Assembly Elections 2016
-
అమ్మ ఇంటి వద్ద కమ్ముకున్న నిశ్శబ్దం
చెన్నై: ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమిళనాడులో మార్పు ఆనవాయితే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అమ్మను సాగనంపుతూ.. కరుణానిధి కోసం అధికార గుమ్మం ఎదురుచూస్తున్నదని తేల్చాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో పోయిస్ గార్డెన్స్‌లోని ముఖ్యమంత్రి జయలలిత నివాసం మూగబోయింది. రేపు ఫలితాలు వెల్లువడనున్న నేపథ్యంలో ఇక్కడ గంభీరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. సోమవారం జరిగిన పోలింగ్‌లో ఓటేసిన అనంతరం తన నిచ్చెలి శశికళ నాటరాజన్‌తో కలిసి జయలలిత నివాసానికి చేరుకుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళీ, అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల విజయావకాశాలపైన అందిన సమాచారాన్ని ఆమె విశ్లేషించింది. అమ్మతో చేదువార్తలను పంచుకొనే ధైర్యం పార్టీ నాయకులకు లేకపోవడంతో ఎన్నికల్లో అన్నాడీఎంకే బాగా పనిచేసిందని, మీరే అధికారంలో కొనసాగుబోతున్నారని పార్టీ జిల్లా కార్యదర్శులు ఆమెకు నివేదించినట్టు సమాచారం. అన్ని జిల్లాల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా గంభీరమైన మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. జర్నలిస్టులతో ఎప్పుడోగానీ ముచ్చటించని జయలలిత మీడియాలో తన పార్టీ పట్ల వస్తున్న వార్తలను శ్రద్ధగా వీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రోజూ గంటపాటు దినపత్రికలు చదువుతూ.. నిత్యం న్యూస్ చానెళ్లు చూస్తూ ఆమె గడుపుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'అమ్మ అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చూశారు. ఒక్క దాంట్లో తప్ప అన్నింటిలోనూ అన్నాడీఎంకేకు ఘోరమైన ఓటమి తప్పదని తేలింది. ఈ ఫలితాలు చూసి అమ్మ నిశ్చేష్టురాలయ్యారు' అని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు మీడియాతో తెలిపారు. -
'కబాలి'తో జయమ్మను టార్గెట్ చేశారు!
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' టీజర్ యూట్యూబ్‌లో సంచనాలు నమోదుచేస్తోంది. విడుదలైన కొన్ని రోజులకే ఈ టీజర్ కు కోటికిపైగా వ్యూస్ దక్కడం చరిత్ర సృష్టిస్తుండగా.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న తమిళనాడులో ఈ 'టీజర్' రాజకీయ దుమారమే రేపుతోంది. 'నేను రా కబాలి' అంటూ రజనీ విశ్వరూపం చూపిన ఈ సినిమా టీజర్‌కు సూఫ్ గా వెలువడిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. రజనీ 'కబాలి' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను మార్చి.. అన్నాడీఎంకేను, ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను టార్గెట్ చేస్తూ ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో రజనీ వాయిస్‌ను మార్చి.. నేరుగా జయలలితపై విమర్శలు ఎక్కుపెట్టారు. చెన్నై వరద విపత్తును ఎదుర్కోవడంలో జయ సర్కార్ విఫలమైందంటూ సాగే ఈ టీజర్ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ టీజర్లో విలన్‌ను అన్నాడీఎంకేగా, రజనీని డీఎంకేగా చూపిస్తూ.. విలన్ 'ఎవర్రా డీఎంకే' అని అడిగినట్టు.. దానికి అధికార అన్నాడీఎంకేపై తీవ్ర విమర్శలు చేస్తూ డీఎంకే (రజనీ) ఎంటరైనట్టు ఈ టీజర్‌ను మార్చారు. ఈ మాక్ టీజర్ ఇంటర్నెట్లో పెట్టిన కొద్దిసేపటిలోనే వైరల్ అయింది. దీనిపై అధికార అన్నాడీఎంకే విమర్శలు ఎక్కుపెట్టగా, ప్రతిపక్ష డీఎంకే మాత్రం తమకు ఈ వీడియోతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఈ వీడియో రాజకీయ వివాదం సృష్టిస్తుండటంతో 'వాకెడ్ఔట్మీడియా' ఇంటర్నెట్ నుంచి దీనిని తొలగించింది. -
ఆమెకు అనారోగ్యం, ఆయనకు వృద్ధాప్యం!
తమిళనాడు రాజకీయాలు చాలా విలక్షణమైనవి. తమిళ పరిపాలన పీఠంపై సినిమా ప్రభావం ఎప్పుడు విస్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం సీఎం అభ్యర్థులుగా బరిలో నిలిచిన ముగ్గురు ప్రధాన పార్టీల నేతలకూ సినీ నేపథ్యముంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన అన్నాడీఎంకే, డీఎంకే ముఖ్యమంత్రులే గత 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఈ రెండు పార్టీల ఆధిపత్యాన్ని, సినీ ఛరిష్మాను అధిగమిస్తానంటున్నారు పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) సీఎం అభ్యర్థి అన్బుమణి రాందాస్. పార్టీ పరంగా కొన్ని బలహీనతలు ఉన్నా అన్నాడీఎంకే, డీఎంకే కంచుకోటలను బద్దలు కొడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృతిరీత్య వైద్యుడు, టెక్ శావీ అయిన అన్బుమణి ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కులవాద పార్టీ ముద్రపడిన పీఎంకేను ప్రజలందరికీ చేరువ చేస్తానని, మంచి పరిపాలన కోసం యువతకు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం అభ్యర్థులుగా బరిలోకి దిగిన జయలలిత, కరుణానిధి, విజయ్‌కాంత్ గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'సీఎం అభ్యర్థులుగా బరిలో ఉన్న ఆ ముగ్గురిని నేను గౌరవిస్తాను. కానీ, వారు తమ దైనందిన కార్యకలాపాలు తాము సొంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో సీఎం తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు. (ఆరోగ్య కారణాలతో జయలలిత ఇంటికే పరిమితమయ్యారు). 93 ఏళ్ల నాయకుడు (కరుణానిధి) కూడా బరిలోకి దిగారు. ఆయన రిటైరైతే మంచిదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి (విజయ్‌కాంత్)కి పొందిక లేదు. ఆయన ప్రజలు చెప్పేది వినడు. ప్రజలకు ఆయన చెప్పేది అర్థం కాదు. ఈ నేపథ్యంలో వృత్తిరీత్య డాక్టర్ అయినా నా పట్ల ప్రజలకు విశ్వాసముంది. కేంద్రమంత్రిగా నా సత్తాను చాటాను. రాష్ట్రంలోని 2.5 కోట్ల యువ ఓటర్లకు నేను ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని. వారి ఆకాంక్షలు నిలబెట్టేవిధంగా పరిపాలిస్తాను. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రజల మన్నన పొందుతాను' అని అన్బుమణి ధీమా వ్యక్తం చేశారు. -
ఈ దేవి సీఎంకు షాక్ ఇస్తుందా?
చెన్నై: పెద్ద పెద్ద వేదికలు లేవు. భారీ సభలు లేవు. తండోపతండాలుగా తరలివచ్చే జనాలు లేరు. అయినా చెన్నై ఆర్కే నగర్‌లోని వీధివీధికి కాలినడకతో తిరుగుతూ.. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలుకరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు సీ దేవి. మేలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న తొలి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా ఆమె చరిత్ర సృష్టించబోతున్నారు. అంతేకాకుండా ఏకంగా అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను ఆమె ఢీకొనబోతున్నారు. జయలలితకు ఆర్కే నగర్ కంచుకోట. భారీ మెజారిటీతో ఆమె గెలువడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయినా వెనుదీయని 33 ఏళ్ల సీ దేవి గట్టి ప్రచారమే చేస్తున్నారు. తమిళ జాతీయవాద పార్టీ అయిన నామ్ తమిలార్ కచ్చి తరఫున అభ్యర్థిగా దిగిన ఆమె ప్రతి ఒక్క ఓటరును పలుకరిస్తున్నారు. నిజానికి ఆర్కే నగర్లో జయలలితను ఓడించడమనే ప్రసక్తే ఉండకపోవచ్చు. 2015 ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కన్నా 16 రెట్ల ఓట్లు అత్యధికంగా సాధించి బంఫర్ మెజారిటీతో జయలలిత విజయం సాధించారు. అయితే, ఈసారి జయమ్మ ఓటుబ్యాంకును గణనీయంగా దెబ్బతీయడమే దేవి లక్ష్యంగా పెట్టుకున్నారు. జయలలితపై పోటీచేయడానికి తానేమీ భయపడటం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. 'ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి పోటీ చేస్తారని తెలిసినప్పుడు నేను మొదట భయపడ్డాను. కానీ మా పార్టీ ఇక్కడ బలంగా ఉంది' అని ఆమె చెప్తున్నారు. స్థానిక నియోజకవర్గ సమస్యలైన నీటి కొరత, అందరికీ రేషన్ కార్డులు లేకపోవడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సీఎంపై పోటీచేయడం ఒక ఎత్తు అయితే, ఒక ట్రాన్స్‌జెండర్ పట్ల సమాజంలో ఉన్న ప్రతికూల అపనమ్మకాల కారణంగా ఆమె ఓటర్లు చేరువ కావడం మరొక ఎత్తు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్!
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారత ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అధికారంలో ఉన్న 1962లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీచేశారు. వెనుదిగిరి చూస్తే 54 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికల సమరంలో ఆయన పదికిపైగా విజయాలు సాధించారు. అయినా 91 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఎన్నికల గోదా నుంచి ఆయన తప్పుకోలేదు. ఇప్పటికీ అదే ఇనుమడించిన ఉత్సాహంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆయనే జ్ఞాన్‌సింగ్ సోహన్‌పాల్. 91 ఏళ్ల ఆయన బెంగాల్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ సర్దార్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు పోటీగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాంప్రసాద్ తివారీ, అటు బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బరిలోకి దిగారు. సోహన్‌పాల్ 1977 ఎన్నికల్లో తొలిసారి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో వామపక్షాల ప్రభంజనంతో బెంగాల్లో కాంగ్రెస్‌లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని పరాజయాలు ఎదురైనా ఆయన ప్రత్యక్ష రాజకీయ రంగం నుంచి వైదొలగలేదు. 'ప్రజలకు ఎంతో పనిచేయాల్సి ఉంది. ఎన్నో ప్రాజెక్టులు సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది' అని ఉత్సాహంగా చెప్తున్నారు సోహన్‌పాల్. 'చాచా'గా పేరొందిన సోహన్‌పాల్ మరోసారి ప్రజల మద్దతు తనకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరగ్‌పూర్ పట్టణంలో ప్రతి ఒక్కరూ తనను గుర్తుపడతారని, ప్రజలకు సేవ చేసేందుకు తనకు మరో అవకాశం లభిస్తుందని ముదుసలి వయస్సులోనూ ఉత్సాహం ఏమాత్రం ఈ కాంగ్రెస్ అభ్యర్థి భరోసాగా ఉన్నారు. -
స్టింగ్ ఆపరేషన్‌తో అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి!
మరో 15 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఊహించనిరీతిలో వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్ మమత బెనర్జీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, మంత్రులు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్టు చెప్తున్న ఓ వీడియో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో హల్చల్ చేస్తోంది. మీడియా ఈ స్టింగ్ ఆపరేషన్ గురించే కథనాలు ప్రసారం చేస్తుండటంతో ఇప్పటికే అధికార పక్షంపై ప్రతిపక్షం నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగత్ రాయ్, సుల్తాన్ అహ్మద్, బెంగాల్ మంత్రి సుబ్రత ముఖర్జీ, కోల్‌కతా మేయర్ శోవన్ ఛటర్జీ తదితరులు ఓ కల్పితమైన లాబీకి పలు హామీలు ఇస్తూ.. లంచాలు తీసుకుంటూ ఈ వీడియోలో కనిపించారు. నారదన్యూస్.కామ్ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. అయితే ఈ వీడియోలో సీఎం మమతాబెనర్జీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ వీడియో ప్రామాణికతపై ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్ రాజకీయాలను ఈ స్టింగ్ ఆపరేషన్ ఓ కుదుపు కుదిపింది. ఏప్రిల్ 4 నుంచి ఆరు దఫాలుగా జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్-వామపక్షాల కూటమి, బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవి నుంచి దిగిపోవాలని, ఎన్నికలు ముగిసేవరకు కూడా ఆమెకు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని బీజేపీ మండిపడింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.