సాక్షి, న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆదివారం పార్టీ కేంద్ర కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ఆ స్థానంలో మాజీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వర్గం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించడం సీపీఎం చేస్తున్న మరో చారిత్రక తప్పిదమా? పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి తన తీర్మానాన్ని నెగ్గించుకోకపోవడం సీతారాం ఏచూరి వైఫల్యమా? అందుకు ఆయన రాజీనామా చేస్తారా? పదవిలో కొనసాగుతూ మరో అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని తన పంథాన్ని భవిష్యత్తులోనైనా నెగ్గించుకుంటారా?
వాస్తవానికి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, లేదా? అంశంలో తప్ప సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ ప్రవేశపెట్టిన తీర్మానాలకు పెద్ద తేడా లేదు. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలను ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ లాంటి లౌకికవాద పార్టీలను కలుపుకుపోవాలని సీతారాం ఏచూరి ప్రతిపాదించగా, బీజేపీ నాజీ లాంటి కరడుగట్టిన పార్టీ కాదని, ఏకీకత అధికారాన్ని చెలాయించే పార్టీ అని, దాన్ని ఎదుర్కొనేందుకు విద్యార్థి నాయకుడు కన్నయ్హ కుమార్ లాంటి వాళ్లను కలుపుకోవాలని, కాంగ్రెస్‌లాంటి బూర్జువా పార్టీల సహాయం అవసరం లేదని కారత్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ రెండు తీర్మానాల గురించి గత శనివారం చర్చించిన సీపీఎం పార్టీ సీతారాం ఏచూరి తీర్మానాన్ని వ్యతిరేకించి కారత్ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం తుది నిర్ణయం కోసం పార్టీ సెంట్రల్ కమిటీకి పంపించింది. ఆదివారం నాడు సమావేశమైన పార్టీ సెంట్రల్ కమిటీ కూడా సీతారాం ఏచారి తీర్మానాన్ని తిరస్కరించింది. ఏప్రిల్ హైదరాబాద్‌లో జరుగనున్న పార్టీ కాంగ్రెస్‌కు రెండు తీర్మానాలను పంపించేందుకు సీతారాం వర్గం చేసిన చివరి ప్రయత్నాన్ని బీవీ రాఘవులు అడ్డుకున్నారు.
సీతారాం తీర్మానం వీగిపోవడానికి కారణం పార్టీ కేరళ శాఖ కారత్‌కు అండగా నిలబడటం. ప్రధానంగా కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే సీతారాం ఏచూరి తీర్మానాన్ని పార్టీ తిరస్కరించింది. కేరళలో సీపీఎంకు బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో అంటకాగడం స్థానిక పార్టీ నాయకులకు అస్సలు ఇష్టం లేదు. ఏదీ ఏమైనా 54 ఏళ్ల క్రితం, అంటే, 1964లో ఏకారణంగానైతే సీపీఐ రెండు పార్టీలుగా విడిపోయిందో, ఇప్పుడు అలాంటి కారణంతోనే పార్టీలో రెండు చీలికలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.
1962లో సీపీఐ ప్రధాన కార్యదర్శి అజయ్ గోష్ మరణంతో పార్టీలో వర్గాలు ఏర్పడినప్పటికీ 1964లో రెండు పార్టీలుగా చీలిపోయాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు సమాజంలో చైనా, సోవియట్ యూనియన్లు రెండు చీలిపోవడం, కార్మికుల ఉద్యమం మంచి ఊపులో ఉన్నప్పుడు పార్లమెంటరీ ఎన్నికల ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ లాంటి బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమి లేదన్న వారు సీపీఐలో ఉండిపోయారు. అదంతా పక్కా రివిజనిజం అని, అంతకన్నా సోవియట్, చైనా తరహాలో చీలిపోవడం మంచిదంటూ విడిపోయిన వర్గం సీపీఎంగా మారింది.
అలాగే, 1975లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు సంఘ్ పార్టీలను కూడా కలుపుకుపోవాలని సీపీఎంలో మెజారిటీ వర్గం వాదించింది. ఎట్టి పరిస్థితుల్లో జనసంఘ్, ఆరెస్సెస్ లాంటి సంస్థలతో చేతులు కలపరాదని నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య వాదించారు. ఈ రోజున సీతారాం ఏచూరి ఓడిపోయినట్లుగానే నాడు సుందరయ్య తన పంతం నెగ్గించుకోలేక ఓడిపోయారు. అందుకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సీతారాం ఏచూరి ఆయన తరహాలో రాజీనామా చేస్తారని అనుకోలేం.
కేంద్రంలో ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలను జారవిడుచుకోం పెద్ద పొరపాటని, అది చారిత్రక తప్పిదమని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నాయకుడు జ్యోతిబసు 1977, జనవరి నెలలో ‘ఏసియన్ ఏజ్’ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. నాడు జ్యోతిబసు ప్రధాని అభ్యర్థిత్వాన్ని సీతారాం ఏచూరి, కారత్‌లు గట్టిగా వ్యతిరేకించగా, ఆయన్ని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ ఒక్కరే బలపరిచారు. అప్పటి నుంచి సీపీఎం ఏ పొరపాటు చేసినా దాన్ని చారిత్రక తప్పిదనంగా పార్టీ వర్గాలు, రాజకీయ విమర్శకులు పేర్కొంటూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment