ఏచూరికి ఎదురు దెబ్బ.. రాజీనామాకు సిద్ధం? | Sitaram Yechury offers to resign as general secretary | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 22 2018 9:46 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

Sitaram Yechury offers to resign as general secretary - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై పార్టీ అధిష్టానాన్ని ఒప్పించటంలో ఆయన రెండోసారి విఫలమయ్యారు. ఏచూరి చేసిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. 

కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన కేం‍ద్ర కమిటీ ఓటింగ్‌లో 55-31తో ఏచూరి చేసిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో మనస్థాపం చెందిన ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఏచూరిని కొనసాగాల్సిందిగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేయటంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తగ్గారు. అయినప్పటికీ ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో పార్టీ నిర్వహించబోయే అంతరంగిక సమావేశంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఏచూరి సిద్ధమవుతున్నారు. 

అసలు విషయం... 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రధాన లక్ష్యంగా సీపీఎం పార్టీ ఆరు నెలల క్రితం తీర్మానం చేసింది. పార్టీ ఓటు బ్యాంకింగ్‌ పెంచుకోవాలంటే బీజేపీ వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ఓ ప్రతిపాదన లేవనెత్తారు.  కానీ, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని.. పార్టీ నైతిక విలువలు దెబ్బ తింటాయని, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీది మోసపూరిత రాజకీయాలని పేర్కొంటూ సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్‌ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఏచూరి ప్రతిపాదనకు అచ్యుతానందన్‌ మద్ధతు ప్రకటించగా... ప్రకాశ్‌ ప్రతిపాదనకు కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నేతలు, పార్టీ లేబర్‌ విభాగం సీఐటీయూ కారత్‌ ప్రతిపాదనకు మద్ధతు ప్రకటించాయి.  

ఈ పరిణామాలు ఎంతకు తెగకపోవటంతో కోల్‌కతాలో భేటీ నిర్వహించిన కేంద్ర కమిటీ మూడు రోజులపాటు ఏచూరి-కారత్‌ ముసాయిదాల మీద చర్చించింది. శనివారం రాత్రి వరకు ఈ వ్యవహారంపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆదివారం ఓటింగ్‌ నిర్వహించింది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 91 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 55 మంది ప్రకాశ్‌ కారత్‌ ముసాయిదాకు ఓటేయగా.. 31 మంది ఏచూరి ముసాయిదావైపు మొగ్గు చూపారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. దీంతో ఏచూరి ముసాయిదా వీగిపోయినట్లయ్యింది. 

ఏచూరి ఓడిపోలేదు... 
సీతారాం ఏచూరికి బెంగాల్‌ పార్టీ యూనిట్‌ మొదటి నుంచి గట్టి మద్ధతు ఇస్తూ వస్తోంది. ముసాయిదా వీగిపోయిన నేపథ్యంలో ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రతిపాదన మాత్రమే వీగిపోయింది. కానీ, ఆయన ఓడిపోలేదు. అంతరంగిక సమావేశంలో అసలు విషయం తేల్చుకుంటాం’ అంటూ పేర్కొంది. ఇక అలీముద్దీన్‌ స్ట్రీట్‌ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పందించిన ఏచూరి... ‘‘పార్టీ, పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ ఆదేశాల మేరకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నా. అంతిమ నిర్ణయం పార్టీదే’’ అంటూ ప్రకటించటంతో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డ వార్తలకు బలం చేకూరింది. కానీ, కమిటీ భేటీ, ఓటింగ్‌ విషయాలను మాత్రం ఆయన మీడియాతో పంచుకోలేదు. 

చివరిసారిగా 1975లో ప్రధాన కార్యదర్శి ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఆ సమయంలో పీ సుందరయ్య ప్రవేశపెట్టిన ప్రతిపాదనను తిరస్కరణకు గురికాగా.. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement