అమ్మ ఇంటి వద్ద కమ్ముకున్న నిశ్శబ్దం
చెన్నై: ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమిళనాడులో మార్పు ఆనవాయితే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అమ్మను సాగనంపుతూ.. కరుణానిధి కోసం అధికార గుమ్మం ఎదురుచూస్తున్నదని తేల్చాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో పోయిస్ గార్డెన్స్‌లోని ముఖ్యమంత్రి జయలలిత నివాసం మూగబోయింది. రేపు ఫలితాలు వెల్లువడనున్న నేపథ్యంలో ఇక్కడ గంభీరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది.
సోమవారం జరిగిన పోలింగ్‌లో ఓటేసిన అనంతరం తన నిచ్చెలి శశికళ నాటరాజన్‌తో కలిసి జయలలిత నివాసానికి చేరుకుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళీ, అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల విజయావకాశాలపైన అందిన సమాచారాన్ని ఆమె విశ్లేషించింది. అమ్మతో చేదువార్తలను పంచుకొనే ధైర్యం పార్టీ నాయకులకు లేకపోవడంతో ఎన్నికల్లో అన్నాడీఎంకే బాగా పనిచేసిందని, మీరే అధికారంలో కొనసాగుబోతున్నారని పార్టీ జిల్లా కార్యదర్శులు ఆమెకు నివేదించినట్టు సమాచారం. అన్ని జిల్లాల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా గంభీరమైన మౌనం దాల్చినట్టు తెలుస్తోంది.
జర్నలిస్టులతో ఎప్పుడోగానీ ముచ్చటించని జయలలిత మీడియాలో తన పార్టీ పట్ల వస్తున్న వార్తలను శ్రద్ధగా వీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రోజూ గంటపాటు దినపత్రికలు చదువుతూ.. నిత్యం న్యూస్ చానెళ్లు చూస్తూ ఆమె గడుపుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'అమ్మ అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చూశారు. ఒక్క దాంట్లో తప్ప అన్నింటిలోనూ అన్నాడీఎంకేకు ఘోరమైన ఓటమి తప్పదని తేలింది. ఈ ఫలితాలు చూసి అమ్మ నిశ్చేష్టురాలయ్యారు' అని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు మీడియాతో తెలిపారు.