పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి? బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గురించి ఏదైనా చెప్పడానికి ఉన్నదీ అంటే, అది– ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మిగిలి ఉంది అని చెప్పడమే. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం పనిచేస్తోందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే, సీపీఎం కలకత్తా సభలలో జరిగిన పరిణామం దేశంలోని మరే ఇతర రాజకీయ పార్టీలో అయినా చోటు చేసుకుకోగలదంటే నమ్మడం సాధ్యం కాదు. రాహుల్ గాంధీ, అమిత్‌షా, లేదంటే కె. చంద్రశేఖరరావు ఏదైనా ఒక రాజకీయ ప్రతిపాదన చేస్తే వారి నాయకత్వంలోని పార్టీల సభ్యులు దానిని ఓడిస్తారని మనం కలలో అయినా ఊహించగలమా?
కలకత్తాలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగబోయే సమావేశానికి అజెండాను తయారు చేసి పెట్టిన సమావేశం ఇది. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో వ్యూహాత్మక అవగాహన కుదుర్చుకోవాలని ఆ పార్టీలో ఒక ప్రతిపాదన ఉంది. ఈ ఆలోచనకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మద్దతు ఉంది. కానీ ఇలాంటి ఆలోచనకు సీతారాం యేచూరి కంటే ముందు ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న ప్రకాశ్ కారత్‌తో పాటు, పార్టీ కేరళ శాఖ కూడా ప్రతిఘటించడం జరిగింది. దీని మీదే తీవ్ర స్థాయి చర్చ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఓటింగ్ పెట్టడంతో 31 ఓట్లతో సీతారాం యేచూరి ప్రతిపాదన వీగిపోయింది. ఆయన చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా 55 ఓట్లు వచ్చాయి. దీని అర్థం కాంగ్రెస్ చేయి, సీపీఎంకు అండగా ఉండదు.
హైదరాబాద్ సభల నిర్ణయమే కీలకమా?
అయితే హైదరాబాద్ సభలో తీసుకునే నిర్ణయమే అంతిమ నిర్ణయమవుతుం దని యేచూరి వర్గీయులు మాత్రం లోపాయికారీగా ఇప్పటికీ వాదిస్తున్నారు. ఈ వర్గంలో ఎక్కువగా బెంగాల్ శాఖ సభ్యులే ఉన్నారు. అలాగే ఫిబ్రవరిలో జరగబోయే త్రిపుర ఎన్నికల తరువాత పరిస్థితులు మారతాయని కూడా ఆశాజనకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోని కూటమి నుంచి సీపీఎం నాయకత్వంలోని కూటమి గట్టి పోటీని ఎదుర్కొం టున్నది. కానీ కేరళ పార్టీ శాఖ తన విధానాన్ని మార్చుకోదు. ఆ రాష్ట్ర పరిస్థితి అనే పట్టకం నుంచి చూసుకుని ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తుంది కూడా. ఆ రాష్ట్ర రాజకీయాలలో సీపీఎం నాయకత్వంలోని కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమితో తలపడుతుంది. కాబట్టి జాతీయ స్థాయి ఒప్పందం యోచనకు అంగీకరించదు. దీని వల్ల బీజేపీకి ప్రతిపక్ష స్థానం లభిస్తుందని సీపీఎం భయపడుతోంది. నిజానికి బీజేపీ కూడా అలాంటి అవకాశం కోసమే అక్కడ ఎదురుచూస్తున్నది.
యేచూరి ప్రతిపాదనను ఓడించడానికి కారత్ శిబిరం 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మందుగుండులా ఉపయోగించుకుంది. ఆ ఎన్నికలలో బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నాయి. అయితే సీపీఎం కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు లభించాయి. కారత్ చెప్పినది వాస్తవమని రుజవయిందని చెప్పడానికి ఆ ఎన్నికల ఫలితాలే ఉపయోగపడినట్టు కనిపిస్తున్నది. అప్పుడు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు కారత్ వర్గం వ్యతిరేకించింది. ‘నేను ముందే చెప్పలేదూ!’ అన్న భావాన్ని గొంతు నిండా నింపుకుని ప్రకాశ్ కారత్ కలకత్తా సభలకు వచ్చారు.
కాగా, పార్టీలో జరిగిన అత్యున్నత స్థాయి ఎన్నికలలో తన ప్రతిపాదన వీగిపోవడమంటే, పార్టీలో తన స్థానం ఎక్కడో యేచూరికి అవగతమయ్యేటట్టు చేసినట్టే. ఇంకా చెప్పాలంటే కేంద్ర కమిటీలోని 91 మంది సభ్యులలో మూడింట ఒక వంతు మంది మద్దతును మాత్రమే యేచూరి కూడగట్టగలరని కూడా వెల్లడయింది. ఇది సహజంగానే ఆయనను నిరాశకు గురి చేసి, రాజీనామాకు సిద్ధపడేటట్టు చేసింది. అయితే ఆయనను ఆ పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఆయన నిష్క్రమణకు వీర మరణం స్థాయి దక్కకూడదని భావిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ సమావేశాల కంటే ముందే సీపీఎంలో చీలిక అవకాశాలను తోసిపుచ్చలేం. నిజానికి ఈ ఎన్నిక పార్టీలోని దోషాన్ని కూడా ఎత్తి చూపింది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకు కూడా అంగీకరించకుండా కేరళ శాఖ ఓటు వేసింది. ఇక బెంగాల్ శాఖలో అయితే ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన వారంతా యేచూరి ప్రతిపాదనకు మద్దతు పలికారు.
దేశ రాజకీయ వ్యవస్థలో వేగంగా ప్రాధాన్యం కోల్పోతున్న పార్టీకి ఇది మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం యేచూరికి ఇదే మొదటిసారి కాదు కూడా. రాజ్యసభ బరిలోకి యేచూరి దిగితే సీపీఎంకు తమ మద్దతు ఉంటుందని జూలై , 2017లో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఆయనను మూడోసారి కూడా ఎగువ సభకు పంపించడానికి సీపీఎం కేంద్ర కమిటీ నిరాకరించింది. ఎందుకంటే ఆ పార్టీలో ఎవరికీ రెండు పర్యాయాలకు మించి ఆ అవకాశం ఇవ్వరు. పార్టీ నిర్మాణం పని మీద యేచూరి మరింత సమయం కేటాయించవలసి ఉంది. చివరిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సీపీఎంకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇందులో చివరి కారణమే రాజకీయంగా చాలా ప్రాధాన్యం కలి గినది. పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి?
వామపక్షాల ప్రభావం నిజంగా ఎంత?
బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు. నిజం చెప్పాలంటే వామపక్షం ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కేవలం లెటర్‌హెడ్ పార్టీ స్థాయికి కుంచించుకుపోయింది. ఎన్నికలలో వరస అపజయాలు, వివిధ రాష్ట్రాలలోని ప్రధాన స్రవంతి పార్టీలకు తోక పార్టీలుగా వ్యవహరించడం కూడా ఆ పరిస్థితిని తెచ్చి పెట్టింది. తనకు సిద్ధాంతపరమైన గౌరవం ఉందని ఆ పార్టీ అభిప్రాయం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ – ఈ జాబితా ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఈ అన్ని రాష్ట్రాలలోను వామపక్షం రాజకీయ పక్షంగా ప్రాధాన్యం కోల్పోయింది.
వీటితో పాటు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకునే స్థితిలో కూడా వామపక్షం లేదు. ఇది కూడా ఒక వాస్తవమే. అమెరికాకు వ్యతిరేకంగా వారు ఇచ్చే సామ్రాజ్య వ్యతిరేక నినాదాలు 21వ శతాబ్దపు భారతదేశంలో చర్విత చర్వణంగా మాత్రమే ఉన్నాయి. అయితే కేంద్రంలోను, రాష్ట్రాలలోను బీజేపీ నుంచి ఎంతటి ప్రతికూలత ఎదురవుతున్నప్పటికీ వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో చురుకుగానే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయి రాజకీయాలకీ; కేంద్ర రాష్ట్ర స్థాయి రాజకీయాలకూ మధ్య వచ్చిన శూన్యాన్ని నింపడం ఎలాగో కూడా సీపీఎం ఆలోచించాలి. విశ్వవిద్యాలయాల స్థాయిలో మొదటిసారి ఓటు హక్కు విని యోగించుకుంటున్నవారిని సాధారణ ఎన్నికలలో తమ బలంగా ఎందుకు మలుచుకోలేకపోతున్నారు? ఇందుకు కారణం కొన్ని భ్రమలలో ఆ పార్టీ చిక్కుకుని ఉండడమే. బీజేపీని తన ప్రధాన శత్రువని సీపీఎం పేర్కొంటున్నది. అయినప్పటికీ, బీజేపీ కంటే తక్కువ శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి అది సుముఖంగా లేదు. ప్రజా ప్రయోజనం కంటే అహంభావానిదే పై చేయి అయ్యేటట్టు చేస్తోందనడానికి ఇదే నిదర్శనం. వామపక్షం గళం బొత్తిగా కరవైపోతున్న కాలమిది. సాపేక్షంగా చూసినప్పుడు యేచూరి వంటి యువ నాయకుడి అవసరం ఇప్పుడు రాజ్యసభలో ఉందన్న వాస్తవాన్ని పార్టీ గుర్తించడం లేదు. పైగా నిబంధనలంటూ మంకు పట్టుకు పరిమితమైంది.
కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు వామపక్షాలు తిరస్కరించడం అంటే అది విపక్ష కూటమి ఏర్పాటు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది క్షేత్రస్థాయిలో కాకపోవచ్చు. కానీ అవగాహనకు సంబంధించి ఎక్కువ ప్రభావం చూపుతుంది. కలకత్తా సభ తరువాత సీపీఎం నిర్ణయం మీద కొన్ని చతురోక్తులు ఇప్పటికే జనంలోకి వచ్చాయి కూడా. అక్కడ జరిగిన నిర్ణయం సీపీఎంలో బీజేపీ విజయమని ఆ చతురోక్తులు పేర్కొంటున్నాయి. ఇంకా పలువురు ఇది సీపీఎం పార్టీ చేసిన రెండవ చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నారు. 1996లో జ్యోతిబసు ప్రధాని కావడానికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నడం మొదటి చారిత్రక తప్పిదమని చెబుతూ ఉంటారు.
ఆ రెండుచోట్ల మినహాయించినా...
సీపీఎం నిర్ణయాన్ని గుడ్డిలో మెల్లగా భావించాలి. ముఖ్యంగా బెంగాల్ రాజకీయాల విషయంలో అయితే అదే నిజం. అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు ఖాళీ చేసిన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి దీటుగా నిలబడగలిగిన ప్రధాన వ్యతిరేక శక్తి. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలి. 2019 ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి సోనియాగాంధీ, మమతా బెనర్జీల మధ్య ఉన్న స్నేహాన్ని ఉపయోగించాలి. సీట్ల సర్దుబాటు విషయంలో మమత కొన్ని చిక్కులు సృష్టించవచ్చు. కానీ రాహుల్ మాత్రం సీపీఎం చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయరాదు. రాహుల్ ఢిల్లీలో ఉంటూ కలకత్తా పట్టకం నుంచి చూసి పరిస్థితులను అంచనా వేయరాదు.
కేరళకు సంబంధించి ఢిల్లీలో దోస్తీ, కేరళలో కుస్తీ వంటి మాటలతో బీజేపీ ఎద్దేవా చేసే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకోకూడదు. మరొక విపక్షంగానే భావిస్తూ అక్కడ కాంగ్రెస్ కూటమి పినరాయ్ విజయన్ నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్‌తో పోరాడగలదు. సీపీఎం, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగినా అక్కడ మూడో పక్షానికి స్థానానికి దొరకడమనేది అరుదని గతాన్ని చూస్తే తెలుస్తుంది. బీజేపీ పరిస్థితి అక్కడ అదే. తన ప్రతిపాదన గురించి సభ్యులకు అవగాహన కల్పించడానికి సీతారాం యేచూరికి ఇంకా రెండు మాసాల గడువు ఉంది. కేరళ, బెంగాల్‌లను మినహాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి సీపీఎంకు కొంత అవకాశం ఉంది. కానీ దీనితో ప్రయోజనం తక్కువే. ఇలాంటి ప్రయత్నం మూడోసారి కూడా విఫలమైతే యేచూరికి రాజీనామా చేయడం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం పార్టీలో బలం లేని వాస్తవాన్ని ఏ నాయకుడికైనా అర్థమయ్యేటట్టు చేస్తుంది.
- టీఎస్ సుధీర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment