
హైదరాబాద్ లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో మాట్లాడుతున్న ప్రకాష్ కారత్
* ‘పాతికేళ్ల సమీక్ష-భవిష్యత్ కార్యాచరణ’పై సీపీఎం అంతర్మథనం
* హైదరాబాద్‌లో ప్రారంభమైన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు
* బూర్జువా పార్టీలతో జట్టుకట్టడం వల్లే విశ్వాసం కోల్పోయాం
* మధ్యతరగతికి, యువతకు దూరమవడం వల్లే బలహీనం
* అభిప్రాయాలు వ్యక్తం చేసిన పలువురు నేతలు
* ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన ‘రాజకీయ ఎత్తుగడల పంథా’ ముసాయిదాపై వ్యతిరేకత
* నేటి మధ్యాహ్నం వరకూ చర్చించి, తీర్మానం చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: గత పాతికేళ్లుగా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసినా, నూతన సరళీకరణ ఆర్థిక విధానాలను గట్టిగా వ్యతిరేకించినా ఎందుకు బలహీనపడ్డామనే అంశంపై సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రజలను చైతన్యపరిచినా రాజకీయం గా ఎందుకు నష్టపోవాల్సి వచ్చిందనే భావన వ్యక్తమైంది. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఐక్యఫ్రంట్‌లు కట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని పిలుపునివ్వడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల విశ్వసనీయత తగ్గిపోయిందని కొందరు సభ్యులు వాదించగా... మధ్యతరగతి ప్రజలు, యువత, బడుగు, బలహీనవర్గాలకు దూరం కావడం వల్లే పార్టీకి నష్టం ఏర్పడిందని మరికొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతినగర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో గత పాతికేళ్లలో అనుసరించిన పార్టీ రాజకీయ విధానాలపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణను, రాజకీయ ఎత్తుగడల పంథాపై సీపీఎం నాయకత్వం చర్చ చేపట్టింది.
తీవ్రస్థాయిలో చర్చ
సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో తరఫున ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ‘రాజకీయ ఎత్తుగడల పంథా’ ముసాయిదా సమీక్ష నివేదికను ప్రవేశపెట్టగా... దీనిపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. అయితే ఢిల్లీలో జరిగిన గత సమావేశంలోనే ఈ విధానంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగి అసమ్మతి కూడా వ్యక్తమైంది. ప్రధానంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏచూరి వర్గం వాటిని వ్యతి రేకించడంతో పాటు ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ కూడా ప్రకటించింది. దీంతో ప్రస్తుత భేటీలోనూ తీవ్ర చర్చ జరిగింది. ఏచూరి వర్గం తమ వాదనను గట్టిగానే వినిపించినట్లు సమాచారం. దీంతో గతాన్ని సమీక్షించుకుని సొంతంగా ఎదిగేలా మెరుగైన విధానాన్ని ఖరారు చేసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై మంగళవారం మధ్యాహ్నం వరకు చర్చించి తీర్మానాన్ని ఆమోదించనున్నారు.
గత మూడేళ్ల విధానాల వల్లే..
సరళీకరణ ఆర్థిక విధానాలను గట్టిగా వ్యతిరేకించి, ప్రజలను చైతన్యపరిచినా రాజకీయంగా ఎందుకు నష్టపోవాల్సి వచ్చిందనే దానిపై వివిధ రాష్ట్రాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజలను మరింత చైతన్యవంతం చేసేందుకు పటిష్టమైన వ్యూహాలను అనుసరించి ఉండాల్సిందని కొందరు కేంద్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గత మూడేళ్లలో అనుసరించిన విధానాల వల్ల పార్టీకి ఎంతో నష్టం జరిగిందని.. పశ్చిమబెంగాల్, కేరళలలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఒక రిద్దరు సభ్యులు పేర్కొన్నట్లు తెలిసింది. పరోక్షంగా కారత్ అనుసరించిన వైఖరిని ఆయన వ్యతిరేక వర్గం తప్పుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా.. కేంద్రం ఇటీవల తెచ్చిన భూసేకరణ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ కేంద్ర కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.