
తృతీయ కూటమిపై కారత్‌తో చర్చలు : ములాయం
ఇటావా : దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటుకుగల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి త్వరలో తాను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌ను కలవనున్నట్టు సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 30న ఢిల్లీలోని తల్కటోరాలో జరగనున్న సమావేశానికి కారత్ తనను ఆహ్వానించారని వెల్లడించారు. ఈ సమావేశానికి మరికొందరు ప్రముఖ నాయకులు కూడా హాజరుకానున్నారని చెప్పారు.
మూడో ఫ్రంట్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. పార్లమెంటు సాధారణ ఎన్నికలు మరికొన్ని నెలల వ్యవధిలోనే జరగనున్నప్పటికీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో మూడో ఫ్రంట్ ఆవిర్భావానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ములాయం అన్నారు. బీజేపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీకి ఆదరణ పెరుగుతుండడంతో మతవాద శక్తులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అలజడులు సృష్టిస్తున్నాయని అన్నారు.