నల్లగొండ టౌన్ : జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకా«శ్‌కారత్ అన్నారు. నల్లగొండలో ఆ పార్టీ రాష్ట్ర ద్వితీయ మహాసభలలో రెండో రోజు సోమవారం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే మోదీ సర్కార్ జమిలి ఎన్నికలకు యత్నిస్తోందని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఎలాంటి నిధుల కేటాయింపులను చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. నిధులు లేకుండా రైతులకు కనీస మద్దతు ధర ఎలా కల్పిస్తారో అర్థం కావడం లేదన్నారు. ప్రజారోగ్యం కోసం రూ.లక్ష కోట్లు కావాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే.. కేంద్రం మాత్రం రూ.2 వేల కోట్లు కేటాయించి ఏ రకంగా ధీమా కల్పిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలను తొమ్మిదిసార్లు పెంచిందని కారత్ విమర్శించారు.
బీజేపీని గద్దె దించడమే లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. అయితే.. ఏరకంగా ముందుకుపోవాలో ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై బీజేపీయేతర పార్టీల సహకారం తీసుకుంటామని చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ విస్తరణపై మాట్లాడుతూ ఆయా రాష్ట్రాలలో అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ అప్పుల కుప్ప
తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పయిందని కారత్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలే టీఆర్‌ఎస్ అమలు చేస్తుండటంతో ఈ దుస్థితికి కారణమన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెబుతున్నప్పటికీ వాస్తవానికి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటాకు రూ.70 వేల కోట్ల అప్పు ఉంటే, మూడున్నరేళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం మరో రూ.70 వేల కోట్ల అప్పులు చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్న పాలకులు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్య, వైద్యం పూర్తిగా ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం
Published Tue, Feb 6 2018 2:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment