ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది.
ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment