సాక్షి, రంగారెడ్డి జిల్లా/తుర్కయాంజాల్: ‘అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులపై కేంద్రం పెత్తనం సరికాదు. రాష్ట్రాలను సంప్రదించకుండా ఆ అధికారులను బదిలీ చేయడం, రాష్ట్రాల హక్కు లను హరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. అలాగే, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధులను కూడా విడుదల చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. సీపీఎం ఏ పార్టీకి గుడ్డిగా మద్దతు తెలపదని.. బీజేపీ, దాని విధానాలకు వ్యతిరేకంగా పని చేసే శక్తులకు మద్దతుగా ఉంటుందన్నారు.
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలకు ప్రత్యేక పరిశీలకులుగా హాజరైన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదట్లో బీజేపీతో దోస్తీ చేసినా...ప్రస్తుతం ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో ప్రజల్లో కొంత నమ్మకం కలిగించి వారి మద్దతు పొందే విషయంలో టీఆర్‌ఎస్ కొంత వెనుకబడిపోయిందన్నారు. బీజేపీ వేగంగా తన ఉనికి కోల్పోతుందని జోస్యం చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు.
ముగిసిన మహాసభలు
తుర్కయాంజాల్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన సీపీఎం రాష్ట్ర మహాసభలు మంగళవారం ముగిశాయి. ఈ సభల్లో 45 అంశాలపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పాటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోకడలపైనా పోరాటం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. విద్య, సాంస్కృతిక, సామాజిక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. మహాసభలకు పలువురు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులతోపాటు తెలంగాణ నుంచి 630 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment