
సాక్షి, చెన్నై: నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం విజయకాంత్ నివాసానికి వచ్చిన రజినీకాంత్ అరగంట సేపు అక్కడ గడిపారు. కేవలం విజయకాంత్‌ను పరామర్శించేందుకే తాను వచ్చినట్టు భేటీ అనంతరం రజనీకాంత్ పేర్కొన్నారు. అలాగే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాలో తీవ్ర చర్చకు దారితీసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో కలిసి అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడితే.. డీఎంకే కాంగ్రెస్‌తో జత కట్టింది. అయితే తొలుత అన్నాడీఎంకే కూటమిలో చేరుతుందని భావించిన డీఎండీకే.. సీట్ల సర్దుబాటు కుదరక కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య విజయకాంత్ తమ పార్టీ ఆశవహులు ఒంటరిగా బరిలో నిలువనున్నారనే సంకేతాలు పంపారు.
ఈ నేపథ్యంలో గురువారం విజయకాంత్‌తో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తాజా మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పరోక్షంగా అన్నాడీఎంకే కూటమికి దూరంగా ఉండాలని ఆయన విజయకాంత్‌ను కోరినట్టుగా సమాచారం. అయితే ఆ మరుసటి రోజే రజినీకాంత్ విజయకాంత్‌తో భేటీ కావడంతో డీఎండీకే ఏ కూటమి వైపు మొగ్గు చూపుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది. మరోవైపు రాజకీయ ఎంట్రీని స్పష్టం చేసిన రజినీకాంత్.. తాను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని తెల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment