west bengal elections
-
నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకుంటా; ఎంపీ సవాల్
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించి బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నబీజేపీకి అభిషేక్ ఒక సంచలన సవాల్ విసిరారు. ‘‘ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి రావాలనే చట్టాన్ని తీసుకొచ్చే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని సంచలన ప్రకటన చేశారు. ‘‘తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా తనకు తానే ఉరేసుకుంటా’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే బీజేపీలో కైలాష్ విజయ్‌వర్గీయ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్ నుంచి రంజిత్‌సింగ్ వరకు ఈ నేతల కుటుంబసభ్యులంతా బీజేపీలోని ముఖ్యమైన పదవులను అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని చట్టం తీసుకొస్తే.. మా కుటుంబం నుంచి సీఎం మమతా బెనర్జీ మాత్రమే టీఎంసీలోఉంటారని.. తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతాబెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
దూకుడు తగ్గించడమా? పెంచడమా?
కోల్‌కతా/న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో.. రానున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడింది. గతంలో మాదిరిగానే పౌరసత్వ సవరణ చట్టం అమలు, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై దూకుడుగా వెళ్లాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహాలను తెరపైకి తేవాలా? అనే విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అధికార టీఎంసీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోవని తాజా ఢిల్లీ ఎన్నికలు స్పష్టం చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని భావించలేమని పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. వారు ఢిల్లీ ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఢిల్లీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. ‘ఢిల్లీలో కొన్ని నెలల వ్యవధిలోనే రెండు విభిన్న ఫలితాలు వచ్చాయి. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమాగా ఉండలేం’ అని వారు వివరించారు. ‘రాష్ట్ర ఎన్నికలకు వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది. జాతీయ ఎన్నికల్లో పనిచేసిన అంశాలు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు.సీఏఏ, ఎన్నార్సీల అమలుపైననే మా ప్రచారం ఉండకూడదు. సుపరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలనూ తెరపైకి తేవాలి’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. ఈ వాదనకు విరుద్ధంగా మరో వాదనను మరి కొందరు నేతలు వినిపించారు. ‘సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి వ్యూహాలను మార్చాల్సిన అవసరం లేదు. వాటిపై దూకుడుగా ముందుకు వెళ్లడమే మంచిది. గతంలో అలా దూకుడుగా వెళ్లిన సందర్భంగా మంచి ఫలితాలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. తృణమూల్ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే.. ఆవేశపూరిత, ఉద్వేగభరిత వ్యూహాలనే అమలు చేయాలి. ఒకవేళ వ్యూహాలను మారిస్తే వెనకడుగు వేసినట్లవుతుంది. ఇది పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సందేశం తీసుకువెళ్తుంది’ అని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌కు సన్నిహితులైన కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడ్తున్నారు. ద్విముఖ పోరు వల్లనే ఓటమి ‘ఢిల్లీ’ పరాజయంపై బీజేపీ సమీక్ష ప్రారంభించింది. గతం కన్నా ఈ సారి ఓటు శాతం పెంచుకున్నప్పటికీ.. ద్విముఖ పోటీ నెలకొనడం వల్లనే ఓటమి పాలయినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 62 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 2015లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి ఆ సంఖ్యను కాస్త మెరుగుపర్చుకుని 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, పార్టీ దిగ్గజాలను ప్రచార బరిలో దింపినప్పటికీ ఆశించిన ఫలితం దక్కకపోవడంపై గురువారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. -
సీపీఎం అడుగులు ఎటు?
పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి? బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గురించి ఏదైనా చెప్పడానికి ఉన్నదీ అంటే, అది– ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మిగిలి ఉంది అని చెప్పడమే. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం పనిచేస్తోందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే, సీపీఎం కలకత్తా సభలలో జరిగిన పరిణామం దేశంలోని మరే ఇతర రాజకీయ పార్టీలో అయినా చోటు చేసుకుకోగలదంటే నమ్మడం సాధ్యం కాదు. రాహుల్ గాంధీ, అమిత్‌షా, లేదంటే కె. చంద్రశేఖరరావు ఏదైనా ఒక రాజకీయ ప్రతిపాదన చేస్తే వారి నాయకత్వంలోని పార్టీల సభ్యులు దానిని ఓడిస్తారని మనం కలలో అయినా ఊహించగలమా? కలకత్తాలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగబోయే సమావేశానికి అజెండాను తయారు చేసి పెట్టిన సమావేశం ఇది. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో వ్యూహాత్మక అవగాహన కుదుర్చుకోవాలని ఆ పార్టీలో ఒక ప్రతిపాదన ఉంది. ఈ ఆలోచనకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మద్దతు ఉంది. కానీ ఇలాంటి ఆలోచనకు సీతారాం యేచూరి కంటే ముందు ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న ప్రకాశ్ కారత్‌తో పాటు, పార్టీ కేరళ శాఖ కూడా ప్రతిఘటించడం జరిగింది. దీని మీదే తీవ్ర స్థాయి చర్చ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఓటింగ్ పెట్టడంతో 31 ఓట్లతో సీతారాం యేచూరి ప్రతిపాదన వీగిపోయింది. ఆయన చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా 55 ఓట్లు వచ్చాయి. దీని అర్థం కాంగ్రెస్ చేయి, సీపీఎంకు అండగా ఉండదు. హైదరాబాద్ సభల నిర్ణయమే కీలకమా? అయితే హైదరాబాద్ సభలో తీసుకునే నిర్ణయమే అంతిమ నిర్ణయమవుతుం దని యేచూరి వర్గీయులు మాత్రం లోపాయికారీగా ఇప్పటికీ వాదిస్తున్నారు. ఈ వర్గంలో ఎక్కువగా బెంగాల్ శాఖ సభ్యులే ఉన్నారు. అలాగే ఫిబ్రవరిలో జరగబోయే త్రిపుర ఎన్నికల తరువాత పరిస్థితులు మారతాయని కూడా ఆశాజనకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోని కూటమి నుంచి సీపీఎం నాయకత్వంలోని కూటమి గట్టి పోటీని ఎదుర్కొం టున్నది. కానీ కేరళ పార్టీ శాఖ తన విధానాన్ని మార్చుకోదు. ఆ రాష్ట్ర పరిస్థితి అనే పట్టకం నుంచి చూసుకుని ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తుంది కూడా. ఆ రాష్ట్ర రాజకీయాలలో సీపీఎం నాయకత్వంలోని కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమితో తలపడుతుంది. కాబట్టి జాతీయ స్థాయి ఒప్పందం యోచనకు అంగీకరించదు. దీని వల్ల బీజేపీకి ప్రతిపక్ష స్థానం లభిస్తుందని సీపీఎం భయపడుతోంది. నిజానికి బీజేపీ కూడా అలాంటి అవకాశం కోసమే అక్కడ ఎదురుచూస్తున్నది. యేచూరి ప్రతిపాదనను ఓడించడానికి కారత్ శిబిరం 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మందుగుండులా ఉపయోగించుకుంది. ఆ ఎన్నికలలో బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నాయి. అయితే సీపీఎం కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు లభించాయి. కారత్ చెప్పినది వాస్తవమని రుజవయిందని చెప్పడానికి ఆ ఎన్నికల ఫలితాలే ఉపయోగపడినట్టు కనిపిస్తున్నది. అప్పుడు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు కారత్ వర్గం వ్యతిరేకించింది. ‘నేను ముందే చెప్పలేదూ!’ అన్న భావాన్ని గొంతు నిండా నింపుకుని ప్రకాశ్ కారత్ కలకత్తా సభలకు వచ్చారు. కాగా, పార్టీలో జరిగిన అత్యున్నత స్థాయి ఎన్నికలలో తన ప్రతిపాదన వీగిపోవడమంటే, పార్టీలో తన స్థానం ఎక్కడో యేచూరికి అవగతమయ్యేటట్టు చేసినట్టే. ఇంకా చెప్పాలంటే కేంద్ర కమిటీలోని 91 మంది సభ్యులలో మూడింట ఒక వంతు మంది మద్దతును మాత్రమే యేచూరి కూడగట్టగలరని కూడా వెల్లడయింది. ఇది సహజంగానే ఆయనను నిరాశకు గురి చేసి, రాజీనామాకు సిద్ధపడేటట్టు చేసింది. అయితే ఆయనను ఆ పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఆయన నిష్క్రమణకు వీర మరణం స్థాయి దక్కకూడదని భావిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ సమావేశాల కంటే ముందే సీపీఎంలో చీలిక అవకాశాలను తోసిపుచ్చలేం. నిజానికి ఈ ఎన్నిక పార్టీలోని దోషాన్ని కూడా ఎత్తి చూపింది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకు కూడా అంగీకరించకుండా కేరళ శాఖ ఓటు వేసింది. ఇక బెంగాల్ శాఖలో అయితే ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన వారంతా యేచూరి ప్రతిపాదనకు మద్దతు పలికారు. దేశ రాజకీయ వ్యవస్థలో వేగంగా ప్రాధాన్యం కోల్పోతున్న పార్టీకి ఇది మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం యేచూరికి ఇదే మొదటిసారి కాదు కూడా. రాజ్యసభ బరిలోకి యేచూరి దిగితే సీపీఎంకు తమ మద్దతు ఉంటుందని జూలై , 2017లో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఆయనను మూడోసారి కూడా ఎగువ సభకు పంపించడానికి సీపీఎం కేంద్ర కమిటీ నిరాకరించింది. ఎందుకంటే ఆ పార్టీలో ఎవరికీ రెండు పర్యాయాలకు మించి ఆ అవకాశం ఇవ్వరు. పార్టీ నిర్మాణం పని మీద యేచూరి మరింత సమయం కేటాయించవలసి ఉంది. చివరిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సీపీఎంకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇందులో చివరి కారణమే రాజకీయంగా చాలా ప్రాధాన్యం కలి గినది. పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి? వామపక్షాల ప్రభావం నిజంగా ఎంత? బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు. నిజం చెప్పాలంటే వామపక్షం ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కేవలం లెటర్‌హెడ్ పార్టీ స్థాయికి కుంచించుకుపోయింది. ఎన్నికలలో వరస అపజయాలు, వివిధ రాష్ట్రాలలోని ప్రధాన స్రవంతి పార్టీలకు తోక పార్టీలుగా వ్యవహరించడం కూడా ఆ పరిస్థితిని తెచ్చి పెట్టింది. తనకు సిద్ధాంతపరమైన గౌరవం ఉందని ఆ పార్టీ అభిప్రాయం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ – ఈ జాబితా ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఈ అన్ని రాష్ట్రాలలోను వామపక్షం రాజకీయ పక్షంగా ప్రాధాన్యం కోల్పోయింది. వీటితో పాటు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకునే స్థితిలో కూడా వామపక్షం లేదు. ఇది కూడా ఒక వాస్తవమే. అమెరికాకు వ్యతిరేకంగా వారు ఇచ్చే సామ్రాజ్య వ్యతిరేక నినాదాలు 21వ శతాబ్దపు భారతదేశంలో చర్విత చర్వణంగా మాత్రమే ఉన్నాయి. అయితే కేంద్రంలోను, రాష్ట్రాలలోను బీజేపీ నుంచి ఎంతటి ప్రతికూలత ఎదురవుతున్నప్పటికీ వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో చురుకుగానే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయి రాజకీయాలకీ; కేంద్ర రాష్ట్ర స్థాయి రాజకీయాలకూ మధ్య వచ్చిన శూన్యాన్ని నింపడం ఎలాగో కూడా సీపీఎం ఆలోచించాలి. విశ్వవిద్యాలయాల స్థాయిలో మొదటిసారి ఓటు హక్కు విని యోగించుకుంటున్నవారిని సాధారణ ఎన్నికలలో తమ బలంగా ఎందుకు మలుచుకోలేకపోతున్నారు? ఇందుకు కారణం కొన్ని భ్రమలలో ఆ పార్టీ చిక్కుకుని ఉండడమే. బీజేపీని తన ప్రధాన శత్రువని సీపీఎం పేర్కొంటున్నది. అయినప్పటికీ, బీజేపీ కంటే తక్కువ శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి అది సుముఖంగా లేదు. ప్రజా ప్రయోజనం కంటే అహంభావానిదే పై చేయి అయ్యేటట్టు చేస్తోందనడానికి ఇదే నిదర్శనం. వామపక్షం గళం బొత్తిగా కరవైపోతున్న కాలమిది. సాపేక్షంగా చూసినప్పుడు యేచూరి వంటి యువ నాయకుడి అవసరం ఇప్పుడు రాజ్యసభలో ఉందన్న వాస్తవాన్ని పార్టీ గుర్తించడం లేదు. పైగా నిబంధనలంటూ మంకు పట్టుకు పరిమితమైంది. కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు వామపక్షాలు తిరస్కరించడం అంటే అది విపక్ష కూటమి ఏర్పాటు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది క్షేత్రస్థాయిలో కాకపోవచ్చు. కానీ అవగాహనకు సంబంధించి ఎక్కువ ప్రభావం చూపుతుంది. కలకత్తా సభ తరువాత సీపీఎం నిర్ణయం మీద కొన్ని చతురోక్తులు ఇప్పటికే జనంలోకి వచ్చాయి కూడా. అక్కడ జరిగిన నిర్ణయం సీపీఎంలో బీజేపీ విజయమని ఆ చతురోక్తులు పేర్కొంటున్నాయి. ఇంకా పలువురు ఇది సీపీఎం పార్టీ చేసిన రెండవ చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నారు. 1996లో జ్యోతిబసు ప్రధాని కావడానికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నడం మొదటి చారిత్రక తప్పిదమని చెబుతూ ఉంటారు. ఆ రెండుచోట్ల మినహాయించినా... సీపీఎం నిర్ణయాన్ని గుడ్డిలో మెల్లగా భావించాలి. ముఖ్యంగా బెంగాల్ రాజకీయాల విషయంలో అయితే అదే నిజం. అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు ఖాళీ చేసిన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి దీటుగా నిలబడగలిగిన ప్రధాన వ్యతిరేక శక్తి. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలి. 2019 ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి సోనియాగాంధీ, మమతా బెనర్జీల మధ్య ఉన్న స్నేహాన్ని ఉపయోగించాలి. సీట్ల సర్దుబాటు విషయంలో మమత కొన్ని చిక్కులు సృష్టించవచ్చు. కానీ రాహుల్ మాత్రం సీపీఎం చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయరాదు. రాహుల్ ఢిల్లీలో ఉంటూ కలకత్తా పట్టకం నుంచి చూసి పరిస్థితులను అంచనా వేయరాదు. కేరళకు సంబంధించి ఢిల్లీలో దోస్తీ, కేరళలో కుస్తీ వంటి మాటలతో బీజేపీ ఎద్దేవా చేసే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకోకూడదు. మరొక విపక్షంగానే భావిస్తూ అక్కడ కాంగ్రెస్ కూటమి పినరాయ్ విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్తో పోరాడగలదు. సీపీఎం, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగినా అక్కడ మూడో పక్షానికి స్థానానికి దొరకడమనేది అరుదని గతాన్ని చూస్తే తెలుస్తుంది. బీజేపీ పరిస్థితి అక్కడ అదే. తన ప్రతిపాదన గురించి సభ్యులకు అవగాహన కల్పించడానికి సీతారాం యేచూరికి ఇంకా రెండు మాసాల గడువు ఉంది. కేరళ, బెంగాల్‌లను మినహాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి సీపీఎంకు కొంత అవకాశం ఉంది. కానీ దీనితో ప్రయోజనం తక్కువే. ఇలాంటి ప్రయత్నం మూడోసారి కూడా విఫలమైతే యేచూరికి రాజీనామా చేయడం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం పార్టీలో బలం లేని వాస్తవాన్ని ఏ నాయకుడికైనా అర్థమయ్యేటట్టు చేస్తుంది. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
మార్ఫింగ్ ఫొటోతో రచ్చరచ్చ!
కోల్‌కతా: మమతా బెనర్జీపై కేవలం కార్టూన్ వేసినందుకు ఏకంగా ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ నేతలది. ఇప్పుడు ఆ పార్టీ నేతలే మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయ లబ్ధి పొందేందుకు తహతహలాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కరత్‌కు మిఠాయి తినిపిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను తృణమూల్ ఎంపీ డిరెక్ ఒబ్రియన్ ఆదివారం విలేకరులకు విడుదల చేశాడు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా సిద్ధాంత వైరుధ్యమున్న బీజేపీ-సీపీఎం చేతులు కలిపాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇది నిజమైన ఫొటోనా? కాదా? అన్నది మాత్రం ఆయన చూసుకోలేదు. ఈ ఫొటోపై వెంటనే బీజేపీ మండిపడింది. అది ఫొటోషాపింగ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో అని, నిజానిజాలు తెలుసుకోకుండానే తృణమూల్ నకిలీ ఫొటోలను విడుదలచేస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. 2013లో ప్రధాని నరేంద్రమోదీకి రాజ్‌నాథ్ స్వీట్ తినిపిస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి తృణమూల్ నాటకమాడుతుందని ఆయన దుయ్యబట్టారు. సీపీఎం అగ్రనేత కరత్ కూడా స్పందించారు. రాజ్‌నాథ్ హోంమంత్రి అయ్యాక ఆయనను తాను కలువనే లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న డిరెక్ ఒబ్రియన్ క్షమాపణ చెప్పారు. తమ రీసెర్చ్ టీమ్ సరిగ్గా పరిశీలించకుండానే ఈ ఫొటోను ఇచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. -
ఎన్నికల సిబ్బంది కారులో బాంబులు!
పశ్చిమబెంగాల్లో ఎన్నికల హింస దారుణంగా ఉంది. ఎన్నికల అధికారులను తీసుకెళ్లాల్సిన కారులో నాలుగు బాంబులు కనిపించాయి. డ్రైవర్ కారును స్టార్ట్ చేయబోతుండగా.. ఈ బాంబులను గుర్తించారు. ఆదివారం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు డీసీఆర్సీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న సెంట్రల్ స్కూలు ఆవరణలో ఈ కారు పార్క్ చేసి ఉంది. తన కారు సీటు కింద పాలిథిన్ బ్యాగులో ఏవో వస్తువులు ఉండటాన్ని డ్రైవర్ చూశాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేయడంతో అందరూ అక్కడకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, పోలీసు సిబ్బంది కూడా వచ్చి పాలిథిన్ బ్యాగును తీశారు. అందులో నాలుగు బాంబులు ఉన్నట్లు ఆ తర్వాత చెప్పారు. ఈ ఘటనతో ఎన్నికల వాహనాలను తీసుకెళ్లడానికి అక్కడున్న డ్రైవర్లు నిరాకరించారు. తమకు తగినంత భద్రత కల్పించాలని లేకపోతే ముందుకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఎన్నికల సిబ్బందిని తరలించడం కూడా కష్టంగా మారింది. -
అప్పుడు మా మాటీ మానుస్.. ఇప్పుడు మనీ మనీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. పరస్పర విమర్శలతో అక్కడి వాతావరణం గరం గరంగా మారింది. గత ఎన్నికల్లో 'మా మాటీ మానుష్' అనే నినాదం విన్నామని, కానీ ఐదేళ్ల తర్వాత చూస్తే ఎక్కడ చూసినా 'మరణం.. మరణం.. మరణం..' అని, 'మనీ.. మనీ' అని వింటున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. ''నరదా తెలుసు కదా.. టీవీలో చూశాను.. ఈ మా మాటీ మానుస్ వాళ్లు డబ్బు తీసుకుంటున్నారు డబ్బులు..'' అని ఎద్దేవా చేశారు. నరదా స్టింగ్ ఆపరేషన్‌లో పశ్చిమబెంగాల్ మంత్రులు లంచాలు తీసుకుంటుండగా బయటపడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వాళ్లకు అభవృద్ధితో అవసరం లేదని.. ఒకవైపు వామపక్షాలు మరోవైపు దీదీ ఇద్దరూ అత్యాచారాలు, అవినీతి, హింసకు సంబంధించిన ఆరోపణలతో పరస్పరం కొట్టుకుంటున్నారని మోదీ అన్నారు. దీదీ గానీ, వామపక్షాలు గానీ.. మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వరని ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీల పాలనలో పశ్చిమబెంగాల్ దారుణాలను చూసిందని, ఇద్దరి తీరుతెన్నులు స్పష్టంగా తెలిశాయని చెప్పారు. తన సమావేశాలకు రావడానికి మమతా బెనర్జీ వెనకాడతారని, కానీ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సోనియా గాంధీని మాత్రం తప్పనిసరిగా కలిసి వెళ్తారని.. వాళ్లిద్దరి బంధం ఏంటో తనకు అర్థం కాదని అన్నారు. -
91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్!
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారత ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అధికారంలో ఉన్న 1962లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీచేశారు. వెనుదిగిరి చూస్తే 54 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికల సమరంలో ఆయన పదికిపైగా విజయాలు సాధించారు. అయినా 91 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఎన్నికల గోదా నుంచి ఆయన తప్పుకోలేదు. ఇప్పటికీ అదే ఇనుమడించిన ఉత్సాహంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆయనే జ్ఞాన్‌సింగ్ సోహన్‌పాల్. 91 ఏళ్ల ఆయన బెంగాల్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ సర్దార్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు పోటీగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాంప్రసాద్ తివారీ, అటు బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బరిలోకి దిగారు. సోహన్‌పాల్ 1977 ఎన్నికల్లో తొలిసారి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో వామపక్షాల ప్రభంజనంతో బెంగాల్లో కాంగ్రెస్‌లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని పరాజయాలు ఎదురైనా ఆయన ప్రత్యక్ష రాజకీయ రంగం నుంచి వైదొలగలేదు. 'ప్రజలకు ఎంతో పనిచేయాల్సి ఉంది. ఎన్నో ప్రాజెక్టులు సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది' అని ఉత్సాహంగా చెప్తున్నారు సోహన్‌పాల్. 'చాచా'గా పేరొందిన సోహన్‌పాల్ మరోసారి ప్రజల మద్దతు తనకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరగ్‌పూర్ పట్టణంలో ప్రతి ఒక్కరూ తనను గుర్తుపడతారని, ప్రజలకు సేవ చేసేందుకు తనకు మరో అవకాశం లభిస్తుందని ముదుసలి వయస్సులోనూ ఉత్సాహం ఏమాత్రం ఈ కాంగ్రెస్ అభ్యర్థి భరోసాగా ఉన్నారు. -
ఆమె సూపర్ ఫాస్ట్ గురూ!
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలు ప్రకటించి మినీ సార్వత్రిక సంగ్రామానికి తెరతీశారు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ. ఆయన అలా తేదీలు ప్రకటించారో.. లేదో, అదేరోజు సాయంత్రం తమ రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలకు కూడా పశ్చిమబెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నింటికీ ఒకేసారి తేదీలను ప్రకటించారు. కానీ, ఈ ఐదు రాష్ట్రాల్లో టీఎంసీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా అసలు ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. మమతమ్మ మాత్రం పెద్ద ఫైలు పట్టుకుని సాయంత్రం మీడియాను పిలిచి మొత్తం అన్ని స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెప్పారు. దాంతో ప్రత్యర్థులు సహా ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ఇంత ప్రిపరేషన్ ఉండటం అసాధ్యమని, దాన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత కేవలం మమతకే దక్కుతుందని అంటున్నారు. వరుసగా రెండోసారి కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ విజయకేతనం ఎగరేయడం దాదాపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మమతా దీదీ ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉంటే.. ఇక ప్రత్యర్థి పార్టీలు కోలుకోవడం కష్టంలాగే కనిపిస్తోంది. కమ్యూనిస్టులు సహా మరే ఇతర పార్టీ ఇంకా అసలు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కసరత్తులు మొదలుపెట్టక ముందే అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటే.. వాళ్లకు చాలా ఎక్కువ సమయం దొరుకుతుంది. దాంతో విజయావకాశాలు మరింత మెరుగుపడటం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేయడంలో మమతా బెనర్జీ మహా ఫాస్ట్ అని చెబుతారు. మరీ ఇంత ఫాస్టా అని మిగిలినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట.