'కబాలి'తో జయమ్మను టార్గెట్ చేశారు!
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' టీజర్ యూట్యూబ్‌లో సంచనాలు నమోదుచేస్తోంది. విడుదలైన కొన్ని రోజులకే ఈ టీజర్ కు కోటికిపైగా వ్యూస్ దక్కడం చరిత్ర సృష్టిస్తుండగా.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న తమిళనాడులో ఈ 'టీజర్' రాజకీయ దుమారమే రేపుతోంది.
'నేను రా కబాలి' అంటూ రజనీ విశ్వరూపం చూపిన ఈ సినిమా టీజర్‌కు సూఫ్ గా వెలువడిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. రజనీ 'కబాలి' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను మార్చి.. అన్నాడీఎంకేను, ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను టార్గెట్ చేస్తూ ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో రజనీ వాయిస్‌ను మార్చి.. నేరుగా జయలలితపై విమర్శలు ఎక్కుపెట్టారు. చెన్నై వరద విపత్తును ఎదుర్కోవడంలో జయ సర్కార్ విఫలమైందంటూ సాగే ఈ టీజర్ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ టీజర్‌లో విలన్ను అన్నాడీఎంకేగా, రజనీని డీఎంకేగా చూపిస్తూ.. విలన్ 'ఎవర్రా డీఎంకే' అని అడిగినట్టు.. దానికి అధికార అన్నాడీఎంకేపై తీవ్ర విమర్శలు చేస్తూ డీఎంకే (రజనీ) ఎంటరైనట్టు ఈ టీజర్‌ను మార్చారు. ఈ మాక్ టీజర్ ఇంటర్నెట్‌లో పెట్టిన కొద్దిసేపటిలోనే వైరల్ అయింది. దీనిపై అధికార అన్నాడీఎంకే విమర్శలు ఎక్కుపెట్టగా, ప్రతిపక్ష డీఎంకే మాత్రం తమకు ఈ వీడియోతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఈ వీడియో రాజకీయ వివాదం సృష్టిస్తుండటంతో 'వాకెడ్ఔట్‌మీడియా' ఇంటర్నెట్ నుంచి దీనిని తొలగించింది.