
ప్రాంతీయ పార్టీలతో కూటమి
సీపీఎం నేత కారత్ వెల్లడి
భువనేశ్వర్: వివిధ ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయం అందించే లక్ష్యంతో వామపక్షాలు కృషిచేస్తున్నాయని గురువారం ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, జేడీఎస్, బీజేడీ వంటి పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకే తాటిపైకి వస్తాయని అన్నారు. అయితే దీనిని మూడో ఫ్రంట్‌గా పిలవడానికి ఆయన నిరాకరించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశానని, ఈ రాష్ట్రంలో తమ మధ్య ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉందని కారత్ చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలనుంచి లోక్‌సభకు తమ పార్టీ తరఫున 35 మంది అభ్యర్థులను నిలపాలనుకుంటున్నామని, ప్రాంతీయ పార్టీలతో పొత్తుల నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.