ధర..దడ
► కూరగాయల ధరలకు రెక్కలు
► క్యారెట్ కిలో రూ.75, వంకాయలు కిలో రూ.48
► కొనలేని స్థితిలో పచ్చిమిర్చి, టమోటా
► తల్లడిల్లుతున్న వినియోగదారులు
► పెరగని కూరగాయల సాగు
ఒంగోలు టూటౌన్: కూరగాయల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మార్కెట్‌కు వెళ్లాలంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు జంకుతున్నారు. ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నెల రోజులుగా మార్కెట్లో కూరగాయల ధరలపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. క్యారెట్ కిలో రూ.75 పలుకుతోంది. పచ్చిమిర్చి ఘాటు అదురుతోంది. కిలో రూ.75 నుంచి రూ.80 పలుకుతోంది. వంకాయల ధరలు విని వినియోగదారులు నోరెళ్లబెడుతున్నారు. కాకరకాయల ధర సైతం కేక పుట్టిస్తోంది. కిలో రూ.40 పలుకుతోంది. టమోటా కిలో రూ.40 చేరింది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలతో పేదలతో పాటు సామాన్య, మధ్య తరగతి ప్రజలు, హోటళ్ల యజమానులు సైతం నోరెళ్లబెడుతున్నారు.
మునక్కాయల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ.60కు విక్రయిస్తున్నారు. గతంలో రూ.200 పలికిన మునగ..ఇప్పుడు కాస్త పరవాలేదనిపించినా.. పేదలు కొనలేని పరిస్థితి. వంకాయలు కిలో రూ.25కు చేరింది. ఎప్పటికప్పుడు కూరగాయల ధరలు పెరగటమే తప్పా తగ్గడం లేదు. ధరలు స్థిరంగా లేకపోవడంతో వ్యాపారులు రెండు, మూడు రోజులు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి జంకుతున్నారు. మార్కెట్‌లో సరుకు తగ్గిందనే ప్రచారం బయటకు వచ్చిందంటే చాలు ఉన్న నిల్వలకు రెక్కలొస్తున్నాయి. ధరలను అమాంతంగా పెంచేయడం పరిపాటిగా మారింది. కూరగాయల సాగు విస్తీర్ణం రానురాను తగ్గిపోతుండటంతో ధరలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది.
తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం:
గత ఏడాది నుంచి జిల్లాను వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా వెంటాడుతున్నాయి. గత ఖరీఫ్ పంటల సాగుతో కూరగాయల పంటలు ఎండిపోయాయి. అప్పటి నుంచి ప్రస్తుత ఖరీఫ్ వరకు వర్షాలు కురవలేదు. వాస్తవంగా జిల్లాలో వేసవిలో కూరగాయల సాగు అధికంగా చేస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి వర్షమే లేకపోవడంతో కూరగాయల సాగుకు రైతులు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న రాయితీ విత్తనాలు క్షేత్ర స్థాయిలో అన్నదాతకు చేరటం లేదు. తీర ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు సాగు చేస్తుంటారు. అయితే వీరు సాగు చేసే భూములు ఎక్కువగా అసైన్డ్ భూములు కావడంతో విత్తన రాయితీతో పాటు ఇతర తీగజాతి విత్తనాలు, (రాయితీ పథకాలు) రైతులకు అందని ద్రాక్షే అవుతోంది. దీంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఎవరూ సాగువైపు దృష్టి సారించలేదు. గత రబీ సీజన్‌లో 2,782 హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు వెయ్యి హెక్టార్లలో కూడా సాగు కాలేదు. తీగజాతి కూరగాయల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహక రాయితీ పెంచినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ పథకం పట్ల రైతులకు అవగాహన కల్పించడంలో ఆ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఆకుకూరలైన గోంగూర, తోటకూరల పెంపకానికి ప్రోత్సాహం కొరవడింది. దీంతో కూరగాయల ధరలు మార్కెట్‌లో మండుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే అమ్ముతున్నారు. పెరిగిన ధరలు కూడా స్థిరంగా ఉండటం లేదు. బయట మార్కెట్లతో పాటు రైతు బజార్లలో కూడా కూరగాయల ధరలు మండుతున్నాయి. కూరగాయల ధరలతోపాటు బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇలా అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. ధరలను అదుపులో ఉంచాల్సిన ప్రభుత్వం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి కూరగాయల ధరలను పేద, సామాన్య, మధ్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.