చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన సభలో.. టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరైన విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా రాజకీయాల్లో విజయ్ చెప్పిన భావజాలాన్ని డీఎంకే పార్టీ కొట్టిపారేసింది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అధికార డీఎంకే పార్టీ నేత విమర్శలు గుప్పించారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ఇతర పార్టీల నుంచి కాపీ కొట్టారని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం.. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే, ఇతర పార్టీల ప్రస్తుత రాజకీయ దృక్కోణాల ‘కాక్‌టెయిల్’ అని ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ మా విధానాలు, కానీ విజయ వాటిని కాపీ చేశాడు. ఆయన ఏది చెప్పినా.. అది మేం ఇప్పటికే చెప్పాం, ఇప్పటికీ మేం వాటిని అనుసరిస్తున్నాం’’అని అన్నారు.
ఇక.. నిన్న( ఆదివారం) విజయ్ తన తొలి బహిరంగ సభ ప్రసంగంలో అధికార డీఎంకే పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తమ పార్టీ అనుసరిస్తామని తెలిపారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment