ఆమె సూపర్ ఫాస్ట్ గురూ!
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలు ప్రకటించి మినీ సార్వత్రిక సంగ్రామానికి తెరతీశారు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ. ఆయన అలా తేదీలు ప్రకటించారో.. లేదో, అదేరోజు సాయంత్రం తమ రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలకు కూడా పశ్చిమబెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నింటికీ ఒకేసారి తేదీలను ప్రకటించారు. కానీ, ఈ ఐదు రాష్ట్రాల్లో టీఎంసీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా అసలు ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. మమతమ్మ మాత్రం పెద్ద ఫైలు పట్టుకుని సాయంత్రం మీడియాను పిలిచి మొత్తం అన్ని స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెప్పారు. దాంతో ప్రత్యర్థులు సహా ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు.
ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ఇంత ప్రిపరేషన్ ఉండటం అసాధ్యమని, దాన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత కేవలం మమతకే దక్కుతుందని అంటున్నారు. వరుసగా రెండోసారి కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ విజయకేతనం ఎగరేయడం దాదాపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మమతా దీదీ ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉంటే.. ఇక ప్రత్యర్థి పార్టీలు కోలుకోవడం కష్టంలాగే కనిపిస్తోంది.
కమ్యూనిస్టులు సహా మరే ఇతర పార్టీ ఇంకా అసలు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కసరత్తులు మొదలుపెట్టక ముందే అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటే.. వాళ్లకు చాలా ఎక్కువ సమయం దొరుకుతుంది. దాంతో విజయావకాశాలు మరింత మెరుగుపడటం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేయడంలో మమతా బెనర్జీ మహా ఫాస్ట్ అని చెబుతారు. మరీ ఇంత ఫాస్టా అని మిగిలినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట.