వామపక్షాలు సహా 9 పార్టీలతో కూటమి
కాంగ్రెస్, బీజేపీలను ఓడించటమే లక్ష్యం
నాలుగు వామపక్ష పార్టీలు, ఎస్‌పీ, జేడీ(యూ), జేడీ(ఎస్), అన్నా డీఎంకే, జేవీఎం నేతల భేటీ
బీజేడీ, ఏజీపీ మద్దతూ ఉందన్న కారత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలు సహా 9 పార్టీలు ఏకమై మూడో కూటమిని ఏర్పాటు చేశాయి. ‘‘మార్పుకు సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ను అధికారం నుంచి తోసివేయాలి. బీజేపీ, మతతత్వ శక్తులను ఓడించి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి’’ అంటూ ఈ పార్టీల కూటమి సంయుక్త ప్రకటన చేసింది. సీపీఎం సహా నాలుగు వామపక్ష పార్టీలతో పాటు.. జనతాదళ్ (యూ), సమాజ్‌వాదీ పార్టీ, అన్నా డీఎంకే, జనతాదళ్ (ఎస్), జార్ఖండ్ వికాస్ మోర్చా నాయకులు మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అసోం గణపరిషత్ (ఏజీపీ), బిజూజనతాదళ్ (బీజేడీ) అధినేతలతో సహా మొత్తం 11 పార్టీలు మూడో కూటమి ఏర్పాటుకు మద్దతు ప్రకటించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నప్పటికీ.. ఆ రెండు పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకాలేదు. అయితే.. బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడే మూడో కూటమి ఏర్పాటు తొందరపాటని వ్యాఖ్యానించటం విశేషం.
పార్టీల ఉమ్మడి ప్రకటన: ప్రధాని అభ్యర్థి విషయాన్ని పక్కనపెట్టి.. మూడో కూటమిని ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయిం చారు. ‘ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, అవినీతిని అంతమొందించాలని, ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలని ఈ పార్టీల నాయకులు తీర్మానించారు. మన సమాజంలో బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని గుర్తించే బలమైన లౌకిక నిర్మాణాన్ని ఈ పార్టీలు ఏర్పాటు చేస్తాయి. అసమానత్వం, సామాజిక న్యాయం, రైతుల ప్రయోజనాలు, మైనారిటీలు, మహిళల హక్కులను, సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు కేంద్రంగా ఉండే అభివృద్ధి మార్గాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. అధికారాన్ని కేంద్రం తన చేతుల్లో కేంద్రీకరించే వ్యవస్థను తిరగదోడి.. అన్ని రాష్ట్రాల హక్కులకూ భద్రతనిచ్చే నిజమైన సమాఖ్య వ్యవస్థను నిర్మిస్తాం. అవసరమైన రాష్ట్రాలకు ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తాం’ అని సంయుక్త ప్రకటనలో హామీ ఇచ్చాయి.
కాంగ్రెస్ హీనం.. బీజేపీ అంతకన్నా ఘోరం
సమావేశం అనంతరం కారత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ది లోపభూయిష్ట పాలన, భారీ అవినీ తి, అనూహ్యమైన ధరల పెరుగుదల, విస్పష్టమైన అసమానతలను సృష్టించిన చరిత్ర. బీజేపీ కూడా కాంగ్రెస్‌కు ఏమాత్రం భిన్నమైనది కాదు. ఇంతకుముందు కేంద్రం లో, ఇప్పుడు ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అవినీతి చరిత్ర కాంగ్రెస్ కన్నా ఘోరమైనది. పైగా.. మన దేశ, సమాజ లౌకిక నిర్మాణానికి అది తీవ్ర విఘా తం కలిగించే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీకి కవల పార్టీ. ఒకే నాణేనికి మరోవైపు ఉన్న పార్టీ’ అని అభివర్ణించారు.
వాటికి మద్దతివ్వం.. మద్దతు తీసుకోం...
‘కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన 272 సీట్లను సాధించటంలో మూడో కూటమి విఫలమైన పక్షంలో.. కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు తీసుకుంటుందా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఆ ప్రశ్నే లేదు. ఈ రెండు ప్రధాన పార్టీల నుంచి మద్దతు తీసుకునే ప్రసక్తి కానీ, వాటికి మద్దతు ఇచ్చే ప్రసక్తి కానీ లేదు’’ అని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ స్పష్టంచేశారు.
పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉండదు...
రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య పొత్తులు, సీట్ల పంపకం గురించి ప్రశ్నించగా.. ప్రతి పార్టీకి తమ సొంత ప్రాంతాలు, రాష్ట్రాల్లో బలం ఉందని కారత్ బదులిచ్చారు. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో తమ వనరులను సమీకరిస్తామని చెప్పారు. ‘‘దీనర్థం.. వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకుంటాయని కానీ, సీట్ల సర్దుబాట్లు కుదుర్చుకుంటాయని కానీ కానవసరం లేదు’’ అని పేర్కొన్నారు.
హాజరైన నేతలు వీరే: కారత్, నితీశ్, ములాయంలతో పాటు.. దేవెగౌడ (జేడీ-ఎస్), ఎ.బి.బర్ధన్, సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), ఎం.తంబిదురై (అన్నా డీఎంకే), టి.జి.చంద్రచూడన్ (ఆర్‌ఎస్‌పీ), దేబబ్రతబిస్వాస్ (ఫార్వర్డ్ బ్లాక్), సీతారాం ఏచూరి (సీపీఎం), కె.సి.త్యాగి (జేడీ-యూ)లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
15 కావచ్చు: ములాయం
కేంద్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సమయాల్లో మద్దతు ఇవ్వటం గురించి ఎస్‌పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను ప్రశ్నించగా.. ‘‘నేను లోక్‌సభలో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాను’’ అని ఆయన బదులిచ్చారు. ‘‘ఇప్పుడున్న 11 పార్టీలు రేపు 15 పార్టీలు కావచ్చు’’ అంటూ భవిష్యత్‌లో కాంగ్రెస్ మద్దతు అవసరం తమకు రాకపోవచ్చునని ములాయం పరోక్షంగా చెప్పారు.
ఆ తర్వాతే ప్రధాని అభ్యర్థి
కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని కారత్, ములాయం, నితీశ్‌లు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా స్పష్టంచేశారు. ‘‘ఈ విషయంపై గతంలో మేం ఎన్నడూ గొడవ పడలేదు. మొరార్జీదేశాయ్, వి.పి.సింగ్, హెడ్.డి.దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానమంత్రులుగా ఎన్నికల తర్వాతే నిర్ణయించటం జరిగింది’’ అని ములాయం గుర్తుచేశారు.