ఢిల్లీ: సామాన్యుడితో ‘వామ్మో’ అనిపిస్తున్న టమాటో ధర.. ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల సెంచరీ దాటేసింది. కేజీకి మినిమమ్ రూ. 50 నుంచి మొదలై.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రూ.120 నుంచి రూ.160 కేజీకి అమ్ముడు పోతూ బెంబేలెత్తిస్తోంది. పోను పోను రేటు పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. దీంతో ఈ పరిస్థితి సాధారణం ఎప్పుడవుతుందనే సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
మరో పది, పదిహేను రోజుల తర్వాత ధరలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. టమాటో ధరలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ మీడియాతో స్పందించారు. ‘‘ప్రజలకు చెబుతోంది ఒక్కటే.. పది, పదిహేను రోజుల్లో ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. టమాటో తాజా లోడ్‌లు ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సమయం రెండు వారాలకు మించి ఉండదు. కాబట్టి, పదిహేను రోజుల తర్వాత.. పరిస్థితి మామూలుగా ఉంటుంది. ధరలు కచ్చితంగా దిగొస్తాయని అంటున్నారాయన.
ప్రతీ ఏడాది ఈ సమయానికి టమాటో ధరల్లో పెరుగుదల సాధారణంగా ఉండేదేనని.. కానీ, ఈసారి పరిస్థితి ఘోరంగా ఉండడమే అడ్డగోలు ధరలకు కారణమని చెబుతున్నారాయన. ప్రతికూల వాతావరణం, సరఫరాపై పరిమితుల వల్లే ఈసారి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారాయన. కొన్ని రాష్ట్రాల్లో వర్షాల వల్ల పంట దెబ్బ తిందని.. తెగులు సమస్యతో పాటు మరికొన్ని చోట్ల టమాటో లోడ్‌లు గమ్యస్థానాలకు చేరుకోలేదని చెబుతున్నారాయన. టమాటో విషయంలోనే కాదు.. చాలా వరకు కూరగాయల విషయంలో ఇదే జరుగుతోందని చెప్తున్నారాయన. ఈ తరుణంలో.. ధరల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నారాయన.
ఇదీ చదవండి: మార్కెట్‌లో ఏది ముట్టుకున్నా.. మంటే!
Comments
Please login to add a commentAdd a comment