
అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయమ్మ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం పెట్టాలని తాము జాతీయ పార్టీలను కోరుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. జాతీయ పార్టీలన్నీ సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు ఆమె ఇక్కడ తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి డీఎంకే ఎంపీ కనిమొళి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, ఆ పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, లను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముందు నుంచీ తాము సమైక్యాంధ్ర కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు నియమించిన మంత్రుల కమిటీ మరో సైమన్ కమీషన్ లాంటిదని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ సిపి బృందం మరికొందరు జాతీయ పార్టీల నేతలను కలుసుకుంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ ఆ పార్టీ చేస్తోంది.