సమాజ్‌వాదీ ముసలం.. ముగియలేదా?
సమాజ్‌వాదీ ముసలం.. ముగియలేదా?
Published Sun, Sep 17 2017 1:18 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములాయం కుటుంబంలోని గొడవలతో సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ములాయం, తనయుడు అఖిలేష్‌ల వర్గాలుగా చీలిపోయిన పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించుకోగా.. ఒకానోక టైంలో తనను తాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ ప్రకటించుకోవటం.. సైకిల్ గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించటం లాంటివి చూశాం. చివరకు పరిస్థితి సర్దుమణిగినా.. పార్టీకి భారీ ఓటమి మాత్రం తప్పలేదు.
ఇదిలా ఉంటే నాలుగైదు నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ పార్టీలో పరిస్థితులు ఏం మారలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23న రాష్ట్ర సర్వసభ్య సమావేశం, అక్టోబర్ 5న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ యువనేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. అయితే విభేధాల అనంతరం భారీ స్థాయిలో నిర్వహించబోతున్న పార్టీ సమావేశాల విషయంలో నేతాజీ ములాయం పేరు ప్రస్తావన రాకపోవటం విశేషం. ములాయం వర్గీయులకు కూడా ఈమేర ఆహ్వానం అందలేదనే తెలుస్తోంది.
మరోవైపు ములాయం సింగ్ నేతృత్వంలో ఈ నెల 21న లొహియా ట్రస్ట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రస్ట్ 11 మంది సభ్యుల్లో తనయుడు అఖిలేష్‌తోపాటు, సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్‌లు కూడా ఉన్నారు. అయినప్పటికీ మొన్నామధ్య నిర్వహించిన సమావేశాలకు వీరిద్దరూ హాజరుకాకపోవటంతో.. త్వరలో నిర్వహించబోయేదానిపై కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటంతో సమాజ్‌వాదీ పార్టీ అధికార జగడం ఇంకా సర్దుమణగలేదనే చెప్పుకుంటున్నారు.
Advertisement
Advertisement