మమతా బెనర్జీపై కేవలం కార్టూన్ వేసినందుకు ఏకంగా ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ నేతలది.
కోల్‌కతా: మమతా బెనర్జీపై కేవలం కార్టూన్ వేసినందుకు ఏకంగా ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ నేతలది. ఇప్పుడు ఆ పార్టీ నేతలే మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయ లబ్ధి పొందేందుకు తహతహలాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కరత్‌కు మిఠాయి తినిపిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను తృణమూల్ ఎంపీ డిరెక్ ఒబ్రియన్ ఆదివారం విలేకరులకు విడుదల చేశాడు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా సిద్ధాంత వైరుధ్యమున్న బీజేపీ-సీపీఎం చేతులు కలిపాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇది నిజమైన ఫొటోనా? కాదా? అన్నది మాత్రం ఆయన చూసుకోలేదు.
ఈ ఫొటోపై వెంటనే బీజేపీ మండిపడింది. అది ఫొటోషాపింగ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో అని, నిజానిజాలు తెలుసుకోకుండానే తృణమూల్ నకిలీ ఫొటోలను విడుదలచేస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. 2013లో ప్రధాని నరేంద్రమోదీకి రాజ్‌నాథ్ స్వీట్ తినిపిస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి తృణమూల్ నాటకమాడుతుందని ఆయన దుయ్యబట్టారు. సీపీఎం అగ్రనేత కరత్ కూడా స్పందించారు. రాజ్‌నాథ్ హోంమంత్రి అయ్యాక ఆయనను తాను కలువనే లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న డిరెక్ ఒబ్రియన్ క్షమాపణ చెప్పారు. తమ రీసెర్చ్ టీమ్ సరిగ్గా పరిశీలించకుండానే ఈ ఫొటోను ఇచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు.