
తెలంగాణ ప్రకటనతో విభజన ఉద్యమాలు: సిపిఎం
ఢిల్లీ : ఎన్నికల్లో లబ్ది పొందాలనే సంకుచిత భావనతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను విభజిస్తున్నదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనతో దేశంలో పలుచోట్ల విభజన ఉద్యమాలు తెరపైకి వచ్చాయని చెప్పారు. భాషాప్రయుక్త రాష్ట్రాలను విడగోట్టడం మంచిదికాన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకు ఆమోదం తెలిపితే దేశం మొత్తంలో చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకుంటాయని, అలా ఏర్పాటు చేస్తే దేశ సమాఖ్య వ్యవస్థకే భంగం కలుగుతుందని ప్రకాష్ కారత్ ముందే హెచ్చరించారు. యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ప్రకటనతో చిన్నరాష్ట్రాల ఉద్యమాల తేనె తుట్టిని కదిపినట్లయింది. ఈశాన్యం ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్, మహారాష్ట్రలో విదర్భ ఉద్యమాలు, ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.