న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఘోర ఓటమి పాలైన పిదప ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. 543 లోక్ సభ సీట్లకు గాను కేవలం 12 సీట్లను మాత్రమే వామపక్షాలు గెలుచుకోవడంతో పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభావంతో దేశంలోని ప్రముఖ పార్టీలన్నీ చతికిలబడటాన్ని అంగీకరిస్తూనే.. వామపక్షాల ఇంతటి ఘోర వైఫల్యాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధినాయకులను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని స్వయంగా ఓ వామపక్ష నేత తన అభిప్రాయంగా తెలిపారు. గతంలో 60 సీట్లున్న వామపక్షాలు ఇంతటి ఘోర వైఫల్యానికి అసలు బాధ్యలెవరనేది ప్రశ్నార్ధకంగానే ఉన్నా.. దానికి నైతిక బాధ్యత మాత్రం ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరూలదేనని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మీడియాతో చెప్పారు. తమ పార్టీ నాయకత్వంలో దృఢమైన నిర్ణయాలు తీసుకునే నాయకులే కొరవైయ్యారంటూ విమర్శించారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఆ ప్రముఖ నేతలిద్దరూ బాధ్యతవహించాలంటున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి కూడా వారికి వేరే మార్గం కూడా ఏమీ లేదన్నారు. తప్పకుండా ఆ ఓటమికి వారిద్దరే మాత్రమే బాధ్యులని తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా 34 సంవత్సారాల పాటు పరిపాలించిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో సీపీఎంకు 9 ఎంపీ సీట్లు గెలవగా, ఇందులో ప శ్చిమబెంగాల్ నుంచి 2 సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి ఇప్పటికీ బోధపడటంలేదు. ఇంతకీ దీనికి బాధ్యులు ఎవరు? పార్టీలోని ముఖ్య నేతలేనా?లేక అసలు ఆ పార్టీల విధివిధానాలు ఏమిటో ప్రజల్లోకి చేరలేదా?అనేది దానికి ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలి.