పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. పరస్పర విమర్శలతో అక్కడి వాతావరణం గరం గరంగా మారింది. గత ఎన్నికల్లో 'మా మాటీ మానుష్' అనే నినాదం విన్నామని, కానీ ఐదేళ్ల తర్వాత చూస్తే ఎక్కడ చూసినా 'మరణం.. మరణం.. మరణం..' అని, 'మనీ.. మనీ' అని వింటున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. ''నరదా తెలుసు కదా.. టీవీలో చూశాను.. ఈ మా మాటీ మానుస్ వాళ్లు డబ్బు తీసుకుంటున్నారు డబ్బులు..'' అని ఎద్దేవా చేశారు. నరదా స్టింగ్ ఆపరేషన్‌లో పశ్చిమబెంగాల్ మంత్రులు లంచాలు తీసుకుంటుండగా బయటపడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
వాళ్లకు అభవృద్ధితో అవసరం లేదని.. ఒకవైపు వామపక్షాలు మరోవైపు దీదీ ఇద్దరూ అత్యాచారాలు, అవినీతి, హింసకు సంబంధించిన ఆరోపణలతో పరస్పరం కొట్టుకుంటున్నారని మోదీ అన్నారు. దీదీ గానీ, వామపక్షాలు గానీ.. మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వరని ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీల పాలనలో పశ్చిమబెంగాల్ దారుణాలను చూసిందని, ఇద్దరి తీరుతెన్నులు స్పష్టంగా తెలిశాయని చెప్పారు. తన సమావేశాలకు రావడానికి మమతా బెనర్జీ వెనకాడతారని, కానీ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సోనియా గాంధీని మాత్రం తప్పనిసరిగా కలిసి వెళ్తారని.. వాళ్లిద్దరి బంధం ఏంటో తనకు అర్థం కాదని అన్నారు.
అప్పుడు మా మాటీ మానుస్.. ఇప్పుడు మనీ మనీ
Published Thu, Apr 7 2016 1:53 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement