
కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించి బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌లో కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నబీజేపీకి అభిషేక్ ఒక సంచలన సవాల్ విసిరారు. ‘‘ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి రావాలనే చట్టాన్ని తీసుకొచ్చే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని సంచలన ప్రకటన చేశారు. ‘‘తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా తనకు తానే ఉరేసుకుంటా’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే బీజేపీలో కైలాష్ విజయ్‌వర్గీయ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్ నుంచి రంజిత్‌సింగ్ వరకు ఈ నేతల కుటుంబసభ్యులంతా బీజేపీలోని ముఖ్యమైన పదవులను అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని చట్టం తీసుకొస్తే.. మా కుటుంబం నుంచి సీఎం మమతా బెనర్జీ మాత్రమే టీఎంసీలోఉంటారని.. తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతాబెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment