యువకుడి బంధువులకు సర్దిచెప్తున్న ఎస్‌ఐ అజయ్‌బాబు, ఇన్‌సెట్‌లో కందుల ప్రవీణ్ ఫైల్ ఫోటో
ఐదేళ్లుగా ప్రేమాయణం నాటకం!
అతని సాయంతో అమెరికా వెళ్లాక మాటమార్చిన యువతి
మనస్థాపంతో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
యువతితో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ప్రేమ పేరుతో వంచించి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకున్న ఓ యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రకాశం జిల్లాలో (Prakasam District) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు (Ongole) చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్‌కు ఐదేళ్ల కిందట పరిచయం కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ కలిసి హైదరాబాదులో (Hyderabad) కొద్దికాలం పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు.
ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరడంతో ప్రవీణ్ తనకున్న పరిచయాలతో అందినకాడికి డబ్బులు తెచ్చి హరిణి లక్ష్మిని ఏడాదిన్నర క్రితం అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఆమె మరో స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి ప్రవీణ్‌కు ఫోన్ చేసి ‘నీవంటే నాకిష్టం లేదని.. తనను మరచిపో’ అంటూ చెప్పింది. ఈ క్రమంలో తమ కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్‌తో పాటు అతని తండ్రి కందుల డానియేలును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
అనంతరం ఎవరి తీరున వారు ఉన్న క్రమంలో ఇటీవల నుంచి మళ్లీ హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి తిరిగి ప్రవీణ్‌కు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని లేకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని యువతి హరిణిలక్ష్మికి చెప్పి మరీ బుధవారం సాయంత్రం ఉప్పుగుండూరు గ్రామంలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం మృతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు. కాగా, మృతుడి తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ అజయ్‌బాబు తెలిపారు.
భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని..
ఉలవపాడు: సంక్రాంతి సంబరాల్లో భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో (Nellore District) బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు (Ulavapadu) మండల పరిధిలోని కరేడు పంచాయతీలోని ఇందిరా నగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ డాన్స్‌లు వేస్తున్న సమయంలో ఇండ్లా బాలసుబ్రహ్మణ్యం (25) తన భార్యను కూడా తనతో డాన్స్ చేయడానికి రమ్మన్నాడు. పిల్లలను పట్టుకుని ఉన్నాను.. తరువాత వచ్చి వేస్తానులే అని చెప్పింది.
చదవండి: సంక్రాంతి అల్లుడు మిస్సింగ్
దీంతో అతను మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికే కదా వెళ్లింది అని కార్యక్రమం అయిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిలోని వంట గదిలో ఫ్యాన్‌కు వేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఉలవపాడు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment