91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్‌! | At 91, Gyan Singh Sohanpal ready for polls again | Sakshi
Sakshi News home page

91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్‌!

Published Thu, Mar 17 2016 9:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్‌! - Sakshi

91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్‌!

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారత ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అధికారంలో ఉన్న 1962లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీచేశారు.

వెనుదిగిరి చూస్తే 54 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికల సమరంలో ఆయన పదికిపైగా విజయాలు సాధించారు. అయినా 91 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఎన్నికల గోదా నుంచి ఆయన తప్పుకోలేదు. ఇప్పటికీ అదే ఇనుమడించిన ఉత్సాహంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆయనే జ్ఞాన్‌సింగ్ సోహన్‌పాల్‌. 91 ఏళ్ల ఆయన బెంగాల్‌ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ సర్దార్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు పోటీగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాంప్రసాద్ తివారీ, అటు బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ బరిలోకి దిగారు.

సోహన్‌పాల్‌ 1977 ఎన్నికల్లో తొలిసారి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో వామపక్షాల ప్రభంజనంతో బెంగాల్‌లో కాంగ్రెస్‌లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని పరాజయాలు ఎదురైనా ఆయన ప్రత్యక్ష రాజకీయ రంగం నుంచి వైదొలగలేదు. 'ప్రజలకు ఎంతో పనిచేయాల్సి ఉంది. ఎన్నో ప్రాజెక్టులు సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది' అని ఉత్సాహంగా చెప్తున్నారు సోహన్‌పాల్. 'చాచా'గా పేరొందిన సోహన్‌పాల్ మరోసారి ప్రజల మద్దతు తనకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరగ్‌పూర్ పట్టణంలో ప్రతి ఒక్కరూ తనను గుర్తుపడతారని, ప్రజలకు సేవ చేసేందుకు తనకు మరో అవకాశం లభిస్తుందని ముదుసలి వయస్సులోనూ ఉత్సాహం ఏమాత్రం ఈ కాంగ్రెస్ అభ్యర్థి భరోసాగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement