Vegetable rates
-
Tomato price: టమాటో ధర దిగొచ్చేది అప్పుడేనంట!
ఢిల్లీ: సామాన్యుడితో ‘వామ్మో’ అనిపిస్తున్న టమాటో ధర.. ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల సెంచరీ దాటేసింది. కేజీకి మినిమమ్ రూ. 50 నుంచి మొదలై.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రూ.120 నుంచి రూ.160 కేజీకి అమ్ముడు పోతూ బెంబేలెత్తిస్తోంది. పోను పోను రేటు పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. దీంతో ఈ పరిస్థితి సాధారణం ఎప్పుడవుతుందనే సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మరో పది, పదిహేను రోజుల తర్వాత ధరలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. టమాటో ధరలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ మీడియాతో స్పందించారు. ‘‘ప్రజలకు చెబుతోంది ఒక్కటే.. పది, పదిహేను రోజుల్లో ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. టమాటో తాజా లోడ్లు ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సమయం రెండు వారాలకు మించి ఉండదు. కాబట్టి, పదిహేను రోజుల తర్వాత.. పరిస్థితి మామూలుగా ఉంటుంది. ధరలు కచ్చితంగా దిగొస్తాయని అంటున్నారాయన. ప్రతీ ఏడాది ఈ సమయానికి టమాటో ధరల్లో పెరుగుదల సాధారణంగా ఉండేదేనని.. కానీ, ఈసారి పరిస్థితి ఘోరంగా ఉండడమే అడ్డగోలు ధరలకు కారణమని చెబుతున్నారాయన. ప్రతికూల వాతావరణం, సరఫరాపై పరిమితుల వల్లే ఈసారి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారాయన. కొన్ని రాష్ట్రాల్లో వర్షాల వల్ల పంట దెబ్బ తిందని.. తెగులు సమస్యతో పాటు మరికొన్ని చోట్ల టమాటో లోడ్లు గమ్యస్థానాలకు చేరుకోలేదని చెబుతున్నారాయన. టమాటో విషయంలోనే కాదు.. చాలా వరకు కూరగాయల విషయంలో ఇదే జరుగుతోందని చెప్తున్నారాయన. ఈ తరుణంలో.. ధరల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నారాయన. ఇదీ చదవండి: మార్కెట్లో ఏది ముట్టుకున్నా.. మంటే! -
కూరగాయల ధరల మంట!
న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టోకున కూరగాయల బాస్కెట్ ధరలు ఏప్రిల్‌లో 40.65 శాతం (2018 ఏప్రిల్ ధరలతో పోల్చితే) పెరిగాయి. అయితే మొత్తంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలోని అన్ని విభాగాలనూ కలిపి చూస్తే, ఏప్రిల్‌లో 3.07 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్ ధర టోకును 2018 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2019 ఏప్రిల్‌లో 3.07 శాతం పెరిగిందన్నమాట. అయితే 2018 ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు (2017 ఏప్రిల్‌తో పోల్చితే) 3.62 శాతంగా ఉంది. సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉండే తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇంధనం ధర కూడా ఏప్రిల్‌లో పెద్దగా పెరగలేదు. సూచీలో ఫుడ్ ఆర్టికల్స్ వాటా దాదాపు 20 శాతం. ఒకవైపు ద్రవ్యోల్బణం రేట్లు అదుపులో ఉండడం, మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత నేపథ్యంలో జూన్‌లో ఆర్బీఐ రెపో రేటు కోత మరోసారి ఉండవచ్చని అసోచామ్‌సహా పలు పారిశ్రామిక సంఘాలు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ పరిశోధనా నివేదికలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ టోకు ధరల పరిస్థితిపై మంగళవారం విడుదలైన గణాంకాలను చూస్తే... ►నెలల వారీగా, 2019 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 2.93% ఉంటే... మార్చిలో 3.18%. ► ఇక సూచీలోని ఆహార విభాగాన్ని చూస్తే, ధరల స్పీడ్ ఏప్రిల్‌లో ఏకంగా 7.37 శాతంగా ఉంది. అంతక్రితం నెల అంటే మార్చిలో ఈ స్పీడ్ కేవలం 5.68 శాతమే. ఈ విభాగంలో ఒకటైన కూరగాయల ధరల పెరుగుదల దీనికి కారణం. 2018 డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.42 శాతం క్షీణించింది. అయితే అప్పటినుంచీ పెరుగుతూ వస్తోంది. ఇదే కూరగాయల రేట్లను చూస్తే, 2018 డిసెంబర్లో –19.29 శాతం క్షీణత ఉంటే, 2019 మార్చిలో 28.13 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో ఏకంగా 40.65% పెరిగింది. కాగా ఆలూ ధరల మాత్రం పెరగలేదు. 17.15 శాతం తగ్గాయి. రేటు కోత సంకేతాలు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం)ను మరింత తగ్గించడానికి అనుగుణమైన గణాంకాలు ప్రస్తుతం వస్తున్నాయని పారిశ్రామిక రంగం పేర్కొంటోంది. జూన్ 6న ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్ష ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాలసీ రేటు నిర్ణయానికి ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. బుధవారం నాడు విడుదలైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.92%గా నమోదైంది. ఇది ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యం 4% లోపే ఉండడం గమనార్హం. ఇక మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారింది. మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్బీఐ మరోదఫా రేటు రెపో రేటు తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం 4% దిగువనే ఉన్నందున వచ్చే నెల పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గింపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అసోచామ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ సుభాశ్ సన్యాల్ పేర్కొన్నారు. -
ధర..దడ
► కూరగాయల ధరలకు రెక్కలు ► క్యారెట్ కిలో రూ.75, వంకాయలు కిలో రూ.48 ► కొనలేని స్థితిలో పచ్చిమిర్చి, టమోటా ► తల్లడిల్లుతున్న వినియోగదారులు ► పెరగని కూరగాయల సాగు ఒంగోలు టూటౌన్: కూరగాయల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మార్కెట్‌కు వెళ్లాలంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు జంకుతున్నారు. ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నెల రోజులుగా మార్కెట్లో కూరగాయల ధరలపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. క్యారెట్ కిలో రూ.75 పలుకుతోంది. పచ్చిమిర్చి ఘాటు అదురుతోంది. కిలో రూ.75 నుంచి రూ.80 పలుకుతోంది. వంకాయల ధరలు విని వినియోగదారులు నోరెళ్లబెడుతున్నారు. కాకరకాయల ధర సైతం కేక పుట్టిస్తోంది. కిలో రూ.40 పలుకుతోంది. టమోటా కిలో రూ.40 చేరింది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలతో పేదలతో పాటు సామాన్య, మధ్య తరగతి ప్రజలు, హోటళ్ల యజమానులు సైతం నోరెళ్లబెడుతున్నారు. మునక్కాయల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ.60కు విక్రయిస్తున్నారు. గతంలో రూ.200 పలికిన మునగ..ఇప్పుడు కాస్త పరవాలేదనిపించినా.. పేదలు కొనలేని పరిస్థితి. వంకాయలు కిలో రూ.25కు చేరింది. ఎప్పటికప్పుడు కూరగాయల ధరలు పెరగటమే తప్పా తగ్గడం లేదు. ధరలు స్థిరంగా లేకపోవడంతో వ్యాపారులు రెండు, మూడు రోజులు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి జంకుతున్నారు. మార్కెట్లో సరుకు తగ్గిందనే ప్రచారం బయటకు వచ్చిందంటే చాలు ఉన్న నిల్వలకు రెక్కలొస్తున్నాయి. ధరలను అమాంతంగా పెంచేయడం పరిపాటిగా మారింది. కూరగాయల సాగు విస్తీర్ణం రానురాను తగ్గిపోతుండటంతో ధరలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం: గత ఏడాది నుంచి జిల్లాను వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా వెంటాడుతున్నాయి. గత ఖరీఫ్ పంటల సాగుతో కూరగాయల పంటలు ఎండిపోయాయి. అప్పటి నుంచి ప్రస్తుత ఖరీఫ్ వరకు వర్షాలు కురవలేదు. వాస్తవంగా జిల్లాలో వేసవిలో కూరగాయల సాగు అధికంగా చేస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి వర్షమే లేకపోవడంతో కూరగాయల సాగుకు రైతులు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న రాయితీ విత్తనాలు క్షేత్ర స్థాయిలో అన్నదాతకు చేరటం లేదు. తీర ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు సాగు చేస్తుంటారు. అయితే వీరు సాగు చేసే భూములు ఎక్కువగా అసైన్డ్ భూములు కావడంతో విత్తన రాయితీతో పాటు ఇతర తీగజాతి విత్తనాలు, (రాయితీ పథకాలు) రైతులకు అందని ద్రాక్షే అవుతోంది. దీంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఎవరూ సాగువైపు దృష్టి సారించలేదు. గత రబీ సీజన్లో 2,782 హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు వెయ్యి హెక్టార్లలో కూడా సాగు కాలేదు. తీగజాతి కూరగాయల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహక రాయితీ పెంచినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ పథకం పట్ల రైతులకు అవగాహన కల్పించడంలో ఆ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఆకుకూరలైన గోంగూర, తోటకూరల పెంపకానికి ప్రోత్సాహం కొరవడింది. దీంతో కూరగాయల ధరలు మార్కెట్లో మండుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే అమ్ముతున్నారు. పెరిగిన ధరలు కూడా స్థిరంగా ఉండటం లేదు. బయట మార్కెట్లతో పాటు రైతు బజార్లలో కూడా కూరగాయల ధరలు మండుతున్నాయి. కూరగాయల ధరలతోపాటు బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇలా అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. ధరలను అదుపులో ఉంచాల్సిన ప్రభుత్వం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి కూరగాయల ధరలను పేద, సామాన్య, మధ్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
కత్తిపీట మీద సామే
- మండుతున్న కూరగాయల రేట్లు - ఉష్ణోగ్రత కారణంగా తగ్గిన దిగుబడి - ఉల్లిపాయల ధరా అదే దారిలో.. అమలాపురం, న్యూస్‌లైన్ : తగలబడుతున్న కారడవి నుంచి వీస్తున్నట్టు గాలి పగలూ, రాత్రీ సెగలు కక్కుతోంది. నీడ పట్టున ఇంట్లోనే ఉన్నా.. పగబట్టినట్టు వాతావరణం హింసిస్తోంది. ఇక.. కూరో, వేపుడో వండుతూ వంటిళ్లలో మండే స్టౌల ముందుండే ఇల్లాళ్ల అవస్థ చెప్పనక్కరలేదు. అక్కడున్నంతసేపూవారికి చిత్రహింసగానే ఉంటోంది. ఉల్లి ఘాటుకు మండుతున్న కంట్లోనే నలుసు పడ్డట్టు- ఇప్పుడా అవస్థకు భగ్గుమంటున్న కూరగాయల ధరలు తోడయ్యాయి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాల మహిళలు వంటింటి బడ్జెట్‌ను నిర్వహించలేక సతమతమవుతున్నారు. కిలో కూరగాయలు కొనే వారికి అర కిలోతోనో, పావుకిలోతోనో సరిపెట్టుకోక తప్ప డం లేదు. దాంతో ఇంటిల్లిపాదికీ కడుపారా తినేందుకు కూర వండి పెట్టడం ఆ ఇల్లాళ్లకు ‘కత్తిపీట మీద సాము’గా మారింది. ఇంట వండిన కూర రుచిగా ఉన్నప్పుడు మారు వడ్డించమనడం ఎవరికైనా ఉన్న అలవాటే. అలా అడిగిన వారికి అడిగినంత కూర వడ్డించడం ఇప్పుడు ఇల్లాళ్లకు శక్తికి మించిన పనిగా పరిణమించింది. జిల్లాలో వారం, పదిరోజులుగా మడికి హోల్‌సేల్ మార్కెట్లో, చిల్లర వ్యాపారాల్లో కూరగాయల ధరలు రోహిణీ కార్తెలో ఉష్ణోగ్రతలాగే దినదినాభివృద్ధి చెందుతున్నాయి. బీర, క్యారెట్, బీట్రూట్ వంటి వాటి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. వీటి ధర కేజీ రూ.40 నుంచి రూ.42 వరకు ఉంది. కొన్ని చోట్ల బీర ధర రూ.45 కూడా దాటింది. టమాటా, బెండకాయలు కేజీ రూ.32 నుంచి రూ.35, క్యాబేజీ, వంకాయలు రూ.24 వరకు, బంగాళదుంప, దొండకాయ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. ఇక.. నగల తయారీలో బంగారానికి రాగి కలవడం ఎంత తప్పనిసరో.. ఏ కూర వండాలన్నా అంతే తప్పనిసరైన ఉల్లిపాయలు కూడా ‘మేము మాత్రం తక్కువ తిన్నామా’ అన్నట్టు ధర విషయంలో మిడిసిపడుతున్నాయి. వాటి నాణ్యతను బట్టి రూ.20 నుంచి 24 వరకు పలుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 సెంటీగ్రేడ్ డిగ్రీలకు పైబడి ఉండడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిందని, దానికి తోడు మండే ఎండల్లో కూరగాయల కోతకు వచ్చేందుకు కూలీలే జంకుతుండడంతో ఎక్కువ కూలి ఇచ్చి కోయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. కాగా మడికి హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రస్తుతం.. ఎప్పుడూ వచ్చే కూరగాయల్లో 60 శాతమే వస్తున్నాయని అక్కడి వ్యాపారులు చెపుతున్నారు. తొలకరి వర్షాలు పడి, ఉష్ణోగ్రతలు త గ్గి కాయగూరల దిగుబడి ఎంతోకొంత పెరిగే వరకూ ధరలు దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు. అంటే.. మరికొన్ని రోజులు కూడా రెండుపూటలా నోరారా తినడం అంటే సామాన్యుల జేబుకు మించిన భారం కాక తప్పదన్న మాట.