద్దలసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ప్రణాళికలు వేశారు.పార్టీలో మరో సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వర్గం దీనిపై విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు (జూలై 28) సమీపిస్తుండటంతో ఈ సమావేశాల్లోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కేంద్ర కమిటీ స్పష్టతనివ్వనుంది. ఇద్దరి మధ్య ఉప్పు–నిప్పు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌ల మధ్య రాజ్యసభ విషయంలో తీవ్రమైన విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. గత నెలలో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలోనే సీతారాం ఏచూరికి మూడోసారి రాజ్యసభ ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నేతలెవరైనా గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేంద్ర కమిటీలో చర్చ జరిగింది. అయితే, పశ్చిమబెంగాల్, త్రిపుర సీపీఎం యూనిట్లు ఏచూరీని మరోసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెటులో వామపక్ష వాణిని బలంగా వినిపిస్తున్నారని ఏచూరికి మద్దతుగా నిలిచాయి. మిగిలిన రాష్ట్రాల యూనిట్లలో ఏచూరిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆదివారం పొలిట్ బ్యూరో సమావేశం, తర్వాతి మూడ్రోజుల పాటు కేంద్ర కమిటీ భేటీ జరగనుంది. ప్రకాశ్ కారత్‌పై ఒత్తిడి పెంచే క్రమంలో గత మే నెలలోనే పశ్చిమబెంగాల్ పార్టీ నాయకత్వం.. తమ రాష్ట్రం నుంచి ఏచూరికి మూడోసారి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. దీన్ని కారత్ వర్గం (బీవీ రాఘవులు కూడా ఇదే వర్గం) తిరస్కరించింది. ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఎంపీ కాకూడదని.. వ్యవస్థాగత అంశాలు, పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలనేది కారత్ వర్గం వాదన. ఏచూరి వర్గం మాత్రం.. పార్లమెంటులో వివిధ పార్టీల ముఖ్యనాయకులతో కలిసి రాజకీయ మేథమథనం జరుగుతున్న సమయంలో తమ పార్టీ సిద్ధాంతాన్ని ఏచూరీయే బలంగా వెల్లడిస్తారంటోంది. ‘రెండుసార్లే’ నిబంధనపై.. పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులకు రెండుసార్లే అవకాశం ఇవ్వాలన్న నిబంధనను కారత్ వర్గం గుర్తుచేస్తోంది. అయితే గతంలోనే ఈ నిబంధనకు మినహాయింపు నిచ్చారని.. ఏచూరిని ఏకగ్రీవంగా ఎన్నుకోని పక్షంలో వామపక్ష కూటమిలోని ఫార్వర్డ్ బ్లాక్ వంటి పలు పార్టీలు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకునే అవకాశం ఉందని ఏచూరి వర్గమంటోంది. పశ్చిమబెంగాల్ నుంచి ఏచూరిని గెలిపించుకునేందుకు వామపక్షాలకు 37 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు తప్పనిసరి. అయితే పార్లమెంటులో బీజేపీ, ఇతర మతతత్వ గ్రూపులపై పోరాడే వాక్చాతుర్యమున్న ఏచూరికి తమ మద్దతుంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే ప్రకటించింది. కాంగ్రెస్ సాయంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభకు ఎన్నికైతే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలనుకున్న పార్టీ సిద్ధాంతాన్ని విస్మరించినట్లే అనేది కారత్ బృందం వాదన. పొలిట్ బ్యూరోలోని మెజారిటీ సభ్యులు సైతం కేరళలో లెఫ్ట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రధాన శత్రువనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏచూరికి అడ్డుకట్ట వేసేందుకు పొలిట్ బ్యూరోలో ఓటింగ్ నిర్వహించేలా కారత్ వర్గం ప్రయత్నిస్తోందని సమాచారం. దాదాపు 80 మంది సభ్యులున్న పార్టీ కేంద్ర కమిటీలో 8 మంది తెలుగురాష్ట్రాలకు చెందిన వారే (బీవీ రాఘవులు, పి. మధు, ఎంఏ గఫూర్, పాతూరి రామయ్య, ఎస్ పుణ్యవతి, తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, సీహెచ్ సీతారాములు, శాశ్వత ఆహ్వానితురాలు మల్లు స్వరాజ్యం) ఉన్నారు. -
ట్రంప్‌కు, మోదీకి తేడా లేదు
► సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ విమర్శ నెల్లూరు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు, మన ప్రధాని మోదీ విధానాలకు తేడా లేదని, ఇద్దరి పాలన ఒకే విధంగా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ విమర్శించారు. అమెరికాలో ఇతర దేశాల వారిపై ట్రంప్ దురుసుగా ప్రవర్తిస్తుంటే, ఇక్కడ ముస్లింలపై దురుసు ప్రవర్తన ఉందన్నారు. గత ఎన్నికల ముందు కార్పొరేట్ సంస్థలు మోదీని భుజానికి ఎత్తుకున్నాయని, ఇప్పుడు ఆ కార్పొరేట్ సంస్థలకే మోదీ మేలు చేస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో దేశంలో ఒక్క శాతం కూడా ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. మేక్ ఇన్ ఇండియాలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో చెప్పాలన్నారు. దేశంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో ఉందన్నారు. దాదాపు 14వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకం 45 రోజులకు మించి జరగడంలేదన్నారు. ఆర్ఎస్ఎస్తో కలసి ప్రధాని మోదీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని కారత్ విమర్శించారు. ఇటీవల దేశంలో జంతువధపై నిషేధం విధించడాన్ని పలువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. హిందువులు కూడా గోమాంసాన్ని తింటారని, ఆవులను పూజించుకుంటూ పోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. -
హోదా ఉద్యమాలకు అండగా ఉంటాం
- అణు ఒప్పందాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి - సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ గుంటూరు వెస్ట్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జరిగే ఉద్యమాలకు తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారాత్ చెప్పారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం గుంటూరులో జరిగింది. సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి ప్రధాని ఏపీకి అనేక హామీలను ఇచ్చారని, వాటన్నింటినీ నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఒకలా, ఏపీలో మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మేధావులు, మైనార్టీలే లక్ష్యంగా దాడులు పెరిగియాని ఆందోళన వ్యక్తం చేశారు. పశు కళేబరాల తొలగింపును ఆపివేయాలని గుజరాత్లో దళితులు నిర్ణయం తీసుకోవడాన్ని తాము సమర్థిస్తున్నామన్నారు. గుజరాత్ రాష్ట్రం కాదనుకున్న అణువిద్యుత్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టిసారించినట్లు ప్రకాశ్‌కారాత్ తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఏ.గఫూర్, పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు పాల్గొన్నారు. -
'అలా జరిగితే ఏపీ తట్టుకోవడం కష్టం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్ తిరస్కరించిన అణువిద్యుత్ కేంద్రాలను ఏపీలో పెట్టడం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణు ప్లాంట్లపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. జపాన్ లాంటి ఘటనలు జరిగితే ఏపీ తట్టుకోవడం కష్టమన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కారత్ డిమాండ్ చేశారు. -
'అలా జరిగితే ఏపీ తట్టుకోవడం కష్టం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్ తిరస్కరించిన అణువిద్యుత్ కేంద్రాలను ఏపీలో పెట్టడం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణు ప్లాంట్లపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. జపాన్ లాంటి ఘటనలు జరిగితే ఏపీ తట్టుకోవడం కష్టమన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కారత్ డిమాండ్ చేశారు. -
కొవ్వాడతో కాకినాడకు తీరని నష్టం
విశాఖపట్నం: ప్రపంచ దేశాలు అణువిద్యుత్ ను తగ్గించుకోవాలని చూస్తుంటే భారత పాలకులు మాత్రం ఆ విద్యుత్ ను పెంచుకోవాలని చూస్తున్నాయని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంటుతో తీరని నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీలో కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటుకు వ్యతిరేకంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంటుతో కాకినాడ నుంచి ఒడిశా వరకు పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. -
'పాలన వైఫల్యాలకు నిదర్శనమే కేబినేట్లో మార్పులు'
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ నిప్పులు చెరిగారు. రెండేళ్ల మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు కేబినేట్ పునర్వ్యవస్థీకరణే నిదర్శనమని ఆయన ఆరోపించారు. గురువారం విజయవాడలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిథిగా హాజరై... ప్రసంగించారు. కొత్త ఉద్యోగాల కల్పనతోపాటు నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన సంగతిని ప్రకాశ్ కారత్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. 7వ వేతన సంఘం నివేదిక ప్రకారం దేశంలో 7.74 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో 8 రెట్లు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయని... దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రంలో మత విద్వేషాలు రేపుతున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మార్ఫింగ్ ఫొటోతో రచ్చరచ్చ!
కోల్‌కతా: మమతా బెనర్జీపై కేవలం కార్టూన్ వేసినందుకు ఏకంగా ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ నేతలది. ఇప్పుడు ఆ పార్టీ నేతలే మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయ లబ్ధి పొందేందుకు తహతహలాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కరత్‌కు మిఠాయి తినిపిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను తృణమూల్ ఎంపీ డిరెక్ ఒబ్రియన్ ఆదివారం విలేకరులకు విడుదల చేశాడు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా సిద్ధాంత వైరుధ్యమున్న బీజేపీ-సీపీఎం చేతులు కలిపాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇది నిజమైన ఫొటోనా? కాదా? అన్నది మాత్రం ఆయన చూసుకోలేదు. ఈ ఫొటోపై వెంటనే బీజేపీ మండిపడింది. అది ఫొటోషాపింగ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో అని, నిజానిజాలు తెలుసుకోకుండానే తృణమూల్ నకిలీ ఫొటోలను విడుదలచేస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. 2013లో ప్రధాని నరేంద్రమోదీకి రాజ్‌నాథ్ స్వీట్ తినిపిస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి తృణమూల్ నాటకమాడుతుందని ఆయన దుయ్యబట్టారు. సీపీఎం అగ్రనేత కరత్ కూడా స్పందించారు. రాజ్‌నాథ్ హోంమంత్రి అయ్యాక ఆయనను తాను కలువనే లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న డిరెక్ ఒబ్రియన్ క్షమాపణ చెప్పారు. తమ రీసెర్చ్ టీమ్ సరిగ్గా పరిశీలించకుండానే ఈ ఫొటోను ఇచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. -
'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మాకినేని బసవపున్నయ్య 24 వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో స్మారక సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకినేని వర్థంతి సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిధిగా హాజరై స్మారకోపన్యాసం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను సంస్కరణలు దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. సంస్కరణల పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు తగ్గించి...బడా కార్పొరేట్లకు రూ.62 వేల కోట్లు కేటాయించారని కేంద్రప్రభుత్వంపై ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. -
దేశంలోనే ఏపీలో రైతు ఆత్మహత్యలెక్కువ
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు. వ్యవసాయ సంక్షోభం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో ఇప్పటి వరకు 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆయన కర్నూలు పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ తరపున నష్టపరిహారం అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న 20 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు సమగ్ర విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్ పాల్గొన్నారు. -
అనంత పోలీసుల అత్యుత్సాహం
-
అనంత పోలీసుల అత్యుత్సాహం
అనంత పురం పోలీసుల తీరుపై సీపీఎం కార్యకర్తలు మండి పడుతున్నారు. ఈనెల 17న ఆ పార్టీ జాతీయ నేత ప్రకాశ్ కారత్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్ పీ కుంట సోలార్ బాధితులను పరామర్శించేందుకు వస్తున్న ప్రకాశ్ కారత్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు.. పలువురు పార్టీ నేతలను, కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పై కూడా బైండోవర్ నమోదు చేయడంతో పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరుపై మండి పడుతున్నాయి. -
కార్పొరేట్లను రప్పించడమే అభివృద్ధా: కారత్
హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం సరళీకృత ఆర్థికవిధానాలను దూకుడుగా అమలు చేస్తుండడంతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం మాజీ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఎర్రతివాచీ పరచి, వాటికి తలుపులు బార్లా తెరవడమే అభివృద్ధా.. అని ప్రశ్నించారు. మంగళవారం సీపీఎం సిద్ధాంతకర్త పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ప్రగతినగర్‌లో నిర్మించిన సుందరయ్య భవన్‌ను కారత్ ప్రారంభించారు. అనంతరం ‘మారుతున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, అన్ని రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. భూసేకరణ చట్టానికి సవరణల ద్వారా రైతన్నల భూమిని కంపెనీలు, సంపన్నవర్గాలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని విశాల ప్రాతిపదికన ఉద్యమాన్ని మొదలుపెడతామన్నారు. కులవ్యవస్థను బద్ధలు కొట్టకుండా, భూ పంపిణీ చేయకుండా దేశం అభివృద్ధి చెందబోదని సీపీఎం పొలిట్‌బ్యూరోసభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. ‘ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు’పై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగం నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే దేశం ముందడుగు వేస్తుందన్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రసంగిస్తూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వేల ఎకరాల భూములను తాము పేదలకు పంపిణీ చేస్తే, ఇప్పుడు వాటిని పెద్దలకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సొంతకాళ్లపై నిలబడదాం!
జాతీయ మహాసభలో సీపీఎం నిర్ణయం ⇒ జాతీయ స్థాయి పొత్తులు, కూటములు ఉండవు ⇒ రాష్ట్రస్థాయిలో పొత్తులపై నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే ⇒ దానికీ కొన్ని షరతులు..!! ⇒ బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రాతిపదిక ⇒ లౌకికవాదం పేరిట ఎవరితో పడితే వారితో దోస్తీకి నై ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చ (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎం ఇక ముందు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించదు. ఆ స్థానంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ప్రత్యామ్నాయానికి కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కొన్ని షరతులు విధిస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి, వామపక్ష సంఘటనకు లాభమో పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీ శాఖలకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సీపీఎం 21వ జాతీయ మహాసభల రెండో రోజైన బుధవారం రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చించారు. కాగా, ఎత్తుగడలపై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరిలు వేర్వేరు పంథాలు వెల్లడించడం గమనార్హం. కారత్ చెబుతున్న విధానం ఏమిటంటే.. ⇒ లౌకిక శక్తులతో వ్యూహాత్మక ఎత్తుగడల పేరిట ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు వద్దు. ⇒ గతం మాదిరే.. మరింత ఉధృతంగా పోరాటాలు చేద్దాం. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో మాత్రమే పొత్తులు పెట్టుకుందాం. ⇒ యూపీ, బిహార్, ఏపీలో ప్రాంతీయ పార్టీలు, ⇒ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎంతో నష్టపోయిన మాట నిజం కాదా?. ⇒ ఆ గుణపాఠాలను పరిగణనలోకి తీసుకుని పాత పద్ధతిలో పోరాటాలు చేద్దాం. ⇒ వామపక్షాలు చిన్నవా, పెద్దవా? అనే దాంతో నిమిత్తం లేకుండా ⇒ అన్ని గ్రూపుల్నీ ఏకం చేద్దాం. ⇒ కేరళలో వామపక్ష సంఘటన నుంచి ఆర్ఎస్పీ తప్పుకుని కాంగ్రెస్‌తో ⇒ కలవడం వల్ల ఎంఎ బేబీ సీటును కోల్పోవాల్సి వచ్చింది. ⇒ ఆ పార్టీ చిన్నదే కావచ్చు. మనం చెల్లించిన మూల్యం మాత్రం పెద్దది. ⇒ గత 25 ఏళ్ల అనుభవాలు చాలు. పొత్తులు వద్దు. ఇక సొంత కాళ్లపై నిలబడదాం. ⇒ స్వతంత్రంగా ఎదుగుదాం. మనమే ప్రత్యామ్నాయం అని నిరూపిద్దాం. ఏచూరి వర్గం వైఖరి ఇదీ... ⇒ వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటనకు ప్రయత్నిస్తూనే భావసారూప్యత ఉన్న ప్రాంతీయ పార్టీలనూ కలుపుకొందాం. ⇒ ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలున్న ఈ సమయంలో అందర్నీ కాదనుకుంటే ఎలా? ⇒ మనం చెబుతున్న లాటిన్ అమెరికా, గ్రీస్ తదితర దేశాల్లో సైతం కమ్యూనిస్టులు స్వతంత్రంగా అధికారంలోకి రాలేదు. ⇒ అన్ని వామపక్ష గ్రూపులు, ప్రజాస్వామి కవాదులు కలిస్తేనే అధికారం వచ్చింది. మనమూ అదే పని చేయాలి. ⇒ ప్రాంతీయ పార్టీల్లో లౌకికత్వాన్ని సమర్థించేవాటితో పొత్తుపై నిర్ణయించే స్వేచ్ఛను రాష్ట్ర కమిటీలకు ఇవ్వాలి. ⇒ అవసరం మేరకు ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండాలి. షరతులు వర్తిస్తాయి ‘సాక్షి’తో రాఘవులు ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై రాఘవులు మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై కొన్ని షరతులుంటాయన్నారు. ⇒ ప్రాంతీయ పార్టీలు, లౌకిక బూర్జువా పార్టీలతో కలసి జాతీయస్థాయిలో పొత్తులుండవు. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మాత్రమే జాతీయస్థాయిలో ఉంటుంది. ⇒ ఎన్నికల సమయంలో ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో రాష్ట్ర కమిటీలే నిర్ణయిస్తాయి. ⇒ అయితే, మతతత్వానికి దూరంగా ఉంటూ, సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించాలి. ఉద్యమాల్లో కలసిరావాలి. ⇒ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ అవకాశవాద బూర్జువా పార్టీలే. వీటికి మా ఫ్రంట్‌లో చోటులేదు. అందరూ అంగీకరిస్తున్న విధానాలు ⇒ సొంత పునాదులపైనే ఎదగాలి. వామపక్ష సంఘటనకు ప్రాధాన్యం ఉండాలి. ⇒ సైద్ధాంతిక నిబద్ధత పెరగాలి. అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలి. మధ్యతరగతిని ఆకట్టుకోవాలి. ⇒ ఎన్నికల పొత్తులనేవి వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు అనుక్రమణికగా ఉండాలే గానీ అవే ప్రధానం కాకూడదు. ⇒ ఈ ముసాయిదాపై చర్చలు గురువారం మధ్యాహ్నంతో ముగుస్తాయి. అనంతరం ప్రకాశ్ కారత్ సమాధానం ఇస్తారు. -
పోరుకుకదలండి
మంగళవారం విశాఖలో ప్రారంభమైన సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో ప్రసంగిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి కారత్. వేదికపై పార్టీ నేతలు సీపీఎం జాతీయ మహాసభల్లో కారత్ ప్రారంభోపన్యాసం మతవాదం విజృంభిస్తోంది.. లౌకిక వ్యవస్థకు చేటు అవినీతి, మతోన్మాద శక్తుల ఆట కట్టించండి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులే ప్రత్యామ్నాయం విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన సీపీఎం సభలు హాజరైన వివిధ వామపక్ష పార్టీల నేతలు (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘మిత, మతవాద శక్తులు విజృంభిస్తున్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలను చుట్టబెడుతున్నాయి. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు, భిన్నత్వంలో ఏకత్వానికి, లౌకిక వ్యవస్థకు చేటు తెస్తున్నాయి. అన్నింటా విధ్వంసం, అదే సర్వస్వం అంటున్న శక్తుల ఆట కట్టించాల్సిన తరుణం ఆసన్నమైంది. రండి, మాతో చేతులు కలపండి. నయా ఉదారవాద అవినీతి, మతోన్మాద శక్తుల ఆట కట్టించేందుకు ప్రజా పోరుకు కదలండి’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ దేశ ప్రజలకు పిలుపిచ్చారు. పార్టీ 21వ జాతీయ మహాసభలు మంగళవారమిక్కడి పోర్టు కళావాణి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సభల ప్రారంభ సూచకంగా పశ్చిమ బెంగాల్ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ అమీల్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకాశ్ కారత్ ప్రారంభోపన్యాసం చేశారు. పోరుబిడ్డల నేలపై సభలు.. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన తెలుగు బిడ్డలు పి.సుందరయ్య, ఎం.బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు పుట్టిన ఆంధ్రప్రదేశ్‌లో మహాసభను నిర్వహించుకుంటున్నామని కారత్ చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల సంయుక్తాధ్వర్యంలో నడుస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతోందన్నారు. కార్పొరేట్ పారిశ్రామిక వేత్తలకు ఐదు శాతం సంపద పన్ను తగ్గించిన మోదీ ప్రభుత్వం.. కార్మికుల కనీస వేతనాలను మాత్రం విస్మరించిందని మండిపడ్డారు. మోదీ వచ్చిన ఏడాది కాలంలో బడా పెట్టుబడిదారుడైన గౌతం అదానీ ఆస్తులు రూ. 25వేల కోట్లకు పైగా పెరగడాన్ని ఉదహరిస్తూ.. ఇట్లాంటి వారే మోదీకి ఎన్నికల్లో అండగా నిలిచారని ధ్వజమెత్తారు. అమెరికాకు తలొగ్గి దేశీయ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. గాడ్సే వారసులకు వంత పాడుతూ భారతీయ రాజ్యాంగ వ్యవస్థనే దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ముంచుకొస్తున్న ఈ ముప్పును అడ్డుకోవడమే ఈ మహాసభ ముందున్న కర్తవ్యంగా ప్రకటించారు. మహిళలు, ఆదివాసీలు, మైనారిటీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, పోలవరం వల్ల నిర్వాసితులయ్యే ఆదివాసీలకు అండగా ఉంటామన్నారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న అరాచకాలను ఆపగలిగేది వామపక్షాలేనని చెప్పారు. ఆప్ విజయం ఆదర్శం: సురవరం ప్రధాని స్వయంగా ప్రచారం చేసినా ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించిందని, ఆప్ విజయం నుంచి వామపక్షాలు పాఠాలు నేర్చుకోవాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. స్వతంత్రంగా ఎదుగుతూనే వామపక్ష శక్తుల ఐక్యత మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. అందరం కలుద్దామని, బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దామని ఆయన చెప్పారు. ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా తమ సందేశాల్లో వామపక్ష శక్తుల ఐక్యతను ప్రధానంగా నొక్కిచెప్పారు. సౌహార్ధ్ర వామపక్ష ప్రతినిధులుగా హాజరైన సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు దేబబ్రత బిశ్వాస్ (ఫార్వర్డ్‌బ్లాక్), అభనీరాయ్ (ఆర్ఎస్సీ), ప్రొవాష్ ఘోష్ (ఎస్‌యూసీఐ-సీ), కవితా కృష్ణన్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్) సందేశాలు ఇచ్చారు. ప్రారంభ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బృందా కారత్, బీవీ రాఘవులు, బిమన్‌బసు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్వాగతోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పుణ్యవతి, వీరయ్య, గఫూర్ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. సభలకు హాజరైన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఫార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి, ఆర్ఎస్పీ నాయకుడు జానకీరామ్ తదితరులు ఉన్నారు. మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 35 దేశాల నుంచి వచ్చిన సందేశాలను సీతారాం ఏచూరి చదివి వినిపించారు. ఆ ఎన్కౌంటర్లు రాజ్యహింసే తెలుగు రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మానవహక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలకు ఊడిగం చేస్తున్న పాలకులు పొట్టకూటి కోసం అడవుల్లో కట్టెలు కొట్టడానికి వెళ్లిన వారిపై స్మగ్లర్ల ముద్ర వేసి దారుణంగా 20 మందిని టీడీపీ ప్రభుత్వం కాల్చి చంపిందని విమర్శించారు. సీపీఎం సభల్లో సౌహార్ద్ర సందేశం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఎన్కౌంటర్లను ఆమె ప్రస్తావించారు. కూలీల కాల్చివేతపై టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు కనీసం విచారం వ్యక్తం చేయలేదన్నారు. కాల్పులపై ప్రశ్నించినందుకు హక్కుల కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. కూలీల ఎన్కౌంటర్ రోజే తెలంగాణలోనూ ఐదుగురు యువకుల్ని కాల్చిచంపారని, అది పోలీసులు కావాలని చేశారా? అన్నట్లుగా ఉందన్నారు. ఈ రెండు సంఘటనలను వేర్వేరుగా చూడలేమని, ప్రభుత్వాల దమనకాండకు ఇవి నిదర్శనమన్నారు. ఇస్లాం ఫోబియా (భయం) పాలకుల్ని చుట్టుముట్టినట్టుందని, ఎన్కౌంటర్లపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని వివరించారు. -
పేదరికం ఉన్నంతకాలం పోరు!
సాక్షితో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సాక్షి, హైదరాబాద్: ‘‘సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంతకాలం మా పోరాటం ఉంటుంది. మేం ఔనన్నా కాదన్నా మా బలం తగ్గినమాట నిజం. అంతమాత్రాన కనుమరుగైనట్టు కాదు. గత 25 ఏళ్లలో జరిగిన తప్పొప్పులేమిటో గుర్తించాం. వచ్చే మహాసభల్లో చర్చించబోతున్నాం. గతకాలపు అనుభవాల పునాదులపై భవిష్యత్‌ను నిర్మించబోతున్నాం..’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. పార్టీ 21వ జాతీయ మహాసభలు విశాఖపట్నంలో మంగళవారం నుంచి జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’కిచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వివరించారు. ప్రాంతీయ బూర్జువా పార్టీలతో జాతీయస్థాయి పొత్తులు, ఎత్తులు ఉండవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ లౌకికత్వాన్ని సమర్థిస్తున్నా అది కూడా బూర్జువా పార్టీయేనని, నయా ఉదారవాద ఆర్థిక విధానాలను పాటించే పార్టీయేనని అన్నారు. తమ పార్టీ పునాదుల్ని పటిష్టం చేసుకుని సొంతకాళ్లపై ఎదుగుతూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని ఏకం చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీల విలీనం తమ ఎజెండాలో లేదన్నారు. ఇంటర్వ్యూలో కారత్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాంతీయ పార్టీల పాత్ర.. ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావం ప్రాంతీయ పార్టీలపైనా ఉంది. ప్రధానమైన ప్రాంతీయపార్టీలపై భూస్వాములు, సంపన్న రైతులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల పట్టు పెరిగింది. దీంతో ఈ పార్టీల పుట్టుక సమయంలో ఉన్న ప్రాధమ్యాలకు, ఇప్పటికి తేడా వచ్చింది. అవి వాటి అవసరాలకోసం పట్టుబడుతున్నాయేతప్ప జాతీయస్థాయి ప్రయోజనాలపై దృష్టి పెట్టట్లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాలలో సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాం. ఈ అనుభవాలతో మూడో ప్రత్యామ్నాయం, జాతీయ ప్రత్యామ్నాయం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. సొంతంగా పెరగడమే మార్గం... ఈ నేపథ్యంలో పార్టీని స్వతంత్రంగా పటిష్టం చేసుకోవడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించాం. బహుముఖ సమస్యలపై విస్తృత పోరాటాలు చేయడమే ఇందుకున్న మార్గం. దీంతోపాటు ప్రజల తక్షణ సమస్యలపై ఇతర రాజకీయ, ప్రజాతంత్ర శక్తులతో కలసి పోరాటాలు చేయాలి. ప్రస్తుతం మా దృష్టంతా సొంతంగా ఎదగడంపైనే. మేము పెరుగుతూ ఇతర వామపక్ష పార్టీలతో కలసి ఐక్య పోరాటాలు చేస్తాం. విలీనం మా ఎజెండాలో లేదు. అవసరమైనప్పుడు చర్చిస్తాం. దేశ లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు ముంచుకొస్తోంది. భావస్వేచ్ఛపై దాడి ఎక్కువైంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ఎదుర్కోవడానికి లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌తోనైనా కలసి పనిచేస్తాం. అంతవరకే అది పరిమితం. నా పదవీకాలం ముగిసింది... పార్టీ నిబంధనావళి ప్రకారం నేనిక ప్రధాన కార్యదర్శిగా ఉండలేను. మహాసభ నూతన కమిటీని, ప్రధాన కార్యదర్శిని, పొలిట్‌బ్యూరోను ఎన్నుకుంటుంది. అది ఈ నెల 19న జరుగుతుంది. మా ముందున్న సవాళ్లు.. మా బలం తగ్గింది. ఇది నిష్టుర సత్యం. బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుని సొంత బలాన్ని కోల్పోయామని పార్టీకి చెందిన కొన్ని రాష్ట్ర శాఖలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో గత పాతికేళ్లలో మేము అనుసరించిన రాజకీయ, ఎత్తుగడల పంథాను పునస్సమీక్షించుకోవాల్సిన అవసరమేర్పడింది. అంతేకాదు.. పార్టీ అనుబంధ సంఘాల సభ్యులను మా రాజకీయ విధానంవైపు ఆకర్షించలేకపోవడం, ఓట్లుగా మలుచుకోలేకపోవడంతోపాటు సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావాన్ని గుర్తించడంలోనూ ఒడిదుడుకులున్నాయి. వచ్చే మహాసభల్లో వీటిని సవరించుకుని ఎత్తుగడల పంథాను ఖరారు చేసుకోవాల్సి ఉంది. గతానికి భిన్నంగా ఈ మహాసభల్లో తొలిసారి రాజకీయ, ఎత్తుగడల పంథాను చర్చించబోతున్నాం. 1988-89లో తిరువనంతపురంలో జరిగిన 13వ మహాసభలో ఆమోదించిన రాజకీయ ఎత్తుగడల పంథాను సమీక్షించబోతున్నాం. మూడు రాష్ట్రాలకేపరిమితమయ్యాం... పార్టీకి భారీగా సభ్యత్వం ఉన్నప్పటికీ అది కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలకే పరిమితమైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో సభ్యత్వం పెరిగి నప్పటికీ రాజకీయ ప్రభావాన్ని చూపలేకపోయింది. దీన్నిబట్టి మా ఎత్తుగడల పంథాలో లోపం ఉందని తేలింది. దిద్దుబాటు చర్యలు చేపట్టాం. -
మళ్లీ వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన నినాదం
* మారనున్న సీపీఎం పంథా * పార్టీకి దిశానిర్దేశం ఇవ్వనున్న రాజకీయ తీర్మానం: ప్రకాశ్ కారత్ * బీజేపీ విధానాలపై పోరాడతాం * ఆర్ఎస్ఎస్ ఏమి చెబుతోందో చంద్రబాబు అదే చెప్పారంటూ విమర్శ సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాజకీయ పంథా మారనుంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో అనుసరించిన రాజకీయ ఎత్తుగడల పంథా ఫలితాన్నివ్వలేదని భావిస్తోంది. బూర్జువా పార్టీలతో పొత్తులు, లౌకిక శక్తుల పేరిట సఖ్యతలు, సరళీకృత ఆర్థిక విధానాలు దెబ్బతీసినట్టు అంచనా వేసింది. తిరిగి పాతికేళ్ల కిందటి వామపక్ష, ప్రజాతంత్ర సంఘటనకు శ్రీకారం చుట్టింది. రెండురోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం రాజకీయ-ఎత్తుగడల పంథాపై సీపీఎం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టామని, బుధవారం సాయంత్రానికి దాన్ని ఆమోదిస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో విశాఖపట్నంలో జరిగే పార్టీ 21వ జాతీయ మహాసభల్లో ఈ తీర్మానాలపై చర్చించి తుది రూపం ఇస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత, దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర సంఘటనను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రమిస్తుందన్నారు. ఇప్పటివరకు జరిగిన తప్పులేమిటో, లాభనష్టాలేమిటో మరో పదిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితిని కేంద్ర కమిటీలో చర్చించినట్టు తెలిపారు. హిందూ మతోన్మాదశక్తుల నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ తన మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ తన మితవాద ధోరణితో దూకూడుగా వ్యవహరిస్తోందని, మున్ముందు బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తుందని కారత్ చెప్పారు. ఇప్పటికే పార్లమెంటును తోసిరాజని మూడు ఆర్డినెన్సులు తెచ్చిందని గుర్తుచేశారు. భూ సేకరణ చట్టంపై తెచ్చిన ఆర్డినెన్స్‌కు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ తీర్మానించినట్టు తెలిపారు. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా ఈనెల 24న పెద్దఎత్తున నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అతిథిగా వచ్చే అమెరికా అధ్యక్షుడు వ్యాపారబృందాన్ని వెంట తీసుకురావడం, భారత్‌కు చేటు తెచ్చే అణు ఒప్పందం వంటి చట్టాలపై సంతకాలు చేయడం వంటి వాటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. గతంలోనూ వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన అన్నప్పటికీ ఈసారి పంథాను మార్చి సరికొత్త విధానాలు, నినాదాలతో ముందుకువెళతామని వివరించారు. సంఘటన తరఫున కాకుండా ఏడు వామపక్షపార్టీలు ఒక వేదికగా ఏర్పడి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు ఉండవు, కలిసిపోవడం జరగదని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టం ప్రకారమే రైతులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎక్కువ సంతానాన్ని కనాల్సిందిగా చంద్రబాబు చెప్పడంపై మాట్లాడుతూ.. బహుశా ఆయన కూడా ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారేమో అని కారత్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఏమి చెబుతుందో చంద్రబాబూ అదే చెప్పారని, మతపరమైన అంశం నుంచే ఈ ఆలోచన పుట్టిందని భావించాల్సి వస్తోందని అన్నారు. సీపీఎం మహాసభల పోస్టర్ ఆవిష్కరణ విశాఖలో వచ్చే ఏప్రిల్ 14 నుంచి 19 వరకు జరగనున్న సీపీఎం 21వ జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. -
దిద్దు‘బాట’లో మార్క్సిస్టులు!
భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకే సమీక్ష: ప్రకాశ్ కారత్ సాక్షి, హైదరాబాద్: సీపీఎం దిద్దుబాటు దిశగా సాగుతోంది. గతంలో జరిగిన తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కేంద్ర కమిటీ మూడురోజుల సమావేశ ఎజెండా ఇదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘విశాఖపట్నంలో వచ్చే ఏప్రిల్‌లో జరిగే పార్టీ జాతీయ మహాసభలకు రాజకీయ ముసాయిదాను ఖరారు చేస్తున్నాం. బహుశా మంగళవారానికి ఇది ఖరారు కావచ్చు. ఈ సమావేశాల్లో ప్రధానంగా 2 తీర్మానాలను చర్చకు చేపట్టాం. ఒకటి రాజకీయ తీర్మానం. వచ్చే మూడేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించినది. రెండోది గత 20 ఏళ్లలో అనుసరించిన రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినది. వీటిపై చర్చించి పార్టీ కమిటీ ఆమోదించిన అనంతరం ప్రజల్లో చర్చకు పెడతాం. మాది ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ. గతాన్ని సమీక్షిస్తున్నామంటే తప్పులు జరిగినట్టు అర్థం కాదు. పరిస్థితిని అవగతం చేసుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవడానికేనని భావించాలి. ముందుకు నడవాలన్నా గతాన్ని చూసుకోవాలి కదా..’ అని అన్నారు. ఎన్నికలు, రాజకీయ విధానం వేర్వేరు.. ‘ఎన్నికల్లో ఓటమి వేరు. రాజకీయ విధానం వేరు. రెండింటినీ కలగలిపి చూడకూడదు. సరైన దిశలో పయనించామా లేదా? అనే శోధన చేసుకుంటున్నాం. దాని ఆధారంగా ముందుకు వెళతాం. బలాల్నీ, బలహీనతల్నీ గుర్తిస్తాం. అన్ని విషయాలు పార్టీ ముందు, ప్రజల ముందు ఉంచుతాం. ప్రజా ఉద్యమాల ఆధారంగా ముందుకు సాగుతాం..’ అని చెప్పారు. వామపక్షాల ఐక్యతకు పెద్దపీట వేశామని, ఆ దిశగానే పయనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కేంద్రంలో సీపీఐ, సీపీఎంలతో పాటు మరో 4 వామపక్ష పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటైందని తెలిపారు. రాష్ట్రాలలోనూ ఆ ప్రక్రియ ముందుకు సాగుతోందన్నారు. రాజకీయ శక్తుల పునరేకీకరణ కూడా నడుస్తున్న చరిత్రేనని, మహాసభల్లో దీనిపై దిశానిర్దేశం చేస్తామని కారత్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఆర్డినెన్స్‌ల రాజ్యం నడుస్తోందని, మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతూ కార్మికవర్గానికి అన్యాయం తలపెడుతోందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకే అన్ని వామపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దేశ ప్రధాన సమస్యల్లో మతోన్మాద రాజకీయం ఒకటని, దీన్నుంచి ప్రజల్ని, దేశాన్ని కాపాడడం ప్రధానమని పేర్కొన్నారు. -
ఎందుకు బలహీనమయ్యాం?
* ‘పాతికేళ్ల సమీక్ష-భవిష్యత్ కార్యాచరణ’పై సీపీఎం అంతర్మథనం * హైదరాబాద్‌లో ప్రారంభమైన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు * బూర్జువా పార్టీలతో జట్టుకట్టడం వల్లే విశ్వాసం కోల్పోయాం * మధ్యతరగతికి, యువతకు దూరమవడం వల్లే బలహీనం * అభిప్రాయాలు వ్యక్తం చేసిన పలువురు నేతలు * ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన ‘రాజకీయ ఎత్తుగడల పంథా’ ముసాయిదాపై వ్యతిరేకత * నేటి మధ్యాహ్నం వరకూ చర్చించి, తీర్మానం చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: గత పాతికేళ్లుగా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసినా, నూతన సరళీకరణ ఆర్థిక విధానాలను గట్టిగా వ్యతిరేకించినా ఎందుకు బలహీనపడ్డామనే అంశంపై సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రజలను చైతన్యపరిచినా రాజకీయం గా ఎందుకు నష్టపోవాల్సి వచ్చిందనే భావన వ్యక్తమైంది. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఐక్యఫ్రంట్లు కట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని పిలుపునివ్వడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల విశ్వసనీయత తగ్గిపోయిందని కొందరు సభ్యులు వాదించగా... మధ్యతరగతి ప్రజలు, యువత, బడుగు, బలహీనవర్గాలకు దూరం కావడం వల్లే పార్టీకి నష్టం ఏర్పడిందని మరికొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతినగర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో గత పాతికేళ్లలో అనుసరించిన పార్టీ రాజకీయ విధానాలపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణను, రాజకీయ ఎత్తుగడల పంథాపై సీపీఎం నాయకత్వం చర్చ చేపట్టింది. తీవ్రస్థాయిలో చర్చ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో తరఫున ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ‘రాజకీయ ఎత్తుగడల పంథా’ ముసాయిదా సమీక్ష నివేదికను ప్రవేశపెట్టగా... దీనిపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. అయితే ఢిల్లీలో జరిగిన గత సమావేశంలోనే ఈ విధానంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగి అసమ్మతి కూడా వ్యక్తమైంది. ప్రధానంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏచూరి వర్గం వాటిని వ్యతి రేకించడంతో పాటు ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ కూడా ప్రకటించింది. దీంతో ప్రస్తుత భేటీలోనూ తీవ్ర చర్చ జరిగింది. ఏచూరి వర్గం తమ వాదనను గట్టిగానే వినిపించినట్లు సమాచారం. దీంతో గతాన్ని సమీక్షించుకుని సొంతంగా ఎదిగేలా మెరుగైన విధానాన్ని ఖరారు చేసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై మంగళవారం మధ్యాహ్నం వరకు చర్చించి తీర్మానాన్ని ఆమోదించనున్నారు. గత మూడేళ్ల విధానాల వల్లే.. సరళీకరణ ఆర్థిక విధానాలను గట్టిగా వ్యతిరేకించి, ప్రజలను చైతన్యపరిచినా రాజకీయంగా ఎందుకు నష్టపోవాల్సి వచ్చిందనే దానిపై వివిధ రాష్ట్రాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజలను మరింత చైతన్యవంతం చేసేందుకు పటిష్టమైన వ్యూహాలను అనుసరించి ఉండాల్సిందని కొందరు కేంద్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గత మూడేళ్లలో అనుసరించిన విధానాల వల్ల పార్టీకి ఎంతో నష్టం జరిగిందని.. పశ్చిమబెంగాల్, కేరళలలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఒక రిద్దరు సభ్యులు పేర్కొన్నట్లు తెలిసింది. పరోక్షంగా కారత్ అనుసరించిన వైఖరిని ఆయన వ్యతిరేక వర్గం తప్పుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా.. కేంద్రం ఇటీవల తెచ్చిన భూసేకరణ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ కేంద్ర కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. -
‘జనతా’పక్షాలు ఏకమైతే విపక్షం బలం
పాట్నా: ఒకప్పటి జనతా పరివార్ భాగస్వామ్య పక్షాలు మళ్లీ ఒక్కటయ్యేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ హర్షం వ్యక్తంచేశారు. బీజేపీని ఎదుర్కొనడానికి జరుగుతున్న ఈ పరిణామాలు ఆహ్వానించదగ్గవని, పార్లమెంటులో వామపక్షాలు కూడా ఈ పార్టీలతో సమన్వయంతో పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఈ భాగస్వామ్య పక్షాలు ఒక్కటైతే పార్లమెంటులో విపక్షాల బలం పెరుగుతుందని అన్నారు. అయితే ఈ పార్టీలు ప్రస్తుతం ఎలాంటి విధానాలు అవలంభిస్తాయన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో వారికి మద్దతు తెలిపే అంశంపై వామపక్షాలు ఒక నిర్ణయానికి వస్తాయని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆయన మండిపడ్డారు. పేద ప్రజలకు మేలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోతపెట్టడం సరికాదని అన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. త్రిపుర రాష్ట్రంలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని, జాతీయ సగటు ప్రకారం ఇతర ప్రాంతాల్లో 45 రోజులే పనిదొరుకుతుండగా, ఆ రాష్ట్రంలో గ్రామీణ పేదలకు 88 రోజులపాటు ఉపాధి లభిస్తోందని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకురావాలని భావిస్తున్న కార్మిక సంస్కరణల ప్రకారం పరిశ్రమల్లో పెద్ద ఎత్తున కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారు వైఫల్యం వల్లే జాతీయ స్థాయిలో బీజేపీ బలపడిందని కారత్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
'హుదూద్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. తుపాను వల్ల స్టీల్ ప్లాంట్‌కు జరిగిన నష్టంపై ఆ సంస్థ ఉన్నతాధికారులను కారత్ అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాను ముంచుకోస్తుందని తెలిసిన అధికార్లు నిర్లక్ష్యం ఉందన్న వార్తలపై విచారణ జరిపించాలని కారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
బీజేపీ సర్కారుది పచ్చిమోసం..!
‘నల్లధనం’పై ప్రతిపక్షాల మండిపాటు న్యూఢిల్లీ: ‘నల్లధనం’ అంశంపై అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విరుచుకుపడింది. అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామంటూ లోక్‌సభ ఎన్నికలప్పుడు పలికిన ప్రగల్బాలన్నీ ఏమయ్యాయని మండిపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆరోపించింది. విదేశాల్లో సొమ్ము దాచుకున్న 55 వేల మంది పేర్లను బయటపెడతామని ఎన్నికల సమయంలో బీజేపీ వాగ్దానం చేసిందని.. మరి అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా కనీసం 55 మంది పేర్లయినా బయటపెట్టలేదేమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ బుధవారం విమర్శించారు. ‘ఈ అంశంలో కోర్టు స్పందించి.. విదేశాల్లో సొమ్ముదాచుకున్న వారి పేర్లను వెల్లడించాల్సిందిగా కోరింది. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం తామే ఈ అంశంలో ముందుకు వెళుతున్నట్లుగా చెప్పుకొంటూ ప్రజలను మోసం చేస్తోంది’ అని అన్నారు. పాత కథే చెబుతున్నారు: సీపీఎం మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మన్మోహన్ ప్రభుత్వం తరహాలోనే వ్యవహరిస్తోందని.. నల్లధనాన్ని వెనక్కి తెచ్చే అంశంలో మోదీ ప్రభుత్వంపై ఏమాత్రం నమ్మకం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు. శివసేన కూడా నల్లధనం అంశంలో కేంద్రం చర్యలను తప్పుబట్టింది. ఇది సున్నితమైన అంశం.. బీజేపీ: నల్లధనం అంశం సున్నితమైందని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కితెచ్చేందుకు చట్ట ప్రక్రియలు ఉన్నాయన్నారు. రాజీవ్ పేరుందన్న వార్తలపై ఫిర్యాదు ఇండోర్: కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నల్లకుబేరుల జాబితాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ పేరుందంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలపై కాంగ్రెస్సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మా దివంగత నేత రాజీవ్, మా పార్టీల ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఆ వదంతులను ప్రారంభించిన, వ్యాప్తి చేస్తోన్న వారిని గుర్తించి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరాం’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత ధర్మేంద్ర వాజ్‌పేయి తెలిపారు. -
'నరేంద్ర మోడీ సర్కార్ విఫలం'
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ విరుచుకుపడ్డారు. దేశంలో ధరలను నియంత్రించడంలో మోడీ సర్కార్ విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రకాశ్ కారత్ శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పెరిగిన రైల్వే ఛార్జీలపై ప్రజలపై భారం వేశారని, త్వరలోనే ఎల్పీజీ గ్యాస్, డీజిల్ ధరలు పెంచేందుకు మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తుందన్నారు. మోడీ చెబుతున్న కఠిన నిర్ణయాలు ప్రజలపై భారం మోపేందుకేనని... గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు తర్వాత లెప్ట్ పార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ప్రకాశ్ కారత్ వ్యాఖ్యానించారు. తృణమూల్ ఎంపీ తపస్ పాల్ వ్యాఖ్యలు క్షమాపణలతో పూర్తి కాలేదని పార్లమెంటులో దీనిపై పోరాడతామని ఆయన అన్నారు. -
మోడీని గద్దెనెక్కించింది కార్పొరేట్లే
సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సాక్షి, హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన కార్పొరేట్ సంస్థలు, గుత్త పెట్టుబడిదారులే నరేంద్ర మోడీని తమ ప్రతినిధిగా ముందుకు తెచ్చి అందలం ఎక్కించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వ్యాఖ్యానించారు. ఆ శక్తులకు హిందూ మతోన్మాదశక్తులు తోడుకావడంతో కాంగ్రెస్ సహా మిగతా పార్టీలేవీ ఎదురునిలవలేకపోయాయని ఆయన పేర్కొన్నారు. మున్ముందు ఆ శక్తుల దుర్నీతికి ఎదురుండదని.. వాటిని నిలువరించడమే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ముందున్న తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ‘ఎస్వీకే ట్రస్టు- వర్తమాన పరిస్థితులు- వామపక్షాల ముందున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో కారత్ ప్రసంగించారు. యూపీఏ పదేళ్ల పాలనలో అధిక ధరలతో ప్రజలు దుర్భరస్థితికి చేరడం, వ్యవసాయ రంగం కుదేలవడం, పారిశ్రామిక ప్రగతి కుంటుపడడం వంటి వాటి ఫలితంగా ప్రజల్లో తలెత్తిన అసమ్మతిని బీజేపీ సొమ్ము చేసుకుందని ఆయన పేర్కొన్నారు. యూపీఏ హయాం తొలినాళ్లలో సహజ వనరులను విచ్చలవిడిగా లూఠీ చేసిన కార్పొరేట్ శక్తులు.. లాభాలు తగ్గడంతో మరో ప్రత్యామ్నాయం కోసం వెతికి మోడీని తమ ప్రతినిధిగా ముందుకు తెచ్చాయని చెప్పారు. ఇదే అదునుగా భావించిన ఆర్ఎస్ఎస్ వంటి మతోన్మాద, హిందూత్వ శక్తులు వాటికి తోడయ్యాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట జరిగే ప్రచారం బీజేపీకి పెద్ద ముసుగు మాత్రమేనని కారత్ స్పష్టం చేశారు. మొత్తంగా దేశం తిరోగమనాన్ని చూడాల్సివస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నయా ఉదారవాద విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడం, బడుగు బలహీనవర్గాలను ఏకం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించడం, ప్రజా రథాలను కదిల్చి మతతత్వ శక్తుల ఆగడాలను అరికట్టడమే ప్రస్తుతం వామపక్షాల ముందున్న కర్తవ్యమని చెప్పారు. ఇందుకు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సింగపూర్ సరే.. సీమ సంగతి చూడండి: రాఘవులు సీమాంధ్రను సింగపూర్‌గా మార్చడం సరే.. ముందు రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల సంగతి చూడాలని చంద్రబాబుకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సూచించారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్‌పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారని, ఆయన వాటిని నెరవేర్చాలని పేర్కొన్నారు. కార్పొరేట్ మయమైపోయిన ప్రస్తుత ఎన్నికల విధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు చట్టసభల్లో లేకపోవడం పేద ప్రజలకు పెద్ద లోటని, చట్టసభల్లో నానాటికీ రియల్టర్లు, బడా పారిశ్రామిక వేత్తల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. -
వామపక్షాల ఘోర ఓటమికి ఆ నేతలే బాధ్యులా?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఘోర ఓటమి పాలైన పిదప ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. 543 లోక్ సభ సీట్లకు గాను కేవలం 12 సీట్లను మాత్రమే వామపక్షాలు గెలుచుకోవడంతో పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభావంతో దేశంలోని ప్రముఖ పార్టీలన్నీ చతికిలబడటాన్ని అంగీకరిస్తూనే.. వామపక్షాల ఇంతటి ఘోర వైఫల్యాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధినాయకులను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని స్వయంగా ఓ వామపక్ష నేత తన అభిప్రాయంగా తెలిపారు. గతంలో 60 సీట్లున్న వామపక్షాలు ఇంతటి ఘోర వైఫల్యానికి అసలు బాధ్యలెవరనేది ప్రశ్నార్ధకంగానే ఉన్నా.. దానికి నైతిక బాధ్యత మాత్రం ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరూలదేనని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మీడియాతో చెప్పారు. తమ పార్టీ నాయకత్వంలో దృఢమైన నిర్ణయాలు తీసుకునే నాయకులే కొరవైయ్యారంటూ విమర్శించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఆ ప్రముఖ నేతలిద్దరూ బాధ్యతవహించాలంటున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి కూడా వారికి వేరే మార్గం కూడా ఏమీ లేదన్నారు. తప్పకుండా ఆ ఓటమికి వారిద్దరే మాత్రమే బాధ్యులని తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా 34 సంవత్సారాల పాటు పరిపాలించిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో సీపీఎంకు 9 ఎంపీ సీట్లు గెలవగా, ఇందులో ప శ్చిమబెంగాల్ నుంచి 2 సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి ఇప్పటికీ బోధపడటంలేదు. ఇంతకీ దీనికి బాధ్యులు ఎవరు? పార్టీలోని ముఖ్య నేతలేనా?లేక అసలు ఆ పార్టీల విధివిధానాలు ఏమిటో ప్రజల్లోకి చేరలేదా?అనేది దానికి ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలి. -
నరేంద్ర మోడీ గాలి లేదు:కాంగ్రెస్ వ్యతిరేక పవనాలే
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గాలి వీస్తోందన్న వార్తలను సీపీఎం కొట్టిపారేసింది. దేశంలో మోడీ గాలికానీ, బీజేపీ గాలికానీ లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్నది కాంగ్రెస్ వ్యతిరేక పవనాలేఅని, అయితే కొద్ది మంది దీనికి వక్రభాష్యం చేపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేక పవనాల వల్ల ప్రాంతీయ పార్టీలకు సైతం లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడతాయని ఆయన జోస్యం చెప్పారు. బీజీపీ అభివద్ధి పేరుతో చేస్తున్న ప్రచారం అంతర్గతంగా మతపరమైన ప్రచారం కూడా ఇమిడి ఉందని, దీనికి ఆర్ఎస్ఎస్ నేతత్వం వహిస్తోందని ఆరోపించారు. -
అధికారమిస్తే ఆర్టికల్ 3 సవరిస్తాం
సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ రాష్ట్రాల అనుమతితోనే విభజన చేయాలి సాక్షి, న్యూఢిల్లీ: తాము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినట్టు మరే రాష్ర్టం విషయంలో జరగకుండా ఆర్టికల్ 3 సవరిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వెల్లడించారు. ఏదైనా రాష్ట్ర విభజించాల్సివస్తే దానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ అంగీకరిస్తేనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలు తెస్తామన్నారు. గురువారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతోపాటు లోక్‌పాల్‌ను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, ఎస్.రామచంద్ర పిళ్లై, ఏకే పద్మనాభన్‌తో కలసి మేనిఫెస్టోను విడుదల చేశారు. అదే విధంగా ఎన్నికలకు సంబంధించి ఇంగ్లీష్, హిందీల్లో రూపొందిన పార్టీ వెబ్సైట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కారత్ విమర్శలు గుప్పించారు. విధాన పరంగా కాంగ్రెస్, బీజేపీలకు తేడా లేదన్నారు. నరేంద్రమోడీ ప్రసంగాలు ఇతర దేశాలతో సంబంధాలను చెడగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. గుజరాత్ తరహా అభివృద్ధి అంటే అవి ఎంతో ప్రమాదకరమైన కార్పోరేట్ విధానాలన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశానికి ప్రత్యామ్నాయ విధానాలున్న లౌకిక ప్రజాతంత్ర ప్రభుత్వం అవసరం ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న 11 పార్టీల కూటమిని బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతానికి భిన్నంగా వామపక్ష పార్టీలన్నీ పరస్పరం సహకరించుకుంటూ అత్యధిక స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు తెలిపారు. దాదాపు 90 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వారణాసిలో గతంలో మాదిరిగానే ఈ మారు సీపీఎం అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్టు వెల్లడించారు. -
డీఎంకేకు భంగపాటు
కాంగ్రెస్‌తో కలిసి కాపురం చేసిన పాపం డీఎంకేను వెంటాడుతూనే ఉంది. యూపీఏ అవినీతి పాలన, 2 జీ స్పెక్ట్రం కుంభకోణం డీఎంకేకు శాపమైపోయింది. డీఎంకే పిలుపుతో పొత్తు ఆలోచన చేసిన వామపక్షాలు ఆ పార్టీలు చేసిన పాపాలు తమకు చుట్టుకుంటాయని వెనకడుగువేశాయి. డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆదివారం నాగపట్నంలో స్పష్టం చేయడంతో కరుణకు భంగపాటు తప్పలేదు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఎదుర్కొనేందుకు బలమైన కూట మిగా తాము ఏర్పడబోతున్నామని డీఎంకే ధీమా వ్యక్తం చేసింది. అయితే ఆచరణకు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో కూటమి ఏర్పడలేదు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల తరువాత బలమైన పార్టీగా పేరొందిన డీఎండీకే కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే అయాచిత వరంగా అన్నాడీఎంకే నుండి వామపక్షాలు వైదొలగడంతో కరుణ ఎగిరిగంతేశారు. వెంటనే పొత్తుకు ఆహ్వానం పలికి పార్టీ సీనియర్ నేత టీఆర్ బాలును ఢిల్లీకి పంపారు. డీఎంకేతో పొత్తుపై శని, ఆదివారాల్లో సుదీర్ఘం గా చర్చించుకున్న వామపక్షాల అగ్రనేతల వద్దనే తీర్మానించుకున్నారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం నాగపట్నం వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కారదర్శి ప్రకాష్ కారత్ మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేతో పొత్తులేదని ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వాల్లో భాగస్వామిగా మెలిగి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకేతో పొత్తుపెట్టుకుంటే ఎన్నికల ప్రచారాల్లో తాము ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని, అందుకే తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వివరణ ఇచ్చారు. ప్రకాష్‌కారత్ ప్రకటనపై కరుణ స్పందిస్తూ, ఆయన ఢిల్లీకి వెళ్లిన తరువాత పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే వామపక్షాల నిర్ణయాన్ని ప్రకటించేందుకు మూడురోజులు గడువుఇచ్చానని తెలిపారు. -
ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కార్యవర్గం భేటీ
హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీతారాం ఏచూరీ, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శి పదవి ఖమ్మం జిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను ఈ పదవిలో నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
‘మూడు’ ఆవిర్భావం
వామపక్షాలు సహా 9 పార్టీలతో కూటమి కాంగ్రెస్, బీజేపీలను ఓడించటమే లక్ష్యం నాలుగు వామపక్ష పార్టీలు, ఎస్పీ, జేడీ(యూ), జేడీ(ఎస్), అన్నా డీఎంకే, జేవీఎం నేతల భేటీ బీజేడీ, ఏజీపీ మద్దతూ ఉందన్న కారత్ న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలు సహా 9 పార్టీలు ఏకమై మూడో కూటమిని ఏర్పాటు చేశాయి. ‘‘మార్పుకు సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ను అధికారం నుంచి తోసివేయాలి. బీజేపీ, మతతత్వ శక్తులను ఓడించి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి’’ అంటూ ఈ పార్టీల కూటమి సంయుక్త ప్రకటన చేసింది. సీపీఎం సహా నాలుగు వామపక్ష పార్టీలతో పాటు.. జనతాదళ్ (యూ), సమాజ్‌వాదీ పార్టీ, అన్నా డీఎంకే, జనతాదళ్ (ఎస్), జార్ఖండ్ వికాస్ మోర్చా నాయకులు మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అసోం గణపరిషత్ (ఏజీపీ), బిజూజనతాదళ్ (బీజేడీ) అధినేతలతో సహా మొత్తం 11 పార్టీలు మూడో కూటమి ఏర్పాటుకు మద్దతు ప్రకటించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నప్పటికీ.. ఆ రెండు పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకాలేదు. అయితే.. బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడే మూడో కూటమి ఏర్పాటు తొందరపాటని వ్యాఖ్యానించటం విశేషం. పార్టీల ఉమ్మడి ప్రకటన: ప్రధాని అభ్యర్థి విషయాన్ని పక్కనపెట్టి.. మూడో కూటమిని ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయిం చారు. ‘ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, అవినీతిని అంతమొందించాలని, ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలని ఈ పార్టీల నాయకులు తీర్మానించారు. మన సమాజంలో బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని గుర్తించే బలమైన లౌకిక నిర్మాణాన్ని ఈ పార్టీలు ఏర్పాటు చేస్తాయి. అసమానత్వం, సామాజిక న్యాయం, రైతుల ప్రయోజనాలు, మైనారిటీలు, మహిళల హక్కులను, సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు కేంద్రంగా ఉండే అభివృద్ధి మార్గాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. అధికారాన్ని కేంద్రం తన చేతుల్లో కేంద్రీకరించే వ్యవస్థను తిరగదోడి.. అన్ని రాష్ట్రాల హక్కులకూ భద్రతనిచ్చే నిజమైన సమాఖ్య వ్యవస్థను నిర్మిస్తాం. అవసరమైన రాష్ట్రాలకు ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తాం’ అని సంయుక్త ప్రకటనలో హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ హీనం.. బీజేపీ అంతకన్నా ఘోరం సమావేశం అనంతరం కారత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ది లోపభూయిష్ట పాలన, భారీ అవినీ తి, అనూహ్యమైన ధరల పెరుగుదల, విస్పష్టమైన అసమానతలను సృష్టించిన చరిత్ర. బీజేపీ కూడా కాంగ్రెస్‌కు ఏమాత్రం భిన్నమైనది కాదు. ఇంతకుముందు కేంద్రం లో, ఇప్పుడు ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అవినీతి చరిత్ర కాంగ్రెస్ కన్నా ఘోరమైనది. పైగా.. మన దేశ, సమాజ లౌకిక నిర్మాణానికి అది తీవ్ర విఘా తం కలిగించే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీకి కవల పార్టీ. ఒకే నాణేనికి మరోవైపు ఉన్న పార్టీ’ అని అభివర్ణించారు. వాటికి మద్దతివ్వం.. మద్దతు తీసుకోం... ‘కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన 272 సీట్లను సాధించటంలో మూడో కూటమి విఫలమైన పక్షంలో.. కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు తీసుకుంటుందా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఆ ప్రశ్నే లేదు. ఈ రెండు ప్రధాన పార్టీల నుంచి మద్దతు తీసుకునే ప్రసక్తి కానీ, వాటికి మద్దతు ఇచ్చే ప్రసక్తి కానీ లేదు’’ అని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ స్పష్టంచేశారు. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉండదు... రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య పొత్తులు, సీట్ల పంపకం గురించి ప్రశ్నించగా.. ప్రతి పార్టీకి తమ సొంత ప్రాంతాలు, రాష్ట్రాల్లో బలం ఉందని కారత్ బదులిచ్చారు. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో తమ వనరులను సమీకరిస్తామని చెప్పారు. ‘‘దీనర్థం.. వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకుంటాయని కానీ, సీట్ల సర్దుబాట్లు కుదుర్చుకుంటాయని కానీ కానవసరం లేదు’’ అని పేర్కొన్నారు. హాజరైన నేతలు వీరే: కారత్, నితీశ్, ములాయంలతో పాటు.. దేవెగౌడ (జేడీ-ఎస్), ఎ.బి.బర్ధన్, సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), ఎం.తంబిదురై (అన్నా డీఎంకే), టి.జి.చంద్రచూడన్ (ఆర్ఎస్పీ), దేబబ్రతబిస్వాస్ (ఫార్వర్డ్ బ్లాక్), సీతారాం ఏచూరి (సీపీఎం), కె.సి.త్యాగి (జేడీ-యూ)లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 15 కావచ్చు: ములాయం కేంద్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సమయాల్లో మద్దతు ఇవ్వటం గురించి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను ప్రశ్నించగా.. ‘‘నేను లోక్‌సభలో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాను’’ అని ఆయన బదులిచ్చారు. ‘‘ఇప్పుడున్న 11 పార్టీలు రేపు 15 పార్టీలు కావచ్చు’’ అంటూ భవిష్యత్‌లో కాంగ్రెస్ మద్దతు అవసరం తమకు రాకపోవచ్చునని ములాయం పరోక్షంగా చెప్పారు. ఆ తర్వాతే ప్రధాని అభ్యర్థి కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని కారత్, ములాయం, నితీశ్‌లు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా స్పష్టంచేశారు. ‘‘ఈ విషయంపై గతంలో మేం ఎన్నడూ గొడవ పడలేదు. మొరార్జీదేశాయ్, వి.పి.సింగ్, హెడ్.డి.దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానమంత్రులుగా ఎన్నికల తర్వాతే నిర్ణయించటం జరిగింది’’ అని ములాయం గుర్తుచేశారు. -
'ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తాం'
-
'ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తాం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా కేంద్రంలో మూడో కూటమి అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. మూడో కూటమి సమావేశం ముగిసిన తర్వాత శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ ఇవాళ సమావేశమయ్యాయని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ విధానాల్లో పెద్ద తేడా లేదన్నారు. యూపీఏ పాలన అవినీతిమయమైందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ అవినీతి పెచ్చురిల్లిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించడమే తమ ధ్యేయమన్నారు. ఎన్నికల తర్వాత మూడో కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని కారత్ తెలిపారు. ములాయం, జయలలిత, నితీష్ కుమార్ పేర్లు ప్రధాని అభ్యర్థులుగా చర్చకు వచ్చినట్టు సమాచారం. థర్డ్ ఫ్రంట్ భేటీకి బీజేడీ, ఏజీపీ, జేవీఎం దూరంగా ఉన్నాయి. -
గందరగోళాన్ని అడ్డుపెట్టుకొని సభలో బిల్లు ప్రవేశపెట్టామంటే కుదరదు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) చాలా తీవ్రమైన అంశం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. దీనిపై సభలో చర్చ జరగాలని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తనను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరిన సందర్భంగా కారత్ విలేకరులతో మాట్లాడారు. ప్రతి పార్టీ, ప్రతి సభ్యుడు అభిప్రాయం చెప్పే హక్కు ఉందన్నారు. సభలో బిల్లును ఏదోలా నెట్టుకొచ్చేద్దాం అన్న ధోరణిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అని తెగేసి చెప్పారు. గడిచిన గురువారం పార్లమెంటులో జరిగిన ఘటనలు దురదృష్టకరమైనవని అన్నారు. ఆ ఘటనలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏపీ పునర్విభజన బిల్లును లోక్‌భలో ప్రవేశపెట్టామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటలను కూడా ఖండిస్తున్నామన్నారు. ఆ సమయంలో సభలో తీవ్ర గందరగోళం ఉందని, దానిని అడ్డంపెట్టుకుని సభలో బిల్లు ప్రవేశపెట్టామని ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రతిపక్షాలు దీన్ని అంగీకరించడంలేదని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో కూడా తాము చెప్పినట్లు కారత్ తెలిపారు. -
అన్యాయాన్ని ఒప్పుకుంటే చెడుసంప్రదాయానికి తెరతీసినట్లే!
ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి, తమ ఉద్యమానికి మద్దతు కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ను కలిశారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కారత్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఒప్పుకోకపోయినా పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టారన్నారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు అప్రజాస్వామికం అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడానికి ఎవ్వరూ ఎస్, నో చెప్పకపోయినా, 10 సెకన్లలో అంతాకానిచ్చేశారని విమర్శించారు. ఈ అప్రజాస్వామిక తీరును తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తమవంతు సహాయాన్ని అందిస్తామని కారత్ చెప్పినట్లు తెలిపారు. అందుకు కారత్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలవాల్సిన సమయం ఇదని చెప్పారు. ఒకవేళ ఈ అన్యాయాన్ని ఒప్పుకున్నట్లైతే ఒక చెడు సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని జగన్ హెచ్చరించారు. -
ప్రకాష్ కారత్ను కలిసిన జగన్
-
‘మూడో’ కసరత్తు ముమ్మరం
న్యూఢిల్లీ: మూడో కూటమి ఏర్పాటు యత్నాలు ముమ్మరమయ్యాయి! సోమవారమిక్కడ మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ నివాసంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమై థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీకి సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలతో కూడిన 11 పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఇందులో నిర్ణయించారు. మూడో కూటమి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్న పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు ఒకట్రెండు భారీ ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ‘బీహార్ సీఎం ఇక్కడ ఉండడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశాం. మూడో కూటమి ఏర్పాటుపై చర్చించాం. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు 11 పార్టీలకు చెందిన నేతలతో త్వరలోనే ఢిల్లీలో సమావేశం కాబోతున్నాం’ అని జేడీ(ఎస్) సెక్రటరీ జనరల్ డానిష్ ఆలీ చెప్పారు. మూడో కూటమికి రూపు ఇచ్చే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు. ఎన్నికల తర్వాతే కూటమి ఏర్పడుతుందని చెప్పారు. నాలుగు లెఫ్ట్ పార్టీలు, ఎస్పీ, జేడీ యూ, అన్నా డీఎంకే, ఏజీపీ, జార్ఖండ్ వికాస్ మోర్చా, జేడీ(ఎస్), బీజేడీలు థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. -
లెఫ్ట్ నేతలతో నితీష్ మంతనాలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో సీపీఎం, సీపీఐ, జేడీయూ నేతలు సమావేశమయ్యారు. ప్రకాష్ కారత్, ఏబీ బర్దన్లతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు నేతలు మామూలుగా కలిసారని, ఇది అధికారిక భేటీ కాదని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలోనే అధికారికంగా సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత 11 పార్టీలు సమావేశమయి మూడో ఫ్రంట్ చర్చిస్తాయని దేవెగౌడ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి మూడో ఫ్రంట్‌కు రూపురేఖలు వస్తాయని ప్రకాష్ కారత్ అన్నారు. -
సమైక్య పోరులో తోడుంటాం: ప్రకాశ్ కారత్
* వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ హామీ * పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు పూర్తిగా మద్దతిస్తామని వెల్లడి * మిత్రపక్షాలతోనూ మాట్లాడతామని హామీ * సమైక్యంపై కేంద్ర అప్రజాస్వామిక వైఖరిని కారత్ దృష్టికి తీసుకెళ్లిన జగన్ * బీజేపీ అగ్రనేత అద్వానీతోనూ సమావేశమైన వైఎస్సార్ సీపీ అధినేత సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో అడ్డుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. సమైక్యం విషయంలో తాము తొలినుంచీ ఉన్న వైఖరినే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందకుండా చూసేందుకు ఇంటాబయటా పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి సాగేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తమ మిత్రపక్షాలైన ఏఐడీఎంకే, జేడీఎస్, జేడీయూలనూ సంప్రదించి బిల్లును అడ్డుకోవాల్సిందిగా కోరతామని హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్ జగన్‌తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలు సీపీఎం ప్రధాన కార్యాలయంలో కారత్‌తో భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు వారు సమైక్యాంధ్యప్రదేశ్పై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాజ్యంగ నిబంధనలు, సంప్రదాయాలను తుంగలో తొక్కి పూర్తి అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కారత్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, బిల్లును వెనక్కి పంపాలని పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారని వివరించారు. రాష్ట్ర అసెంబ్లీకి పంపిన బిల్లులోనూ విభజన అనంతర పరిణామాలు, ఆర్థిక పంపిణీ, నీటి వనరుల నిర్వహణపై సరైన వివరణలు లేవని, దీన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ, మండలిలో పూర్తిగా వ్యతిరేకించారని తెలిపారు. సభలోని మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం విభజన బిల్లును తిరస్కరించారని గుర్తుచేశారు. ఇదే సమయంలో బిల్లును తిరస్కరిస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందిందని, తిరస్కరించిన ఆ బిల్లును పార్లమెంట్‌కు సిఫార్సు చేయరాదని కోరారు. ఈ విషయంలో సీపీఎం మద్దతు కావాలన్నారు. ఉభయ సభల్లో ప్రవేశపెట్టే సమయంలో బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలని విన్నవించారు. దీనికి ప్రకాశ్ కారత్ పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. బిల్లును వ్యతిరేకిస్తాం: కారత్ ఈ భేటీ అనంతరం కారత్ విలేకరులతో మాట్లాడుతూ, ‘‘సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచీ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయి. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం జరగకుండా చూసేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై చర్చించుకున్నాం’’ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయమై చర్చలేమీ జరుగలేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని కారత్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. అద్వానీతోనూ జగన్ భేటీ.. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవైలు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో పార్లమెంట్లో లాబీల్లో భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకర ణ బిల్లు విషయంలో బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలని జగన్ కోరారు. బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల ప్రయోజనాలను పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు ఏమాత్రం విలువనివ్వకుండా అడ్డగోలుగా విభజన చేస్తున్నారని వివరించారు. శాసనసభలో విభజన బిల్లును తిరస్కరిస్తూ చేసినతీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించిందని అద్వానీ దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించాలని కోరారు. జగన్ విజ్ఞప్తికి అద్వానీ పూర్తి సానుకూలంగా స్పందించారని వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉత్తరాంధ్రలో 8, 9 తేదీల్లో ‘సమైక్య శంఖారావం’ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ నెల 8, 9 తేదీల్లో ఉత్తరాంధ్రలో సమైక్య శంఖారావం యాత్ర చేపట్టనున్నారు. 8న విశాఖ జిల్లా చోడవరంలో మధ్యాహ్నం 3 గంటలకు, గాజువాకలో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభల్లో పాల్గొంటారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకు భోగాపురంలోనూ, సాయంత్రం 3 గంటలకు శ్రీకాకుళంలోనూ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం సభలో వైఎస్సార్ సీపీలో చేరతారు. -
బిల్లును అడ్డుకోండి: కారత్కు జగన్ విజ్ఞప్తి
-
బిల్లును అడ్డుకోండి: కారత్కు జగన్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్కు విజ్ఞప్తి చేశారు. పార్టీకి చెందిన నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి, ఇతర నాయకులతో కలసి ఆయన ఈ రోజు కారత్ను కలిశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్నట్లు వివరించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు సహకరించాలని వారు కారత్ను కోరారు. రాష్ట్ర సమైక్యత కోసం గతంలో కూడా జగన్మోహన రెడ్డి బృందం జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసింది. రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టనుండటంతో జగన్ మళ్లీ జాతీయ నాయకులను కలిసి అభ్యర్థిస్తున్నారు. -
వై.కాంగ్రెస్ కాంగ్రేసేతర లౌకిక పార్టీ-కారత్
-
లౌకిక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో లౌకిక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. ఆ రెండు పార్టీలను ఓడించటమే లక్ష్యంగా తాము పనిచేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తాము కాంగ్రెసేతర లౌకిక ప్రతిపక్ష పార్టీగా చూస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉండకపోవచ్చని కారత్ పరోక్షంగా చెప్పారు. ఆ పార్టీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తోందని, ఇది దురదృష్టకరమని అన్నారు. శనివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావే శాలు పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై. వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలివీ..తృతీయ కూటమి కాకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల అనంతరం ఇది రూపుదిద్దుకుంటుంది. ఈ అంశంపై ఇప్పటికే సీపీఎంతోపాటు ఇతర వామపక్షాలు, అన్నా డీఎంకే, జనతాదళ్ (ఎస్), జనతాదళ్ (యునెటైడ్), బిజూ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, మరికొన్ని పార్టీలు చర్చించుకున్నాయి. 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజున ఈ ప్రత్యామ్నాయంలో ఉండే పార్టీలు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక ప్రకటన చేస్తాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా హర్యానా, పంజాబ్, రాజస్థాన్ వంటి 8 రాష్ట్రాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. ళీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎన్ని స్థానాల్లో పోటీచేయాలో ఇంకా నిర్ణయించలేదు. కాంగ్రెస్, బీజేపీయేత ర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటాం పొత్తులతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్లమెంటు సమావే శాల తరువాత ఖరారు చేస్తాం యూపీఏ పాలన ప్రజలకు భారంగా మారింది. నిత్యావసరాలు ధరలు పెరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అనుసరించే నయా ఉదారవాద విధానాలకు, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పే ప్రత్యామ్నాయానికి తేడా లేదు. మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వామపక్షాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. ఆ పార్టీ ప్రస్తుతానికి ఢిల్లీకే పరిమితమైంది. ఆర్థిక రంగంతో పాటు పలు కీలకమైన అంశాలపై ఆ పార్టీ వైఖరిని ఇంతవరకూ వెల్లడించలేదు. అవినీతి విషయంలో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవటం వల్ల ఫలితం శూన్యం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నది మాత్ర ం ఆ పనే. కేంద్రం అనుసరించే సరళీకృత ఆర్థిక విధానాలే అవినీతికి మూలకారణం. అధికారంలో ఉన్న రాజకీయ నేతలు, కార్పొరేట్ శక్తులు, అధికారులు కలిసి అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. వామపక్ష కూటమిలో సీపీఐ కూడా భాగస్వామే. తెలంగాణ బిల్లు విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీయకూడదని మేం చెబుతున్నాం. పార్లమెంటులోనూ ఇదే అంశాన్ని చెప్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్కడ కూడా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఎం పోరాడుతుంది. -
వైఎస్ఆర్సీపీ కాంగ్రెసేతర,లౌకిక ప్రతిపక్షపార్టీ: ప్రకాష్ కారత్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసేతర, లౌకిక ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశానికి శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరమితమని వ్యాఖ్యానించారు. సీపీఎం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్ధమైదని ప్రకాష్ కారత్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు తరువాత తమ విధానాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సీపీఐ, సీపీఎం పొత్తులపై రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తాయని ప్రకాష్ కారత్ తెలిపారు. టీడీపీ మతతత్వ బీజేపీతో దోస్తీ కడుతోందని ఆయన ఆరోపించారు. -
ప్రాంతీయ పార్టీలతో కూటమి
సీపీఎం నేత కారత్ వెల్లడి భువనేశ్వర్: వివిధ ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయం అందించే లక్ష్యంతో వామపక్షాలు కృషిచేస్తున్నాయని గురువారం ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, జేడీఎస్, బీజేడీ వంటి పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకే తాటిపైకి వస్తాయని అన్నారు. అయితే దీనిని మూడో ఫ్రంట్‌గా పిలవడానికి ఆయన నిరాకరించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశానని, ఈ రాష్ట్రంలో తమ మధ్య ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉందని కారత్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలనుంచి లోక్‌సభకు తమ పార్టీ తరఫున 35 మంది అభ్యర్థులను నిలపాలనుకుంటున్నామని, ప్రాంతీయ పార్టీలతో పొత్తుల నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. -
ఫిబ్రవరికల్లా లౌకిక కూటమి: ప్రకాశ్ కారత్
పకాశ్ కారత్ ఉద్ఘాటన కొచ్చి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని సమర్థంగా ఎదుర్కొనే దిశగా కాంగ్రెసేతర లౌకిక పార్టీల కూటమి ఏర్పాటు ఈ ఫిబ్రవరికల్లా సాకారమయ్యే అవకాశాలున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. ‘‘బీజేపీని, మోడీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విఫలమవుతున్నాయి. కాంగ్రెసేతర లౌకిక పార్టీల కూటమి మాత్రమే బీజేపీ, మోడీలకు సరిగ్గా చెక్ పెట్టగలదు’’ అని శనివారం ఎర్నాకుళంలో అన్నారు. వివిధ కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు సీపీఎం, వామపక్షాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. ‘ఈ సారి ఎన్నికలకు ముందే 14 ప్రాంతీయ పార్టీలు ఒక్కటయ్యాయి. ఫిబ్రవరి తొలి వారాల్లో కూటమి ఒక రూపు వస్తుంది’ అని చెప్పారు. సీపీఎం నేతలు, కార్యకర్తలు.. బ్లాగ్లు, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లలో తమ అభిప్రాయాలను వ్యక్తంచేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అవి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని హెచ్చరించారు. -
బూర్జువా పార్టీలకు ఆప్ ప్రత్యామ్నాయమే.. వామపక్షాలకు కాదు: కరత్
బూర్జువా పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయంగా రూపొందొచ్చు గానీ, వామపక్షాలకు మాత్రం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ అన్నారు. ఢిల్లీలో కేవలం ఓ మైనారిటీ ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేసిన ఆప్ గురించి అప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. ఢిల్లీలో ఆ పార్టీ మంచి ఫలితాలే సాధించినా, మిగిలిన రాష్ట్రాల గురించి మాత్రం అంత నమ్మకంగా చెప్పలేమన్నారు. వారికి మధ్యతరగతి నుంచి మద్దతు లభించడం మంచి విషయమేనని, అయితే వాళ్ల కార్యక్రమాలు, విధానాల గురించి మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని ప్రకాష్ కరత్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అటు వామపక్షాల మద్దతుదారులు కొందరితో పాటు ఇతర పక్షాల నుంచి కూడా తగినంత బలం లభించిన విషయాన్ని కరత్ అంగీకరించారు. వామపక్షాలు ఆప్‌తో పొత్తు పెట్టుకుంటాయా అని ప్రశ్నించగా, వాళ్లకు అసలు పొత్తులపైనే నమ్మకం ఉన్నట్లు కనిపించడంలేదని చెప్పారు. ఉదారవాద విధానాలు, మత వాదం లాంటి అంశాలపై వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం తమకుందని ప్రకాష్ కరత్ అన్నారు. -
మతతత్వ శక్తులకు మోడీ ఒక ప్రతినిధి:కారత్
కోల్‌కతా: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ ప్రకాశ్ కారత్ విమర్శల వర్షం గుప్పించారు. మతతత్వ శక్తులకు మోడీ ఒక ప్రతినిధిలా వ్యవరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నగరంలోని ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కారత్..మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ విద్వేషాలను రెచ్చగొడుతూ మతతత్వానికి ఆజ్యం పోస్తున్నారన్నారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కూడా మోడీ హస్తం ఉందనే విషయం కాదనలేని వాస్తమన్నారు. మోడీ వెనుక ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని కారత్ తెలిపారు. దేశంలో పేట్రేగి పోతున్నమతతత్వ పోకడలను నిర్మూలించేందుకు లెఫ్ట్ పార్టీలతో సహా, స్థానిక పార్టీలు కృషి చేసేందుకు నడుంబిగించాయన్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ లౌకిక వాద ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగిస్తోందన్నారు. -
సమైక్యతకు అండదండ కావాలి
వామపక్ష నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఢిల్లీలో భారత క మ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ను, భారత క మ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిలను కలుసుకున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును వ్యతిరేకించి, సమైక్యాంధ్రప్రదేశ్ పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా జగన్మోహన్రెడ్డి ఇరువురు నేతలకు రాసిన లేఖ పూర్తి పాఠాన్ని అందిస్తున్నాం... మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. కమ్యూనిస్టును కాను కాబట్టి నేను మాట్లాడ లేదు. ఆ తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు, సోషలిస్టును కాను కాబట్టి నేను మాట్లాడ లేదు. ఆ తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు, ట్రేడ్ యూనియనిస్టును కాను కాబట్టి నేను మాట్లాడ లేదు.ఆ తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు, యూదును కాను కాబట్టి నేను మాట్లాడ లేదు. ఆ తర్వాత వాళ్లు కేథలిక్కుల కోసం వచ్చారు, కేథలిక్కును కాను కాబట్టి నేను మాట్లాడ లేదు.ఆ తర్వాత వాళ్లు నా కోసం వచ్చారు. వెనుదిరిగి చూస్తే నా కోసం మాట్లాడటానికి ఎవరూ మిగల్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ మహా తొందరపడిపోతోంది. విభజనను వ్యతిరేకిస్తున్న అశేష రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లకు చిల్లి గవ్వ విలువైనా ఇవ్వకుండా, పర్యవసానాల పట్టింపే లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అది ఈ విభజనకు పాల్పడుతోంది. మూడు నెలలకు పైబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఒక ప్రభంజనంలా చెలరేగుతోంది. అయినా పట్టించుకోకుండా అధికారంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు తాను రూపొందించుకున్న పథకాలతో మొండిగా, ప్రమాదకరమైన వేగంతో ముందుకు సాగుతోంది. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న బిల్లు శ్రుతిమించిన కాంగ్రెస్ అధికార దురహంకార స్వభావానికి అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వాంఛిస్తున్న 75 శాతం ప్రజల వాణిని అది ప్రతిబింబించడం లేదు. కాబట్టి నిజమైన సమాఖ్య భావనకు విరుద్ధమైన ఆ బిల్లును పార్లమెంటు ముందు ఉంచినప్పుడు మీ పార్టీ దాన్ని తిరస్కరించాలని కోరుతున్నాను. ఏపీకి జరుగుతున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీలన్నీ నిలవాల్సిన సమయమిది. ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాన్ని, తలబిరుసుతనాన్ని, ఆధిపత్యవాదాన్ని నేడు తెలుగు ప్రజలు సవాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలోనూ, ప్రజాభీష్టంలోనూ విశ్వాసమున్న ప్రతి పార్టీ ఈ విభజనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను చేపట్టాల్సి ఉంది. ముందు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఇలా విభజన ఎత్తుగడలకు పాల్పడటానికి ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా మారనివ్వకూడదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే రాజకీయ పార్టీలు ఈ సమస్యపై మౌన ప్రేక్షకులుగా మిగిలిపోకూడదు. ఎందుకంటే రేపు మరే రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి పునరావృతం కావచ్చు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి పార్లమెంటులోనూ, బయటా కూడా మీ పార్టీ మద్దతుగా నిలవాలని, మా పోరాటానికి సంఘీభావాన్ని తెలపాలని కోరుతున్నాం. ఇది అధికార పార్టీకి కనువిప్పు కావాలి. కాంగ్రెస్ మునుముందు ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడకుండా నివారించాల్సి ఉంది. వైఎస్సార్ మరణానంతర ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని క్లుప్తంగా మీకు వివరించాల్సి ఉంది. రాష్ట్రం అరాచకపు గందరగోళంలో కూరుకుపోయింది, గత నాలుగున్నరేళ్లుగా పరిపాలన ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రజలు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వపు ప్రజావ్యతిరేక విధానాలతో వారు విసిగి వేసారిపోయారు. అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మిన్నంటింది, ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని తెలిసిపోతోంది. ప్రతి ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ధరావతులు కోల్పోవడం లేక ఘోర పరాజయం పాలు కావడమే అందుకు తార్కాణం. కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, కనీసం ఒక్క ప్రాంతంలోనైనా కొన్ని సీట్లు, ఓట్లు దక్కించుకోవాలనీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పరిస్థితిని ఇంత వరకు తెచ్చింది. ప్రజాస్వామిక సంప్రదాయాల గురించి, ఒక రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే ఏ పరిస్థితుల్లో, ఏ పద్ధతిలో చేయాల్సి ఉంటుందనే విషయం గురించి ప్రజా జీవితంలో ఉన్న మీకు తెలిసే ఉంటుంది. జనాభాలో 75 శాతం ఈ విభజనను వ్యతిరేకిస్తున్నా కేంద్రం రాష్ట్ర విభజన దిశగా తన పథకాలతో ముందుకు సాగుతోంది. తద్వారా తన నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచించాలని అది ప్రయత్నిస్తోంది. ఒక్కసారి గతాన్ని కొంత గుర్తు చేసుకుంటే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాతి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి రాష్ట్ర విభజన జరగలేదనే విషయం మీకే స్ఫురిస్తుందని భావిస్తున్నాను. అత్యుత్తమ ప్రజాస్వామిక సంప్రదాయాలన్నిటి నుంచి, మునుపటి ఉదాహరణలన్నిటి నుంచి కాంగ్రెస్ వైదొలుగుతున్న ఈ సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న మా పోరాటానికి మీరు మీ సహాయ సహకారాలను అందిస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాను. 1905లో నాటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ చేసిన హేయమైన బెంగాల్ విభజన, దానితో పాటూ బ్రిటిష్ వారి విభజించి పాలించు భావజాలం తెలుగు ప్రజలకు నేడు తిరిగి జ్ఞప్తికి వస్తున్నాయి. నేడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అనుసరిస్తున్న సూత్రం కూడా అదే. దేశంలోని ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ కింది విషయాలపై ఆలోచించాల్సి ఉంది. 1. కొన్ని ఓట్లను, సీట్లను సంపాదించుకోవడానికి కేంద్రం తనకు లభించిన అధికారాలను తన ఇష్టానుసారం అక్రమ లబ్ధిని పొందడానికి వాడుకోవచ్చా? 2. 2009 డి సెంబర్ 9న కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలని ఏకపక్షంగా నిర్ణయించింది.అది, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుక అని ఆ పార్టీ పేర్కొంది. అలాంటి కొలబద్దతో రాష్ట్ర విభజనకు పాల్పడవచ్చా? 3. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నంత మాత్రాన నిర్దిష్టమైన ప్రాతిపదికగానీ, సంబంధిత శాసనసభ ఆమోదంగానీ, హేతుబద్ధతగానీ లేకుండా ఇలా రాష్ట్రాన్ని విభజించవచ్చా? ఆంధ్రప్రదేశ్ 1955లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్సార్సీ) చేసిన సిఫారసుల మేరకు జరిగిన పునర్వ్యవస్థీకరణతో ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రమనే వాస్తవాన్ని కేంద్రం గుర్తించడం లేదు. 4. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాలను కోరుతున్నారు. కొన్ని శాసనసభలు విభజనకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. అవన్నీ మూలనపడి ఉండగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏపీ విభజన కోసం మాత్రం కేంద్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. ఎందుకు? 5. నేడు కేంద్రం ఇలా ఇష్టానుసారంగా పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఏపీని విభజిస్తే, ముందు ముందు వచ్చే ప్రభుత్వాలకు కూడా అదే నిరంకుశ పద్ధతి ఆనవాయితీగా మారదా? 6. రాష్ట్ర శాసన సభ ఆమోదం లేకుండానే కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3న రాష్ట్ర విభజనకు నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? అంతకు ముందు శ్రీకృష్ణ కమిషన్ నివేదిక... విభజనతో రాష్ట్రం నష్టపోతుందని సూచించింది. ఆ నివేదిక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్‌కు ప్రాతిపదిక ఏమిటి?అది ఎలా సమంజసం? 1956లో నాటి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల రెండు శాసనసభలు విడి విడిగా సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాయి. హైదరాబాద్ శాసనసభ మూడింట రెండు వంతుల మెజారిటీతో భాషాప్రయుక్త రాష్ట్రంగా విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించింది. 174 మంది సభ్యులుగల హైదరాబాద్ శాసనసభలో తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొన్నవారు 147 మంది. అందులో 103 మంది విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటుకు అంగీకరించారు. విశాలాంధ్ర ఏర్పాటు కావాలన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి, ఆ తీర్మానం నెగ్గడానికి తోడ్పడ్డారు. అదేవిధంగా ఆంధ్ర శాసనసభ కూడా విశాలాంధ్ర తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. 1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది (ఆ ప్రసంగం రాష్ట్ర ఐక్యతపై స్పష్టతను ఇచ్చేదిగా ఉంది). ఇందిర ఇలా అన్నారు... ‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలు పోరాటం సాగించారంటే అందుకు ప్రేరణ బహుశా తెలుగువారి సుదీర్ఘ చరిత్రే కావాలి. ఈ సందర్భంగా నా వ్యక్తిగత అనుభవాన్ని చెప్పమంటారా? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదికను బహిరంగ పరచటానికి ముందు నేను దక్షిణాదిన పర్యటించటం జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా నాడు మిన్నంటిన విశాలాంధ్ర నినాదాలు నేటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి... పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న కొందరి వాంఛను ఆనాడు జయించింది నిజానికి కలిసి ఉండాలనే తెలుగు ప్రజల ఆకాంక్షే’’ నేటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానం రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి నాజీ భావజాలాన్ని పోలి ఉంది. జర్మన్ తత్వవేత్త మార్టిన్ నీమోల్లర్ ఆనాడు పలికిన సుప్రసిద్ధమైన మాటలను గుర్తు చేసుకోవడం సందర్భోచితం. కేంద్రం నేడు ఏపీకి చేస్తున్న ఈ అన్యాయంపై మేధావులు, ప్రజాస్వామిక సంస్థలు, రాజ్యాంగాన్ని గౌరవించేవారు మౌనం వహిస్తే, స్పందించకపోతే ఇదే అన్యాయం మరే రాష్ట్రానికైనా జరగొచ్చు. ప్రతి రాష్ట్రంలోనూ జరగొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు విజయావకాశాలు లేవనుకున్న ఏ రాష్ట్రాన్నయినా బలహీనపరచడానికి తన అధికారాలను ఇలా విచ్చలవిడిగా ప్రయోగిస్తుంది. ఈ రాష్ట్రాలన్నీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రతిపాదనలను అనుసరించి భాషాప్రాతిపదికపై పునర్వ్యవస్థీకరించినవే. కాబట్టి ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా లేదా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా రాష్ట్ర శాసనసభలోనూ, పార్లమెంటులోనూ కూడా మూడింట రెండు వంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ రాజ్యాంగ సవరణను తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 3వ అధికరణకు సవరణను తేవడం రానున్న రోజుల్లో అవసరం. కాగా ఏపీ విభజన బిల్లును పార్లమెంటు ముందు ఎప్పుడు ఉంచితే అప్పుడు దాన్ని వ్యతిరేకించడం తక్షణ ఆవశ్యకత. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారాలను కేంద్రానికి కల్పించే 3వ అధికరణకు సవరణ తేవాల్సిన ఆవశ్యకతపై మా పార్టీ తయారు చేసిన సంక్షిప్తమైన నోట్‌ను, ఏపీ రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి మా పార్టీ సమర్పించిన లేఖ ప్రతిని కూడా ఈ లేఖకు జోడిస్తున్నాం. ఈ లేఖ మీకు మరింత స్పష్టతనిస్తుంది. ఏపీ విభజన ప్రతిపాదన వలన కలిగే దుష్ఫలితాల వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇది అత్యంత కీలక సమయం. ప్రజాస్వామ్యం ఒక వంచనాత్మాక సౌధం వాకిట నిలిచిన సమయం. మనం ప్రజాస్వామ్యన్ని పరిరక్షి ంచి, దాని పవిత్రతను కాపాడాల్సి ఉంది. ప్రజాభీష్టమే విజయం సాధించాలి తప్ప కొందరు నేతల లెక్కలు కావు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం సాగుతున్న పోరాటానికి సౌహార్ద్రతను ప్రకటించి, పార్లమెంటులో ఆ బిల్లును ఓడించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేతులు కలపాలని మీ అందరినీ మరో మారు కోరుతున్నాను. -
అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయమ్మ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం పెట్టాలని తాము జాతీయ పార్టీలను కోరుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. జాతీయ పార్టీలన్నీ సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు ఆమె ఇక్కడ తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి డీఎంకే ఎంపీ కనిమొళి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, లను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముందు నుంచీ తాము సమైక్యాంధ్ర కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు నియమించిన మంత్రుల కమిటీ మరో సైమన్ కమీషన్ లాంటిదని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ సిపి బృందం మరికొందరు జాతీయ పార్టీల నేతలను కలుసుకుంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ ఆ పార్టీ చేస్తోంది. -
అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయమ్మ
-
తృతీయ కూటమిపై కారత్‌తో చర్చలు : ములాయం
ఇటావా : దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటుకుగల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి త్వరలో తాను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ను కలవనున్నట్టు సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 30న ఢిల్లీలోని తల్కటోరాలో జరగనున్న సమావేశానికి కారత్ తనను ఆహ్వానించారని వెల్లడించారు. ఈ సమావేశానికి మరికొందరు ప్రముఖ నాయకులు కూడా హాజరుకానున్నారని చెప్పారు. మూడో ఫ్రంట్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. పార్లమెంటు సాధారణ ఎన్నికలు మరికొన్ని నెలల వ్యవధిలోనే జరగనున్నప్పటికీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో మూడో ఫ్రంట్ ఆవిర్భావానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ములాయం అన్నారు. బీజేపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీకి ఆదరణ పెరుగుతుండడంతో మతవాద శక్తులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అలజడులు సృష్టిస్తున్నాయని అన్నారు. -
తెలంగాణ ప్రకటనతో విభజన ఉద్యమాలు: సిపిఎం
ఢిల్లీ : ఎన్నికల్లో లబ్ది పొందాలనే సంకుచిత భావనతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను విభజిస్తున్నదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనతో దేశంలో పలుచోట్ల విభజన ఉద్యమాలు తెరపైకి వచ్చాయని చెప్పారు. భాషాప్రయుక్త రాష్ట్రాలను విడగోట్టడం మంచిదికాన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకు ఆమోదం తెలిపితే దేశం మొత్తంలో చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకుంటాయని, అలా ఏర్పాటు చేస్తే దేశ సమాఖ్య వ్యవస్థకే భంగం కలుగుతుందని ప్రకాష్ కారత్ ముందే హెచ్చరించారు. యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ప్రకటనతో చిన్నరాష్ట్రాల ఉద్యమాల తేనె తుట్టిని కదిపినట్లయింది. ఈశాన్యం ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్, మహారాష్ట్రలో విదర్భ ఉద్యమాలు, ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.