ఆమెకు అనారోగ్యం, ఆయనకు వృద్ధాప్యం!
తమిళనాడు రాజకీయాలు చాలా విలక్షణమైనవి. తమిళ పరిపాలన పీఠంపై సినిమా ప్రభావం ఎప్పుడు విస్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం సీఎం అభ్యర్థులుగా బరిలో నిలిచిన ముగ్గురు ప్రధాన పార్టీల నేతలకూ సినీ నేపథ్యముంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన అన్నాడీఎంకే, డీఎంకే ముఖ్యమంత్రులే గత 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఈ రెండు పార్టీల ఆధిపత్యాన్ని, సినీ ఛరిష్మాను అధిగమిస్తానంటున్నారు పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) సీఎం అభ్యర్థి అన్బుమణి రాందాస్.
పార్టీ పరంగా కొన్ని బలహీనతలు ఉన్నా అన్నాడీఎంకే, డీఎంకే కంచుకోటలను బద్దలు కొడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృతిరీత్య వైద్యుడు, టెక్ శావీ అయిన అన్బుమణి ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కులవాద పార్టీ ముద్రపడిన పీఎంకేను ప్రజలందరికీ చేరువ చేస్తానని, మంచి పరిపాలన కోసం యువతకు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం అభ్యర్థులుగా బరిలోకి దిగిన జయలలిత, కరుణానిధి, విజయ్‌కాంత్ గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
'సీఎం అభ్యర్థులుగా బరిలో ఉన్న ఆ ముగ్గురిని నేను గౌరవిస్తాను. కానీ, వారు తమ దైనందిన కార్యకలాపాలు తాము సొంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో సీఎం తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు. (ఆరోగ్య కారణాలతో జయలలిత ఇంటికే పరిమితమయ్యారు). 93 ఏళ్ల నాయకుడు (కరుణానిధి) కూడా బరిలోకి దిగారు. ఆయన రిటైరైతే మంచిదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి (విజయ్‌కాంత్)కి పొందిక లేదు. ఆయన ప్రజలు చెప్పేది వినడు. ప్రజలకు ఆయన చెప్పేది అర్థం కాదు. ఈ నేపథ్యంలో వృత్తిరీత్య డాక్టర్ అయినా నా పట్ల ప్రజలకు విశ్వాసముంది. కేంద్రమంత్రిగా నా సత్తాను చాటాను. రాష్ట్రంలోని 2.5 కోట్ల యువ ఓటర్లకు నేను ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని. వారి ఆకాంక్షలు నిలబెట్టేవిధంగా పరిపాలిస్తాను. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రజల మన్నన పొందుతాను' అని అన్బుమణి ధీమా వ్యక్తం చేశారు.